సిసలైన చాంపియన్
► టి20 ప్రపంచకప్ విజేత వెస్టిండీస్
► ఫైనల్లో 4 వికెట్లతోఇంగ్లండ్‌పై విజయం
► రాణించిన శామ్యూల్స్ గెలిపించిన బ్రాత్‌వైట్
► రెండో సారి టైటిల్ కైవసం
కోల్‌కతా నుంచి సాక్షి క్రీడాప్రతినిధి:- వెస్టిండీస్ జట్టు మహాద్భుతం చేసింది. టి20 ప్రపంచకప్‌ను రెండో సారి గెలిచి చరిత్ర సృష్టించింది. తమకే సొంతమైన రీతిలో చివర్లో విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శనతో అసలు సిసలు చాంపియన్‌లా ఆడి టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన ఫైనల్లో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. జో రూట్ (36 బంతుల్లో 54; 7 ఫోర్లు), బట్లర్ (22 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించగా, బ్రాత్‌వైట్, బ్రేవోలకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం వెస్టిండీస్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మార్లోన్ శామ్యూల్స్ (66 బంతుల్లో 85 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు)కు తోడు బ్రాత్‌వైట్ (10 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగి విండీస్‌ను జగజ్జేతగా నిలిపారు. 2012లో టైటిల్ నెగ్గిన విండీస్ రెండో సారి టి20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. రెండు సార్లూ కెప్టెన్ డారెన్ స్యామీనే కావడం విశేషం.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: ఆదుకున్న రూట్
పవర్‌లెస్ ప్లే
ఫైనల్ మ్యాచ్ విండీస్ లెగ్‌స్పిన్నర్ బద్రీ సంచలన బౌలింగ్‌తో ప్రారంభమైంది. రెండో బంతికే అతను రాయ్ (0)ను క్లీన్‌బౌల్డ్ చేసి శుభారంభాన్ని అందించాడు. రసెల్ వేసిన తర్వాతి ఓవర్లో బౌండరీ కోసం ప్రయత్నించిన హేల్స్ (1) షార్ట్ ఫైన్‌లెగ్‌లో బద్రీకి సునాయాస క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లండ్‌కు షాక్ తగిలింది. టోర్నీలో ఘోరంగా విఫలమైన కెప్టెన్ మోర్గాన్ (5) అదే దారిలో నడిచాడు. మరో వైపు రూట్ నిలబడటంతో పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు 33 పరుగులు చేయగలిగింది.
ఆ ఐదు ఓవర్లు
పవర్ ప్లే ముగిసిన తర్వాత రూట్, బట్లర్ దూకుడు ప్రదర్శించారు. వీరిద్దరి జోరు ఇంగ్లండ్‌ను కోలుకునేలా చేసింది. బెన్ బౌలింగ్‌లో బట్లర్ 3 భారీ సిక్సర్లు బాది సత్తా చాటాడు. దాంతో 7-11 మధ్య 5 ఓవర్లలో 10 రన్‌రేట్‌తో ఇంగ్లండ్ 50 పరుగులు చేసింది.
మార్చేసిన బ్రేవో, బ్రాత్‌వైట్
నాలుగో వికెట్‌కు రూట్, బట్లర్ భాగస్వామ్యం 51 పరుగులకు చేరిన తర్వాత ఒక్కసారిగా ఇంగ్లండ్ పతనం మొదలైంది. జోరు మీదున్న బట్లర్... బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్‌లో బ్రేవోకు క్యాచ్ ఇచ్చాడు. మరో వైపు 33 బంతుల్లో రూట్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఈ దశలో బ్రేవో ఓవర్ ఇంగ్లండ్‌ను ముంచింది. అతను వేసిన నాలుగో బంతిని ఆడలేక స్టోక్స్ (13) సునాయాస క్యాచ్ అందించగా, చివరి బంతికి అలీ (0) వెనుదిరిగాడు. అప్పటి దాకా నిలకడగా ఆడుతూ వచ్చిన రూట్... బ్రాత్‌వైట్ ఓవర్లో స్కూప్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. 18 బంతుల వ్యవధిలో 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ పరిస్థితి మరింత దిగజారింది. చివర్లో విల్లీ (14 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో ఆఖరి 5 ఓవర్లలో ఇంగ్లండ్ 40 పరుగులు చేయగలిగింది.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: శామ్యూల్స్ పోరాటం
రూట్ దెబ్బ...
వెస్టిండీస్ ఇన్నింగ్స్ కూడా దాదాపు ఇంగ్లండ్‌లాగే సాగింది. విల్లీ తొలి ఓవర్లో ఒకే పరుగు ఇవ్వగా, అనూహ్యంగా రెండో ఓవర్ వేసిన రూట్ అద్భుత ఫలితం సాధించాడు. తొలి బంతినే భారీ షాట్ ఆడబోయి చార్లెస్ (1) మిడాన్‌లో చిక్కగా, మూడో బంతిని ఇదే తరహాలో ఆడి క్రిస్ గేల్ (4) క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లండ్ సంబరాలు మిన్నంటాయి. గత మ్యాచ్ హీరో సిమన్స్ (0) తొలి బంతికే ఎల్బీ కావడంతో విండీస్ కష్టాల్లో పడగా... జోర్డాన్ వేసిన ఆరో ఓవర్లో శామ్యూల్స్ 3 ఫోర్లు బాదడంతో పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 37కు చేరింది.
కొనసాగిన తడ‘బ్యాటు’
పవర్‌ప్లే తర్వాత విండీస్ నీరసించింది. కీపర్ పట్టుకున్న క్యాచ్ నేలను తాకడంతో అదృష్టవశాత్తూ అవుట్ కాకుండా బతికిపోయిన శామ్యూల్స్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు పరుగులు తీయడమే కష్టంగా మారిపోయింది. ఎంత బలంగా బాదే ప్రయత్నం చేసినా బంతి ఫీల్డర్లను దాటిపోలేదు. 7-13 మధ్య 7 ఓవర్లలో 39 పరుగులే చేసిన ఆ జట్ట్టు కేవలం 3 ఫోర్లు మాత్రమే కొట్టింది. ఎట్టకేలకు 14వ ఓవర్లో ఒక భారీ సిక్స్ కొట్టిన బ్రేవో (27 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) ఆ వెంటనే వెనుదిరిగాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 69 బంతుల్లో 75 పరుగులు జోడించారు.
మరువలేని ఫినిషింగ్
6 ఓవర్లలో 70 పరుగులు చేయాల్సిన దశలో ప్లంకెట్ ఓవర్లో శామ్యూల్స్ 2 సిక్సర్లు, ఫోర్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. అయితే విల్లీ చక్కటి బౌలింగ్‌కు తోడు ఇంగ్లండ్ అద్భుత ఫీల్డింగ్‌తో తర్వాతి ఓవర్లోనే రసెల్ (1), స్యామీ (2) వెనుదిరిగారు. 15-19 ఓవర్ల మధ్యలో విండీస్ 51 పరుగులు చేయగా... ఇక చివరి ఓవర్ విండీస్‌ను చరిత్రలో నిలబెట్టింది. ఆఖరి ఓవర్లో విజయానికి 19 పరుగులు కావలసి ఉండగా... స్టోక్స్ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్ వరుసగా నాలుగు సిక్సర్లు బాది కొత్త చరిత్ర సృష్టించాడు. ఏడో వికెట్‌కు శామ్యూల్స్, బ్రాత్‌వైట్ 25 బంతుల్లో అజేయంగా 54 పరుగులు జత చేశారు.