బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. రంగ్‌పూర్ రైడర్స్, ఫార్చూన్ బారిషల్ మధ్య నిన్నటి రసవత్తర మ్యాచ్ అనంతరం తమీమ్ ఇక్బాల్ (ఫార్చూన్ బారిషల్ కెప్టెన్), అలెక్స్ హేల్స్ (రంగ్‌పూర్ రైడర్స్) కొట్టుకున్నంత పని చేశారు. మ్యాచ్ అనంతరం జరిగే హ్యాండ్ షేక్ ఈవెంట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లా మీడియా కథనాల మేరకు.. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునేందుకు ఎదురెదురుపడ్డాడు.
ఈ సందర్భంగా తమీమ్ ఇక్బాల్, హేల్స్ మధ్య మాటామాటా పెరిగింది. తొలుత హేల్స్ తమీమ్‌ను రెచ్చగొట్టాడు. తమీమ్‌కు షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు హేల్స్ అగౌరవంగా ప్రవర్తించాడు. హేల్స్ ప్రవర్తనను అవమానంగా భావించిన తమీమ్ తొలుత నిదానంగా సమాధానం చెప్పాడు. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావని తమీమ్ హేల్స్‌ను అడిగాడు. ఏదైనా చెప్పాలనుకుంటే ముఖం మీద చెప్పు. ఇలా ప్రవర్తించడం సరికాదు. మగాడిలా ప్రవర్తించు అని తమీమ్ హేల్స్‌తో అన్నాడు.
తమీమ్ తన అసంతృప్తిని వెలిబుచ్చుతుండగానే హేల్స్ ఏదో అన్నాడు. ఇందుకు చిర్రెతిపోయిన తమీమ్ సహనాన్ని కోల్పోయి హేల్స్ మీదకు వచ్చాడు. హేల్స్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇద్దరికి సర్ది చెప్పేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు ప్రయత్నించారు. గొడవ వద్దని వారు ఎంత వారిస్తున్నా తమీమ్, హేల్స్ ఒకరి మీదికి ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
అయితే ఈ గొడవపై హేల్స్ మరోలా స్పందించాడు. ఇందులో తన తప్పేమీ లేదని అన్నాడు. గొడవను తొలుత తమీమే స్టార్ట్ చేశాడని చెప్పాడు. షేక్ హ్యాండ్ ఇస్తున్న సందర్భంగా తమీమ్ తనను ఇంకా డ్రగ్స్ తీసుకుంటున్నావా అని అడిగాడు. డ్రగ్స్ కారణంగా నిషేధించబడినందుకు (ఇంగ్లండ్) సిగ్గుపడుతున్నావా అని అడిగాడు. ఇలా మాట్లాడుతూనే చాలా దరుసుగా ప్రవర్తించాడని హేల్స్ చెప్పుకొచ్చాడు.
కాగా, ఫార్చూన్ బారిషల్‌తో నిన్న జరిగిన రసవత్తర సమరంలో రంగ్‌పూర్ రైడర్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రంగ్‌పూర్ రైడర్స్ గెలుపుకు చివరి ఓవర్‌లో 26 పరుగులు అవసరమయ్యాయి. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కైల్ మేయర్స్ బంతిని అందుకోగా.. నురుల్ హసన్ స్ట్రయిక్ తీసుకున్నాడు.
తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన నురుల్.. ఆతర్వాత వరుసగా రెండు బౌండరీలు, ఓ సిక్సర్ మరో బౌండరీ బాదాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. నురుల్ మరో సిక్సర్ బాది రంగ్‌పూర్ రైడర్స్‌కు సంచలన విజయాన్నందించాడు. మొత్తంగా కైల్ మేయర్స్ వేసిన చివరి ఓవర్‌లో నురుల్ 30 పరగులు పిండుకున్నాడు. 198 పరుగుల లక్ష్య ఛేదనలో 7 బంతులు ఎదుర్కొన్న నురుల్ 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు (నాటౌట్) చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment