న్యూజిలాండ్‌తో మూడో టెస్టు సందర్భంగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్‌ను జడ్డూ అధిగమించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు కివీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.
ముంబై వేదికగా మూడో టెస్టు
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బెంగళూరు, పుణె వేదికగా జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య టీమిండియాను న్యూజిలాండ్ ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ముంబై వేదికగా శుక్రవారం నామమాత్రపు మూడో టెస్టు మొదలైంది.
వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు.. సొంతగడ్డపై ఇప్పటికే భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన టామ్ లాథమ్ బృందం విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో మూడో టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆకాశ్ దీప్ శుభారంభం.. అదరగొట్టిన వాషీ
స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బౌలర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ప్రభావం చూపుతున్నారు. ఆట తొలిరోజు భోజన విరామ సమయానికి ముందు వాషీ.. కివీస్ కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(28), మిడిలార్డర్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(5) రూపంలో రెండు కీలక వికెట్లు తీశాడు. మరోవైపు.. పేసర్ ఆకాశ్ దీప్ డేంజరస్ ఓపెనర్ డెవాన్ కాన్వే(4)ను అవుట్ చేసి శుభారంభం అందించాడు.
లంచ్ తర్వాత వికెట్ల వేట మొదలుపెట్టిన జడ్డూ
ఈ క్రమంలో లంచ్ బ్రేక్‌కు ముందు న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. అయితే, భోజన విరామం తర్వాత జడ్డూ తన బౌలింగ్ పదునుపెంచాడు. క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్లను ఇబ్బంది పెడుతున్న విల్ యంగ్(71)ను తొలుత పెవిలియన్‌కు పంపిన జడేజా.. అనంతరం టామ్ బ్లండెల్(0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్(17)ను అవుట్ చేశాడు. తద్వారా జడ్డూ టెస్టుల్లో 312 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.
టీ బ్రేక్ సమయానికి కివీస్‌స్కోరు ఎంతంటే?
ఈ నేపథ్యంలో భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్(311), ఇషాంత్ శర్మ(311)లను జడ్డూ అధిగమించాడు. వీరిద్దరి రికార్డును బ్రేక్ చేస్తూ టాప్-5లో చోటు సంపాదించాడు. ఇదిలా ఉంటే.. టీ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు
1. అనిల్ కుంబ్లే(స్పిన్నర్)- 619 వికెట్లు
2. రవిచంద్రన్ అశ్విన్(స్పిన్నర్)- 533 వికెట్లు
3. కపిల్ దేవ్(పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్)- 434 వికెట్లు
4. హర్భజన్ సింగ్(స్పిన్నర్)- 417 వికెట్లు
5. రవీంద్ర జడేజా(స్పిన్నర్)- 312 వికెట్లు.
చదవండి: IPL 2025 Retentions: జాక్‌పాట్ కొట్టిన ఆటగాళ్లు వీరే..!
Comments
Please login to add a commentAdd a comment