రుతురాజ్‌ బాదాడు... మ్యాక్స్‌వెల్‌ గెలిపించాడు | India lost by 5 wickets | Sakshi
Sakshi News home page

రుతురాజ్‌ బాదాడు... మ్యాక్స్‌వెల్‌ గెలిపించాడు

Published Wed, Nov 29 2023 3:51 AM | Last Updated on Wed, Nov 29 2023 3:58 AM

India lost by 5 wickets - Sakshi

రుతురాజ్‌ మెరుపు శతకాన్ని మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం కమ్మేసింది. టీమిండియా ‘హ్యాట్రిక్‌’ను, సిరీస్‌ విజయాన్ని అడ్డుకుంది. ఇటీవలే ముగిసిన ప్రపంచకప్‌లో అఫ్గాన్‌పై అద్వితీయ డబుల్‌ సెంచరీని గుర్తుకు తెచ్చేలా మూడో టి20లో మ్యాక్సీ అజేయ శతకంతో ఆస్ట్రేలియాను  గెలిపించాడు. బౌలింగ్‌లో ఆఖరి ఓవర్లో 30 పరుగులు సమర్పించుకున్న మ్యాక్సీ ఆ చేత్తోనే బ్యాటింగ్‌లో ఆఖరి బంతిదాకా పోరాడి మరీ జట్టును సిరీస్‌లో నిలిపాడు.

గువాహటి: వరుస విజయాలతో సిరీస్‌ను గెలుచుకుందామనుకున్న టీమిండియా పట్టుదలకు ఒకే ఒక్కడు అడ్డుపడ్డాడు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (48 బంతుల్లో 104 నాటౌట్‌; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) ధనాధన్‌ ధాటికి మ్యాచ్‌ చేజారింది. మంగళవారం జరిగిన మూడో టి20లో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. సిరీస్‌ ఆధిక్యం 2–1కు తగ్గింది. మొదట భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో వరుసగా మూడో సారి టీమిండియా 200 పైచిలుకు స్కోరు చేసింది.

ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (57 బంతుల్లో 123 నాటౌట్‌; 13 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు శతకాన్ని సాధించాడు. సూర్యకుమార్‌ (29 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం ఆ్రస్టేలియా సరిగ్గా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసి గెలిచింది. ట్రవిస్‌ హెడ్‌ (18 బంతుల్లో 35; 8) వేగంగా ఆడాడు. మ్యాక్స్‌వెల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లభించింది. పేసర్‌ ముకేశ్‌ వివాహం కోసం సెలవు తీసుకోగా, అవేశ్‌ ఖాన్‌ భారత తుది జట్టులోకి వచ్చాడు.  

ఒడిదుడుకులతో మొదలై... 
పవర్‌ప్లేలో చెలరేగిపోయే ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (6) రెండో ఓవర్లోనే నిష్క్రమించడం, ఆ మరుసటి ఓవర్లోనే వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (0) డకౌట్‌ కావడంతో భారత్‌ పరుగుల పయనం నెమ్మదిగా మొదలైంది.

24/2 వద్ద కెప్టెన్‌ సూర్యకుమార్‌ క్రీజులోకి వచ్చాడు. నాథన్‌ ఎలిస్‌ ఐదో ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో అతను భారత శిబిరంలో జోష్‌ తెచ్చాడు. పవర్‌ప్లేలో జట్టు 43/2 స్కోరు చేసింది. సూర్య తడాఖా చూపడంతో పరుగుల వేగం పుంజుకుంది. చూడచక్కని బౌండరీలతో సూర్యకుమార్‌ కాసేపు ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 

రుతురాజ్‌ వీరవిహారం 
అప్పటి వరకు అడపాదడపా బౌండరీలతో సరిపెట్టుకుంటూ వచ్చిన రుతురాజ్‌ తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 21 బంతుల్లో 21 పరుగులే చేశాడు. ఆ తర్వాత ‘పరుగుల మిషన్‌’లా చెలరేగిపోయాడు. గైక్వాడ్‌ తర్వాతి 10 ఓవర్లలో 36 బంతులాడి 102 పరుగులు చేశాడు. 13వ ఓవర్లో రెండు ఫోర్లు, 14వ ఓవర్లో గైక్వాడ్‌ మరో రెండు బౌండరీలు బాది 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తిలక్‌ వర్మ కూడా ఓ ఫోర్‌ కొట్టడంతో ఆ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి.

సంఘా ఓవర్లో వరుసగా 4, 6 బాదిన గైక్వాడ్‌... హార్డి వేసిన 18వ ఓవర్లో 0, 6, 1వైడ్, 6, 4, 0, 6, 2లతో 25 పరుగులు పిండుకున్నాడు. మ్యాక్స్‌వెల్‌ వేసిన ఆఖరి ఓవర్లో రుతురాజ్‌ 3 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 30 పరుగులు వచ్చాయి. తొలి బంతికి బాదిన సిక్సర్‌తోనే 52 బంతుల్లో రుతురాజ్‌ సెంచరీ  పూర్తయ్యింది. అబేధ్యమైన నాలుగో వికెట్‌కు రుతురాజ్, తిలక్‌ 9.4 ఓవర్లలో 141 పరుగులు జోడించారు. 

