Samuels
-
టి20ల్లో ‘విన్’డీసే
2016 మార్చి 31: ముంబైలో టి 20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్... విరాట్ కోహ్లి (47 బంతుల్లో 89; 11 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుతో 192 పరుగులు చేసింది. సొంతగడ్డ బలంతో గెలుపు మనదే అనుకున్నారంతా. గేల్, శామ్యూల్స్ వంటి హిట్టర్లు విఫలం కావడంతో ఆట అలాగే మొదలైంది కూడా. కానీ, జాన్సన్ చార్లెస్ (36 బంతుల్లో 52; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), లెండిల్ సిమన్స్ 51 బంతుల్లో 82; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), రసెల్ (20 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఇలా ఒకరి వెంట ఒకరు విరుచుకుపడి రెండు బంతులు ఉండగానే విజయాన్ని గుంజేసుకున్నారు. 2016 ఆగస్ట్ 27: ఫ్లోరిడాలో వెస్టిండీస్–భారత్ మధ్య రెండో టి20. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ జాన్సన్ చార్లెస్ (33 బంతుల్లో 79; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు), ఎవిన్ లూయీస్ (49 బంతుల్లో 100; 5 ఫోర్లు, 9 సిక్స్‌లు) దుమ్ము రేపడంతో 245 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 110; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగడంతో టీమిండియా లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. కానీ, చివరి ఓవర్లో బ్రేవో జిత్తులమారి బౌలింగ్‌తో విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. సాక్షి క్రీడా విభాగం: ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్ టి20ల్లో ఎంతటి మొండి జట్టో చెప్పేందుకు పై రెండు ఉదాహరణలు చాలు. ఈ పొట్టి ఫార్మాట్లో భారత్... ఆస్ట్రేలియా కొమ్ములు వంచింది. దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. పాకిస్తాన్‌కు దమ్ము చూపించింది. ఇంగ్లండ్‌కు ముచ్చెమటలు పట్టించింది. కానీ, విండీస్‌ను మాత్రం కనీసం వణికించలేకపోతోంది. కారణం... ఆ జట్టులోని భీకర హిట్టర్లైన బ్యాట్స్‌మెన్, మంత్రం వేసినట్లు కట్టిపడేసే బౌలర్లే. టెస్టులు, వన్డే ల్లో ప్రదర్శన ఎలా ఉన్నా... ప్రపంచవ్యాప్తంగా లీగ్‌ల లో ఆడుతుండటంతో కరీబియన్లు టి20ల్లో మేటిగా నిలుస్తున్నారు. దీంతో వారికి ఒత్తిడిని అధిగమించడంతో పాటు, వేదిక ఏదైనా, ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఎదురుదాడి చేసే స్థయిర్యం అలవడింది. ఎంతకూ మింగుడుపడదే! టీమిండియా ఇప్పటివరకు విండీస్‌పై 8 టి20లు ఆడితే రెండే నెగ్గగలిగింది. ఐదింటిలో ఓడిపోయింది. మరో మ్యాచ్ రద్దయింది. మేటి జట్లన్నింటిపై మెరుగైన రికార్డు ఉన్నా, కరీబియన్లు మాత్రం మనకు ఎంతకూ లొంగడం లేదు. గేల్ దుమారం అంతగా తాకకున్నా... ఎవిన్ లూయీస్, జాన్సన్ చార్లెస్, లెండిల్ సిమ్మన్స్ వంటి పెద్దగా పేరు లేని ఆటగాళ్లే భారత్‌ను బంతాట ఆడుకున్నారు. వీరితోపాటు బ్రేవో, స్యామీ, బ్రాత్‌వైట్, పొలార్డ్, రస్సెల్ వంటి ఆల్‌రౌండర్లతో ఆ జట్టు ఎంతకూ తెగని కథలా కనిపించేది. ఇందులో చాలామంది ప్రస్తుత జట్టులో లేకున్నా ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. ఆదమరిస్తే అంతే! చివరి ఓవర్లో నాలుగు సిక్స్‌లు కొట్టి ఇంగ్లండ్ నుంచి టి20 ప్రపంచకప్‌ను అమాంతం లాగేసుకున్న కార్లోస్ బ్రాత్‌వైట్ ఇప్పుడు వెస్టిండీస్ టి20 జట్టు కెప్టెన్. ఐపీఎల్లో కోల్‌కతా తరఫున మెరుపులు మెరిపించిన రసెల్, ముంబై ఇండియన్స్‌ను చాలా సార్లు గట్టెక్కించిన కీరన్ పొలార్డ్ ఈ సిరీస్‌కు అందుబాటులోకి వచ్చారు. వీరితో పాటు జట్టులో ఉన్న కారీ పియరీ, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ అటు బ్యాట్‌తో, ఇటు బంతితో దెబ్బకొట్టే సత్తా ఉన్న ఆల్‌రౌండర్లే కావడం విశేషం. ఇక, యువ హెట్‌మైర్ దూకుడెంతో వన్డే సిరీస్‌లోనే తెలిసొచ్చింది. లూయిస్ స్థానంలో జట్టులోకి వచ్చిన నికొలస్ పూరన్ సైతం సత్తా ఉన్నవాడే. ఈ నేపథ్యంలో ఒక్క ఓవర్‌తో ఫలితం మారిపోయే టి20ల్లో భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. -
డికాక్ అవుట్..శామ్యూల్స్ ఇన్
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు వెస్టీండిస్ ఆల్‌రౌండర్ మార్లన్ శామ్యూల్స్‌ను ఎంపిక చేసింది. జట్టులోని ప్రధాన ఆటగాడు సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ గాయంతో ఈ సీజన్ కు దూరమయ్యాడు. ఇతని స్థానంలో శ్యాముల్స్ ను ఎంపిక చేసినట్లు ఆ జట్టు ప్రకటించింది. డికాక్ ఇప్పటి వరకు ఢిల్లీ ఆడిన మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. అయితే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో వెస్టీండిస్ గెలుపుకు కీలక పాత్ర పోషించిన శ్యాముల్స్ను ఐపీఎల్-10 సీజన్ వేలంలో ఏ జట్టు తీసుకోలేదు. దీంతో 7 వ స్థానంలో దాటిగా ఆడే ఆల్ రౌండర్ లేక సతమతమవుతున్నఢిల్లీ శ్యామ్యూల్స్ను ఎంపిక చేసింది. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలవాలని ఢిల్లీ భావిస్తుంది. ఇప్పటికీ 6 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ రెండు నెగ్గి, నాలుగు మ్యాచుల్లో ఓడింది. -
ఫైనల్లో ఆస్ట్రేలియా
► 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై గెలుపు ► ముక్కోణపు వన్డే సిరీస్ బ్రిడ్జ్‌టౌన్: బ్యాటిం గ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఫైనల్‌కు చేరింది. కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 50 ఓవ ర్లలో 8 వికెట్లకు 282 పరుగులు చేసింది. శామ్యూల్స్ (134 బంతుల్లో 125; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆసీస్‌పై తొలి సెంచరీతో ఆకట్టుకోగా...రామ్ దిన్ (92 బంతుల్లో 91; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) కొద్దిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు, ఫాల్క్‌నర్, బొలాండ్ చెరో 2 వికె ట్లతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసి విజయం సాధించింది. స్మిత్ (107 బంతుల్లో 78; 5 ఫోర్లు), మార్ష్ (85 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించగా... మ్యాక్స్‌వెల్ (26 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. శామ్యూల్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
ఐసీసీది ద్వంద్వ వైఖరి: రిచర్డ్స్
కింగ్స్టన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తమ సభ్య దేశాలన్నింటి మీదా ఒకేలాంటి వైఖరి అవలంభించడం లేదని వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ఆరోపించారు. విండీస్‌పై ఓ నిబంధన.. భారత్‌పై ఓ నిబంధన అమలు పరుస్తున్నారని దెప్పిపొడిచారు. టి20 ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్‌కు ఐసీసీ మందలింపుపై ఆయన ఈ రకంగా విమర్శించారు. టైటిల్ గెలిచాక తమ క్రికెట్ బోర్డుపై స్యామీ, శామ్యూల్స్, బ్రేవో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చర్య ఐసీసీకి ఆగ్రహం తెప్పించింది. ఇటీవలి తమ బోర్డు సమావేశంలో ఓ ప్రకటన విడుదల చేశారు. విండీస్ ఆటగాళ్లు అనుచితంగా ప్రవర్తించారని, బోర్డుకు అప్రతిష్ట తెచ్చారని పేర్కొంది. అయితే దీనిపై రిచర్డ్స్ గళమెత్తారు. -
మైదానంలో, బయటా... అతను సీరియస్!
వెస్టిండీస్ గెలిచిన రెండు టి20 ప్రపంచకప్‌లలో కలిసి శామ్యూల్స్ చేసిన స్కోరు వికెట్ నష్టానికి 163 పరుగులు... ఇతర వెస్టిండీస్ ఆటగాళ్లంతా చేసింది 11 వికెట్ల నష్టానికి 121 పరుగులు... ఇది చాలు ఈ రెండు టైటిల్స్ గెలవడంలో అతని పాత్ర ఏమిటో చెప్పడానికి. వన్డేలనుంచి టి20ల వరకు వరల్డ్ కప్ జట్ల విజయాలలో భాగమైన స్టార్ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ వారెవరికీ రెండు ఫైనల్స్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్రదర్శన ఇవ్వడం సాధ్యం కాలేదు. సరదాగా కనిపించడంలో విండీస్ జట్టులోని ఇతర ఆటగాళ్లతో పోలిస్తే కాస్త తక్కువగానే కనిపించినా ఆవేశం మాత్రం ఎక్కువే. పేరుకు పదహారేళ్ల కెరీర్ ఉన్నా స్వయంకృతం కారణంగా సీన్లో కనిపించని శామ్యూల్స్ మరోసారి ప్రపంచకప్ ద్వారా హీరోగా మారాడు. కోల్‌కతానుంచి సాక్షి క్రీడా ప్రతినిధి :- ప్రపంచ కప్ గెలిచిన తర్వాత మీడియా సమావేశానికి మార్లోన్ శామ్యూల్స్ వచ్చాడు. ఎప్పుడో మ్యాచ్ ముగిసినా అతను తన ప్యాడ్స్‌ను విప్పలేదు. అయితే వాటి వల్ల కుర్చీలో సరిగ్గా కూర్చోలేక నేరుగా టేబుల్‌పైనే కాళ్లు పెట్టేశాడు. ఆ ప్రవర్తనకు పొగరు అనేది కూడా చాలా చిన్న పదమేమో. అయితే జట్టుకు టైటిల్ అందించిన ఆనందంలో అతను ప్రపంచాన్ని లెక్క చేసే పరిస్థితిలో లేడు. అక్కడ ఉన్న ఐదే ఐదు నిమిషాల్లో స్టోక్స్‌ను, వార్న్‌ను ఏకిపారేశాడు. ఇంకా అక్కడే ఉంటే ఏం జరిగేదో కానీ, ఐసీసీ అధికారులు అర్ధాంతరంగా తీసుకెళ్లిపోయారు. శామ్యూల్స్ వ్యవహారశైలికి ఇదో ఉదాహరణ. పేరుకు పదహారేళ్ల కెరీర్ ఉన్నా... అప్పుడప్పుడు వరల్డ్ కప్ మెరుపులే అతడిని గుర్తించేలా చేశాయి. ఈడెన్తోనే మొదలు... 2000లో శామ్యూల్స్ అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించాడు. రెండేళ్ల పాటు అంతంత మాత్రంగానే ఆడిన అతనికి 2002లో భారత పర్యటనకు అవకాశం లభించింది. అయితే కోల్‌కతాలో టెస్టుకు ముందు క్లబ్‌కు హాజరై నిబంధనలు ఉల్లంఘించడంతో విండీస్ బోర్డు అతడిని వెనక్కి పిలిచింది. అయితే చచ్చీ చెడి బతిమాలడంతో చివరకు వదిలేసింది. వెంటనే మ్యాచ్ అవకాశం దక్కించుకున్న అతను ఈడెన్ గార్డెన్స్‌లోనే తన తొలి టెస్టు సెంచరీ నమోదు చేశాడు. నాటినుంచి మళ్లీ ఈడెన్‌లో టి20 విజయం అందుకునే వరకు ఎన్నో మలుపులు, వివాదాలు. సరిగ్గా 2007 టి20 ప్రపంచకప్ సమయంలో అతనిపై ఫిక్సింగ్ ఆరోపణలు. అదీ భారత పోలీసులు బయటపెట్టిందే. అయితే విచారణ కొనసాగుతుండగానే విండీస్ టోర్నీలో ఆడించింది. చివరకు తప్పు చేసినట్లు రుజువు కావడంతో రెండేళ్ల నిషేధం. నిజానికి ఇలాంటి ఘటన తర్వాత ఆటగాడు తిరిగి రావడం కష్టం. కానీ శామ్యూల్స్ కూడా గట్టిగానే పోరాడాడు. తనలో సత్తా ఉందని, నిరూపించుకుంటానని పట్టుదలగా వచ్చి అతను ఆ తర్వాత ఎంతో మెరుగయ్యాడు. ఐపీఎల్లో పుణే వారియర్స్ తరపున ఆడినప్పుడు అతను 730 జెర్సీ నంబర్ ధరించాడు. దానికి కారణం చెబుతూ 730 రోజులు తాను నిషేధంతో క్షోభను అనుభవించానని, అది గుర్తు చేసుకుంటే తనలో పట్టుదల పెరుగుతుందని చెప్పుకోవడం అతని శైలి. 2012 ప్రపంచకప్ గెలిపించడంతో శామ్యూల్స్ స్థాయి పెరిగింది. అయితే ఆ తర్వాత మళ్లీ అతను చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. ఈ మధ్యలో అతని బౌలింగ్‌పై అంపైర్లు రెండు సార్లు సందేహాలు లేవనెత్తారు. చివరకు అది చకింగ్గా తేలడంతో రెండేళ్ల క్రితమే బౌలింగ్ మానేయాల్సి వచ్చింది. బ్యాట్‌తోనే జవాబు... విమర్శలు వచ్చినప్పుడు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి చూశారా నా ఆట అన్నట్లుగా ఒక జవాబివ్వడం చాలా మంది ఆటగాళ్లు చేసేదే. అయితే మర్యాద కోసం కొంత మంది పేరు ఎత్తకుండా దానిని దాటవేస్తారు. అయితే శామ్యూల్స్ అలాంటి వ్యక్తి కాదు. అందుకే వేదికపైనే ఇది వార్న్ కోసం అంటూ నేరుగా తిట్టి పోశాడు. మూడేళ్ల క్రితం బిగ్‌బాష్ సందర్భంగా గొడవ ముదిరి వార్న్‌పై అతను బ్యాట్ విసిరేశాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్టు సమయంలో శామ్యూల్స్ రన్నింగ్‌ను తీవ్రంగా విమర్శించిన వార్న్... ఈసారి టి20 ప్రపంచకప్ సెమీస్‌లో అవుటయ్యాక ఆట చేత కాదన్నాడు. దాంతో నేను మైక్‌తో కాదు బ్యాట్‌తో జవాబిస్తానని మ్యాచ్ తర్వాత ఘాటుగా శామ్యూల్స్ వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌లో ఒక సారి స్టోక్స్‌తో వాదన జరగ్గా... చివరి ఓవర్లో కూడా మాటల యుద్ధం సాగింది. గెలిచిన తర్వాత షర్ట్ విప్పి ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూం ముందు డ్యాన్స్ చేశాడు. నాతో ఆడేటప్పుడు మాటలతో పెట్టుకోవద్దు అని ముందే అతనికి చెప్పాను. ఎందుకంటే నేను బాగా ఆడబోతున్నాను అని తెలుసు. అయినా అతను మారలేదు. అతడి బౌలింగ్‌లో ఒక్క బంతి కూడా ఎదుర్కోక ముందే మాటలతో దాడి చేస్తే ఊరుకుంటానా అని శామ్యూల్స్ వ్యాఖ్యానించాడు. గేల్, సిమన్స్ విఫలమైనా.... మరో సారి తన అనుభవం రంగరించి అమూల్యమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు రెండో టైటిల్ అందించిన అతని స్థానం విండీస్ క్రికెట్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత కూడా నేను ఇంత కాలం కొనసాగుతున్నానంటే నా పట్టుదల, పోరాడేతత్వమే కారణం. ఇక నన్ను ఎవరైనా మాటలతో ఏమైనా అంటే మాత్రం నేను మరింతగా రెచ్చిపోతాను. గత ఐదేళ్లలో నా జీవితం ఎంతో మారింది. ఈ స్థాయిలో ఆడగలుగుతున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు - శామ్యూల్స్ జరిమానా ఆదివారం జరిగిన ఫైనల్ చివరి ఓవర్లో ఇంగ్లండ్ బౌలర్ స్టోక్స్‌ను అసభ్యపదజాలంతో శామ్యూల్స్ దూషించాడు. దీనిపై ఐసీసీ విచారణ జరపగా శామ్యూల్స్ తప్పు అంగీకరించాడు. దీంతో అతడి మ్యాచ్‌లో ఫీజులో 30 శాతం కోత విధించినట్లు ఐసీసీ ప్రకటించింది. -
బౌలర్‌ను తిట్టిన విండీస్ ప్లేయర్‌పై భారీ ఫైన్
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లపై తిట్లవర్షం కురిపించిన విండీస్ ఆటగాడు మార్లన్ సామ్యూల్స్పై ఐసీసీ భారీ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 30శాతం జరిమానా మోపింది. చివరి ఓవర్ వేసిన బెన్ స్టోక్పై మార్లన్ తిట్లవర్షం కురిపించాడు. అతడిని ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆటగాళ్లు, వారి సిబ్బంది కోసం ఉద్దేశించిన ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.1.4ను అతడు ఉల్లంఘించినట్టు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంగ్లండ్ బౌలర్లపై సామ్యూల్స్ అసభ్య వ్యాఖ్యలు చేసినట్టు మొదట ఫీల్డ్ ఎంపైర్లు కుమార్ ధర్మసేనా, రాడ్ టకర్, థర్డ్ ఎంపైర్ మారైఎస్ ఎరాస్మస్, ఫోర్త్ ఎంపైర్ బ్రుస్ ఆక్సెన్‌ఫర్డ్ అభియోగాలు మోపారు. ఈ అభియోగాలను అంగీకరించిన సామ్యూల్స్.. మ్యాచ్ రీఫరీ రంజన్ ముదుగలె విధించిన జరిమానాకు అంగీకరించారు. ఎదుటి జట్టు ఆటగాళ్లను దూషించడం ఐసీసీ నిబంధనల ప్రకారం లెవల్ 1 ఉల్లంఘనగా భావిస్తారు. ఇందుకు సదరు ఆటగాడిపై గరిష్ఠంగా 50శాతం వరకు జరిమానా విధిస్తారు. -
సిసలైన చాంపియన్
► టి20 ప్రపంచకప్ విజేత వెస్టిండీస్ ► ఫైనల్లో 4 వికెట్లతోఇంగ్లండ్పై విజయం ► రాణించిన శామ్యూల్స్ గెలిపించిన బ్రాత్‌వైట్ ► రెండో సారి టైటిల్ కైవసం కోల్‌కతా నుంచి సాక్షి క్రీడాప్రతినిధి:- వెస్టిండీస్ జట్టు మహాద్భుతం చేసింది. టి20 ప్రపంచకప్‌ను రెండో సారి గెలిచి చరిత్ర సృష్టించింది. తమకే సొంతమైన రీతిలో చివర్లో విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శనతో అసలు సిసలు చాంపియన్‌లా ఆడి టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన ఫైనల్లో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. జో రూట్ (36 బంతుల్లో 54; 7 ఫోర్లు), బట్లర్ (22 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించగా, బ్రాత్‌వైట్, బ్రేవోలకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం వెస్టిండీస్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మార్లోన్ శామ్యూల్స్ (66 బంతుల్లో 85 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు)కు తోడు బ్రాత్‌వైట్ (10 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగి విండీస్‌ను జగజ్జేతగా నిలిపారు. 2012లో టైటిల్ నెగ్గిన విండీస్ రెండో సారి టి20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. రెండు సార్లూ కెప్టెన్ డారెన్ స్యామీనే కావడం విశేషం. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: ఆదుకున్న రూట్ పవర్‌లెస్ ప్లే ఫైనల్ మ్యాచ్ విండీస్ లెగ్‌స్పిన్నర్ బద్రీ సంచలన బౌలింగ్‌తో ప్రారంభమైంది. రెండో బంతికే అతను రాయ్ (0)ను క్లీన్‌బౌల్డ్ చేసి శుభారంభాన్ని అందించాడు. రసెల్ వేసిన తర్వాతి ఓవర్లో బౌండరీ కోసం ప్రయత్నించిన హేల్స్ (1) షార్ట్ ఫైన్‌లెగ్‌లో బద్రీకి సునాయాస క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లండ్‌కు షాక్ తగిలింది. టోర్నీలో ఘోరంగా విఫలమైన కెప్టెన్ మోర్గాన్ (5) అదే దారిలో నడిచాడు. మరో వైపు రూట్ నిలబడటంతో పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు 33 పరుగులు చేయగలిగింది. ఆ ఐదు ఓవర్లు పవర్ ప్లే ముగిసిన తర్వాత రూట్, బట్లర్ దూకుడు ప్రదర్శించారు. వీరిద్దరి జోరు ఇంగ్లండ్‌ను కోలుకునేలా చేసింది. బెన్ బౌలింగ్‌లో బట్లర్ 3 భారీ సిక్సర్లు బాది సత్తా చాటాడు. దాంతో 7-11 మధ్య 5 ఓవర్లలో 10 రన్‌రేట్‌తో ఇంగ్లండ్ 50 పరుగులు చేసింది. మార్చేసిన బ్రేవో, బ్రాత్‌వైట్ నాలుగో వికెట్‌కు రూట్, బట్లర్ భాగస్వామ్యం 51 పరుగులకు చేరిన తర్వాత ఒక్కసారిగా ఇంగ్లండ్ పతనం మొదలైంది. జోరు మీదున్న బట్లర్... బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్‌లో బ్రేవోకు క్యాచ్ ఇచ్చాడు. మరో వైపు 33 బంతుల్లో రూట్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఈ దశలో బ్రేవో ఓవర్ ఇంగ్లండ్‌ను ముంచింది. అతను వేసిన నాలుగో బంతిని ఆడలేక స్టోక్స్ (13) సునాయాస క్యాచ్ అందించగా, చివరి బంతికి అలీ (0) వెనుదిరిగాడు. అప్పటి దాకా నిలకడగా ఆడుతూ వచ్చిన రూట్... బ్రాత్‌వైట్ ఓవర్లో స్కూప్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. 18 బంతుల వ్యవధిలో 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ పరిస్థితి మరింత దిగజారింది. చివర్లో విల్లీ (14 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో ఆఖరి 5 ఓవర్లలో ఇంగ్లండ్ 40 పరుగులు చేయగలిగింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్: శామ్యూల్స్ పోరాటం రూట్ దెబ్బ... వెస్టిండీస్ ఇన్నింగ్స్ కూడా దాదాపు ఇంగ్లండ్‌లాగే సాగింది. విల్లీ తొలి ఓవర్లో ఒకే పరుగు ఇవ్వగా, అనూహ్యంగా రెండో ఓవర్ వేసిన రూట్ అద్భుత ఫలితం సాధించాడు. తొలి బంతినే భారీ షాట్ ఆడబోయి చార్లెస్ (1) మిడాన్‌లో చిక్కగా, మూడో బంతిని ఇదే తరహాలో ఆడి క్రిస్ గేల్ (4) క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లండ్ సంబరాలు మిన్నంటాయి. గత మ్యాచ్ హీరో సిమన్స్ (0) తొలి బంతికే ఎల్బీ కావడంతో విండీస్ కష్టాల్లో పడగా... జోర్డాన్ వేసిన ఆరో ఓవర్లో శామ్యూల్స్ 3 ఫోర్లు బాదడంతో పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 37కు చేరింది. కొనసాగిన తడ‘బ్యాటు’ పవర్‌ప్లే తర్వాత విండీస్ నీరసించింది. కీపర్ పట్టుకున్న క్యాచ్ నేలను తాకడంతో అదృష్టవశాత్తూ అవుట్ కాకుండా బతికిపోయిన శామ్యూల్స్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు పరుగులు తీయడమే కష్టంగా మారిపోయింది. ఎంత బలంగా బాదే ప్రయత్నం చేసినా బంతి ఫీల్డర్లను దాటిపోలేదు. 7-13 మధ్య 7 ఓవర్లలో 39 పరుగులే చేసిన ఆ జట్ట్టు కేవలం 3 ఫోర్లు మాత్రమే కొట్టింది. ఎట్టకేలకు 14వ ఓవర్లో ఒక భారీ సిక్స్ కొట్టిన బ్రేవో (27 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) ఆ వెంటనే వెనుదిరిగాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 69 బంతుల్లో 75 పరుగులు జోడించారు. మరువలేని ఫినిషింగ్ 6 ఓవర్లలో 70 పరుగులు చేయాల్సిన దశలో ప్లంకెట్ ఓవర్లో శామ్యూల్స్ 2 సిక్సర్లు, ఫోర్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. అయితే విల్లీ చక్కటి బౌలింగ్‌కు తోడు ఇంగ్లండ్ అద్భుత ఫీల్డింగ్‌తో తర్వాతి ఓవర్లోనే రసెల్ (1), స్యామీ (2) వెనుదిరిగారు. 15-19 ఓవర్ల మధ్యలో విండీస్ 51 పరుగులు చేయగా... ఇక చివరి ఓవర్ విండీస్‌ను చరిత్రలో నిలబెట్టింది. ఆఖరి ఓవర్లో విజయానికి 19 పరుగులు కావలసి ఉండగా... స్టోక్స్ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్ వరుసగా నాలుగు సిక్సర్లు బాది కొత్త చరిత్ర సృష్టించాడు. ఏడో వికెట్‌కు శామ్యూల్స్, బ్రాత్‌వైట్ 25 బంతుల్లో అజేయంగా 54 పరుగులు జత చేశారు. -
అపూర్వం ... అద్భుతం... అద్వితీయం
