Siddarth Kaul
-
వేలంలో ఎవరూ కొనలేదు..! రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
టీమిండియా వెటరన్ పేసర్ సిద్దార్థ్ కౌల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సిద్దార్డ్ కౌల్ అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో అమ్ముడుపోని తర్వాత కౌల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రూ.40 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ రైట్ ఆర్మ్ పేసర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఈ విషయాన్ని కౌల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. భారత క్రికెట్ తరపున ఆడేందుకు అవకాశమిచ్చిన బీసీసీఐకి, తను ప్రాతినిథ్యం వహించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సిద్దార్ద్ ధన్యవాదాలు తెలిపాడు.ఐర్లాండ్‌పై అరంగేట్రం..కాగా పంజాబ్‌కు చెందిన సిద్దార్థ్ కౌల్ 2018లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అదే ఏడాదిలో ఇంగ్లండ్‌పై వన్డే డెబ్యూ చేశాడు. కౌల్ చివరగా టీమిండియా తరపున 2019లో ఆడాడు. భారత్ తరపున మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడిన కౌల్.. 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్హెచ్ జట్లకు అతడు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 55 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ పంజాబీ పేసర్.. 29.98 సగటుతో 58 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. -
కౌంటీల్లో ఆడనున్న సన్‌రైజర్స్ మాజీ బౌలర్
సన్‌రైజర్స్ మాజీ పేసర్, టీమిండియా బౌలర్ సిద్దార్థ్ కౌల్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ 2024 సీజన్ కోసం నార్తంప్టన్‌షైర్ కౌంటీ ఇతన్ని ఎంపిక చేసుకుంది. ఈ మేరకు నార్తంప్టన్‌షైర్ కౌంటీ ఓ ప్రకటన విడుదల చేసింది. మే 10 నుంచి గ్లోసెస్టర్‌షైర్‌తో జరుగబోయే మ్యాచ్‌లో సిద్దార్థ్ నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. సిద్దార్థ్ తొలిసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు క్రిస్ ట్రెమెయిన్కు ప్రత్యామ్నాంగా సిద్దార్థ్‌ను నార్తంప్టన్‌షైర్ ఎంపిక చేసుకుంది. 33 ఏళ్ల సిద్దార్థ్ 2023 సీజన్ వరకు ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. గత సీజన్లో అతను ఆర్సీబీకి ఆడాడు. సిద్దార్థ్ ఐపీఎల్ అరంగేట్రం సీజన్లో కేకేఆర్‌కు, ఆతర్వాత 2013-2014 వరకు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు.. 2016-2021 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. సన్‌రైజర్స్‌కు ఆడుతున్నప్పుడు సిద్దార్థ్ చాలా పేరు వచ్చింది. అక్కడి ప్రదర్శనలతోనే అతను టీమిండియాకు ఎంపికయ్యాడు. దేశవాలీ క్రికెట్లో పంజాబ్‌కు ఆడే సిద్దార్థ్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇతను పంజాబ్ తరఫున 59 మ్యాచ్‌ల్లో 205 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 12 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. సిద్దార్థ్ టీమిండియా ఛాంపియన్‌గా నిలిచిన 2008 అండర్-19 ప్రపంచకప్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఆ మెగా టోర్నీలో యువ భారత్ విరాట్ కోహ్లి సారథ్యంలో టైటిల్ గెలిచింది. టీమిండియా తరఫున 3 వన్డేలు, 2 టీ20లు ఆడిన సిద్దార్థ్ ఐపీఎల్ కెరీర్లో 55 మ్యాచ్‌లు ఆడి 58 వికెట్లు పడగొట్టాడు. -
ఐదేసిన సిద్ధార్థ్ కౌల్.. పంజాబ్ ఘన విజయం
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2022 ఎలైట్ గ్రూప్-బిలో పంజాబ్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. జైపూర్ వేదికగా పుదుచ్చేరితో ఇవాళ (అక్టోబర్ 20) జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన పంజాబ్.. 20 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్.. ప్రత్యర్ధిని కేవలం 86 పరుగులకే కట్టడి చేసింది. వెటరన్ పేసర్ సిద్ధార్థ్ కౌల్ (5/12) ఐదు వికెట్లతో చెలరేగడంతో పుదుచ్చేరి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. సిద్దార్థ్‌కు జతగా బల్తేజ్ సింగ్ (1/17), హర్‌ప్రీత్ బ్రార్ (1/16), మార్కండే (2/17) రాణించారు. పుదుచ్చేరి ఇన్నింగ్స్‌లో పరమేశ్వరన్ శివరామన్ (25), అంకిత్ శర్మ (23), అరుణ్ కార్తీక్ (15) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. కేవలం 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అభిషేక్ శర్మ (29), శుభ్‌మన్ గిల్ (21), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (23 నాటౌట్), హర్‌ప్రీత్ బ్రార్ (13 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పుదుచ్చేరి బౌలర్లలో సాగర్ ఉదేషికి ఓ వికెట్ దక్కింది. -
జహీర్ ఖాన్ వల్లే..
న్యూఢిల్లీ: తన బౌలింగ్‌ను మరింత మెరుగుపరుచుకోవడానికి మాజీ పేసర్ జహీర్ ఖానే కారణమని టీమిండియా పేసర్ సిద్దార్థ్ కౌల్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లబోయే భారత జట్టులో చోటు దక్కించుకున్న సిద్ధార్థ్ కౌల్.. జహీర్ సూచనలతో తన బౌలింగ్‌లో పదును పెరిగిందన్నాడు. ‘నా తొలి ప్రాధాన్యం దేశవాళీ క్రికెట్‌కే. పంజాబ్ తరఫున చేసిన ప్రదర్శనలే జాతీయ జట్టులో అవకాశం దక్కేలా చేశాయి. న్యూజిలాండ్‌లో భారత్-ఏ తరఫున బౌలింగ్ చేశా. అక్కడి పిచ్‌లపై పూర్తి అవగాహన ఉంది. ఎప్పుడూ జట్టు గెలుపు కోసమే కష్టపడతా. నా మార్గనిర్దేశకుడు జహీర్ ఖాన్ నేతృత్వంలో నా బౌలింగ్‌ను మరింత పటిష్టం చేసుకున్నా. ఆయన చక్కని సలహాలు ఇస్తారు. బంతులు విసిరేటప్పుడు సింపుల్‌గా ఉండాలని సూచిస్తారు. ఆయన నాతో చాలా సమయం గడిపారు. నా బౌలింగ్ గురించి నోట్స్ రాసుకున్నారు. బంతులు విసిరేటప్పుడు ఏ కండరాలు ఉపయోగించాలి, ఏ ప్రాంతాల్లో బంతులు వేయాలో చెప్పారు. భారత్-ఎ తరఫున న్యూజిలాండ్ వెళ్లేటప్పుడూ ఆయనతో మాట్లాడాను. ఆ సలహాలు అద్భుతంగా ఉపయోగపడ్డాయి’ అని తెలిపాడు. ఇక భారత-ఎ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ గురించి మాట్లాడుతూ.. రాహుల్ సర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనకు క్రికెట్‌పై ఉన్న నాలెడ్జ్‌ను వెలకట్టలేం. ఆయన సలహాలు నాకెంతగానో ఉపయోగపడ్డాయి’ అని కౌల్ చెప్పుకొచ్చాడు. -
విండీస్‌తో మూడో టి20కి సిద్ధార్థ్ కౌల్
వెస్టిండీస్‌తో ఆదివారం చెన్నైలో జరుగనున్న ఆఖరి టి20 మ్యాచ్ నుంచి టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. రానున్న ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు ఈ ముగ్గురికి తగినంత విశ్రాంతి కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపారు. పంజాబ్ పేసర్ సిద్ధార్థ్ కౌల్‌ను జట్టులోకి తీసుకున్నారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 2–0తో నెగ్గిన విషయం తెలిసిందే. కౌల్ ఈ ఏడాది ఐర్లాండ్‌పై టి20 అరంగేట్రం చేశాడు. -
మూడో టీ20: సిద్దార్థ్ కౌల్‌కు అవకాశం
ముంబై : వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి భారత్ సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నై వేదికగా జరిగే మూడో టీ20కి ప్రధాన పేసర్లు ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, చైనామన్ కుల్దీప్ యాదవ్‌లకు టీమ్ మేనేజ్మెంట్ విశ్రాంతిని కల్పించింది. అలాగే యువబౌలర్ సిద్దార్థ్ కౌల్‌కు అవకాశం కల్పించింది. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ట్వీట్ చేసింది. రంజీల్లో పంజాబ్ తరపున కౌల్ అద్బుతంగా రాణించడంతో సెలక్టర్లు అవకాశం కల్పించారు. ఇక భారత్ తరపున మూడు అంతర్జాతీయ వన్డేలు, 2 టీ20లు ఆడిన కౌల్.. వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయనప్పటికి టీ20ల్లో 3 వికెట్లు తీశాడు. నవంబర్ 21 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగానే ఈ ముగ్గురు బౌలర్లకు విశ్రాంతి కల్పించినట్లు తెలుస్తోంది. ఈ పర్యటన దృష్ట్యానే సిరీస్‌కు ముందే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. UPDATE: Umesh Yadav, Jasprit Bumrah & Kuldeep Yadav rested for 3rd Paytm #INDvWI T20I in Chennai@sidkaul22 added to India's squad Details - https://t.co/hqzMTMT8rZ pic.twitter.com/tbdbLBfwEI — BCCI (@BCCI) November 9, 2018 -
ఇంగ్లండ్‌తో వన్డే: సిద్దార్థ్ కౌల్ అరంగేట్రం
నాటింగ్‌హామ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. గాయం కారణంగా భువనేశ్వర్ కుమార్ దూరం కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ సిద్దార్థ్ కౌల్ అరంగేట్రం చేశాడు. టీమిండియా మాజీ సారథి, సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్‌లో కోహ్లి ఎక్కువగా ప్రయోగాల జోలికి వెళ్లకుండా టీ20 జట్టునే కోనసాగించాడు. చివరి టీ20 ఆడని కుల్దీప్ యాదవ్‌కు తుదిజట్టులో అవకాశం దక్కింది. కాగా, గాయం కారణంగా హేల్స్ దూరమవ్వగా బెన్ స్టోక్స్ తుది జట్టులోకి వచ్చాడు. పిచ్ పొడిబారి ఉండటంతో బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలోనే ఇంగ్లండ్ రెండు వరల్డ్ రికార్డు స్కోర్లు (441, 481) సాధించింది. ఇప్పటికే టి20 సిరీస్ గెలుచుకున్న టీమిండియా ఇక్కడా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. వన్డేల్లో ఇటీవలి తమ ధాటిని కొనసాగించాలని ఇంగ్లండ్ భావిస్తోంది. 2014లో ఇక్కడ ఆడిన తమ చివరి పర్యటనలో భారత్ వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. తుది జట్లు: టీమిండియా: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, సురేశ్ రైనా, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, సిద్దార్థ్ కౌల్, ఉమేశ్ యాదవ్, చాహల్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్: ఇయన్ మోర్గాన్(కెప్టెన్), జాసన్ రాయ్, బెయిర్ స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, మొయిన్ అలీ, డేవిడ్ విల్లే, లియామ్ ప్లంకెట్, అదిల్ రషీద్, మార్క్ వుడ్ -
సిద్దార్థ్ కౌల్ చెత్త రికార్డు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ సిద్దార్థ్ కౌల్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఓవరాల్ ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్లో అత్యధిక పరుగులు సమర్పించుకుని చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ఈ సీజన్లో సిద్దార్థ్ కౌల్ ఇచ్చిన పరుగులు 547, కాగా, ఆ తర్వాత స్థానంలో డ్వేన్ బ్రేవో ఉన్నాడు. ఐపీఎల్-11వ సీజన్లో బ్రేవో 533 పరుగులు ఇచ్చాడు. ఇలా ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న జాబితాలో సిద్దార్థ్ కౌల్, బ్రేవోలు వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉండగా, ఉమేశ్ యాదవ్(508-2013) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మెక్లీన్గన్(507-2017) నాల్గో స్థానంలో ఉండగా, ఆపై మళ్లీ డ్వేన్ బ్రేవో(497-2013; 494-2016) రెండు సార్లు అత్యధిక పరుగుల్ని సమర్పించుకున్నాడు. -
సిద్దార్థ్ కౌల్‌కు మళ్లీ పిలుపు