గెలిపించిన మ్యాక్స్‌వెల్‌ 
ఆస్ట్రేలియా ఛేజింగ్‌ను ఓపెనర్‌ హెడ్‌ ధాటిగా మొదలెట్టాడు. తొలి ఓవర్లో 2, రెండో ఓవర్లో 4 బౌండరీలు బాదాడు. హార్డి (16)ని అర్ష్దీప్‌ పెవిలియన్‌ చేర్చాడు. బౌండరీలతో చెలరేగిపోతున్న హెడ్‌ను అవేశ్‌ఖాన్‌  బోల్తా కొట్టించాడు. పవర్‌ప్లేలో ఆసీస్‌ స్కోరు 67/2. క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్‌ భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఆసీస్‌ ఓవర్‌కు 10పైచిలుకు రన్‌రేట్‌తో సాగిపోయింది.

నాలుగో వికెట్‌కు 60 పరుగులు జోడించాక 128 పరుగుల వద్ద స్టోయినిస్‌ (17) నిష్క్రమించగా, స్వల్ప వ్యవధిలో టిమ్‌ డేవిడ్‌ (0) డకౌటయ్యాడు. భారత్‌ శిబిరం ఆనందంలో ఉండగా అప్పుడు ఆసీస్‌ స్కోరు 13.3 ఓవర్లలో 134/5. గెలుపు సమీకరణం 39 బంతుల్లో 85 పరుగులు భారత్‌కే అనుకూలంగా ఉంది. కానీ తర్వాత కెపె్టన్‌ వేడ్‌ (28 నాటౌట్‌) జతవ్వగా... మ్యాక్స్‌వెల్‌ యథేచ్ఛగా భా రీసిక్సర్లతో భారత్‌ శిబిరాన్ని వణికించాడు.

18 బంతుల్లో 49 పరుగులు చేయాల్సివుండగా 18వ ఓవర్‌ వేసిన ప్రసిధ్‌ కేవలం 6 పరుగులే ఇచ్చి భారత్‌కు ఊరటనిచ్చాడు. కానీ అదే ప్రసిధ్‌ ఆఖరి ఓవర్లో 6 బంతుల్లో 21 పరుగులు కావాల్సినపుడు 4, 1, 6, 4, 4, 4లతో 23 పరుగులిచ్చుకున్నాడు. ఇందులో ఆఖరి 4 బంతుల్ని బౌండరీలను దాటించిన మ్యాక్స్‌వెల్‌ 47 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 

4 అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక (4)  సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్‌శర్మ  రికార్డును మ్యాక్స్‌వెల్‌ సమం చేశాడు.

100 మ్యాక్స్‌వెల్‌కు ఇది 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్‌. వందో మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా అతను నిలిచాడు.  

68 భారత్‌ తరఫున టి20ల్లో అత్యధిక పరుగులు (68) ఇచ్చిన ఆటగాడు ప్రసిధ్‌ కృష్ణ  

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) వేడ్‌ (బి) బెహ్రెన్‌డార్ఫ్‌ 6; రుతురాజ్‌ నాటౌట్‌ 123; ఇషాన్‌ (సి) స్టోయినిస్‌ (బి) రిచర్డ్‌సన్‌ 0; సూర్యకుమార్‌ (సి) వేడ్‌ (బి) హార్డి 39; తిలక్‌ వర్మ నాటౌట్‌ 31; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 222.  వికెట్ల పతనం: 1–14, 2–24, 3–81.  
బౌలింగ్‌: రిచర్డ్‌సన్‌ 3–0–34–1, బెహ్రెన్‌డార్ఫ్‌ 4–1– 12–1, ఎలిస్‌ 4–0–36–0, త న్వీర్‌ సంఘా 4–0–42–0, హార్డి 4–0–64–1, మ్యాక్స్‌వెల్‌ 1–0–30–0.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) బిష్ణోయ్‌ (బి) అవేశ్‌ 35; హార్ది (సి) ఇషాన్‌ (బి) అర్ష్దీప్‌ 16; ఇంగ్లిస్‌ (బి) బిష్ణోయ్‌ 10; మ్యాక్స్‌వెల్‌ నాటౌట్‌ 104; స్టోయినిస్‌ (సి) సూర్య (బి) అక్షర్‌ 17; టిమ్‌ డేవిడ్‌ (సి) సూర్య (బి) బిష్ణోయ్‌ 0; వేడ్‌ నాటౌట్‌ 28; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 225. వికెట్ల పతనం: 1–47, 2–66, 3–68, 4–128, 5–134.  బౌలింగ్‌: అర్ష్దీప్‌ 4–0–44–1, ప్రసిధ్‌కృష్ణ 4–0–68–0, రవి బిష్ణోయ్‌ 4–0–32–2, అవేశ్‌ఖాన్‌ 4–0–37–1, అక్షర్‌ పటేల్‌ 4–0–37–1.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement