ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ బౌలింగ్ ఎంత ఛండాలంగా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సీజన్‌లో ఆ జట్టులో ఒక్కరంటే ఒక్కరు కూడా కనీస స్థాయి బౌలర్‌గా కనిపించడం లేదు.
కోట్లు కుమ్మరించి కొనుక్కున్న విదేశీ పేసర్లు అల్జరీ జోసఫ్, కెమరూన్ గ్రీన్, రీస్ టాప్లే, లోకీ ఫెర్గూసన్ గల్లీ స్థాయి బౌలర్లకంటే హీనంగా బౌలింగ్ చేస్తుండగా.. స్వదేశీ హీరోలు సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ తామేమీ తక్కువ కాదన్నట్లు పోటీపడి పరుగులు సమర్పించుకుంటున్నారు. సన్‌రైజర్స్‌తో నిన్నటి మ్యాచ్‌లో అయితే ఆర్సీబీ బౌలర్ల చెత్త ప్రదర్శన శృతి మించిపోయింది.
ఈ మ్యాచ్‌లో ఏకంగా నలుగురు బౌలర్లు తమ కోటా నాలుగు ఓవర్లలో 50పైగా పరుగులు సమర్పించుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇలా ఒకే ఇన్నింగ్స్‌లో ఇంత మంది ఫిఫ్టి ప్లస్ స్కోర్లు సమర్పించుకోవడం ఇదే మొదటిసారి.
ఈ మ్యాచ్‌లో రీస్ టాప్లే 68, విజయ్‌కుమార్ 64, ఫెర్గూసన్ 52, యశ్ దయాల్ 51 పరుగులు సమర్పించుకున్నారు. ఆర్సీబీ చెత్త బౌలింగ్ కారణంగా సన్‌రైజర్స్ బ్యాటర్లు పేట్రేగిపోయి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ను నమోదు చేశారు. ఆర్సీబీ బౌలర్ల చెత్త ప్రదర్శనను ఎప్పుడూ వెనకేసుకొచ్చే సొంత అభిమానులే జీర్ణించుకోలేకతున్నారు. ఆర్సీబీ బౌలింగ్.. నభూతో నభవిష్యతి అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 25 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 288 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదిస్తూ ఆర్సీబీ 262 పరుగులకు పరిమితమైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.
ఛేదనలో విరాట్ (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ ఆర్సీబీని గెలిపించలేకపోయారు. ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment