ఐపీఎల్ 2024 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్ 15) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఆర్సీబీ తమ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొట్టబోతుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ అద్భుత ప్రదర్శనలు చేస్తూ ఐదింట మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలువగా.. ఆరింట ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన ఆర్సీబీ అట్టడుగు స్థానంలో కొనసాగుతుంది.
హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 22 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా సన్‌రైజర్స్ 12, ఆర్సీబీ 10 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. నేటి మ్యాచ్‌కు వేదిక అయిన చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆర్సీబీని ఓడించింది. 2016 సీజన్ టైటిల్‌ను సన్‌రైజర్స్ ఇదే వేదికపై ఆర్సీబీని చిత్తు చేసి సాధించింది. 2019 తర్వాత ఇరు జట్లు ఈ వేదికపై ఇప్పటివరకు తలపడలేదు.
బలాబలాల విషయానికొస్తే.. ప్రస్తుత సీజన్‌లో సన్‌రైజర్స్ ఆర్సీబీ కంటే చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ఈ జట్టు నిండా విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్ విభాగంలోనూ సన్‌రైజర్స్ పర్ఫెక్ట్‌గా ఉంది. జట్టులో సగం మంది రాణించినా ఆర్సీబీతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు తిరుగుండదు.
ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్ లాంటి మెరుపు వీరులు.. కమిన్స్, భువీ, ఉనద్కత్, నటరాజన్ లాంటి అద్భుతమైన పేసర్లు సన్‌రైజర్స్ అమ్ములపొదిలో ఉన్నారు. నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడమే సన్‌రైజర్స్‌కు ఉన్న ఏకైక లోటు.
ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ జట్టు పరిస్థితి సన్‌రైజర్స్‌కు పూర్తి భిన్నంగా ఉంది. జట్టులో విరాట్ కోహ్లి మినహా ఒక్కరూ రాణించడం లేదు. మ్యాక్స్‌వెల్, గ్రీన్, విల్ జాక్స్ లాంటి విదేశీ మెరుపులు ఉన్నప్పటికీ వీరు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా పేల లేదు. విరాట్ తర్వాత దినేశ్ కార్తీక్ ఒక్కడే అడపాదడపా ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. రజత్ పాటిదార్, డుప్లెసిన్ ఇటీవల ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అర్దసెంచరీలు సాధించారు.
ఆర్సీబీ బౌలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ జట్టు బౌలింగ్ లైనప్‌లో పేరెన్నిక కలిగిన బౌలర్ ఒక్కరూ లేడు. రీస్ టాప్లే, సిరాజ్, ఆకాశ్‌దీప్, విజయ్‌కుమార్ వైశాఖ్ వికెట్లు తీయకపోగా ప్రతి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఈ బౌలింగ్ వనరులతో ఆర్సీబీ ఈ సీజన్‌లో నెట్టుకు రావడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో ఆర్సీబీ నేటి మ్యాచ్‌లో పటిష్టమైన సన్‌రైజర్స్‌ను ఏమేరకు నిలువరిస్తుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment