విండీస్ విహారం
► వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలుపు
► పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా
► రాణించిన చార్లెస్, శామ్యూల్స్
జట్టు మొత్తం టి20 స్టార్స్‌తో నిండిన వెస్టిండీస్ టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరింది. తొలి రెండు మ్యాచ్‌లతో పోలిస్తే దక్షిణాఫ్రికాపై కాస్త కష్టపడ్డా హ్యాట్రిక్ విజయంతో నాకౌట్‌కు అర్హత సాధించింది. గేల్, బ్రేవో ఈసారి బంతితో మెరిస్తే.. శామ్యూల్స్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో కరీబియన్లను గట్టెక్కించాడు. ఈ గ్రూప్‌లో శ్రీలంకతో నేడు జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే... దక్షిణాఫ్రికా జట్టు ఇంటికి వెళుతుంది.
నాగ్‌పూర్: భారీ హిట్టర్లున్న దక్షిణాఫ్రికాను అద్భుతమైన బౌలింగ్‌తో కట్టడి చేసిన వెస్టిండీస్ జట్టు.. టి20 ప్రపంచకప్‌లో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. బ్యాటింగ్‌లో కాస్త తడబడ్డా మూడు వికెట్లతో సఫారీలపై గెలిచింది. వీసీఏ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులు చేసింది. డికాక్ (46 బంతుల్లో 47; 3 ఫోర్లు, 1 సిక్స్), వీస్ (26 బంతుల్లో 28; 2 ఫోర్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తొలి మూడు ఓవర్లలో మూడు కీలక వికెట్లు పడటంతో సఫారీలు కోలుకోలేకపోయారు.
భారీగా ఆశలు పెట్టుకున్న డివిలియర్స్ (12 బంతుల్లో 10; 1 ఫోర్), మిల్లర్ (1) కూడా ఒత్తిడికి లోనుకావడంతో ప్రొటీస్ 47 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. అయితే డికాక్, వీస్‌లు ఆరో వికెట్‌కు 7.2 ఓవర్లలో 50 పరుగులు జోడించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. రస్సెల్, గేల్, బ్రేవోలు తలా రెండు వికెట్లు తీశారు.
లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 19.4 ఓవర్లలో 7 వికెట్లకు 123 పరుగులు చేసి గెలిచింది. శామ్యూల్స్ (44 బంతుల్లో 44; 6 ఫోర్లు) టాప్ స్కోరర్. ప్రత్యర్థుల ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయినా.. ఇన్నింగ్స్ ఐదో బంతికి ‘డేంజర్ బ్యాట్స్‌మన్’ క్రిస్ గేల్ (4)ను అవుట్ చేసి ప్రొటీస్ పట్టుబిగించే ప్రయత్నం చేసింది. తర్వాత ఫ్లెచర్ (11) అనూహ్యంగా రనౌటైనా.. చార్లెస్ (35 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), శామ్యూల్స్ సమయోచితంగా ఆడారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 32 పరుగులు జత చేశారు.
అయితే చార్లెస్, డ్వేన్ బ్రేవో (8) వరుస ఓవర్లలో అవుట్‌కావడంతో విండీస్ విజయ సమీకరణం 24 బంతుల్లో 24 పరుగులుగా మారింది. ఈ దశలో స్పిన్నర్ తాహిర్ ‘మ్యాజిక్’ చేశాడు. 17వ ఓవర్‌లో వరుస బంతుల్లో రస్సెల్ (4), స్యామీ (0)లను అవుట్ చేస్తే.. 18వ ఓవర్‌ను వీస్ మూడు పరుగులే ఇవ్వడంతో ప్రొటీస్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. తర్వాతి ఓవర్‌లో మోరిస్ రెండు ఫోర్లు సమర్పించుకున్నా శామ్యూల్స్‌ను అవుట్ చేయడంతో విండీస్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు చేయాల్సిన దశలో రబడ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్ (10 నాటౌట్) భారీ సిక్సర్ బాదడంతో సఫారీల పోరాటం వృథా అయ్యింది. తాహిర్‌కు రెండు వికెట్లు దక్కాయి. శామ్యూల్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా రనౌట్ 1; డికాక్ (బి) రస్సెల్ 47; డు ప్లెసిస్ (సి) బెన్ (బి) రస్సెల్ 9; రోసోవ్ (సి) రస్సెల్ (బి) గేల్ 0; డివిలియర్స్ (బి) బ్రేవో 10; మిల్లర్ (బి) గేల్ 1; వీస్ (సి) స్యామీ (బి) బ్రేవో 28; మోరిస్ నాటౌట్ 16; ఫాంగిసో రనౌట్ 4; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 122.
వికెట్ల పతనం: 1-1; 2-13; 3-20; 4-46; 5-47; 6-97; 7-112; 8-122.
బౌలింగ్: బద్రీ 3-0-22-0; రస్సెల్ 4-0-28-2; గేల్ 3-0-17-2; బ్రాత్‌వైట్ 2-0-11-0; బెన్ 4-0-20-0; బ్రేవో 4-0-20-2.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: చార్లెస్ (సి) డుప్లెసిస్ (బి) వీస్ 32; గేల్ (బి) రబడ 4; ఫ్లెచర్ రనౌట్ 11; శామ్యూల్స్ (సి) డివిలియర్స్ (బి) మోరిస్ 44; బ్రేవో (సి) వీస్ (బి) ఫాంగిసో 8; రస్సెల్ (సి) మిల్లర్ (బి) తాహిర్ 4; స్యామీ (బి) తాహిర్ 0; బ్రాత్‌వైట్ నాటౌట్ 10; రామ్‌దిన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (19.4 ఓవర్లలో 7 వికెట్లకు) 123.
వికెట్ల పతనం: 1-5; 2-34; 3-66; 4-87; 5-100; 6-100; 7-113.
బౌలింగ్: రబడ 3.4-0-38-1; మోరిస్ 4-0-33-1; తాహిర్ 4-0-13-2; వీస్ 4-0-19-1; ఫాంగిసో 4-0-19-1.