SRH vs RCB: ఉప్పల్‌లో 300 కొడతారా..! | IPL Match Today SRH vs RCB | Sakshi
Sakshi News home page

SRH vs RCB: ఉప్పల్‌లో 300 కొడతారా..!

Published Fri, Apr 26 2024 12:37 PM | Last Updated on Fri, Apr 26 2024 12:37 PM

IPL Match Today SRH vs RCB - Sakshi

సాక్షి, హైదరాబాద్: 266... 277... 287... ఇదంతా ఒకే ఐపీఎల్‌ సీజన్‌లో, ఒకే టీమ్, వేర్వేరు మ్యాచ్‌లలో చేసిన పరుగుల విధ్వంసం. విశేషం ఏమిటంటే ఈ 287 పరుగులే ఇప్పటి వరకు ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరు. ఈ పరుగుల సునామీ సృష్టించింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కాగా... ఇందులో 277 పరుగులు నమోదు చేసింది నగరంలోని ఉప్పల్‌ స్టేడియం వేదికగానే.

ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఈసారి ఐపీఎల్‌ సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు నేడు ఉప్పల్‌ స్టేడియం వేదికగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టును ‘ఢీ’ కొట్టనుంది. 10 రోజుల క్రితం బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌ జట్టు 288 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా... ఆ లక్ష్యాన్ని ఆర్‌సీబీ (262/7) చేధించినంత పనిచేసింది. ఈ ఇరు జట్లే మళ్లీ నేడు తలపడనుండటంతో క్రికెట్‌ అభిమానుల చూపంతా ఈ మ్యాచ్‌పైనే ఉంది.  

ఆర్‌సీబీ ప్రతీకారం తీర్చుకోనుందా? 
హైదరాబాద్‌ తన హవాను కొనసాగించనుందా? అనే ఆసక్తికి ఉప్పల్‌ స్టేడియం వేదికగా మారింది. ఈ మ్యాచ్‌లో ఓడితే బెంగళూరు ‘ప్లే ఆఫ్స్‌’ చేరే అవకాశాలు ఆవిరవుతాయి. ఈ నేపథ్యంలో బెంగళూరుకు ఆడుతున్న ‘లోకల్‌ బాయ్‌’ మొహమ్మద్‌ సిరాజ్, భారత స్టార్‌ విరాట్‌ కోహ్లి ఎలాంటి ప్రదర్శన చేస్తారో వేచి చూడాలి. మరోవైపు తొలుత బ్యాటింగ్‌ చేస్తే ట్రావిస్‌ హెడ్, అభిషేక్‌ శర్మ, క్లాసెన్, మార్క్‌రమ్, ఆంధ్ర క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అబ్దుల్‌ సమద్‌ చెలరేగితే సన్‌రైజర్స్‌ స్కోరు ఈసారి 300 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు.  

సన్‌రైజర్స్‌ భీకరమైన ఫామ్‌లో ఉండటం... కోహ్లిలాంటి దిగ్గజం బరిలోకి దిగనుండటంతో ఈ మ్యాచ్‌ కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ సీజన్‌లోని గత మ్యాచ్‌ల్లాగే ఈసారీ అభిమానులకు టికెట్ల ఇక్కట్లు తప్పట్లేదు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు క్షణాల్లో అయిపోవడంతో చేసేదేమిలేక క్రికెట్‌ అభిమానులంతా బిగ్‌ స్క్రీన్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న పలు రెస్టారెంట్లు, ఫుడ్‌ కోర్టులు, మాల్స్‌ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం కోసం భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నాయి.   
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement