
న్యూఢిల్లీ: తన బౌలింగ్‌ను మరింత మెరుగుపరుచుకోవడానికి మాజీ పేసర్ జహీర్ ఖానే కారణమని టీమిండియా పేసర్ సిద్దార్థ్ కౌల్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లబోయే భారత జట్టులో చోటు దక్కించుకున్న సిద్ధార్థ్ కౌల్.. జహీర్ సూచనలతో తన బౌలింగ్‌లో పదును పెరిగిందన్నాడు. ‘నా తొలి ప్రాధాన్యం దేశవాళీ క్రికెట్‌కే. పంజాబ్ తరఫున చేసిన ప్రదర్శనలే జాతీయ జట్టులో అవకాశం దక్కేలా చేశాయి. న్యూజిలాండ్‌లో భారత్-ఏ తరఫున బౌలింగ్ చేశా. అక్కడి పిచ్‌లపై పూర్తి అవగాహన ఉంది. ఎప్పుడూ జట్టు గెలుపు కోసమే కష్టపడతా. నా మార్గనిర్దేశకుడు జహీర్ ఖాన్ నేతృత్వంలో నా బౌలింగ్‌ను మరింత పటిష్టం చేసుకున్నా. ఆయన చక్కని సలహాలు ఇస్తారు.
బంతులు విసిరేటప్పుడు సింపుల్‌గా ఉండాలని సూచిస్తారు. ఆయన నాతో చాలా సమయం గడిపారు. నా బౌలింగ్ గురించి నోట్స్ రాసుకున్నారు. బంతులు విసిరేటప్పుడు ఏ కండరాలు ఉపయోగించాలి, ఏ ప్రాంతాల్లో బంతులు వేయాలో చెప్పారు. భారత్-ఎ తరఫున న్యూజిలాండ్ వెళ్లేటప్పుడూ ఆయనతో మాట్లాడాను. ఆ సలహాలు అద్భుతంగా ఉపయోగపడ్డాయి’ అని తెలిపాడు. ఇక భారత-ఎ జట్టు కోచ్ రాహుల్ ద‍్రవిడ్ గురించి మాట్లాడుతూ.. రాహుల్ సర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనకు క్రికెట్‌పై ఉన్న నాలెడ్జ్‌ను వెలకట్టలేం. ఆయన సలహాలు నాకెంతగానో ఉపయోగపడ్డాయి’ అని కౌల్ చెప్పుకొచ్చాడు.