జొహన్నెస్‌బర్గ్: సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అనూహ్యంగా పరాజయంపాలైన దాదాపు నెల రోజుల తర్వాత భారత జట్టు మరో వన్డే పోరులో బరిలోకి దిగుతోంది. అయితే ఆ టోర్నీలో ఆడినవారిలో పలువురు కీలక ఆటగాళ్లు లేకుండానే రాహుల్ నాయకత్వంలో యువ క్రికెటర్లతో కూడిన టీమిండియా సిద్ధమైంది. మరో వైపు వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత దక్షిణాఫ్రికాకు కూడా ఇదే తొలి మ్యాచ్.
సఫారీ టీమ్ కూడా స్వదేశంలో పలువురు కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం వాండరర్స్ మైదానంలో తొలి వన్డే జరగనుంది. ‘బ్రెస్ట్ క్యాన్సర్’ అవగాహన కార్యక్రమంలో భాగంగా మైదానం మొత్తం గులాబీమయం కానుంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు గులాబీ రంగు జెర్సీలతోనే బరిలోకి దిగుతారు.
ఎవరెవరికి చాన్స్!
వన్డే సిరీస్ కోసం భారత జట్టులోకి ఎంపిక చేసిన ఆటగాళ్ల బృందంలో 9 మందికి 10కంటే తక్కువ వన్డేలు ఆడిన అనుభవం ఉంది. దేశవాళీ వన్డేల్లో ప్రదర్శనతో పాటు టి20 టీమ్‌లో సభ్యులుగా సత్తా చాటిన కుర్రాళ్లకు ఇక్కడా అవకాశం దక్కనుంది. రుతురాజ్, తిలక్, రింకూ సింగ్‌లాంటి బ్యాటర్లు దీనిని ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మిడిలార్డర్‌లో సంజు సామ్సన్‌కు మ్యాచ్ దక్కుతుందా అనేది ఆసక్తికరం. వన్డేల కోసమే ఎంపిక చేసిన తమిళనాడు ఓపెనర్ సాయి సుదర్శన్‌కు కూడా టీమ్ మేనేజ్‌మెంట్ పరీక్షించవచ్చు.
కెప్టెన్‌గా గతంలోనూ మంచి అనుభవం ఉన్న కేఎల్ రాహుల్ ఈసారి కూడా యువ ఆటగాళ్లతో జట్టును ఎలా నడిపిస్తాడనేది చూడాలి. షమీ, బుమ్రా, సిరాజ్‌లు అందుబాటులో లేరు. దాంతో ముకేశ్, అర్ష్దీప్, అవేశ్‌లపైనే భారం ఉంది. అయితే స్పిన్‌లో మాత్రం పరిస్థితి మెరుగా>్గ ఉంది. ఫామ్‌లో ఉన్న కుల్దీప్‌తో పాటు అక్షర్, పునరాగమనంలో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న చహల్‌లను ఎదుర్కోవడం సఫారీలకు అంత సులభం కాదు.
బ్యాటింగ్‌పైనే భారం...
దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దూకుడైన ఆటగాళ్లలో మిల్లర్, క్లాసెన్, కెప్టెన్ మార్క్‌రమ్‌లకు పేరుంది. భారత్‌తో టి20 సిరీస్‌లో ఈ ముగ్గురినుంచి చెప్పుకోదగ్గ మెరుపులు రాలేదు. వన్డేల్లోనైనా తమ స్థాయికి తగినట్లుగా ఆడితే సఫారీ జట్టు పైచేయి సాధించగలదు. ఓపెనర్‌గా రీజా హెన్‌డ్రిక్స్‌కు ఇకపై పూర్తి స్థాయిలో అవకాశాలు రానున్నాయి. వాటిని అతను ఎంత సమర్థంగా ఉపయోగించుకుంటాడనేది చూడాలి. బ్యాటింగ్‌లో భారీ స్కోరు సాధించడంపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ఆ జట్టు బౌలింగ్ దళంలో పూర్తిగా అనుభవరాహిత్యం కనిపిస్తోంది. విలియమ్స్, బర్జర్, ముల్దర్ లు టీమిండియాకు కట్టడి చేయగలరా అనేది సందేహమే.
జట్ల వివరాలు (అంచనా)
భారత్: రాహుల్ (కెప్టెన్ ), రుతురాజ్, సుదర్శన్, తిలక్, శ్రేయస్, రింకూ/సామ్సన్, అక్షర్, అర్ష్ దీప్, అవేశ్, కుల్దీప్, ముకేశ్.
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్ (కెప్టెన్ ), హెన్‌డ్రిక్స్, డి జోర్జి, వాన్‌డర్ డసెన్, క్లాసెన్, మిల్లర్, ఫెలుక్వాయో, ముల్దర్, బర్జర్, మహరాజ్/ షమ్సీ, విలియమ్స్
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు బాగా అనుకూల మైదానం. భారీ స్కోర్లు ఖాయం. గత నాలుగు వన్డేల్లో మూడు సార్లు తొలి ఇన్నింగ్స్‌లో 300కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. వర్షసూచన లేదు.
Comments
Please login to add a commentAdd a comment