6, 6, 6, 6 ప్రపంచకప్ ఫైనల్లో చివరి ఓవర్లో జరిగిన విధ్వంసం ఇది. వెస్టిండీస్ హిట్టర్ బ్రాత్‌వైట్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆఖరి ఓవర్లో విజయానికి 19 పరుగులు చేయాల్సి ఉండగా... ఆశలు లేని దశలో అతనిలోని హిట్టర్ బయటికి వచ్చాడు. ఆరు బంతులేం ఖర్మ అంటూ భారీ సిక్సర్లు బాది రెండు బంతుల ముందే మ్యాచ్‌ను ముగించాడు. వెస్టిండీస్‌ను మరోసారి విశ్వవిజేతగా నిలిపాడు. సెమీఫైనల్ వరకు డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ విజయాల్లో కీలకంగా వ్యవహరించిన స్టోక్స్‌కు... ఫైనల్లో మాత్రం బ్రాత్‌వైట్ స్ట్రోక్ తగిలింది. కరీబియన్ల డబుల్ ధమాకా క్రికెట్ చరిత్రలో ఇదో అపూర్వ ఘట్టం... ఒకే దేశానికి చెందిన మహిళల, పురుషుల జట్లు ఒకేసారి చాంపియన్స్ అయ్యాయి.మహిళల క్రికెట్లో ఇదో అద్భుత ఘట్టం... ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన వెస్టిండీస్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది.టి20 చరిత్రలో ఇదో అద్వితీయ క్షణం... తొలిసారి వెస్టిండీస్ పురుషుల జట్టు ప్రపంచకప్‌ను రెండోసారి గెలిచింది.అవును... కరీబియన్స్ భారత గడ్డపై శివతాండవం చేశారు. అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు ఈడెన్ గడ్డపై సంచలనం సృష్టించారు. మధ్యాహ్నం జరిగిన మహిళల ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు వెస్టిండీస్ షాకిస్తే... రాత్రి జరిగిన పురుషుల ఫైనల్లో సంచలన ఆటతీరుతో కరీబియన్స్ రెండోసారి కప్‌ను ముద్దాడారు. గేల్ గర్జించకపోయినా... ఇంగ్లండ్‌కు వణుకు పుట్టింది. శామ్యూల్స్ అనే యోధుడి పోరాటానికి... బ్రాత్‌వైట్ పవర్ హిట్టింగ్ తోడవడంతో వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్‌పై 4 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. రూట్ (36 బంతుల్లో 54;7 ఫోర్లు), బట్లర్ (22 బంతుల్లో 36;1 ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగారు. తర్వాత విండీస్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసి నెగ్గింది. శామ్యూల్స్ (66 బంతుల్లో 85 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రాత్ వైట్ (10 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) దుమ్మురేపారు. శామ్యూల్స్ మరోసారి 2012లో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 56 బంతుల్లో 78 పరుగులు చేసి వెస్టిండీస్‌ను గెలిపించిన శామ్యూల్స్... మరోసారి ఒంటరి పోరాటంతో వెస్టిండీస్‌ను విజేతగా నిలిపాడు. ఈసారి అజేయంగా 66 బంతుల్లో 85 పరుగులు చేసి యోధుడిలా ఆదుకున్నాడు. ఇన్నింగ్స్ రెండో బంతికి క్రీజులోకి వచ్చిన శామ్యూల్స్ చివరి వరకు నిలబడ్డాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (బి) బద్రీ 0; హేల్స్ (సి) బద్రీ (బి) రసెల్ 1; రూట్ (సి) బెన్ (బి) బ్రాత్‌వైట్ 54; మోర్గాన్ (సి) గేల్ (బి) బద్రీ 5; బట్లర్ (సి) బ్రేవో (బి) బ్రాత్‌వైట్ 36; స్టోక్స్ (సి) సిమన్స్ (బి) బ్రేవో 13; అలీ (సి) రామ్‌దిన్ (బి) బ్రేవో 0; జోర్డాన్ (నాటౌట్) 12; విల్లీ (సి) చార్లెస్ (బి) బ్రాత్‌వైట్ 21; ప్లంకెట్ (సి) బద్రీ (బి) బ్రేవో 4; రషీద్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1-0; 2-8; 3-23; 4-84; 5-110; 6-110; 7-111; 8-136; 9-142. బౌలింగ్: బద్రీ 4-1-16-2; రసెల్ 4-0-21-1; బెన్ 3-0-40-0; బ్రేవో 4-0-37-3; బ్రాత్‌వైట్ 4-0-23-3; స్యామీ 1-0-14-0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: చార్లెస్ (సి) స్టోక్స్ (బి) రూట్ 1; గేల్ (సి) స్టోక్స్ (బి) రూట్ 4; శామ్యూల్స్ (నాటౌట్) 85; సిమన్స్ (ఎల్బీ) (బి) విల్లీ 0; బ్రేవో (సి) రూట్ (బి) రషీద్ 25; రసెల్ (సి) స్టోక్స్ (బి) విల్లీ 1; స్యామీ (సి) హేల్స్ (బి) విల్లీ 2; బ్రాత్‌వైట్ (నాటౌట్) 34; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1-1; 2-5; 3-11; 4-86; 5-104; 6-107. బౌలింగ్: విల్లీ 4-0-20-3; రూట్ 1-0-9-2; జోర్డాన్ 4-0-36-0; ప్లంకెట్ 4-0-29-0; రషీద్ 4-0-23-1; స్టోక్స్ 2.4-0-41-0. ప్రైజ్‌మనీ (పురుషుల విభాగం) విజేత :- 16 లక్షల డాలర్లు (రూ. 10 కోట్ల 59 లక్షలు) రన్నరప్ :- 8 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 29 లక్షలు) సెమీస్‌లో ఓడిన జట్లకు:- 4 లక్షల డాలర్లు (రూ. 2 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీ (మహిళల విభాగం) విజేత :- లక్ష డాలర్లు (రూ. 66 లక్షల 23 వేలు) రన్నరప్:- 50 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు) -
