పరిగి, న్యూస్‌లైన్: పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ జడలు విచ్చుకుంది. ఒక ప్పుడు పట్టణాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్‌లు నేడు పరిగికి కూడా పాకింది. ఈ జాడ్యం గత ఐపీఎల్ సీజన్‌లో ప్రారంభమవగా ప్రస్తుతం కొనసాగుతున్న టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో వేళ్లూనుకుంటోంది. ప్రస్తుతం జనమంతా ఎన్నికలో హడావుడిలో మునిగిపోగా క్రికెట్‌పై ఆసక్తి ఉన్న యువకులు బెట్టింగ్‌కు బావినసవుతూ రూ. వేలకువేలు వెచ్చిస్తున్నారు.
బెట్టింగులు ఇలా..
క్రికెట్ బెట్టింగ్‌ల గురించి వినడమే గాని చాలా మందికి దానికి గురించి తెలియదు. బాల్ టూ బాల్... ఓవర్ టూ ఓవర్.. మ్యాచ్ టూ మ్యాచ్ ఇలా బెట్టింగులు నిర్వహిస్తున్నారు. పలానా బాల్ పలానా బ్యాట్స్‌మన్ సిక్స్, లేదా ఫోర్ కొడతాడని ఫోన్‌లో బెట్ కట్టడం, లేదా పలానా బ్యాట్స్‌మన్ పలానా ఓవర్‌లో 10 పరుగులు, లేదా 20 పరుగులు ఆపైనా సాధిస్తాడు. లేదా దేశాల మధ్య జరిగే మ్యాచ్‌లో పలానా దేశం విజయం సాధిస్తుంది. పలానా బ్యట్స్‌మన్ హాఫ్ సెంచరీ సాధిస్తాడు.. ఇలా పలు రూపాల్లో బెట్టింగ్ వ్యవహారం కొనసాగుతోంది. మ్యాచ్ టూ మ్యాచ్ బెట్ కట్టే వారు ముందుగానే మధ్యవర్తుల ఖాతాల్లో డబ్బులు వేయాల్సి ఉంటు ంది.
గెలిస్తే చెల్లించిన డబ్బులకు డబుల్ అమౌంట్ నిర్వహకులు ఆన్‌లైన్‌లోనే చెల్లిస్తారు. లేదంటే ముందుగా కట్టిన డబ్బులు పోతాయి. ఓవర్ టూ ఓవర్, బాల్ టూ బాల్.. బెట్టింగ్ విషయానికి వస్తే ఓవర్‌కు ముందు, బాల్‌కు ముందు ఫోన్ చేసి బెట్ కట్టాల్సి ఉంటుంది. కొందరు నిర్వాహకులు బ్రోకర్‌ను నియమించి అతని ద్వారా లేవాదేవీలు జరుపుతుంటారు. గెలిస్తే మరుసటి రోజు అతను డబ్బులు తెచ్చి ఇస్తుంటాడు. ఓడితే డబ్బులు తీసుకువెళ్తాడు. పరిగిలో ప్రస్తుతం బెట్టింగ్ ఇలా కొనసాగుతోంది.
యువత, ఉద్యోగులపై వల...
బెట్టింగ్ నిర్వాహకులు హైదరాబాద్‌లో ఉండి కొందరు మధ్యవర్తుల ద్వారా ప్రధానంగా క్రికెట్ అంటే క్రేజ్ ఉన్న యువకులు, ఉద్యోగులను ఎంచుకుని ముగ్గులోకి దింపుతున్నారు. గత ఐపీఎల్ సీజన్‌లో పరిగికి చెందిన 30-50 మంది వరకు బెట్టింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఆ సంఖ్య మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
కాయ్.. రాజా.. కాయ్!
Published Mon, Mar 31 2014 11:06 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement