IPL 2024 RCB VS SRH: ఓడినా ఆల్‌టైమ్‌ రికార్డు సెట్‌ చేసిన ఆర్సీబీ | IPL 2024, RCB VS SRH: RCB Recorded Highest Team Score In IPL While Batting Second | Sakshi
Sakshi News home page

IPL 2024 RCB VS SRH: ఓడినా ఆల్‌టైమ్‌ రికార్డు సెట్‌ చేసిన ఆర్సీబీ

Published Tue, Apr 16 2024 11:05 AM | Last Updated on Tue, Apr 16 2024 11:19 AM

IPL 2024 RCB VS SRH: RCB Recorded Highest Team Score In IPL While Batting Second - Sakshi

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో నిన్న (ఏప్రిల్‌ 15) అత్యంత రసవత్తరమైన సమరం జరిగింది. ఆర్సీబీ, సన్‌రైజర్స్‌ మధ్య జరిగిన భారీ స్కోరింగ్‌ మ్యాచ్‌లో ఎన్నో టీ20 రికార్డులు బద్దలయ్యాయి. ఐపీఎల్‌లో అత్యధిక టీమ్‌ స్కోర్‌.. ఓ టీ20 మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి చేసిన అత్యధిక స్కోర్‌ (సన్‌రైజర్స్‌ 287 + ఆర్సీబీ 262 = 549 పరుగులు).. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు (ఆర్సీబీ-22).. ఓ టీ20 మ్యాచ్‌లో నమోదైన అత్యధిక బౌండరీలు (43 ఫోర్లు, 38 సిక్సర్లు= 81).. ఇలా ఈ మ్యాచ్‌లో చాలావరకు పొట్టి క్రికెట్‌ రికార్డులన్నీ బద్దలయ్యాయి.

ఇదే మ్యాచ్‌లో మరో భారీ రికార్డు కూడా నమోదైంది. ఆర్సీబీ మ్యాచ్‌ ఓడినప్పటికీ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్‌ (262) చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్‌ పేరిట ఉండేది. ముంబై ఇండియన్స్‌ ఇదే సీజన్‌లో సెకెండ్‌ బ్యాటింగ్‌ చేస్తూ (సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ) 246 పరుగులు చేసింది. 

ఈ మ్యాచ్‌లో సెకెండ్‌ బ్యాటింగ్‌ చేస్తూ అత్యధిక స్కోర్‌ నమోదు చేసిన ఆర్సీబీ.. మరో రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోర్‌ చేసిన జట్టుగా డ్యూయల్‌ రికార్డు నమోదు చేసింది. 2017 సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ.. 49 పరుగులకే ఆలౌటైంది. ఈ స్కోర్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోర్‌గానూ రికార్డైంది. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ.. సన్‌రైజర్స్‌ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 288 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదిస్తూ ఆర్సీబీ 262 పరుగులకు పరిమితమైంది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌.. ట్రవిస్‌ హెడ్‌ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్‌ సమద్‌ (10 బంతుల్లో 37 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్‌ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్‌ (10 బంతుల్లో 37 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. 

ఛేదనలో ఆర్సీబీ చివరి వరకు గెలుపు కోసం పోరాటం చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. విరాట్‌ కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్‌ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్‌ కార్తీక్‌ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), మహిపాల్‌ లోమ్రార్‌ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్‌ రావత్‌ (14 బంతుల్లో 25 నాటౌట్‌; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement