పంత్‌ అవుట్‌.. గిల్‌ సెంచరీ మిస్‌.. భారత్‌ స్కోరెంతంటే? | Ind vs NZ 3rd Test Day 2 Lunch Break: Gill Shines, Pant 60 - Check India Score | Sakshi
Sakshi News home page

Ind vs NZ: పంత్‌ అవుట్‌.. గిల్‌ సెంచరీ మిస్‌.. భారత్‌ స్కోరెంతంటే?

Published Sat, Nov 2 2024 11:51 AM | Last Updated on Sat, Nov 2 2024 12:53 PM

Ind vs NZ 3rd Test Day 2 Lunch Break: Gill Shines, Pant 60 - Check India Score

న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో టీమిండియా మెరుగైన స్కోరు దిశగా పయనిస్తోంది. శనివారం నాటి మూడో రోజు ఆటలో భోజన విరామ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగుల వద్ద నిలిచింది. కాగా కివీస్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను రోహిత్‌ సేన ఇప్పటికే 0-2తో చేజార్చుకుంది.

ఈ క్రమంలో ముంబై వేదికగా శుక్రవారం మొదలైన మూడో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 ఫైనల్‌ చేరాలన్నా.. కివీస్‌ చేతిలో వైట్‌వాష్‌ నుంచి తప్పించుకోవాలన్నా భారత్‌ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.

తొలిరోజు కివీస్‌ 235 పరుగులకు ఆలౌట్‌ 
ఇక వాంఖడే వేదికగా టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసిన టీమిండియా.. న్యూజిలాండ్‌ జట్టును నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయగలిగింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న వాంఖడే పిచ్‌పై రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్‌ సుందర్‌ నాలుగు వికెట్లు తీయగా.. పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. ఈ క్రమంలో కివీస్‌ జట్టు తొలి రోజే.. తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్‌ అయింది.

రోహిత్‌, కోహ్లి ఫెయిల్‌
ఈ క్రమంలో బ్యాటింగ్‌ మొదలుపెట్టిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌(30) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(18) మరోసారి విఫలమయ్యాడు. ఇక జైస్వాల్‌ వచ్చిన మహ్మద్‌ సిరాజ్‌ డకౌట్‌ కాగా.. విరాట్‌ కోహ్లి(4) రనౌట్‌ రూపంలో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది.

ఫలితంగా శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 86 పరుగులే చేసింది. ఈ క్రమంలో శుబ్‌మన్‌ గిల్‌ 31, రిషభ్‌ పంత్‌ ఒక పరుగుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి.. ఆది నుంచే దూకుడు ప్రదర్శించారు. కివీస్‌ బౌలర్లపై అటాక్‌ చేస్తూ ఇద్దరూ అర్ధ శతకాలు సాధించారు.

గిల్‌కు టెస్టుల్లో ఏడో ఫిఫ్టీ
గిల్‌ 66 బంతుల్లో యాభై పరుగులు పూర్తి చేసుకోగా.. పంత్‌ 36 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. అయితే, ఇష్‌ సోధి బౌలింగ్‌లో పంత్‌(60) లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా వెనుదిరగగా.. భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. అతడి స్థానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. 

 

ఇక శనివారం భోజన విరామ సమయానికి టీమిండియా 43 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ 70, జడేజా 10 పరుగులతో ఆడుతున్నారు. కాగా కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ కంటే టీమిండియా ఇంకా 40 పరుగులు వెనుకబడి ఉంది.  

గిల్‌ సెంచరీ మిస్‌
అయితే, లంచ్‌ తర్వాత గిల్‌ 90 పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద అవుయ్యాడు. అంతకంటే ముందు రవీంద్ర జడేజా(14), సర్ఫరాజ్‌ ఖాన్‌(0) వికెట్లను భారత్‌ కోల్పోయింది. 53.2 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి టీమిండియా 227 పరుగులు చేసింది.

టీమిండియా-న్యూజిలాండ్‌ మూడో టెస్టు
ప్లేయింగ్‌ ఎలెవన్‌ 
టీమిండియా
రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, రిషభ్‌ పంత్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఆకాశ్‌దీప్‌, మహ్మద్‌ సిరాజ్‌

న్యూజిలాండ్‌ 
టామ్‌ లాథమ్‌, డెవాన్‌ కాన్వే, విల్‌ యంగ్‌, రచిన్‌ రవీంద్ర, డారిల్‌ మిచెల్‌,  టామ్‌ బ్లండెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, ఇష్‌ సోధి, మ్యాట్‌ హెన్రీ, అజాజ్‌ పటేల్‌, విలియమ్‌ ఓ రూర్కీ.  

చదవండి: IPL 2025: మన లీడర్‌.. మన కెప్టెన్‌.. రీటైన్‌ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరు?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement