‘డెరైక్టర్’ కొనసాగింపు
♦ టి20 ప్రపంచకప్ వరకు రవిశాస్త్రికే బాధ్యతలు
♦ ముగ్గురు అసిస్టెంట్ కోచ్‌లకూ అవకాశం
♦ బీసీసీఐ అధికారిక ప్రకటన
ముంబై : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎంపికపై సందిగ్ధత వీడింది. రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి కొత్త కోచ్‌ను ఎంపిక చేయనున్నట్లు వచ్చిన వార్తలకు తెర పడింది. టీమ్ డెరైక్టర్ హోదాలో పని చేస్తున్న మాజీ ఆల్‌రౌండర్ రవిశాస్త్రిని కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్ వరకు శాస్త్రి బాధ్యతలు నిర్వర్తిస్తారు. భారత జట్టు ఇటీవలి ప్రదర్శన నేపథ్యంలో కొత్త కోచ్ అవసరం లేదని భావిస్తూ సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన సలహా కమిటీ రవిశాస్త్రిని కొనసాగించాలని సూచించింది.
వచ్చే ఏడాది ఏప్రిల్ 3న టి20 ప్రపంచ కప్ ఫైనల్ జరగనున్నందున శాస్త్రికి దాదాపు మరో ఏడు నెలలు డెరైక్టర్‌గా కొనసాగే అవకాశం దక్కింది. మరోవైపు ముగ్గురు సహాయక కోచ్‌లు సంజయ్ బంగర్, భరత్ అరుణ్, ఆర్. శ్రీధర్‌లను కూడా ప్రపంచ కప్ వరకు కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు కొత్త కోచ్‌ను ఎంపిక చేస్తామని ఇటీవల బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రకటించినా... లంకతో సిరీస్ భారత్ నెగ్గడంతో పాటు సమర్థత కలిగిన కోచ్‌లు అందుబాటులో లేరని భావించిన బీసీసీఐ శాస్త్రిని కొనసాగించేందుకే మొగ్గు చూపింది. 2014 ఆగస్టులో ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత వన్డే సిరీస్ నుంచి డెరైక్టర్, సహాయక కోచ్‌ల బృందం బాధ్యతలు చేపట్టింది.
ఏజీఎం వాయిదా: ఈనెల 27న జరగాల్సిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) మళ్లీ వాయిదా పడింది. బోర్డు సమావేశానికి తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడి హోదాలో ఎన్. శ్రీనివాసన్ హాజరు కావచ్చా లేదా అనేది తేలే వరకు ఈ సమావేశం జరిగే అవకాశం లేదు. కోర్టు ఆదేశాల తర్వాత ఏజీఎంను నిర్వహిస్తామని కార్యదర్శి ఠాకూర్ స్పష్టం చేశారు.
ఎయిరిండియాతో ఒప్పందం: వచ్చే ఏడాదిపాటు భారత క్రికెటర్లంతా ఎయిరిండియా విమానాల్లోనే ప్రయాణిస్తారు. దీనికి సం బంధించి బీసీసీఐ, ఎయిరిండియా మధ్య ఒప్పందం కుదిరింది.