ముంబై: రాబోవు కాలంలో టీమిండియా ఆడబోయే నాలుగు వేర్వేరు సిరీస్‌లకు సంబంధించి జట్లను మంగళవారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌తో పాటు, ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్, ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీస్, మూడు వన్డేల సిరీస్‌లకు సంబంధించి భారత జట్లను చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అఫ్గానిస్తాన్‌తో జరిగే చారిత్రక టెస్టు మ్యాచ్‌కు పెద్దగా మార్పులు లేకుండానే జట్టును ప్రకటించారు. భారత రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి కౌంటీల్లో ఆడటానికి ఇంగ్లండ్‌కు పయనం కానున్న నేపథ్యంలో అఫ్గానిస్తాన్‌తో టెస్టుకు అజింక్యా రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అయితే అఫ్గానిస్తాన్‌తో టెస్టు మ్యాచ్‌కు శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించినా అతనికి నిరాశే ఎదురైంది. కాగా, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అయ్యర్‌తో పాటు అంబటి రాయుడులకు చోటు కల్పించారు. మరొకవైపు ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే, టీ 20 సిరీస్‌ల్లో సిద్ధార్థ్ కౌల్ చోటు దక్కించుకున్నాడు. గతంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో కౌల్‌కు చోటు దక్కినా.. ఆడే అవకాశం రాలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న కౌల్ విశేషంగా రాణిస్తుండటంతో అతనికి మళ్లీ పిలుపు అందింది. భారత్ తలపడే పరిమిత ఓవర్ల సిరీస్‌కు విరాట్ కోహ్లినే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తొలుత ఈ టీ 20 సిరీస్‌లకు రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని భావించారు. కాగా, రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి అందుబాటులో ఉండటంతో కెప్టెన్సీ విషయంలో ఎటువంటి మార్పులు జరగలేదు. జూన్ 14 వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో భారత్-అఫ్గానిస్తాన్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఆపై జూన్ 27 వ తేదీ నుంచి ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో భారత్ పాల్గొనుంది. జూలై 3 వ తేదీ నుంచి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ జరుగనుండగా, జూలై 12 వ తేదీ నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. అఫ్గానిస్తాన్ ఏకైక టెస్టు మ్యాచ్‌కు.. అజింక్యా రహానే(కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చటేశ్వర్ పుజారా, కరుణ్ నాయర్, సాహా, అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, షమీ, హార్దిక్, ఇషాంత్ శర్మ, శార్దూల్ ఠాకూర్ ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు..విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీష్ పాండే, ఎంఎస్ ధోని, దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, బూమ్రా, హార్దిక్ పాండ్యా, సిద్ధార్ధ్ కౌల్, ఉమేశ్ యాదవ్ ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు.. విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీష్ పాండే, ఎంఎస్ ధోని, దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, బూమ్రా, హార్దిక్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, సిద్ధార్థ్ కౌల్, ఉమేశ్ యాదవ్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు.. విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బూమ్రా, హార్దిక్ పాండ్యా, సిద్ధార్థ్ కౌల్, ఉమేశ్ యాదవ్ -
