ఇంగ్లండ్ కుమ్మేసింది
► దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం
► జో రూట్, జాసన్ రాయ్ మెరుపులు
► ఆమ్లా, డి కాక్ శ్రమ వృథా
ముంబై: 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఉఫ్‌మని ఊదేశారు. ఓపెనర్ జాసన్ రాయ్ (16 బంతుల్లో 43; 5 ఫోర్లు; 3 సిక్సర్లు) ఊచకోతతో ప్రారంభమైన పరుగుల వరద జో రూట్ (44 బంతుల్లో 83; 6 ఫోర్లు; 4 సిక్సర్లు) జట్టు విజయాన్ని ఖాయం చేసేదాకా సాగింది. ఫలితంగా వాంఖడే మైదానంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో ఓడింది. టి20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక ఛేజింగ్ కావడం విశేషం. బౌలర్ల వైఫల్యానికి తోడు చెత్త ఫీల్డింగ్ కూడా జత కలవడంతో ప్రొటీస్ మూల్యం చెల్లించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 229 పరుగుల స్కోరు సాధించింది.
ఓపెనర్లు ఆమ్లా (31 బంతుల్లో 58; 7 ఫోర్లు; 3 సిక్సర్లు), డి కాక్ (24 బంతుల్లో 52; 7 ఫోర్లు; 3 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నారు. డుమిని (28 బంతుల్లో 54 నాటౌట్; 3 ఫోర్లు; 3 సిక్సర్లు), మిల్లర్ (12 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు; 2 సిక్సర్లు) చివర్లో ధాటిగా ఆడారు. అనంతరం భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు చేసి నెగ్గింది.ఇంగ్లండ్ తొలి బంతి నుంచే బాదుడు ప్రారంభించింది. రబడా వేసిన ఇన్నింగ్స్ ప్రారంభ ఓవర్‌లో నాలుగు ఫోర్లు బాదిన ఓపెనర్ రాయ్ 21 పరుగులు రాబట్టగా రెండో ఓవర్‌లో మరో ఓపెనర్ హేల్స్ వరుసగా మూడు ఫోర్లు.. రాయ్ 4,6 కొట్టడంతో 23 పరుగులు వచ్చాయి.
మూడో ఓవర్‌లో హేల్స్ (7 బంతుల్లో 17; 4 ఫోర్లు) అవుటవడంతో తొలి వికెట్‌కు 15 బంతుల్లోనే 48 పరుగులు వచ్చాయి. కొద్దిసేపటికే రాయ్ ఓ భారీ సిక్స్ అనంతరం అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జో రూట్ బాధ్యతను తీసుకుని ఇన్నింగ్స్‌ను నడిపించాడు. భారీ షాట్లతో రెచ్చిపోయి 29 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. 19వ ఓవర్‌లో అవుటయ్యాడు. ఇక చివరి ఓవర్‌లో ఒక్క పరుగు కోసం హైడ్రామా నడిచినా మొయిన్ అలీ ఇంగ్లండ్‌కు విజయాన్ని ఖాయం చేశాడు.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా ఎల్బీడబ్ల్యు (బి) అలీ 58; డి కాక్ (సి) హేల్స్ (బి) అలీ 52; డి విలియర్స్ (సి) మోర్గాన్ (బి) రషీద్ 16; డు ప్లెసిస్ (సి) రాయ్ (బి) విల్లీ 17; డుమిని నాటౌట్ 54; మిల్లర్ నాటౌట్ 28; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 229.
వికెట్ల పతనం: 1-96, 2-114, 3-133, 4-169.
బౌలింగ్: విల్లే 4-0-40-1; టోప్లే 2-0-33-0; అలీ 4-0-34-2; జోర్డాన్ 3-0-49-0; స్టోక్స్ 2-0-23-0; రషీద్ 4-0-35-1; రూట్ 1-0-13-0.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) డి కాక్ (బి) అబాట్ 43; హేల్స్ ఎల్బీడబ్ల్యు (బి) అబాట్ 17; స్టోక్స్ (సి) మోరిస్ (బి) రబడా 15; జో రూట్ (సి) మిల్లర్ (బి) రబడా 83, మోర్గాన్ (బి) డుమిని 12; బట్లర్ (స్టంప్డ్) డి కాక్ (బి) తాహిర్ 21; అలీ నాటౌట్ 12; జోర్డాన్ (సి) డుమిని (బి) అబాట్ 5; విల్లే (రనౌట్) 0; రషీద్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (19.4 ఓవర్లలో 8 వికెట్లకు) 230.
వికెట్ల పతనం: 1-48, 2-71, 3-87, 4-111, 5-186, 6-219, 7-229, 8-229.
బౌలింగ్: రబడా 4-0-50-2; స్టెయిన్ 2-0-35-0; అబాట్ 3.4-0-41-3; తాహిర్ 4-0-28-1; డుమిని 3-0-31-1; మోరిస్ 3-0-43-0.