విండీస్ విహారం
► వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలుపు ► పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా ► రాణించిన చార్లెస్, శామ్యూల్స్ జట్టు మొత్తం టి20 స్టార్స్‌తో నిండిన వెస్టిండీస్ టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరింది. తొలి రెండు మ్యాచ్‌లతో పోలిస్తే దక్షిణాఫ్రికాపై కాస్త కష్టపడ్డా హ్యాట్రిక్ విజయంతో నాకౌట్‌కు అర్హత సాధించింది. గేల్, బ్రేవో ఈసారి బంతితో మెరిస్తే.. శామ్యూల్స్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో కరీబియన్లను గట్టెక్కించాడు. ఈ గ్రూప్‌లో శ్రీలంకతో నేడు జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే... దక్షిణాఫ్రికా జట్టు ఇంటికి వెళుతుంది. నాగ్‌పూర్: భారీ హిట్టర్లున్న దక్షిణాఫ్రికాను అద్భుతమైన బౌలింగ్‌తో కట్టడి చేసిన వెస్టిండీస్ జట్టు.. టి20 ప్రపంచకప్‌లో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. బ్యాటింగ్‌లో కాస్త తడబడ్డా మూడు వికెట్లతో సఫారీలపై గెలిచింది. వీసీఏ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులు చేసింది. డికాక్ (46 బంతుల్లో 47; 3 ఫోర్లు, 1 సిక్స్), వీస్ (26 బంతుల్లో 28; 2 ఫోర్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తొలి మూడు ఓవర్లలో మూడు కీలక వికెట్లు పడటంతో సఫారీలు కోలుకోలేకపోయారు. భారీగా ఆశలు పెట్టుకున్న డివిలియర్స్ (12 బంతుల్లో 10; 1 ఫోర్), మిల్లర్ (1) కూడా ఒత్తిడికి లోనుకావడంతో ప్రొటీస్ 47 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. అయితే డికాక్, వీస్‌లు ఆరో వికెట్‌కు 7.2 ఓవర్లలో 50 పరుగులు జోడించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. రస్సెల్, గేల్, బ్రేవోలు తలా రెండు వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 19.4 ఓవర్లలో 7 వికెట్లకు 123 పరుగులు చేసి గెలిచింది. శామ్యూల్స్ (44 బంతుల్లో 44; 6 ఫోర్లు) టాప్ స్కోరర్. ప్రత్యర్థుల ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయినా.. ఇన్నింగ్స్ ఐదో బంతికి ‘డేంజర్ బ్యాట్స్‌మన్’ క్రిస్ గేల్ (4)ను అవుట్ చేసి ప్రొటీస్ పట్టుబిగించే ప్రయత్నం చేసింది. తర్వాత ఫ్లెచర్ (11) అనూహ్యంగా రనౌటైనా.. చార్లెస్ (35 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), శామ్యూల్స్ సమయోచితంగా ఆడారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 32 పరుగులు జత చేశారు. అయితే చార్లెస్, డ్వేన్ బ్రేవో (8) వరుస ఓవర్లలో అవుట్‌కావడంతో విండీస్ విజయ సమీకరణం 24 బంతుల్లో 24 పరుగులుగా మారింది. ఈ దశలో స్పిన్నర్ తాహిర్ ‘మ్యాజిక్’ చేశాడు. 17వ ఓవర్లో వరుస బంతుల్లో రస్సెల్ (4), స్యామీ (0)లను అవుట్ చేస్తే.. 18వ ఓవర్‌ను వీస్ మూడు పరుగులే ఇవ్వడంతో ప్రొటీస్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. తర్వాతి ఓవర్లో మోరిస్ రెండు ఫోర్లు సమర్పించుకున్నా శామ్యూల్స్‌ను అవుట్ చేయడంతో విండీస్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సిన దశలో రబడ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్ (10 నాటౌట్) భారీ సిక్సర్ బాదడంతో సఫారీల పోరాటం వృథా అయ్యింది. తాహిర్‌కు రెండు వికెట్లు దక్కాయి. శామ్యూల్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా రనౌట్ 1; డికాక్ (బి) రస్సెల్ 47; డు ప్లెసిస్ (సి) బెన్ (బి) రస్సెల్ 9; రోసోవ్ (సి) రస్సెల్ (బి) గేల్ 0; డివిలియర్స్ (బి) బ్రేవో 10; మిల్లర్ (బి) గేల్ 1; వీస్ (సి) స్యామీ (బి) బ్రేవో 28; మోరిస్ నాటౌట్ 16; ఫాంగిసో రనౌట్ 4; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 122. వికెట్ల పతనం: 1-1; 2-13; 3-20; 4-46; 5-47; 6-97; 7-112; 8-122. బౌలింగ్: బద్రీ 3-0-22-0; రస్సెల్ 4-0-28-2; గేల్ 3-0-17-2; బ్రాత్‌వైట్ 2-0-11-0; బెన్ 4-0-20-0; బ్రేవో 4-0-20-2. వెస్టిండీస్ ఇన్నింగ్స్: చార్లెస్ (సి) డుప్లెసిస్ (బి) వీస్ 32; గేల్ (బి) రబడ 4; ఫ్లెచర్ రనౌట్ 11; శామ్యూల్స్ (సి) డివిలియర్స్ (బి) మోరిస్ 44; బ్రేవో (సి) వీస్ (బి) ఫాంగిసో 8; రస్సెల్ (సి) మిల్లర్ (బి) తాహిర్ 4; స్యామీ (బి) తాహిర్ 0; బ్రాత్‌వైట్ నాటౌట్ 10; రామ్‌దిన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (19.4 ఓవర్లలో 7 వికెట్లకు) 123. వికెట్ల పతనం: 1-5; 2-34; 3-66; 4-87; 5-100; 6-100; 7-113. బౌలింగ్: రబడ 3.4-0-38-1; మోరిస్ 4-0-33-1; తాహిర్ 4-0-13-2; వీస్ 4-0-19-1; ఫాంగిసో 4-0-19-1. -
బ్రాత్‌వైట్, శామ్యూల్స్ సెంచరీలు
పోర్ట్ఎలిజబెత్: ఓపెనర్ బ్రాత్‌వైట్ (186 బంతుల్లో 106; 12 ఫోర్లు), మార్లన్ శామ్యూల్స్ (160 బంతుల్లో 101; 14 ఫోర్లు; 1 సిక్స్) అద్భుత సెంచరీలతో భారీ స్కోరుకు బాటలు వేసినా... మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం కరువైంది. మోర్కెల్ (4/69), తాహిర్ (3/108) ధాటికి జట్టు కుదేలైపోయింది. దీంతో సోమవారం ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 79 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జెరోమ్ టేలర్ (10 బ్యాటింగ్) ఉన్నాడు. చివర్లో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ వీలు కాలేదు. అంతకుముందు 147/2 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన విండీస్‌ను బ్రాత్‌వైట్, శామ్యూల్స్ అద్భుత ఆటతీరుతో ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 176 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే వీరిద్దరు వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరడంతో విండీస్ కష్టాల్లో పడింది. ఓ దశలో 233/4తో పటిష్టంగా ఉన్న విండీస్ కేవలం 42 పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌ను 417/8 స్కోరువద్ద డిక్లేర్ చేసింది. -
ఇంగ్లండ్‌పై విండీస్ గెలుపు
బ్రిడ్జ్‌టౌన్: టి20 ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్ సరైన సమయంలో సత్తా చాటింది. ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన తొలి టి20లో శామ్యూల్స్ (46 బంతుల్లో 69 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్; 2/21) ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచడంతో 27 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టులో శామ్యూల్స్‌కు తోడు గేల్ (35 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. శామ్యూల్ బద్రీ (3/17) ఆరంభంలోనే మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. బొపార (24 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్), బ్రెస్నన్ (29 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించగలిగారు. శామ్యూల్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
వెస్టిండీస్ బౌలర్లపై ఐసీసీకి ఫిర్యాదు
భారత్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో ఘోరంగా ఓడిపోయిన వెస్టిండీస్ ఓ వివాదంలో చిక్కుకుంది. విండీస్ బౌలర్లు శామ్యూల్స్, షిల్లింగ్‌ఫోర్డ్ బౌలింగ్ శైలిపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ముంబైలో జరిగిన రెండో టెస్టు సందర్భంగా అంపైర్లు వీరిద్దరిపై ఐసీసీకి ఫిర్యాదు చేశారు. శామ్యూల్స్, షిల్లింగ్‌ఫోర్డ్ బౌలింగ్ యాక్షన్‌పై సందేహం వ్యక్తం చేస్తూ ఫీల్డ్ అంపైర్లు, టీవీ అంపైర్లు ఫిర్యాదు చేసినట్టు ఐసీసీ వెల్లడించింది. ఈ విషయాన్ని విండీస్ టీమ్ మేనేజర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. శామ్యూల్స్, షిల్లింగ్‌ఫోర్డ్ బౌలింగ్ శైలిని ఐసీసీ నిశితంగా పరిశీలించనుంది. బౌలింగ్ యాక్షన్‌కు సంబంధించి 21 రోజుల్లోగా వ్యక్తిగత అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా ఇద్దరు బౌలర్లకు సూచించింది. నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేసినట్టు తేలితే వీరిద్దరిపై చర్యలు తీసుకుంటారు.