బౌల్ట్ బౌలింగ్‌లో సామ్సన్ క్లీన్‌బౌల్డ్, డి కాక్
డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ రెండు వరుస పరాజయాల తర్వాత కోలుకుంది...ప్రత్యర్థి రాజస్తాన్ రాయల్స్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తూ కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. సరిగ్గా చెప్పాలంటే అదృష్టం కలిసొచ్చి దక్కిన తమ గత రెండు విజయాలతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో మాత్రం తమ స్థాయికి తగిన ఆటతీరును రోహిత్ సేన ప్రదర్శించింది. ముంబై పదునైన బౌలింగ్‌పై ఎదురు దాడి చేయలేక రాజస్తాన్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఒక్క బ్యాట్స్‌మన్ కూడా దూకుడు ప్రదర్శించలేకపోయాడు. అనంతరం ముంబై ఆడుతూ పాడుతూ సునాయాసంగా లక్ష్యాన్ని చేరింది. క్వింటన్ డి కాక్ కీలక అర్ధ సెంచరీతో ముందు నిలిచి జట్టును గెలిపించాడు.
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో మరో ఏకపక్ష మ్యాచ్...ఎలాంటి పోరాటం లేకుండా, ఎటువంటి మెరుపు ఇన్నింగ్స్‌లు కనిపించకుండా మ్యాచ్ ముగిసింది. ఈ పోరులో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. ముందుగా రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (27 బంతుల్లో 42; 5 ఫోర్లు), జోస్ బట్లర్ (32 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), శివమ్ దూబే (31 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (20 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సి క్సర్లు) చెప్పుకోదగ్గ పరుగులు సాధించారు. అనంతరం ముంబై 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 172 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్వింటన్ డి కాక్ (50 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స ర్లు) అర్ధ సెంచరీ చేయగా, కృనాల్ పాండ్యా (26 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు.
రాణించిన టాప్–4...
ఓపెనర్లు బట్లర్, యశస్వి కొన్ని చక్కటి షాట్లతో రాజస్తాన్‌కు సరైన ఆరంభాన్ని అందించారు. జయంత్ ఓవర్లో బట్లర్ వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ కొట్టగా...కూల్టర్ నైల్ వేసిన తర్వాతి ఓవర్లో యశస్వి 4, 6 బాదాడు. పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 47 పరుగులకు చేరింది. ఇదే జోరులో రాహుల్ చహర్ వేసిన బంతిని భారీ సిక్స్‌గా మలచిన బట్లర్ తర్వాతి బంతిని ముందుకు దూసుకొచ్చి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం కృనాల్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి జోరు ప్రదర్శించిన సామ్సన్ దానిని కొనసాగించాడు. చహర్ తర్వాతి ఓవర్లో యశస్వి కూడా ఒక సిక్స్ కొట్టి అదే ఓవర్లో బౌలర్‌కే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. బౌల్ట్ ఓవర్లోనూ వరుసగా రెండు ఫోర్లు కొట్టిన సామ్సన్...బౌల్ట్ తర్వాతి ఓవర్లో క్లీన్‌బౌల్డయ్యాడు. మరో ఎండ్‌లో దూబే కూడా ధాటిగా ఆడటంతో రాయల్స్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. తొలి 10 ఓవర్లలో 2 వికెట్లకు 91 పరుగులు చేయగలిగిన రాయల్స్ ఈ ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. చేతిలో వికెట్లు ఉండి కూడా మరో 80 పరుగులు మాత్రమే చేయగలిగింది.
కృనాల్ కీలక ఇన్నింగ్స్...
ఛేదనలో ముంబైకి పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. యువ బౌలర్ చేతన్ సకరియా (0/18) మినహా ఇతర బౌలర్లెవరూ ముంబై కట్టడి చేయలేకపోయారు. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన డి కాక్ ఈ సారి తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. ముస్తఫిజుర్ ఓవర్లో వరుస బంతుల్లో అతను 4, 6 కొట్టాడు. మరో వైపు రోహిత్ శర్మ (14) ఎక్కువ సేపు నిలబడలేకయాడు. అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్ (16)ను కూడా మోరిస్ తక్కువ వ్యవధిలో అవుట్ చేశాడు. ఉనాద్కట్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన డి కాక్ 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డి కాక్‌తో జత కలిసిన కృనాల్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడి ముంబై పనిని సులువు చేశాడు. తెవాటియా, ముస్తఫిజుర్ ఓవర్లలో ఒక్కో సిక్సర్ కొట్టిన అతను...ముస్తఫిజుర్ ఓవర్లోనే క్లీన్‌బౌల్డయ్యాడు. ఈ జోడి మూడో వికెట్‌కు 46 బంతుల్లో 63 పరుగులు జోడించింది. 20 బంతుల్లో 26 పరుగులు చేయాల్సిన ఈ దశలో కీరన్ పొలార్డ్ (8 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) చకచకా పరుగులు సాధించి మరో 9 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు.
స్కోరు వివరాలు
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (స్టంప్డ్) డి కాక్ (బి) చహర్ 41, యశస్వి (సి) అండ్ (బి) చహర్ 32, సామ్సన్ (బి) బౌల్ట్ 42, దూబే (సి) అండ్ (బి) బుమ్రా 35, మిల్లర్ (నాటౌట్) 7, పరాగ్ (నాటౌట్) 8, ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 171.
వికెట్ల పతనం: 1–66, 2–99, 3–148, 4–158.
బౌలింగ్: బౌల్ట్ 4–0–37–1, బుమ్రా 4–0–15–1, జయంత్ 3–0–37–0, కూల్టర్ నైల్ 4–0–35–0, రాహుల్ చహర్ 4–0–33–2, కృనాల్ 1–0–12–0.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) సకరియా (బి) మోరిస్ 14, డి కాక్ (నాటౌట్) 70, సూర్యకుమార్ (సి) బట్లర్ (బి) మోరిస్ 16, కృనాల్ (బి) ముస్తఫిజుర్ 39, పొలార్డ్ (నాటౌట్) 16, ఎక్స్‌ట్రాలు 17, మొత్తం (18.3 ఓవర్లలో 3 వికెట్లకు) 172.
వికెట్ల పతనం: 1–49, 2–83, 3–146.
బౌలింగ్: సకరియా 3–0–18–0, ఉనాద్కట్ 4–0–33–0, ముస్తఫిజుర్ 3.3–0–37–1, మోరిస్ 4–0–33–2, తెవాటియా 3–0–30–0, దూబే 1–0–6–0.
Comments
Please login to add a commentAdd a comment