కొత్త కోచ్ లేనట్లే!
ప్రపంచకప్ ముగిసిన దగ్గర్నించి కోచ్ విషయంలో జరుగుతున్న రకరకాల ప్రచారాలకు తెరదించాలని బీసీసీఐ భావిస్తోంది. సీనియర్ క్రికెటర్లతోపాటు బోర్డులోని కొందరు పెద్దలు కూడా ఇప్పటికిప్పుడు కొత్త కోచ్ అనవసరమనే భావనలో ఉన్నారు. వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే టి20 ప్రపంచకప్ వరకు రవిశాస్త్రికే బాధ్యతలు ఇవ్వాలని, ముగ్గురు సహాయక కోచ్‌లను కొనసాగించాలని ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
భారత జట్టు కోచ్‌గా డంకన్ ఫ్లెచర్ కొనసాగిన సమయంలోనే రవిశాస్త్రి భారత జట్టు డెరైక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. బ్యాటింగ్‌కు సంజయ్ బంగర్, బౌలింగ్‌కు భరత్ అరుణ్, ఫీల్డింగ్‌కు శ్రీధర్‌లను సహాయక కోచ్‌లుగా తీసుకున్నారు. వన్డే ప్రపంచకప్ తర్వాత కూడా కోచ్‌ను నియమించలేదు. బంగ్లాదేశ్‌కు కూడా ఇదే బృందం వెళ్లింది. అయితే అక్కడ వన్డే సిరీస్‌లో భారత జట్టు అనూహ్య ఓటమి నేపథ్యంలో కొత్త కోచ్ అవసరమనే అభిప్రాయం వచ్చింది.
అయినా దీనిపై తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ లోగా కోహ్లి నేతృత్వంలో శ్రీలంక వెళ్లిన జట్టు తొలి టెస్టులో ఓడిపోయినా... అనూహ్యంగా పుంజు కుని సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. 22 ఏళ్ల తర్వాత లంక గడ్డపై సిరీస్ గెలిచి రికార్డు సృష్టించింది. అయితే ఈ సిరీస్ జరుగుతున్న సమయంలోనే రకరకాల వార్తలు వచ్చాయి. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కోచ్‌లను ఎంపిక చేయాలనే ఆలోచన బీసీసీఐకి ఉందనే ప్రచారమూ సాగింది.
దక్షిణాఫ్రికాతో అక్టోబరు 2న ప్రారంభమయ్యే సిరీస్ సమయానికి కొత్త కోచ్ వస్తాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటన్నింటికీ తెరదించుతూ ప్రస్తుతం ఉన్న వారినే కొనసాగించాలని బోర్డు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కాంట్రాక్టులు ఇస్తారు
ఇప్పటివరకూ ఒక్కో సిరీస్‌కే వీరి నియామకం జరిగింది. నిజానికి శ్రీలంక సిరీస్‌తో వీరి బాధ్యతలు ముగిశాయి. ఇలా ఒక్కో సిరీస్‌కు నిర్ణయం తీసుకుంటే కష్టమని, తాము ఎంతకాలం పని చేయాలో స్పష్టం చేస్తే మేలని సహాయక కోచ్‌లు చెప్పినట్లు సమాచారం. ఆటగాళ్లతో ఎక్కువకాలం కలిసి పనిచేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని, కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఈ ముగ్గురూ కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రితో పాటు మిగిలిన ముగ్గురికి కూడా టి20 ప్రపంచకప్ వరకు బాధ్యతలు అప్పగిస్తూ కాంట్రాక్టులు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
రాబోయే ఆరు నెలలు భారత్‌కు బిజీ షెడ్యూల్ ఉంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో పూర్తి స్థాయి సిరీస్, ఆ తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్ ఉంది. అది ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్, బంగ్లాదేశ్‌లో ఆసియా కప్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత భారత్‌లోనే టి20 ప్రపంచకప్ ఉంది. అప్పటిదాకా వచ్చే ఫలితాలను బట్టి ఆ తర్వాత రెండు నెలలు ఐపీఎల్ సీజన్ జరిగే సమయంలో నిర్ణయాలను సమీక్షించుకోవచ్చు.
-సాక్షి క్రీడావిభాగం
ఆ నిర్ణయం ఎందుకంటే...
రవిశాస్త్రి విషయంలో టెస్టు కెప్టెన్ కోహ్లితో పాటు వన్డే కెప్టెన్ ధోని కూడా సంతోషంగానే ఉన్నారు. ఈ ఇద్దరితో పాటు సీనియర్ క్రికెటర్లంతా శాస్త్రిని కొనసాగిస్తే మేలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు సహాయక కోచ్‌లు కూడా విభిన్నంగా ఆలోచిస్తూ ఆటగాళ్లను మెరుగ్గా సన్నద్ధం చేస్తున్నారనే అభిప్రాయం కూడా అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలో విదేశీ కోచ్‌ల కోసం పరుగులు పెట్టే కంటే... ఇప్పుడు ఉన్న వ్యవస్థనే కొనసాగిస్తే మేలనే చర్చ మొదలైంది. అయితే కోచ్ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యతను వాస్తవానికి బీసీసీఐ క్రికెట్ కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ కూడా ప్రస్తుతం ఉన్న వారినే కొనసాగించాలనే ప్రతిపాదనకు అంగీ కరించినట్లు సమాచారం.