
8 వేదికల్లో టి20 ప్రపంచకప్
* మార్చి 11 నుంచి టోర్నీ
* ఈడెన్‌లో ఫైనల్
ముంబై: భారత్‌లో వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌కు వేదికలు ఖరారయ్యాయి. మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగే ఈ మెగా టోర్నీకి ఎనిమిది స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి. తుది పోరు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగబోతుండగా మిగతా మ్యాచ్‌లు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, మొహాలీ, నాగ్‌పూర్, ఇండోర్, ధర్మశాల స్టేడియాల్లో నిర్వహిస్తారు.
ఈడెన్‌లో ఇప్పటిదాకా కేవలం ఒక్క అంతర్జాతీయ టి20 మ్యాచ్ మాత్రమే జరిగింది. మరోవైపు చెన్నైలోని చిదంబరం స్టేడియం టోర్నీకి దూరమైంది. అక్కడి మూడు స్టాండ్‌లు కార్పొరేషన్‌తో విభేదాల కారణంగా సీజ్ కావడంతో ఖాళీగా ఉంటున్నాయి. దీంతో టోర్నీ నుంచి ఐసీసీ ఈ నగరాన్ని తప్పించింది. బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్... హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు కూడా కావడంతో ధర్మశాలకు ఆతిథ్యం దక్కింది.