జైపూర్: పురుషుల ఐపీఎల్ తరహాలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో ఉత్కంఠకు మాత్రం కొదవ ఉండటం లేదు. స్కోర్లు తక్కువైనా సోమవారం ట్రయల్ బ్లేజర్స్–సూపర్ నోవాస్ జట్ల మ్యాచ్ చివరి బంతి వరకు సాగి ఆసక్తి రేపగా... బుధవారం ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో అనూహ్య ఫలితం వచ్చేలా కనిపించింది. వెలాసిటీ విజయానికి 20 బంతుల్లో 2 పరుగులు మాత్రమే అవసరమైన స్థితిలో... ఏడు బంతుల్లో ఒక్క పరుగూ రాకుండా ఐదు వికెట్లు పడటంతో ఏం జరుగుతుందోనన్న ఉత్సుకత నెలకొంది. అయితే, సుశ్రీ ప్రధాన్ (2) అందుకు అవకాశం ఇవ్వకుండా లాంఛనాన్ని పూర్తి చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. వెలాసిటీ 18 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసి మూడు వికెట్ల తేడాతో నెగ్గింది.
హర్లీన్... మళ్లీ
గత మ్యాచ్‌లో చెలరేగిన కెప్టెన్ స్మృతి మంధాన (10) ఈసారి త్వరగానే వెనుదిరగడంతో బ్లేజర్స్‌కు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సుజీ బేట్స్ (22 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్), వన్ డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (40 బంతుల్లో 43; 5 ఫోర్లు) రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. సుజీ ఔటవడం, హర్లీన్‌కు ఎక్కువగా స్ట్రయికింగ్ రాకపోవడంతో స్కోరు వేగం పుంజుకోలేదు. స్టెఫానీ టేలర్ (18 బంతుల్లో 5) బంతులు వృథా చేసింది. 18వ ఓవర్‌లో హర్లీన్, దీప్తి శర్మ (16) వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. దీంతో మెరుగైన స్కోరుకు అవకాశం లేకపోయింది. వెలాసిటీ బౌలర్లలో ఏక్తా బిష్త్ (2/13), అమేలీ కెర్ (2/21) రెండేసి వికెట్లు పడగొట్టారు. శిఖా పాండే (1/18) పొదుపుగా బౌలింగ్ చేసింది. అనంతరం టీనేజ్ ఓపెనర్ షఫాలీ వర్మ (31 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్), వన్‌డౌన్ బ్యాటర్ డానియల్ వ్యాట్ (35 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్) మెరుపులతో వెలాసిటీ ఛేదన సులువుగానే సాగింది. రెండో వికెట్‌కు వీరు 38 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 63 పరుగుల వద్ద షఫాలీ ఔటయ్యాక వ్యాట్, కెప్టెన్ మిథాలీ రాజ్ (22 బంతుల్లో 17; 1 ఫోర్) ఇన్నింగ్స్‌ను నడిపించారు. మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. గెలుపునకు 25 బంతుల్లో 2 పరుగులే కావాల్సిన దశలో దీప్తి శర్మ (4/14) మాయాజాలానికి వ్యాట్, వేద కృష్ణమూర్తి (0), మిథాలీ, శిఖా పాండే (0), కెర్ (0) ఒకరివెంట ఒకరు వెనుదిరిగారు. దీంతో జట్టు 111/2 నుంచి 111/7కు పడిపోయింది. చేతిలో మూడు వికెట్లుండగా సమీకరణం 13 బంతుల్లో 2 పరుగులుగా మారింది. ఒత్తిడిని తట్టుకున్న ప్రధాన్... దీప్తి వేసిన బంతిని షార్ట్ థర్డ్‌మ్యాన్ దిశగా పంపి వెలాసిటీని గెలిపించింది.
నేడు వెలాసిటీ, సూపర్ నోవాస్ మ్యాచ్
ఫైనల్ సహా మొత్తం నాలుగు మ్యాచ్‌ల మహిళల టి20 లీగ్‌లో గురువారం వెలాసిటీ, సూపర్‌నోవాస్ మధ్య మూడో లీగ్ మ్యాచ్ జరుగనుంది. ప్రస్తుతం ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ చెరో మ్యాచ్ నెగ్గి ఉన్నాయి. మూడింటిలో బ్లేజర్స్ (–0.305), నోవాస్ (–0.1) కంటే వెలాసిటీ (0.678) రన్‌రేట్ చాలా మెరుగ్గా ఉంది. గురువారం వెలాసిటీ గెలిచినా, ఓడినా ఫైనల్‌కు వెళ్లే చాన్స్ ఉంది. నోవాస్‌కు మాత్రం విజయం, మంచి రన్‌రేట్ సాధించడం కూడా ముఖ్యమే.
15 ఏళ్ల సంచలనం...
బ్లేజర్స్, వెలాసిటీ మ్యాచ్‌లో బరిలో దిగిన షఫాలీ వర్మ వయసు కేవలం 15 ఏళ్లు. హరియాణాకు చెందిన ఈ టీనేజర్ అండర్–19 స్థాయిలో అదరగొట్టే ప్రదర్శన కనబరుస్తోంది. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన ఈమె ఇటీవల జరిగిన బీసీసీఐ అండర్–19 మహిళల క్రికెట్ లీగ్‌లో విశేషంగా రాణించింది. బెంగాల్‌పై 57 బంతుల్లో సెంచరీ బాది వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్‌పై 58 బంతుల్లో 98 పరుగులు చేసింది. ఇక హైదరాబాద్‌పై అయితే 77 బంతుల్లోనే 125 పరుగులు చేసింది. ఈ మూడుసార్లూ జట్టు గెలవగా ఈమెనే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’. ఈ టోర్నీలో 5 ఇన్నింగ్స్‌ల్లో 376 పరుగులు చేసింది. ఆఫ్‌బ్రేక్ బౌలింగ్‌తో వికెట్ కీపింగ్ కూడా చేయగలగడం షఫాలీ ప్రత్యేకత. షఫాలీ ఇదే జోరును కొనసాగిస్తే మహిళల జాతీయ జట్టులోకి రావడానికి మరెంతో కాలం పట్టకపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment