కరీబియన్ల జోరు
► శ్రీలంకపై ఏడు వికెట్లతో విజయం
► మెరిసిన బద్రీ, ఫ్లెచర్
ఇన్నాళ్లూ ఐపీఎల్ మెరుపులతో భారత అభిమానులకు దగ్గరైన వెస్టిండీస్ క్రికెటర్లు... ఈసారి టి20 ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడుతూ భారత అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సాధికార విజయం సాధించారు.
బెంగళూరు: టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు దూసుకుపోతోంది. తమ తొలి మ్యాచ్‌లో గేల్ విధ్వంసంతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన కరీబియన్లు... శ్రీలంకపై అన్ని విభాగాల్లోనూ సమష్టిగా రాణించి అలవోకగా నెగ్గారు. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో స్యామీ సేన ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు మాత్రమే చేసింది. దిల్షాన్ (12), చండీమల్ (16) ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించే ప్రయత్నం చేసినా... కరీబియన్ బౌలర్లు కట్టడి చేశారు. వరుస విరామాల్లో వికెట్లతో ఏ దశలోనూ లంకను కుదురుకోనీయలేదు. పెరీరా (29 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడటంతో లంకకు ఓ మాదిరి స్కోరైనా లభించింది. వెస్టిండీస్ స్పిన్నర్ శామ్యూల్ బద్రీ (3/12) ఆరంభంలో సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. బ్రేవో రెండు వికెట్లు తీశాడు.
వెస్టిండీస్ జట్టు 18.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి గెలిచింది. ఫీల్డింగ్ సమయంలో గాయం కావడం వల్ల గేల్ ఓపెనింగ్ చేయలేదు. అయితే ఈ లోటు తెలియకుండా గేల్ స్థానంలో వచ్చిన ఫ్లెచర్ (64 బంతుల్లో 84 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. రెండో ఎండ్‌లో మూడు వికెట్లు పడ్డా ఏమాత్రం తడబాటు లేకుండా దాదాపుగా ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. గేల్ బ్యాటింగ్‌కు రావాలంటూ బెంగళూరు అభిమానులు గోల చేశారు.
దీంతో మూడో వికెట్ పడ్డాక గేల్ బ్యాటింగ్‌కు రాబోయాడు. అయితే ఫీల్డింగ్ సమయంలో బయటకు వెళ్లినందున నిబంధనల ప్రకారం మరో 11 నిమిషాలు ఆగాక లేదా మరో రెండు వికెట్లు పడ్డాక గేల్ ఆడాలని అంపైర్లు సూచించారు. రస్సెల్ (8 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఫ్లెచర్ మ్యాచ్‌ను ముగించడంతో బెంగళూరు అభిమానులు గేల్ మెరుపులను చూడలేకపోయారు.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: చండీమల్ రనౌట్ 16; దిల్షాన్ ఎల్బీడబ్ల్యు (బి) బ్రాత్‌వైట్ 12; తిరిమన్నె (సి) ఫ్లెచర్ (బి) బద్రీ 5; కపుగెడెర (స్టంప్డ్) రామ్‌దిన్ (బి) బద్రీ 6; మాథ్యూస్ (సి) రామ్‌దిన్ (బి) బ్రేవో 20; సిరివర్ధన (సి) గేల్ (బి) బద్రీ 0; తిషార పెరీరా (సి) రస్సెల్ (బి) బ్రేవో 40; కులశేఖర (బి) రస్సెల్ 7; హెరాత్ రనౌట్ 3; వాండార్సె నాటౌట్ 0; చమీరా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 122.
వికెట్ల పతనం: 1-20; 2-32; 3-41; 4-47; 5-47; 6-91; 7-116; 8-121; 9-121.
బౌలింగ్: రస్సెల్ 4-0-34-1; బద్రీ 4-0-12-3; బెన్ 4-0-13-0; బ్రాత్‌వైట్ 4-0-36-1; డ్వేన్ బ్రేవో 4-0-20-2.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: ఫ్లెచర్ నాటౌట్ 84; చార్లెస్ (బి) వాండార్సె 10; శామ్యూల్స్ (స్టంప్డ్) చండీమల్ (బి) సిరివర్ధన 3; రామ్‌దిన్ (బి) సిరివర్ధన 5; రస్సెల్ నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.2 ఓవర్లలో మూడు వికెట్లకు) 127.
వికెట్ల పతనం: 1-39; 2-54; 3-72.
బౌలింగ్: మాథ్యూస్ 1-0-13-0; హెరాత్ 4-0-27-0; కులశేఖర 2-0-17-0; వాండార్సె 4-1-11-1; సిరివర్ధన 4-0-33-2; చమీరా 3-0-15-0; పెరీరా 0.2-0-11-0.