ముంబైపై ‘రైజింగ్‌’ పుణే | Rising Pune Supergiant won by 3 runs | Sakshi
Sakshi News home page

ముంబైపై ‘రైజింగ్‌’ పుణే

Published Tue, Apr 25 2017 12:41 AM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM

ముంబైపై ‘రైజింగ్‌’ పుణే

ముంబైపై ‘రైజింగ్‌’ పుణే

చివరి ఓవర్‌లో స్మిత్‌ సేన   
ఉత్కంఠ విజయం
రాణించిన బౌలర్లు
రోహిత్‌ శర్మ పోరాటం వృథా  


వరుసగా ఆరు విజయాలతో భీకర ఫామ్‌లో ఉన్న ముంబై ఇండియన్స్‌ జోరుకు బ్రేక్‌ పడింది. ప్రత్యర్థి ఎవరైనా... ఎలాంటి లక్ష్యమైనా అవలీలగా సాధిస్తూ వస్తున్న రోహిత్‌ సేన రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ను మాత్రం అధిగమించ లేకపోతోంది. తక్కువ స్కోరు అయినా పుణే బౌలర్లు చివరికంటా పోరాడి జట్టుకు చక్కటి విజయాన్ని అందించగలిగారు. లీగ్‌లో ఇప్పటిదాకా ముంబైకి ఎదురైన రెండు పరాజయాలూ పుణే చేతుల్లోనే కావడం విశేషం. అటు ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న కెప్టెన్‌ రోహిత్‌ అద్భుతంగా పోరాడినా ఫలితం లేకపోయింది.

ముంబై: ఐపీఎల్‌ పదో సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు మరోసారి రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ అడ్డుకట్ట వేసింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పుణే మూడు పరుగుల తేడాతో నెగ్గింది. ఈ జట్టుకిది వరుసగా మూడో విజయం. ముంబై విజయం కోసం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (39 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు.  ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 160 పరుగులు చేసింది. ఓపెనర్లు రాహుల్‌ త్రిపాఠి (31 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రహానే (32 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా ఎవరూ రాణించలేదు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. పార్థివ్‌ (27 బంతుల్లో 33; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. స్టోక్స్, ఉనాద్కట్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. స్టోక్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

శుభారంభం అందినా: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణేకు ఓపెనర్లు రహానే, రాహుల్‌ త్రిపాఠి శుభారంభం అందించారు. తొలి ఓవర్‌లోనే సిక్స్‌ బాదిన రహానేకు తోడు త్రిపాఠి కూడా వేగంగా ఆడడంతో పవర్‌ప్లేలో జట్టు 48 పరుగులు చేసింది. ఎనిమిదో ఓవర్‌లో రహానే రెండు ఫోర్లు, త్రిపాఠి ఓ ఫోర్‌ కొట్టడంతో 14 పరుగులు వచ్చాయి. అయితే తన వరుస రెండు ఓవర్లలో కరణ్‌ శర్మ వీరిద్దరిని పెవిలియన్‌కు చేర్చడంతో స్కోరులో వేగం తగ్గింది. మొదట రహానేను రిటర్న్‌ క్యాచ్‌తో అవుట్‌ చేయగా తొలి వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత త్రిపాఠి పనిపట్టాడు. అయితే మరుసటి ఓవర్‌లోనే హర్భజన్‌ కెప్టెన్‌ స్మిత్‌ (12 బంతుల్లో 17; 2 ఫోర్లు)ను బౌల్డ్‌ చేయడంతో పాటు టి20ల్లో 200 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా పుణే ఇన్నింగ్స్‌లో మెరుపులు లేకపోగా స్టోక్స్‌ (12 బంతుల్లో 17; 2 ఫోర్లు), ధోని (7) వరుస ఓవర్లలో అవుటయ్యారు. ఆఖర్లో మనోజ్‌ తివారి (13 బంతుల్లో 22; 4 ఫోర్లు) చెలరేగడంతో జట్టు ఓ మాదిరి స్కోరైనా చేయగలిగింది.

రోహిత్‌ హవా: తొలి ఓవర్‌లో మూడు పరుగులే వచ్చినా ఆ తర్వాతి రెండు ఓవర్లలో బట్లర్‌ రెండు ఫోర్లు.. పార్థివ్‌ పటేల్‌ మూడు ఫోర్లు బాది జోరు కనబరిచారు. అయితే ఐదో ఓవర్‌లో స్టోక్స్‌.. బట్లర్‌ను అవుట్‌ చేశాడు. కొద్దిసేపటికే నితీశ్‌ రాణా (3), పార్థివ్‌ వరుస ఓవర్లలో అవుట్‌ కావడంతో పుణే పైచేయి సాధించింది. కానీ కెప్టెన్‌ రోహిత్‌ జట్టు విజయం కోసం అద్భుతంగా పోరాడాడు. 14వ ఓవర్‌లో ఫోర్, సిక్స్‌ బాదిన తను 33 బంతుల్లో ఈ సీజన్‌లో తొలి అర్ధ సెంచరీ సాధించాడు. అయితే చివరి ఓవర్‌లో 17 పరుగులు కావాల్సిన దశలో హార్దిక్‌ (11 బంతుల్లో 13; 2 ఫోర్లు) తొలి బంతికే వెనుదిరిగాడు. రెండో బంతిని రోహిత్‌ సిక్సర్‌గా మలిచినా నాలుగో బంతికి ఉనాద్కట్‌ రిటర్న్‌ క్యాచ్‌ తీసుకోవడంతో ముంబై పరాజయం ఖాయమైంది.

ఐపీఎల్‌లో నేడు
బెంగళూరు & హైదరాబాద్‌
వేదిక: బెంగళూరు, రా. గం. 8.00 నుంచి
సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement