బౌలర్‌ను తిట్టిన విండీస్ ప్లేయర్‌పై భారీ ఫైన్
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లపై తిట్లవర్షం కురిపించిన విండీస్ ఆటగాడు మార్లన్ సామ్యూల్స్‌పై ఐసీసీ భారీ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 30శాతం జరిమానా మోపింది. చివరి ఓవర్ వేసిన బెన్ స్టోక్‌పై మార్లన్ తిట్లవర్షం కురిపించాడు. అతడిని ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆటగాళ్లు, వారి సిబ్బంది కోసం ఉద్దేశించిన ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.1.4ను అతడు ఉల్లంఘించినట్టు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇంగ్లండ్ బౌలర్లపై సామ్యూల్స్ అసభ్య వ్యాఖ్యలు చేసినట్టు మొదట ఫీల్డ్ ఎంపైర్లు కుమార్ ధర్మసేనా, రాడ్ టకర్, థర్డ్ ఎంపైర్ మారైఎస్ ఎరాస్మస్, ఫోర్త్ ఎంపైర్ బ్రుస్ ఆక్సెన్‌ఫర్డ్ అభియోగాలు మోపారు. ఈ అభియోగాలను అంగీకరించిన సామ్యూల్స్.. మ్యాచ్ రీఫరీ రంజన్ ముదుగలె విధించిన జరిమానాకు అంగీకరించారు. ఎదుటి జట్టు ఆటగాళ్లను దూషించడం ఐసీసీ నిబంధనల ప్రకారం లెవల్ 1 ఉల్లంఘనగా భావిస్తారు. ఇందుకు సదరు ఆటగాడిపై గరిష్ఠంగా 50శాతం వరకు జరిమానా విధిస్తారు.