Alex Hales
-
తమీమ్ ఇక్బాల్, అలెక్స్ హేల్స్ మధ్య తీవ్ర వాగ్వాదం.. కొట్టుకున్నంత పని చేశారు..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. రంగ్‌పూర్ రైడర్స్, ఫార్చూన్ బారిషల్ మధ్య నిన్నటి రసవత్తర మ్యాచ్ అనంతరం తమీమ్ ఇక్బాల్ (ఫార్చూన్ బారిషల్ కెప్టెన్), అలెక్స్ హేల్స్ (రంగ్‌పూర్ రైడర్స్) కొట్టుకున్నంత పని చేశారు. మ్యాచ్ అనంతరం జరిగే హ్యాండ్ షేక్ ఈవెంట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లా మీడియా కథనాల మేరకు.. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునేందుకు ఎదురెదురుపడ్డాడు.ఈ సందర్భంగా తమీమ్ ఇక్బాల్, హేల్స్ మధ్య మాటామాటా పెరిగింది. తొలుత హేల్స్ తమీమ్‌ను రెచ్చగొట్టాడు. తమీమ్‌కు షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు హేల్స్ అగౌరవంగా ప్రవర్తించాడు. హేల్స్ ప్రవర్తనను అవమానంగా భావించిన తమీమ్ తొలుత నిదానంగా సమాధానం చెప్పాడు. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావని తమీమ్ హేల్స్‌ను అడిగాడు. ఏదైనా చెప్పాలనుకుంటే ముఖం మీద చెప్పు. ఇలా ప్రవర్తించడం సరికాదు. మగాడిలా ప్రవర్తించు అని తమీమ్ హేల్స్‌తో అన్నాడు.తమీమ్ తన అసంతృప్తిని వెలిబుచ్చుతుండగానే హేల్స్ ఏదో అన్నాడు. ఇందుకు చిర్రెతిపోయిన తమీమ్ సహనాన్ని కోల్పోయి హేల్స్ మీదకు వచ్చాడు. హేల్స్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇద్దరికి సర్ది చెప్పేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు ప్రయత్నించారు. గొడవ వద్దని వారు ఎంత వారిస్తున్నా తమీమ్, హేల్స్ ఒకరి మీదికి ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.అయితే ఈ గొడవపై హేల్స్ మరోలా స్పందించాడు. ఇందులో తన తప్పేమీ లేదని అన్నాడు. గొడవను తొలుత తమీమే స్టార్ట్ చేశాడని చెప్పాడు. షేక్ హ్యాండ్ ఇస్తున్న సందర్భంగా తమీమ్ తనను ఇంకా డ్రగ్స్ తీసుకుంటున్నావా అని అడిగాడు. డ్రగ్స్ కారణంగా నిషేధించబడినందుకు (ఇంగ్లండ్) సిగ్గుపడుతున్నావా అని అడిగాడు. ఇలా మాట్లాడుతూనే చాలా దరుసుగా ప్రవర్తించాడని హేల్స్ చెప్పుకొచ్చాడు.కాగా, ఫార్చూన్ బారిషల్‌తో నిన్న జరిగిన రసవత్తర సమరంలో రంగ్‌పూర్ రైడర్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రంగ్‌పూర్ రైడర్స్ గెలుపుకు చివరి ఓవర్లో 26 పరుగులు అవసరమయ్యాయి. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కైల్ మేయర్స్ బంతిని అందుకోగా.. నురుల్ హసన్ స్ట్రయిక్ తీసుకున్నాడు. తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన నురుల్.. ఆతర్వాత వరుసగా రెండు బౌండరీలు, ఓ సిక్సర్ మరో బౌండరీ బాదాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. నురుల్ మరో సిక్సర్ బాది రంగ్‌పూర్ రైడర్స్‌కు సంచలన విజయాన్నందించాడు. మొత్తంగా కైల్ మేయర్స్ వేసిన చివరి ఓవర్లో నురుల్ 30 పరగులు పిండుకున్నాడు. 198 పరుగుల లక్ష్య ఛేదనలో 7 బంతులు ఎదుర్కొన్న నురుల్ 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు (నాటౌట్) చేశాడు. -
అలెక్స్ హేల్స్ ఊచకోత
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు, రంగ్‌పూర్ రైడర్స్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిల్హెట్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (జనవరి 6) జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 56 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హేల్స్ శతక్కొట్టడంతో సిల్హెట్ స్ట్రయికర్స్పై రంగ్‌పూర్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిల్హెట్ స్ట్రయికర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రోనీ తాలుక్దార్ (32 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జకీర్ హసన్ (38 బంతుల్లో 50; 4 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. జార్జ్ మున్సే 18, పాల్ స్టిర్లింగ్ 16 పరుగులు చేసి ఔట్ కాగా.. ఆఖర్లో ఆరోన్ జోన్స్ (19 బంతుల్లో 38 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), జాకెర్ అలీ (5 బంతుల్లో 20 నాటౌట్; 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. రంగ్‌పూర్ రైడర్స్ బౌలర్లలో సైఫుద్దీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మెహిది హసన్, ఆకిఫ్ జావెద్ తలో వికెట్ దక్కించుకున్నారు.భారీ లక్ష్య ఛేదనకు దిగిన రంగ్‌పూర్ రైడర్స్ 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అలెక్స్ హేల్స్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. సైఫ్ హసన్ 49 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. రంగ్‌పూర్ రైడర్స్ బ్యాటర్లలో హకీమ్ తమీమ్ డకౌట్ కాగా.. ఇఫ్తికార్ అహ్మద్ 8 పరుగులు (నాటౌట్) చేశాడు. సిల్హెట్ స్ట్రయికర్స్ పేసర్ తంజిమ్ హసన్ సకీబ్‌కు రెండు వికెట్లు దక్కాయి.ఈ గెలుపుతో రంగ్‌పూర్ రైడర్స్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచినట్లైంది. పాయింట్ల పట్టికలో రంగ్‌పూర్ రైడర్స్ అగ్రస్థానంలో నిలిచింది. రెండింట రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఖుల్నా టైగర్స్ రెండో స్థానంలో ఉంది. చిట్టగాంగ్ కింగ్స్ (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం), ఫార్చూన్ బారిషల్ (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం), దర్బార్ రాజ్షాహి (3 మ్యాచ్‌ల్లో ఓ విజయం), సిల్హెట్ స్ట్రయికర్స్ (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు), ఢాకా క్యాపిటల్స్ (3 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలు) వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నాయి. -
అలెక్స్ హేల్స్ విధ్వంసం
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో గాలే మార్వెల్స్ నాలుగో విజయం సాధించింది. నిన్న (జులై 10) జరిగిన మ్యాచ్‌లో మార్వెల్స్.. క్యాండీ ఫాల్కన్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్ (43 బంతుల్లో 69; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), చండీమల్ (14 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (15 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రమేశ్ మెండిస్ (14 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మార్వెల్స్ బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 3, ప్రిటోరియస్ 2, ఉడాన, తీక్షణ, నదీశన్ తలో వికెట్ పడగొట్టారు.హేల్స్ విధ్వంసం188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మార్వెల్స్.. అలెక్స్ హేల్స్ (55 బంతుల్లో 86 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), భానుక రాజపక్స (26 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో 19.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మార్వెల్స్ ఇన్నింగ్స్‌లో డిక్వెల్లా 25, టిమ్ సీఫర్ట్ 16 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ మ్యాచ్‌లో ఫాల్కన్స్ ఏకంగా ఏడుగురు బౌలర్లను ప్రయోగించినా ఉపయోగం లేకుండా పోయింది. హసరంగ, ఫ్లెచర్ మాత్రం తలో వికెట్ దక్కించుకున్నారు. -
అలెక్స్ హేల్స్ మెరుపులు
లంక ప్రీమియర్ లీగ్ 2024లో గాలె మార్వెల్స్ ఆటగాడు అలెక్స్ హేల్స్ రెచ్చిపోయాడు. జాఫ్నా కింగ్స్‌తో నిన్న (జులై 2) జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్దసెంచరీతో (47 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటాడు. హేల్స్‌తో పాటు నిరోషన్ డిక్వెల్లా (27 బంతుల్లో 47; 8 ఫోర్లు, సిక్స్), జనిత్ లియనాగే (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్), జహూర్ ఖాన్ (4-0-24-3), ప్రిటోరియస్ (4-0-23-2), ఉడాన (4-0-60-2) రాణించడంతో మార్వెల్స్ 5 వికెట్ల తేడాతో జాఫ్నాపై విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా.. నిస్సంక (51), అవిష్క ఫెర్నాండో (59), అసలంక (33) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.అనంతరం 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మార్వెల్స్ చివరి బంతికి విజయం సాధించింది. మార్వెల్స్ గెలుపు చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా.. సహన్ బౌండరీ బాదాడు. జాఫ్నా బౌలర్లలో అశిత ఫెర్నాండో, ఫేబియన్ అలెన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ధనంజయ డిసిల్వ ఓ వికెట్ దక్కించుకున్నాడు.రాణించిన వెల్లలగే, షాదాబ్ ఖాన్నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో క్యాండీ ఫాల్కన్స్‌పై కొలొంబో స్ట్రయికర్స్ 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కొలొంబో.. సమరవిక్రమ (48), తిసార పెరీరా (38), ముహమ్మద్ వసీం (32) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. క్యాండీ బౌలర్లలో రజిత, హసరంగ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. షనక, చమీరా, అఘా సల్మాన్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాండీ.. దునిత్ వెల్లలగే (4/20). షాదాబ్ ఖాన్ (4/22) రెచ్చిపోవడంతో 15.5 ఓవర్లలో 147 పరుగులకే చాపచుట్టేసింది. క్యాండీ ఇన్నింగ్స్‌లో కేవలం నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. చండీమల్ (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
KKR Vs MI: సునీల్ నరైన్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు డకౌట్లగా వెనుదిరిగిన ప్లేయర్‌గా నరైన్ నిలిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌటైన నరైన్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో నరైన్ ఇప్పటివరకు 44 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఇంతకుముందు ఈ చెత్త రికార్డు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అలెక్స్ హెల్స్ పేరిట ఉండేది. హెల్స్ 43 సార్లు డకౌటయ్యాడు. తాజా మ్యాచ్‌తో హెల్స్‌ను నరైన్ అధిగమించాడు. అదే విధంగా ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన రెండో ఆటగాడిగా పియూష్ చావ్లా సరసన సునీల్ నరైన్ నిలిచాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 16 సార్లు ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ డకౌటయ్యాడు. దీంతో పాటు మరో రికార్డును కూడా నరైన్ తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్( అంతర్జాతీయ, లీగ్‌లు)లో 550 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా సునీల్ నరైన్ నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 625 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ 574 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. -
రెచ్చిపోయిన రసెల్.. 17 బంతుల్లో 6 సిక్సర్లు, అయినా ఓడిన నైట్‌రైడర్స్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ శివాలెత్తిపోయాడు. ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే ఏకంగా 6 సిక్సర్లు కొట్టి 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయినా ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ ఓటమిపాలైంది. రసెల్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రసెల్‌తో పాటు జో క్లార్క్ (21), మైఖేల్ పెప్పర్ (38), అలీషాన్ షరాఫు (37), సామ్ హెయిన్ (40) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. ఎమిరేట్స్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ 3 వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్, వకార్ సలామ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఎంఐ ఎమిరేట్స్ మరో ఓవర్ మిగిలుండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు కుశాల్ పెరీరా (27 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ముహమ్మద్ వసీం (61 బంతుల్లో 87 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో ఎమిరేట్స్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆఖర్లో ఎమిరేట్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ సైతం విరుచుకుపడ్డాడు. పూరన్ కేవలం 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేసి ఔటయ్యాడు. ముహమ్మద్ వసీం.. టిమ్ డేవిడ్ (10) సాయంతో ఎమిరేట్స్‌ను గెలిపించాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో డేవిడ్ విల్లే, అలీ ఖాన్లకు తలో వికెట్ దక్కింది. అలెక్స్ హేల్స్ మెరుపు ఇన్నింగ్స్ వృధా.. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో డెజర్ట్ వైపర్స్‌పై షార్జా వారియర్స్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన వైపర్స్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు కెప్టెన్ టామ్ కోహ్లెర్ కాడ్మోర్ (68) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వైపర్స్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ హేల్స్ (61) అర్దసెంచరీతో రాణించాడు. వారియర్స్ బౌలర్లు క్రిస్ వోక్స్ (2/26), డేనియల్ సామ్స్ (2/29) వైపర్స్ పతనాన్ని శాశించాడు. -
అలెక్స్ హేల్స్ విధ్వంసకర శతకం.. రోహిత్, రాహుల్ రికార్డు సమం
ఇంగ్లండ్ మాజీ ఆటగాడు అలెక్స్ హేల్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్-2023లో విధ్వంసం సృష్టించాడు. సెయింట్ లూసియా కింగ్స్‌తో నిన్న (సెప్టెంబర్ 17) జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో (57 బంతుల్లో 119 నాటౌట్; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న జమైకా తల్లావాస్ 122 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తల్లావాస్.. హేల్స్ శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆఖర్లో కెప్టెన్ ఇమాద్ వసీం (24 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో తల్లావాస్ 200 పరుగుల మార్కును తాకింది. వీరిద్దరు మినహా తల్లావాస్ ఇన్నింగ్స్‌లో అంతా విఫలమయ్యారు. కిర్క్ మెకెంజీ 3, స్టీవెన్ టేలర్ 14, షమార్ బూక్స్ 13, ఫేబియన్ అలెన్ ఒక్క పరుగు చేసి నిరాశపరిచారు. లూసియా కింగ్స్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 2, అల్జరీ జోసఫ్, మాథ్యూ ఫోర్డ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్.. క్రిస్ గ్రీన్ (4-0-15-4), మహ్మద్ అమీర్ (2-0-7-2), ఇమాద్ వసీం (4-1-24-2), హేడెన్ వాల్ష్ (4-0-17-1) ధాటికి 15 ఓవర్లలో 79 పరుగులకు కుప్పకూలింది. లూసియా కింగ్స్ ఇన్నింగ్స్‌లో భానుక రాజపక్ష (22), అల్జరీ జోసఫ్ (10), మాథ్యూ ఫోర్డ్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్లు రోస్టన్ ఛేజ్ 5, సీన్ విలియమ్స్ 0, సికందర్ రజా 3, కొలిన్ మున్రో 4 నిరాశపరిచారు. రోహిత్, రాహుల్ రికార్డు సమం చేసిన అలెక్స్ హేల్స్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కిన హేల్స్ తన టీ20 కెరీర్లో 6వ శతకాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో అతను టీ20ల్లో అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. టీ20ల్లో హేల్స్‌తో పాటు టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, డికాక్, రిలీ రొస్సో, మార్టిన్ గప్తిల్, జేసన్ రాయ్, షేన్ వాట్సన్, జోస్ బట్లర్లు ఆరు సెంచరీలు చేశారు. ఈ జాబితాలో క్రిస్ గేల్ 22 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 10 శతకాలతో రెండో స్థానంలో, క్లింగర్, వార్నర్, కోహ్లి, ఫించ్ 8 శతకాలతో మూడో స్థానంలో, లూక్ రైట్, బ్రెండన్ మెక్కల్లమ్ 7 సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నారు. బౌండరీల విషయంలో ఎవరికీ అందనంత ఎత్తులో.. టీ20ల్లో అత్యధిక బౌండరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అలెక్స్ హేల్స్ టాప్‌లో ఉన్నాడు. హేల్స్ 416 మ్యాచ్‌ల్లో 1285 బౌండరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. హేల్స్ తర్వాత వార్నర్ 1180 ఫోర్లతో రెండో స్థానంలో ఉండగా.. గేల్ 1132 ఫోర్లతో మూడో ప్లేస్‌లో, ధవన్ (1090) నాలుగులో, ఫించ్ (1089) ఐదులో, జేమ్స్ విన్స్ (1069) ఆరులో, విరాట్ కోహ్లి (1069) ఏడో స్థానంలో ఉన్నారు. -
చెలరేగిన కొలిన్ మున్రో.. చేతులెత్తేసిన మలాన్, హేల్స్, రూట్
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా వెల్ష్ ఫైర్‌తో నిన్న (ఆగస్ట్ 14) జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్ రాకెట్స్ 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్.. కొలిన్ మున్రో మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. మున్రో మినహా రాకెట్స్ ఇన్నింగ్స్‌లో అంతా విఫలమయ్యారు. రాకెట్స్ టీమ్‌లో డేవిడ్ మలాన్ (10), అలెక్స్ హేల్స్ (4), జో రూట్ (14), డేనియల్ సామ్స్ (17) లాంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నా ఆ జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. వెల్ష్ ఫైర్ బౌలర్లలో డేవిడ్ విల్లే, జేక్ బాల్, వాన్ డర్ మెర్వ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. రాణించిన జో క్లార్క్.. 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెల్ష్‌ఫైర్.. 6 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జో క్లార్క్ (54), కెప్టెన్ టామ్ ఎబెల్ (32) వెల్ష్ఫైర్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వెల్ష్ ఫైర్ స్టార్ ఆటగాళ్లు జానీ బెయిర్‌స్టో (9 బంతుల్లో 3), గ్లెన్ ఫిలప్స్ (12) విఫలమయ్యారు. స్టెఫెన్ ఎస్కినాజీ (25) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. రాకెట్స్ బౌలర్లలో డేనియల్ సామ్స్ 2, జాన్ టర్నర్, ఐష్ సోధి తలో వికెట్ పడగొట్టారు. -
ఇంగ్లండ్ క్రికెట్లో మరో వికెట్ డౌన్.. నెల రోజుల వ్యవధిలో నాలుగో ఆటగాడు
ఇంగ్లండ్ క్రికెట్లో మరో వికెట్ పడింది. నెల రోజుల వ్యవధిలో నాలుగో ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్ సిరీస్-2023 సందర్భంగా తొలుత స్టువర్ట్ బ్రాడ్, ఆతర్వాత మొయిన్ అలీ, కొద్ది రోజుల గ్యాప్‌లో ఇంగ్లండ్ టీ20 వరల్డ్‌కప్ విన్నర్ అలెక్స్ హేల్స్, తాజాగా త్రీ టైమ్ యాషెస్ సిరీస్ విన్నర్, బ్రాడ్ సహచరుడు, ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2010లో అంతర్జతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఫిన్.. 2017 వరకు ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. ఈ మధ్య కాలంలో అతను మూడు సార్లు యాషెస్ సిరీస్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. గతకొంతకాలంగా మోకాలి గాయంతో బాధ పడుతున్న ఫిన్.. తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిన్ ఓ స్టేట్మెంట్ ద్వారా వెల్లడించాడు. గత ఏడాది కాలంగా మోకాలి గాయం బాధిస్తుందని, గాయంతో పోరాటంలో తాను ఓడిపోయానని, తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నానని ఫిన్ తన స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. 2005లో మిడిల్సెక్స్ తరఫున కెరీర్‌ను ప్రారంభించిన ఫిన్.. 2010-16 మధ్యలో ఇంగ్లండ్ తరఫున 36 టెస్ట్‌లు ఆడి 125 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. 2011లో వన్డే అరంగ్రేటం చేసిన ఫిన్ 69 వన్డేల్లో 102 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. 2011-15 మధ్యలో 21 టీ20 ఆడిన ఫిన్ 27 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్‌ల్లో ఫిన్ ఓ హాఫ్ సెంచరీ కూడా చేశాడు. కౌంటీల్లో 2005 నుంచి 2022 వరకు మిడిల్‌సెక్స్‌కు ఆడిన ఫిన్.. ఆతర్వాత ససెక్స్‌ను మారాడు. ససెక్స్ తరఫున ఫిన్ కేవలం 19 మ్యాచ్‌లే ఆడాడు. ససెక్స్‌కు ఆడుతుండగానే మోకాలి గాయం బారిన పడిన 34 ఏళ్ల ఫిన్, కెరీర్‌ను కొనసాగించలేక రిటైర్మెంట్ ప్రకటించాడు. -
చెలరేగిన డేవిడ్ వీస్.. తుస్సుమన్న విధ్వంసకర వీరులు
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా ట్రెంట్ రాకెట్స్‌తో నిన్న (ఆగస్ట్ 9) జరిగిన మ్యాచ్‌లో నార్త్ర్న్ సూపర్ ఛార్జర్స్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ చెలరేగిపోయాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన అర్ధశతకం సాధించాడు. అతనికి బ్రైడన్ కార్స్ (29 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), సైఫ్ జైబ్ (21 బంతుల్లో 21; ఫోర్), ఆడమ్ హోస్ (17 బంతుల్లో 18; 3 ఫోర్లు) జత కలవడంతో సూపర్ ఛార్జర్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. Luke Wood's first 10 balls were something else! 🚀#TheHundred pic.twitter.com/SZWNvcn26V — The Hundred (@thehundred) August 10, 2023 నిప్పులు చెరిగిన లూక్ వుడ్.. సూపర్ ఛార్జర్స్ హిట్టర్లు టామ్ బాంటన్ (0), మాథ్యూ షార్ట్ (8), హ్యారీ బ్రూక్ (0).. రాకెట్స్ పేసర్ లూక్ వుడ్ ధాటికి వణికిపోయారు. తొలి 6 బంతుల్లోనే వీరు ముగ్గురు పెవిలియన్‌కు చేరారు. వుడ్ ఈ ముగ్గురిని క్లీన్ బౌల్డ్ చేశాడు. వుడ్ 20 బంతుల్లో 23 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొడితే.. జో రూట్ 20 బంతుల్లో 24 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. David Wiese 🤝 powerful hitting Insane crowd catch incoming... #TheHundred pic.twitter.com/Gn2MWUNyNW — The Hundred (@thehundred) August 9, 2023 తుస్సుమన్న విధ్వంసకర వీరులు.. అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాకెట్స్.. నిర్ణీత బంతుల్లో 139 పరుగులు చేసి 3 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. విధ్వంసకర వీరులైన రాకెట్స్ బ్యాటర్లు అలెక్స్ హేల్స్ (29), డేవిడ్ మలాన్ (6), కొలిన్ మున్రో (15), టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (15), జో రూట్ (4), సామ్ హెయిన్ (20), డేనియల్ సామ్స్ (27).. సూపర్ ఛార్జర్స్ బౌలర్లు వేన్ పార్నెల్ (3/21), రీస్ టాప్లే (2/20), కల్లమ్ పార్కిన్సన్ (2/29) ధాటికి తేలిపోయారు. ప్రపంచ క్రికెట్లో విధ్వంసకర వీరులుగా పేరున్న రాకెట్స్ బ్యాటర్లు.. సూపర్ ఛార్జర్స్ నిర్ధేశించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలయ్యారు. 🚨JOE ROOT STRIKES FOR THE TRENT ROCKETS 🚨#TheHundred pic.twitter.com/JVcWq6nSeZ — The Hundred (@thehundred) August 9, 2023 -
ఇంగ్లండ్ విధ్వంసకర ప్లేయర్ సంచలన నిర్ణయం
ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ అలెక్స్ హేల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 కెరీర్ పీక్స్‌లో ఉండగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు. తన రిటైర్మెంట్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ టీ20 వరల్డ్‌కప్-2022 గెలవడంలో కీలకపాత్ర పోషించిన హేల్స్ ఆ టోర్నీలో 6 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీ సాయంతో 212 పరుగులు చేశాడు. హేల్స్ అంతర్జాతీయ కెరీర్లో పాక్‌తో చివరి మ్యాచ్ (వరల్డ్‌కప్ ఫైనల్) ఆడాడు. ఆ మ్యాచ్‌లో హేల్స్ (1) విఫలమైనప్పటికీ ఇంగ్లండ్ చిరస్మరణీయ విజయం సాధించి జగజ్జేతగా ఆవిర్భవించింది. అదే టోర్నీలో భారత్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో హేల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగి 47 బంతుల్లో 86 పరుగులు చేశాడు. అంతకుముందు శ్రీలంక (47), న్యూజిలాండ్ (52)లతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌ల్లోనూ హేల్స్ చెలరేగిపోయాడు. కెరీర్లో 11 టెస్ట్‌లు, 70 వన్డేలు, 75 టీ20లు ఆడిన హేల్స్ 7 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5000కు పైగా పరుగులు చేశాడు. -
అలెక్స్ హేల్స్ ఊచకోత.. పరుగు తేడాతో సెంచరీ మిస్
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (దుబాయ్) 2023లో ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్, డెసర్ట్ వైపర్స్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీలు, సెంచరీ సాయంతో 356 పరుగులు (33 ఫోర్లు, 15 సిక్సర్లు) చేసిన హేల్స్.. ఇవాళ (జనవరి 22) గల్ఫ్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 57 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి కేవలం పరుగు తేడాతో లీగ్‌లో రెండో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. On 99 tried to hit a six and got out!@AlexHales1 🫡pic.twitter.com/6PDOPghAUl — CricTracker (@Cricketracker) January 22, 2023 హేల్స్ ఊచకోత ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహన్ ముస్తఫా (16 బంతుల్లో 23; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ కొలిన్ మున్రో (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షెఫానీ రూథర్‌ఫోర్ట్ (15 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించారు. గల్ఫ్ జెయింట్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్, లియామ్ డాసన్, డేవిడ్ వీస్, క్రిస్ జోర్డాన్ తలో వికెట్ పడగొట్టారు. Alex Hales at his best in the ILT20! His lowest score in the tournament so far is 64 🤯#AlexHales #England #DesertVipers #DPWorldILT20 #CricTracker pic.twitter.com/dENrWohDt7— CricTracker (@Cricketracker) January 22, 2023 అనంతరం 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన గల్ఫ్ టీమ్.. 3.3 ఓవర్ల తర్వాత 2 వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసి పోరాడుతుంది. ఓపెనర్లు టామ్ బాంటన్ (3), జేమ్స్ విన్స్ (4) విఫలమయ్యారు. క్రిస్ లిన్ (22), రెహాన్ అహ్మద్ క్రీజ్‌లో ఉన్నారు. బాంటన్ వికెట్ టామ్ కర్రన్ పడగొట్టగా.. విన్స్‌ను కాట్రెల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కాగా, తొట్ట తొలి ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో అలెక్స్ హేల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. లీగ్ తొలి మ్యాచ్‌లో షార్జా వారియర్స్‌పై 52 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 నాటౌట్ పరుగులు చేసిన హేల్స్.. ఆతర్వాత అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్ సాయంతో 64 పరుగులు, ఆ వెంటనే అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో 59 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేశాడు. తాజాగా గల్ఫ్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ చెలరేగిన హేల్స్ పరుగు తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈ లీగ్‌లో తొలి సెంచరీ హేల్స్ పేరిటే నమోదై ఉంది. రెండో సెంచరీ ఇంగ్లండ్‌కే చెందిన టామ్ కోహ్లెర్ కాడ్మోర్ (షార్జా వారియర్స్) బాదాడు. దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టామ్ (షార్జా వారియర్స్) 47 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 నాటౌట్ పరుగులు చేశాడు. -
