ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఏ రేంజ్‌లో రెచ్చిపోతున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ గతంలో ఎన్నడూ లేనంతగా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఇంతటి సమతూకమైన జట్టు బహుశా పొట్టి క్రికెట్ చరిత్రలో ఎక్కడా లేదనే చెప్పవచ్చు.
బ్యాటింగ్ విభాగంలో సన్‌రైజర్స్ ప్రదర్శన న భూతో న భవిష్యతి అన్న చందంగా ఉంది. ఈ జట్టులో ఉన్నటువంటి విధ్వంసకర వీరులు యావత్ పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఏ జట్టులోనూ లేరు. ఓపెనర్ల దగ్గరి నుంచి ఎనిమిది, తొమ్మిదో స్థానం ఆటగాళ్ల వరకు అందరూ మెరుపు వీరులే ఉన్నారు.
ఓపెనర్లు అభిషేక్, హెడ్ ఊచకోత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీరిద్దరు తమకెదురైన ప్రతి బౌలర్‌ను గడగడలాడిస్తున్నారు. వీరి దెబ్బకు బ్యాటింగ్ రికార్డులు ఒక్కొటిగా బద్దలవుతూ ఉన్నాయి. వీరిద్దరి తర్వాత బ్యాటింగ్‌కు దిగే మార్క్రమ్, క్లాసెన్ విధ్వంసం ఇంకో లెవెల్లో ఉంది. వీరు కూడా తమేమీ తక్కువ కాదు అన్నట్లు విధ్వంసం సృస్టిస్తున్నారు.
మార్క్రమ్ గత కొన్ని మ్యాచ్‌లుగా లయ తప్పినట్లు కనిపిస్తున్నా క్లాసెన్ మాత్రం అవకాశం దొరికిన ప్రతిసారి రెచ్చిపోతున్నాడు. ఈ నలుగురితో పాటు యువ ఆల్‌రౌండర్లు నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్‌లు కూడా తమ దాకా వస్తే మెరుపులు మెరిపిస్తున్నారు.
బౌలింగ్ విభాగంలో సైతం సన్‌రైజర్స్ చాలా పటిష్టంగా ఉంది. స్వింగ్ సుల్తాన్ భునేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇతనికి కమిన్స్, నటరాజన్, ఉనద్కత్ తోడవుతున్నారు. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం స్పిన్నర్ విజయ్‌కాంత్ వియాస్‌కాంత్ పర్వాలేదనిపించాడు. షాబాజ్ అహ్మద్, నితీశ్ రెడ్డి కూడా బంతితో రాణిస్తున్నారు.
సన్‌రైజర్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలతో పాటు ఫీల్డింగ్‌లోనూ పటిష్టంగా ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో నితీశ్, సన్వీర్ సింగ్ పట్టిన క్యాచ్‌లే ఇందుకు నిదర్శనం. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ బెంచ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. ఎంతలా అంటే.. బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లతో మరో సమతూకమైన జట్టును తయారు చేయవచ్చు.
మొత్తంగా ఈ సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ గతంలో ఎన్నడూ లేనట్లు అత్యంత పటిష్టంగా కనిపిస్తూ టైటిల్ దిశగా పరుగులు పెడుతుంది. ఈసారి సన్‌రైజర్స్ టైటిల్ ఎగరేసుకుపోవడం పక్కా అని అభిమానులు ధీమాగా ఉన్నారు. విశ్లేషకులు, మాజీలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment