‘కంగారు’ పడ్డా కొట్టేశారు
► బంగ్లాదేశ్‌పై మూడు వికెట్లతో ఆసీస్ విజయం
► సెమీస్ అవకాశాలు సజీవం
బెంగళూరు: టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఆశలు సజీవంగా నిలిచాయి. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచి టోర్నీలో తొలి విజయం సాధించింది. అటు బంగ్లాదేశ్ వరుసగా రెండో ఓటమితో దాదాపుగా సెమీస్ అవకాశాలు కోల్పోయింది. చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోగా... బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 156 పరుగులు చేసింది. ఆరంభంలోనే సర్కార్, షబ్బీర్‌ల వికెట్లు కోల్పోయినా.... మిథున్ (22 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్సర్), షకీబ్ (25 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్సర్) కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. చివర్లో మహ్మదుల్లా (29 బంతుల్లో 49 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్సర్) సంచలన షాట్లతో చెలరేగడంతో బంగ్లాదేశ్‌కు గౌరవప్రదమైన స్కోరు లభించింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీయగా, వాట్సన్ రెండు వికెట్లు సాధించాడు.
ఆస్ట్రేలియా జట్టు 18.3 ఓవర్లలో ఏడు వికెట్లకు 157 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (45 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్సర్), వాట్సన్ (15 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్సర్) తొలి వికెట్‌కు 44 బంతుల్లోనే 62 పరుగులు జోడించి శుభారంభాన్ని ఇచ్చారు. స్మిత్ (13 బంతుల్లో 14; 1 సిక్సర్), వార్నర్ (9 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్సర్) ఎక్కువసేపు నిలబడలేదు. మధ్య ఓవర్లలో బంగ్లాదేశ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచినా... మ్యాక్స్‌వెల్ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చకచకా పరుగులు చేశాడు. రెండు సులభమైన క్యాచ్‌లను వదిలేయడం బంగ్లాదేశ్‌ను దారుణంగా దెబ్బతీసింది. షకీబ్ మూడు, ముస్తాఫిజుర్ రెండు వికెట్లు తీసుకున్నారు. జంపాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
స్కోరు వివరాలు
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: మిథున్ (సి) వాట్సన్ (బి) జంపా 23; సౌమ్య సర్కార్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) వాట్సన్ 1; షబ్బీర్ (సి) ఫాల్క్‌నర్ (బి) వాట్సన్ 12; షకీబ్ (సి) కౌల్టర్ నైల్ (బి) జంపా 33; షువగత ఎల్బీడబ్ల్యు (బి) జంపా 13; మహ్మదుల్లా నాటౌట్ 49; ముష్ఫికర్ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 156.
వికెట్ల పతనం: 1-2; 2-25; 3-62; 4-78; 5-105.
బౌలింగ్: కౌల్టర్ నైల్ 4-0-21-0; వాట్సన్ 4-0-31-2; హేస్టింగ్స్ 3-0-24-0; మిషెల్ మార్ష్ 1-0-12-0; మ్యాక్స్‌వెల్ 1-0-12-0; ఆడమ్ జంపా 4-0-23-3; ఫాల్క్‌నర్ 3-0-26-0.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఖవాజా (బి) అల్ అమిన్ 58; వాట్సన్ రనౌట్ 21; స్టీవ్ స్మిత్ (బి) ముస్తాఫిజుర్ 14; వార్నర్ (సి) అండ్ (బి) షకీబ్ 17; మ్యాక్స్‌వెల్ (స్టంప్డ్) ముష్ఫికర్ (బి) షకీబ్ 26; మిషెల్ మార్ష్ (సి) షకీబ్ (బి) ముస్తాఫిజుర్ 6; ఫాల్క్‌నర్ నాటౌట్ 5; హేస్టింగ్స్ (సి) సర్కార్ (బి) షకీబ్ 3; నెవిల్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.3 ఓవర్లలో ఏడు వికెట్లకు) 157.
వికెట్ల పతనం: 1-62; 2-95; 3-115; 4-119; 5-135; 6-148; 7-152.
బౌలింగ్: మొర్తజా 1-0-9-0; మహ్మదుల్లా 2-0-22-0; అల్ అమిన్ 2-0-14-1; ముస్తాఫిజుర్ 4-0-30-2; షకీబ్ 4-0-27-3; సాజిబ్ 3.3-0-40-0; షువగత 2-0-13-0.