బంగ్లాదేశ్ బోణీ
► క్వాలిఫయింగ్‌లో నెదర్లాండ్స్‌పై గెలుపు
► తమీమ్ ఒంటరిపోరాటం
ధర్మశాల: టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బోణీ చేసింది. తమీమ్ ఇక్బాల్ (58 బంతుల్లో 83 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో... బుధవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లా 8 పరుగుల స్వల్ప తేడాతో నెదర్లాండ్స్‌పై గెలిచింది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 20 ఓవర్లలో 7 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఆరంభంలో డచ్ బౌలర్లు చెలరేగడంతో బంగ్లాకు శుభారంభం దక్కలేదు.
ఓ ఎండ్‌లో తమీమ్ నిలకడగా ఆడినా.. రెండో ఎండ్‌లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. సౌమ్య సర్కార్ (15), షబ్బీర్ (15) కాసేపు పోరాడారు. గుగెటెన్ 3, వాన్ మీకెరెన్ 2 వికెట్లు తీశారు. తర్వాత నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 145 పరుగులకే పరిమితమైంది. బోరెన్ (29), మైబర్గ్ (29), కూపర్ (20) ఓ మాదిరిగా ఆడారు. చివరి 12 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన దశలో డచ్ ఆటగాళ్లు బుకారి (14), పీటర్ సీలర్ (7 నాటౌట్)లు ఒకే ఓవర్లో 16 పరుగులు రాబట్టారు. అయితే తస్కిన్ వేసిన ఆఖరి ఓవర్‌లో 8 పరుగులు మాత్రమే రావడంతో ఓటమి తప్పలేదు. అల్ అమిన్, షకీబ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తమీమ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.