‘అతని కెప్టెన్సీలోనే అరంగేట్రం చేస్తా’
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న పేసర్ సిద్దార్థ్ కౌల్.. ఇప్పటివరకూ 8 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు సాధించాడు. 2008లో విరాట్ కోహ్లి నాయకత్వంలో అండర్-19 ప్రపంచకప్‌లో జట్టులో సభ్యుడిగా ఉన్న కౌల్.. మళ్లీ తప్పకుండా అతని సారథ్యంలోనే భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ‘విరాట్ కోహ్లినే నాకు స్ఫూర్తి. గత పదేళ్లుగా అతడు జట్టులో ఎంతో స్థిరంగా రాణిస్తున్నాడు. నేను త్వరలో టీమిండియాలో చోటు దక్కించుకుంటానన్న నమ్మకం ఉంది. శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం నన్ను ఎంపిక చేశారు. కానీ, ఆడే అవకాశం దక్కలేదు. త్వరలోనే కోహ్లి నాయకత్వంలో నేను భారత్ తరపున కచ్చితంగా ఆడతా’ అని సిద్దార్థ్ ధీమా వ్యక్తం చేశాడు. మరొకవైపు ఐపీఎల్ తనకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. ఐపీఎల్లో బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు. కొన్ని నెలల క్రితం శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో కౌల్ చోటు దక్కించుకున్నాడు. కానీ, ఒక్క మ్యాచ్‌లో కూడా అతనికి ఆడే అవకాశం దక్కలేదు. కాగా, ఐపీఎల్లో తన ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమంటున్నాడు కౌల్. -
స్టార్లు లేకున్నా సన్ రైజర్స్ సక్సెస్ జర్నీ
-
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్!
సాక్షి, ముంబై: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌ల రిఫరీ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం ముంబైలోని వాంఖడే స్డేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుపై సన్‌రైజర్స్ జట్టు 31 పరుగుల తేడాతో సంచలనం విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే సన్‌రైజర్స్ జట్టు ఆటగాళ్లు కాస్త అతిగా ప్రవర్తించారని ఐపీఎల్ మ్యాచ్ రిఫరీ భావించారు. మ్యాచ్‌లో 16వ ఓవర్ వేసిన సిద్ధార్త్ కౌల్ ఓవర్ చివరి బంతికి ముంబై ఆటగాడు మయాంక్ మార్కండేను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ బాట పట్టించాడు. కానీ వికెట్ తీసిన ఆనందంలో బౌలర్ కౌల్.. ఔటైన క్రికెటర్ మయాంక్ మార్కండేను వెక్కిరించాడు. దీన్ని ముంబై ఆటగాళ్లు రిఫరీ దృష్టికి తీసుకెళ్లారు. ఐపీఎల్11 సీజన్లో సన్‌రైజర్స్ ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ జట్టుకు కౌల్ ప్రాతినిథ్యం వహించాడు. 9 వికెట్లు తీసిన కౌల్ సన్‌రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ప్లేయర్స్ అండ్ టీం అఫీషియల్స్ (ఐపీఎల్ ఆటగాళ్ల ప్రవర్తనా నియమాళి) 2.1.4 ప్రకారం బౌలర్ సిద్ధార్త్ కౌల్ లెవల్ వన్ ప్రకారం తప్పు చేసినట్లు రిఫరీ గుర్తించారు. జరిమానా ఎంత అన్నది ఇంకా వెల్లడించలేదు. పూర్తి స్థాయిలో దీనిపై విచారణ జరిపిన అనంతరం అతడి గేమ్ పాయింట్లలో కోత విధించే అవకాశాలున్నాయి. అయితే ఇలాంటివి ఆటలో భాగమేనని, సన్‌రైజర్స్ హైదరాబాద్ మద్దతుదారులు కామెంట్ చేస్తున్నారు.