రూట్ మెరుపు ఇన్నింగ్స్ వృధా.. శతక్కొట్టి గెలిపించిన ప్రత్యర్ధి బ్యాటర్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో వరుసగా రెండు రోజుల్లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. నిన్న (జనవరి 20) అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెసర్ట్ వైపర్స్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ (59 బంతుల్లో 110; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ బాదగా.. ఇవాళ (జనవరి 21) దుబాయ్ క్యాపిటల్స్‌పై షార్జా వారియర్స్ ఓపెనర్ టామ్ కోహ్లెర్ కాడ్మోర్ (47 బంతుల్లో 106 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కాడ్మోర్ సుడిగాలి శతకంతో ఊగిపోవడంతో క్యాపిటల్స్ నిర్ధేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని వారియర్స్ కేవలం 14.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదేసింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాడ్మోర్, జో డెన్లీ (17 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) వారియర్స్‌ను విజయతీరాలకు చేర్చారు. క్యాపిటల్స్ బౌలర్లలో అకీఫ్ రజా 2 వికెట్లు పడగొట్టగా.. చమిక కరుణరత్నేకు ఓ వికెట్ దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ జో రూట్ (54 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ధశతకంతో, లారెన్స్ (38 బంతుల్లో 34; 2 ఫోర్లు, సిక్స్), రోవమన్ పావెల్ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. వారియర్స్ బౌలర్లలో క్రిస్ వోక్స్, నవీన్ ఉల్ హాక్ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో టామ్ కోహ్లెర్ కాడ్మోర్ బాదిన శతకం రెండోది కాగా, అంతకుముందు మ్యాచ్‌లో అలెక్స్ హేల్స్ చేసినది లీగ్‌లో తొట్టతొలి సెంచరీ కావడం విశేషం. -
ఎలిమినేటర్ మ్యాచ్.. గల్లీ క్రికెట్‌లా ఈ ఆటలేంటి!
మనం చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ముందు బ్యాటింగ్ ఎవరు రావాలనే దానిపై వివిధ పద్దతులు ఆచరించేవాళ్లం. ఒక పిల్లాడు వంగితే.. వాడి వీపుపై చేతులతో సంఖ్యలను చెబుతూ ఏ స్థానంలో ఎవరు ఆడాలనేది నిర్ణయించేవారు. మరికొంతమంది పచ్చాలు వేసేవారు. ఇదంతా గల్లీ క్రికెట్ కాబట్టి మస్తు ఎంజాయ్‌గా అనిపించేది. కానీ ఇదే తీరు ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో జరిగితే ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా అబుదాబి టి10 లీగ్‌లో భాగంగా టీమ్ అబుదాబి జట్టు ఓపెనర్లు అలెక్స్ హేల్స్, క్రిస్ లిన్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇద్దరిలో ఎవరు స్ట్రైక్ తీసుకోవాలనిదానిపై చిన్న గేమ్ ఆడారు. ఆ గేమ్ పేరు రాక్-పేపర్-సిసర్స్. ఈ గేమ్‌లో గెలిచిన హేల్స్ స్ట్రైక్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు అభిమానులు.. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గల్లీ క్రికెట్‌లా ఆటలేంటి అంటూ ఫన్నీ కామెంట్స్ చేవారు. ఆ తర్వాత ఒక్క పరుగు మాత్రమే చేసిన హేల్స్ సుల్తాన్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డెక్కన్ గ్లాడియేటర్స్ టీమ్ అబుదాబిని 5 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ గ్లాడియేటర్స్ 10 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. ఓడియన్ స్మిత్ 32 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమ్ అబుదాబి 10 ఓవర్లలో వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. జేమ్స్ విన్స్ 21 పరుగులు చేశాడు. క్వాలిఫయర్-2లో మోరిస్విల్లే సాంప్ ఆర్మీతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచిన డెక్కన్ గ్లాడియేటర్స్ ఫైనల్‌కు చేరుకుంది. ఇక డిసెంబర్ 4న(ఆదివారం) న్యూయార్క్ స్ట్రైకర్స్‌తో ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. pic.twitter.com/HC34HqTkbQ — Hassam (@Nasha_e_cricket) December 3, 2022 చదవండి: దిగ్గజం పీలే పరిస్థితి అత్యంత విషమం.. -
IPL 2023: సన్‌రైజర్స్‌లోకి బెన్ స్టోక్స్.. కెప్టెన్ కూడా అతడే..?
