► టి20 ప్రపంచకప్ టైటిల్ వెస్టిండీస్ సొంతం
► ఫైనల్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల విజయం
మహిళల క్రికెట్‌లో ఇదో సంచలనం. ఇన్నాళ్లూ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల గుత్తాధిపత్యంలా సాగిన టి20 ఫార్మాట్‌లో వెస్టిండీస్ మహిళలు కొత్త చరిత్ర సృష్టించారు. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఫైనల్లో చిత్తు చేసి తొలిసారి టైటిల్ సాధించారు.
ఆస్ట్రేలియా స్కోరు 148... గెలిచేందుకు సరిపోయే స్కోరుకంటే తాము ఎక్కువగానే చేశామని ఆ జట్టు ప్లేయర్ విలాని చెప్పేసింది. తమతో పోలిస్తే బలహీనంగా కనిపిస్తున్న విండీస్‌ను కంగారూలు తక్కువగా అంచనా వేశారు. మొదటి మూడు ఓవర్లలో విండీస్ 9 పరుగులు చేయగానే సంబరపడి పట్టు సడలించారు. అంతే... ఆ తర్వాత మ్యాథ్యూస్, టేలర్‌ల సెంచరీ భాగస్వామ్యం కరీబియన్లను విశ్వవిజేతగా నిలపగా... నిరాశగా చూస్తుండటం మినహా ఆసీస్ ఏమీ చేయలేకపోయింది ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం విండీస్ 19.3 ఓవర్లలో 2 వికెట్లకు 149 పరుగులు చేసి టోర్నీని చేజిక్కించుకుంది. వరుసగా గత మూడు వరల్డ్‌కప్‌లలో విజేతగా నిలిచి నాలుగో టైటిల్ మీద కన్నేసిన ఆసీస్‌కు భంగపాటు తప్పలేదు. మొదటి సారే ఫైనల్‌కు చేరినా... సమరోత్సాహం ప్రదర్శించిన విండీస్ ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది.
కీలక భాగస్వామ్యం: ఆరంభంలోనే హీలీ (4)ను అవుట్ చేసి విండీస్ శుభారంభం చేసింది. అయితే విలాని (37 బంతుల్లో 52; 9 ఫోర్లు), కెప్టెన్ లానింగ్ (49 బంతుల్లో 52; 8 ఫోర్లు) కలిపి జట్టును నడిపించారు. ముఖ్యంగా దూకుడుగా ఆడిన విలాని 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేసింది. వీరిద్దరు రెండో వికెట్‌కు 10 ఓవర్లలో 77 పరుగులు జోడించారు. విలాని వెనుదిరిగినా... లానింగ్, పెర్రీ (23 బంతుల్లో 28; 2 సిక్సర్లు) కలిసి 34 బంతుల్లో 42 పరుగులు జోడించారు. అయితే చివర్లో కట్టడి చేసిన విండీస్ బౌలర్లు ఆఖరి 5 ఓవర్లలో 34 పరుగులే ఇవ్వడంతో ఆసీస్ స్కోరు 150 పరుగుల లోపే ఆగిపోయింది.
ఆ ఇద్దరూ అదుర్స్: విండీస్ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగానే ఆరంభించిన హేలీ మ్యాథ్యూస్ (45 బంతుల్లో 66; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ స్టెఫానీ టేలర్ (57 బంతుల్లో 59; 6 ఫోర్లు) ఆ తర్వాత జోరు పెంచారు. ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరు చక్కటి షాట్లతో దూసుకుపోయారు. ఈ జోడీని విడదీయడానికి ఆసీస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో ఏకంగా 120 పరుగులు జోడించిన అనంతరం ఎట్టకేలకు వికెట్ పడింది. 26 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన ఈ దశనుంచి విండీస్ వేగంగా విజయం వైపు దూసుకుపోయింది. లక్ష్యానికి చేరువైన తర్వాత టేలర్ కూడా అవుటైనా, డాటిన్ (12 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు) పని పూర్తి చేసింది. మ్యాథ్యూస్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలు వగా, టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు టైటిల్ అందించిన స్టెఫానీ టేలర్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును అందుకుంది.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హీలీ (సి) అండ్ (బి) మ్యాథ్యూస్ 4; విలాని (సి) టేలర్ (బి) టేలర్ 52; లానింగ్ (ఎల్బీ) (బి) మొహమ్మద్ 52; పెర్రీ (ఎల్బీ) (బి) డాటిన్ 28; బ్లాక్‌వెల్ (నాటౌట్) 3; ఆస్‌బోర్న్ (రనౌట్) 0; జొనాసెన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1-15; 2-92; 3-134; 4-147; 5-147.
బౌలింగ్: కానెల్ 2-0-15-0; మ్యాథ్యూస్ 2-0-13-1; టేలర్ 3-0-26-0; డాటిన్ 4-0-33-2; ఫ్లెచర్ 1-0-9-0; మొహమ్మద్ 4-0-19-1; క్వింటైన్ 4-0-27-0.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: మ్యాథ్యూస్ (సి) బ్లాక్‌వెల్ (బి) బీమ్స్ 66; టేలర్ (సి) జొనాసెన్ (బి) ఫారెల్ 59; డాటిన్ (నాటౌట్) 18; కూపర్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.3 ఓవర్లలో 3 వికెట్లకు) 149.
వికెట్ల పతనం: 1-120; 2-144.
బౌలింగ్: జొనాసెన్ 4-0-26-0; పెర్రీ 3.3-0-27-0; షుట్ 3-0-26-0; ఫారెల్ 4-0-35-1; బీమ్స్ 4-0-27-1; ఆస్‌బోర్న్ 1-0-6-0.
మహిళల కొత్త చరిత్ర
Published Mon, Apr 4 2016 3:24 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM
Advertisement
Advertisement