సన్‌రైజర్స్ మాజీ పేసర్, టీమిండియా బౌలర్ సిద్దార్థ్ కౌల్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ 2024 సీజన్ కోసం నార్తంప్టన్‌షైర్ కౌంటీ ఇతన్ని ఎంపిక చేసుకుంది. ఈ మేరకు నార్తంప్టన్‌షైర్ కౌంటీ ఓ ప్రకటన విడుదల చేసింది.
మే 10 నుంచి గ్లోసెస్టర్‌షైర్‌తో జరుగబోయే మ్యాచ్‌లో సిద్దార్థ్ నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. సిద్దార్థ్ తొలిసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు క్రిస్ ట్రెమెయిన్‌కు ప్రత్యామ్నాంగా సిద్దార్థ్‌ను నార్తంప్టన్‌షైర్ ఎంపిక చేసుకుంది.
33 ఏళ్ల సిద్దార్థ్ 2023 సీజన్ వరకు ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. గత సీజన్‌లో అతను ఆర్సీబీకి ఆడాడు. సిద్దార్థ్ ఐపీఎల్ అరంగేట్రం సీజన్‌లో కేకేఆర్‌కు, ఆతర్వాత 2013-2014 వరకు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు.. 2016-2021 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
సన్‌రైజర్స్‌కు ఆడుతున్నప్పుడు సిద్దార్థ్ చాలా పేరు వచ్చింది. అక్కడి ప్రదర్శనలతోనే అతను టీమిండియాకు ఎంపికయ్యాడు. దేశవాలీ క్రికెట్‌లో పంజాబ్‌కు ఆడే సిద్దార్థ్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇతను పంజాబ్ తరఫున 59 మ్యాచ్‌ల్లో 205 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 12 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి.
సిద్దార్థ్ టీమిండియా ఛాంపియన్‌గా నిలిచిన 2008 అండర్-19 ప్రపంచకప్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఆ మెగా టోర్నీలో యువ భారత్ విరాట్ కోహ్లి సారథ్యంలో టైటిల్ గెలిచింది. టీమిండియా తరఫున 3 వన్డేలు, 2 టీ20లు ఆడిన సిద్దార్థ్ ఐపీఎల్ కెరీర్‌లో 55 మ్యాచ్‌లు ఆడి 58 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment