డబ్లిన్: దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో సఫారీ బ్యాట్స్‌మెన్ గర్జించారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో పసికూన చేతిలో ఎదురైన పరాభవంతో సఫారీలు అలర్ట్ అయ్యారు. పరువు పోకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారీ స్కోర్ నమోదు చేశారు. ఓపెనర్లు క్వింటన్ డికాక్(91 బంతుల్లో 120; 11 ఫోర్లు, 5 సిక్సర్లు), జన్నెమన్ మలాన్ (177 బంతుల్లో 169 నాటౌట్; 16 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 346 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి, ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించారు.
ముఖ్యంగా మలాన్ చివరి దాకా క్రీజ్‌లో నిలిచి భారీ శతకంతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో అతను కెరీర్‌లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ వాన్ డర్ డుసెన్(28 బంతుల్లో 30; 2 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ 2, క్రెయిగ్ యంగ్, సిమి సింగ్ తలో వికెట్ పడగొట్టారు. కడపటి వార్తలందేసరికి ఐర్లాండ్ 3 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 12 పరుగులు సాధించింది. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా ఫలితం తేలకపోగా, రెండో వన్డేలో ఆతిధ్య ఐర్లాండ్ సఫారీలపై 43 పరుగుల తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. వన్డే క్రికెట్‌లో ఐర్లాండ్‌కు సఫారీలపై ఇదే తొలి విజయం కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment