T20 World Cup 2022 AUS Vs AFG: Australia beat Afghanistan By 4 Runs - Sakshi
Sakshi News home page

T20 WC AFG Vs AUS: ఆసీస్‌ గెలిచినా... కంగారే!

Published Sat, Nov 5 2022 4:51 AM | Last Updated on Sat, Nov 5 2022 9:20 AM

T20 World Cup 2022: Australia beat Afghanistan by 4 runs - Sakshi

అఫ్గాన్‌తో తలపడిన ‘కంగారూ’ను చూస్తే... మ్యాచ్‌ గెలిచినా సరే... ఇంతకి ఇది ఆస్ట్రేలియా జట్టేనా? సొంతగడ్డపై డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆడాల్సిన ఆటేనా? నాణ్యమైన జట్టు ఇలా గెలవడమేంటి. ఆఖరి లీగ్‌ అయిపోయినా ముందుకెళ్లేందుకు అగచాట్లు పడటమేంటి అనే ప్రశ్నలు సగటు క్రికెట్‌    అభిమానిని పదేపదే తొలిచేస్తున్నాయి.

నిజమే మరి... చివరి లీగ్‌లో... అదీ కీలకమైన దశలో... ఓ క్రికెట్‌ కూనతో చచ్చిచెడి గెలిచినా ఆసీస్‌కు సెమీస్‌ ఖాయం కాలేదు. తమ ఆటతీరుతో అఫ్గానిస్తాన్‌ ఆసీస్‌ను ఓడించినంత పనిచేసింది. సూపర్‌ ‘12’లో ఒక్క మ్యాచ్‌ కూడా గెల వని జట్టుగా అఫ్గానిస్తాన్‌ నిలిచింది. ఈ వైఫల్యానికి బాధ్యతగా జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు మొహమ్మద్‌ నబీ ప్రకటించాడు.    

అడిలైడ్‌: ఒంటి చేత్తో మ్యాచ్‌ల్ని గెలిపించే వార్నర్, దంచేసే స్టొయినిస్, మెరిపించే మ్యాక్స్‌వెల్, నిలకడ చూపించే స్మిత్, నిప్పులు చెరిగే సీమర్లు ఇన్ని వనరులున్న ఆస్ట్రేలియా జట్టు అఫ్గానిస్తాన్‌పై గెలిచేందుకు ఆఖరి బంతి దాకా కష్టపడింది. గ్రూప్‌–1లో శుక్రవారం జరిగిన ‘సూపర్‌–12’ మ్యాచ్‌లో ఆసీస్‌ 4 పరుగులతో అఫ్గాన్‌ను అయితే ఓడించింది కానీ సెమీస్‌ కంగారూ మాత్రం అలాగే వుంది. ఇంగ్లండ్, లంక పోరు ముగిసేదాకా ఆసీస్‌ బిక్కుబిక్కుమని నిరీక్షించక తప్పదు.

మొదట ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (32 బంతుల్లో 54 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మిచెల్‌ మార్‌‡్ష (30 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అఫ్గానిస్తాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసి పోరాడి ఓడింది. రెగ్యులర్‌గా ‘బిగ్‌బాష్‌ లీగ్‌’లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ తరఫున ఆడే రషీద్‌ఖాన్‌ (23 బంతుల్లో 48 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) తన సొంతగడ్డపై రెచ్చిపోయాడు.  

మ్యాక్స్‌వెల్‌ ఫిఫ్టీ
గత ప్రపంచకప్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డీ వార్నర్‌ (18 బంతుల్లో 25; 5 ఫోర్లు) ఈ టోర్నీలో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో తన వ్యక్తిగత టాప్‌ స్కోరు చేశాడు. కామెరాన్‌ గ్రీన్‌ (3), స్మిత్‌ (4) నిరాశపరిచారు. పవర్‌ప్లేలో 52 పరుగులైతే చేసినా జట్టు 3 వికెట్లు కోల్పోయింది. మార్‌‡్ష, స్టొయినిస్‌ (21 బంతుల్లో 25; 2 సిక్సర్లు) మెరిపించినంత వరకు ఆస్ట్రేలియా స్కోరు జోరు మీదుంది. 15 ఓవర్లు ముగిసేసరికి 133/4 స్కోరుతో మెరుగ్గానే ఉన్న ఆసీస్‌ను ఆఖరి ఐదు ఓవర్లలో అఫ్గాన్‌ బౌలర్లు కట్టడి చేశారు. ఓ వైపు మ్యాక్స్‌వెల్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్నప్పటికీ మరోవైపు మిగతా వికెట్లను పడగొట్టేశారు. 8 బంతుల వ్యవధిలో వేడ్‌ (6)ను ఫారుఖీ, కమిన్స్‌ (0), కేన్‌ రిచర్డ్‌సన్‌ (1)లను నవీనుల్‌ హక్‌ అవుట్‌ చేశాడు.  

రషీద్‌ఖాన్‌ వీరవిహారం
ఆరంభంలోనే ఓపెనర్‌ ఘని (2) అవుటైనా... గుర్బాజ్‌ (17 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇబ్రహీం జద్రాన్‌ (33 బంతుల్లో 26; 2 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. ఓ దశలో 13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 99 స్కోరు చేసింది. విజయానికి 42 బంతుల్లో 70 పరుగుల సమీకరణం అఫ్గాన్‌ సంచలనానికి అనుకూలంగా కనిపించింది. అయితే జంపా వేసిన 14వ ఓవర్‌ అఫ్గాన్‌ను తలకిందులు చేసింది. 4 బంతుల వ్యవధిలో గుల్బదిన్‌ నైబ్‌ (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రనౌట్‌ కాగా, ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్‌ (0)లను జంపా అవుట్‌ చేశాడు. కెప్టెన్‌ నబీ(1)ని హాజల్‌వుట్‌ పెవిలియన్‌ పంపాడు.

103/6 స్కోరువద్ద కష్టాల్లో పడింది. కానీ చివర్లో వీరవిహారం చేశాడు. 4.3 ఓవర్లలో 45 పరుగులు రావడంతో ఆస్ట్రేలియా శిబిరానికి ముచ్చెమటలు పట్టాయి. ఆఖరి ఓవర్లో 22 పరుగులు చేయాల్సివుండగా... స్టొయినిస్‌ బౌలింగ్‌లో వైడ్‌గా వెళ్లిన తొలిబంతికి రసూలి (15)  రనౌటయ్యాడు. స్ట్రయిక్‌ తీసుకున్న రషీద్‌ 0, 4, 0, 6, 2, 4లతో విరుచుకుపడి 16 పరుగులు పిండుకున్నాడు. వైడ్‌తో మొత్తం 17 పరుగులు రాగా చివరకు 4 పరుగుల తేడాతో ఆసీస్‌ గట్టెక్కింది. ఆస్ట్రేలియా గెలవడంతోనే శ్రీలంక  టోర్నీనుంచి నిష్క్రమించింది.  

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (బి) నవీన్‌ 25; గ్రీన్‌ (సి) నైబ్‌ (బి) ఫారుఖీ 3; మార్‌‡్ష (సి) గుర్బాజ్‌ (బి) ముజీబ్‌ 45; స్మిత్‌ (ఎల్బీ) (బి)నవీన్‌ 4; స్టొయినిస్‌ (సి) ఘని (బి) రషీద్‌ 25; మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 54; వేడ్‌ (బి) ఫారుఖీ 6; కమిన్స్‌ (సి) రషీద్‌ (బి) నవీన్‌ 0; రిచర్డ్సన్‌ (రనౌట్‌) 1; జంపా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 168.
వికెట్ల పతనం: 1–22, 2–48, 3–52, 4–86, 5–139, 6–155, 7–156, 8–159.
బౌలింగ్‌: ఫారుఖీ 4–0–29–2, ముజీబ్‌ 4–0–42–1, నవీన్‌ ఉల్‌ హఖ్‌ 4–0–21–3, నైబ్‌ 3–0–31–0, రషీద్‌ 4–0–29–1, నబీ 1–0–14–0.

అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) వార్నర్‌ (బి) రిచర్డ్సన్‌ 30; ఘని (సి) కమిన్స్‌ (బి) హాజల్‌వుడ్‌ 2; ఇబ్రహీం జద్రాన్‌ (సి) మార్‌‡్ష (బి) జంపా 26; నైబ్‌ (రనౌట్‌) 39; నబీ (సి) వార్నర్‌ (బి) హాజల్‌వుడ్‌ 1; నజీబుల్లా జద్రాన్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) జంపా 0; రసూలీ (రనౌట్‌) 15; రషీద్‌ (నాటౌట్‌) 48; నవీన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 164.
వికెట్ల పతనం: 1–15, 2–40, 3–99, 4–99, 5–99, 6–103, 7–148.
బౌలింగ్‌: హాజల్‌వుడ్‌ 4–0–33–2, కమిన్స్‌ 4–0–22–0, స్టొయినిస్‌ 2–0–26–0, రిచర్డ్సన్‌ 4–0–48–1, జంపా 4–0–22–2, గ్రీన్‌ 2–0–13–0.   

టి20 ప్రపంచకప్‌లో నేడు
ఇంగ్లండ్‌ vs శ్రీలంక (మ.గం. 1:30 నుంచి) స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం
నేటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలిస్తే సెమీస్‌ చేరుతుంది.
అదే లంక గెలిస్తే ఆస్ట్రేలియా ముందంజ వేస్తుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement