మైదానంలో, బయటా... అతను సీరియస్!
వెస్టిండీస్ గెలిచిన రెండు టి20 ప్రపంచకప్‌లలో కలిసి శామ్యూల్స్ చేసిన స్కోరు వికెట్ నష్టానికి 163 పరుగులు... ఇతర వెస్టిండీస్ ఆటగాళ్లంతా చేసింది 11 వికెట్ల నష్టానికి 121 పరుగులు... ఇది చాలు ఈ రెండు టైటిల్స్ గెలవడంలో అతని పాత్ర ఏమిటో చెప్పడానికి. వన్డేలనుంచి టి20ల వరకు వరల్డ్ కప్ జట్ల విజయాలలో భాగమైన స్టార్ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ వారెవరికీ రెండు ఫైనల్స్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్రదర్శన ఇవ్వడం సాధ్యం కాలేదు.
సరదాగా కనిపించడంలో విండీస్ జట్టులోని ఇతర ఆటగాళ్లతో పోలిస్తే కాస్త తక్కువగానే కనిపించినా ఆవేశం మాత్రం ఎక్కువే. పేరుకు పదహారేళ్ల కెరీర్ ఉన్నా స్వయంకృతం కారణంగా సీన్‌లో కనిపించని శామ్యూల్స్ మరోసారి ప్రపంచకప్ ద్వారా హీరోగా మారాడు.
కోల్‌కతానుంచి సాక్షి క్రీడా ప్రతినిధి :- ప్రపంచ కప్ గెలిచిన తర్వాత మీడియా సమావేశానికి మార్లోన్ శామ్యూల్స్ వచ్చాడు. ఎప్పుడో మ్యాచ్ ముగిసినా అతను తన ప్యాడ్స్‌ను విప్పలేదు. అయితే వాటి వల్ల కుర్చీలో సరిగ్గా కూర్చోలేక నేరుగా టేబుల్‌పైనే కాళ్లు పెట్టేశాడు. ఆ ప్రవర్తనకు పొగరు అనేది కూడా చాలా చిన్న పదమేమో. అయితే జట్టుకు టైటిల్ అందించిన ఆనందంలో అతను ప్రపంచాన్ని లెక్క చేసే పరిస్థితిలో లేడు. అక్కడ ఉన్న ఐదే ఐదు నిమిషాల్లో స్టోక్స్‌ను, వార్న్‌ను ఏకిపారేశాడు. ఇంకా అక్కడే ఉంటే ఏం జరిగేదో కానీ, ఐసీసీ అధికారులు అర్ధాంతరంగా తీసుకెళ్లిపోయారు. శామ్యూల్స్ వ్యవహారశైలికి ఇదో ఉదాహరణ. పేరుకు పదహారేళ్ల కెరీర్ ఉన్నా... అప్పుడప్పుడు వరల్డ్ కప్ మెరుపులే అతడిని గుర్తించేలా చేశాయి.
ఈడెన్‌తోనే మొదలు...
2000లో శామ్యూల్స్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించాడు. రెండేళ్ల పాటు అంతంత మాత్రంగానే ఆడిన అతనికి 2002లో భారత పర్యటనకు అవకాశం లభించింది. అయితే కోల్‌కతాలో టెస్టుకు ముందు క్లబ్‌కు హాజరై నిబంధనలు ఉల్లంఘించడంతో విండీస్ బోర్డు అతడిని వెనక్కి పిలిచింది. అయితే చచ్చీ చెడి బతిమాలడంతో చివరకు వదిలేసింది. వెంటనే మ్యాచ్ అవకాశం దక్కించుకున్న అతను ఈడెన్ గార్డెన్స్‌లోనే తన తొలి టెస్టు సెంచరీ నమోదు చేశాడు. నాటినుంచి మళ్లీ ఈడెన్‌లో టి20 విజయం అందుకునే వరకు ఎన్నో మలుపులు, వివాదాలు. సరిగ్గా 2007 టి20 ప్రపంచకప్ సమయంలో అతనిపై ఫిక్సింగ్ ఆరోపణలు. అదీ భారత పోలీసులు బయటపెట్టిందే. అయితే విచారణ కొనసాగుతుండగానే విండీస్ టోర్నీలో ఆడించింది.
చివరకు తప్పు చేసినట్లు రుజువు కావడంతో రెండేళ్ల నిషేధం. నిజానికి ఇలాంటి ఘటన తర్వాత ఆటగాడు తిరిగి రావడం కష్టం. కానీ శామ్యూల్స్ కూడా గట్టిగానే పోరాడాడు. తనలో సత్తా ఉందని, నిరూపించుకుంటానని పట్టుదలగా వచ్చి అతను ఆ తర్వాత ఎంతో మెరుగయ్యాడు. ఐపీఎల్‌లో పుణే వారియర్స్ తరపున ఆడినప్పుడు అతను 730 జెర్సీ నంబర్ ధరించాడు. దానికి కారణం చెబుతూ 730 రోజులు తాను నిషేధంతో క్షోభను అనుభవించానని, అది గుర్తు చేసుకుంటే తనలో పట్టుదల పెరుగుతుందని చెప్పుకోవడం అతని శైలి. 2012 ప్రపంచకప్ గెలిపించడంతో శామ్యూల్స్ స్థాయి పెరిగింది. అయితే ఆ తర్వాత మళ్లీ అతను చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. ఈ మధ్యలో అతని బౌలింగ్‌పై అంపైర్లు రెండు సార్లు సందేహాలు లేవనెత్తారు. చివరకు అది చకింగ్‌గా తేలడంతో రెండేళ్ల క్రితమే బౌలింగ్ మానేయాల్సి వచ్చింది.
బ్యాట్‌తోనే జవాబు...
విమర్శలు వచ్చినప్పుడు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి చూశారా నా ఆట అన్నట్లుగా ఒక జవాబివ్వడం చాలా మంది ఆటగాళ్లు చేసేదే. అయితే మర్యాద కోసం కొంత మంది పేరు ఎత్తకుండా దానిని దాటవేస్తారు. అయితే శామ్యూల్స్ అలాంటి వ్యక్తి కాదు. అందుకే వేదికపైనే ఇది వార్న్ కోసం అంటూ నేరుగా తిట్టి పోశాడు. మూడేళ్ల క్రితం బిగ్‌బాష్ సందర్భంగా గొడవ ముదిరి వార్న్‌పై అతను బ్యాట్ విసిరేశాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్టు సమయంలో శామ్యూల్స్ రన్నింగ్‌ను తీవ్రంగా విమర్శించిన వార్న్... ఈసారి టి20 ప్రపంచకప్ సెమీస్‌లో అవుటయ్యాక ఆట చేత కాదన్నాడు. దాంతో నేను మైక్‌తో కాదు బ్యాట్‌తో జవాబిస్తానని మ్యాచ్ తర్వాత ఘాటుగా శామ్యూల్స్ వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌లో ఒక సారి స్టోక్స్‌తో వాదన జరగ్గా... చివరి ఓవర్లో కూడా మాటల యుద్ధం సాగింది.
గెలిచిన తర్వాత షర్ట్ విప్పి ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూం ముందు డ్యాన్స్ చేశాడు. నాతో ఆడేటప్పుడు మాటలతో పెట్టుకోవద్దు అని ముందే అతనికి చెప్పాను. ఎందుకంటే నేను బాగా ఆడబోతున్నాను అని తెలుసు. అయినా అతను మారలేదు. అతడి బౌలింగ్‌లో ఒక్క బంతి కూడా ఎదుర్కోక ముందే మాటలతో దాడి చేస్తే ఊరుకుంటానా అని శామ్యూల్స్ వ్యాఖ్యానించాడు. గేల్, సిమన్స్ విఫలమైనా.... మరో సారి తన అనుభవం రంగరించి అమూల్యమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు రెండో టైటిల్ అందించిన అతని స్థానం విండీస్ క్రికెట్‌లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
ఎన్నో ఒడిదుడుకుల తర్వాత కూడా నేను ఇంత కాలం కొనసాగుతున్నానంటే నా పట్టుదల, పోరాడేతత్వమే కారణం. ఇక నన్ను ఎవరైనా మాటలతో ఏమైనా అంటే మాత్రం నేను మరింతగా రెచ్చిపోతాను. గత ఐదేళ్లలో నా జీవితం ఎంతో మారింది. ఈ స్థాయిలో ఆడగలుగుతున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు - శామ్యూల్స్
జరిమానా
ఆదివారం జరిగిన ఫైనల్ చివరి ఓవర్‌లో ఇంగ్లండ్ బౌలర్ స్టోక్స్‌ను అసభ్యపదజాలంతో శామ్యూల్స్ దూషించాడు. దీనిపై ఐసీసీ విచారణ జరపగా శామ్యూల్స్ తప్పు అంగీకరించాడు. దీంతో అతడి మ్యాచ్‌లో ఫీజులో 30 శాతం కోత విధించినట్లు ఐసీసీ ప్రకటించింది.