ఐపీఎల్-2023 సీజన్ మినీ వేలానికి (డిసెంబర్ 23) రోజులు దగ్గర పడుతున్న కొద్దీ.. కొత్తగా వేలం బరిలో నిలిచే విదేశీ స్టార్ ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీలు చేజిక్కించుకుంటాయోనన్న టెన్షన్ అభిమానుల్లో మొదలైంది. పలానా ఆటగాడిని పలానా ఫ్రాంచైజీ దక్కించుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఇప్పటినుంచే అంచనాల్లో మునిగితేలుతున్నారు. వేలానికి ఇంకా నెల రోజుల సమయం ఉనప్పటికీ.. తమతమ ఫేవరెట్ జట్లు ఇలా ఉంటే బాగుంటుందని లెక్కలేసుకుంటున్నారు. ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్-2022 స్టార్లు సామ్ కర్రన్, బెన్ స్టోక్స్, అలెక్స్ హేల్స్, ఆదిల్ రషీద్, సికందర్ రాజా, కెమరూన్ గ్రీన్ తమతమ జట్లలో ఉండాలని అన్ని ఫ్రాంచైజీలు, సంబంధిత జట్ల అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆయా ఫ్రాంచైజీల పర్స్ల్లో ఉన్న బ్యాలెన్స్ లెక్కలను బేరీజు వేసుకుని పై పేర్కొన్న ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే, 10 ఫ్రాంచైజీల్లో ఎక్కువ పర్స్ బ్యాలెన్స్ ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (42.25 కోట్లు)కు ఎక్కువ మంది స్టార్ ఆటగాళ్లను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న బ్యాలెన్స్ ప్రకారం.. బెన్ స్టోక్స్, అలెక్స్ హేల్స్, కెమరూన్ గ్రీన్‌లను చేజిక్కించుకునేందుకు ఎందాకైనా వెళ్లే ఛాన్స్ ఉంది. వీరిలో స్టోక్స్‌కు 10 నుంచి 12 కోట్లు ఖర్చు చేసినా.. హేల్స్‌కు 3 నుంచి 4 కోట్లు, గ్రీన్‌కు 6 నుంచి 8 కోట్లు వెచ్చించినా ఆ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా బ్యాలెన్స్ మిగిలే ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం సన్‌రైజర్స్.. స్టోక్స్‌పై ఎంతైనా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అందులోనూ ఆ జట్టు.. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వదిలించుకోవడంతో స్టోక్స్‌ను ఎలాగైనా దక్కించుకుని, కెప్టెన్సీ పగ్గాలు కూడా అప్పజెప్పే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్ట్: ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కో జన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టి నటరాజన్, ఫజల్ హక్ ఫారూఖీ. సన్‌రైజర్స్ విడిచిపెట్టిన ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్ ప్రస్తుతానికి ఆయా ఫ్రాంచైజీల పర్స్‌లో ఉన్న బ్యాలెన్స్ వివరాలు.. సన్‌రైజర్స్ హైదరాబాద్- 42.25 కోట్లు పంజాబ్ కింగ్స్-32.20 కోట్లు లక్నో సూపర్ జెయింట్స్-23.35 కోట్లు ముంబై ఇండియన్స్-20.55 కోట్లు చెన్నై సూపర్‌కింగ్స్-20.45కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్-19.45 కోట్లు గుజరాత్ టైటాన్స్-19.25 కోట్లు రాజస్థాన్ రాయల్స్-13.20 కోట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-8.75 కోట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్-7.05 కోట్లు -
సూర్య అగ్రస్థానం పదిలం.. 22 స్థానాలు ఎగబాకిన అలెక్స్ హేల్స్
ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ అలెక్స్ హేల్స్ ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో హేల్స్ ఏకంగా 22 స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకున్నాడు. టి20 ప్రపంచకప్‌లో టీమిండియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో అలెక్స్ హేల్స్ 47 బంతుల్లోనే 86 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అతని ధాటికి టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ ప్రపంచకప్‌లో అలెక్స్ హేల్స్ 212పరుగులు సాధించి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇక టీమిండియా సంచలనం సూర్యకుమార్ యాదవ్ మాత్రం నెంబర్‌వన్ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. టి20 ప్రపంచకప్‌లో 239 పరుగులు చేసిన సూర్యకుమార్ టోర్నీలో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌గా ఉన్న సూర్యకుమార్ ఖాతాలో 859 పాయింట్లు ఉన్నాయి. ఇక ఆ తర్వాత పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 836 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం 778 పాయింట్లతో మూడోస్థానానికి చేరుకోగా.. ఒక స్థానం పడిపోయిన న్యూజిలాండ్ బ్యాటర్ డెవన్ కాన్వే 771 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా మార్ర్కమ్, డేవిడ్ మలాన్, రిలీ రొసౌ, గ్లెన్ ఫిలిప్స్, ఆరోన్ ఫించ్, పాతుమ్ నిస్సాంకలు ఉన్నారు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే ఇంగ్లండ్ బౌలర్లు ఆదిల్ రషీద్, సామ్ కరన్‌లు ముందంజ వేశారు. టి20 ప్రపంచకప్‌లో టీమిండియాతో సెమీఫైనల్, పాకిస్తాన్‌తో ఫైనల్లో మంచి ప్రదర్శన కనబరిచిన రషీద్ ఐదు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలవగా.. ఆల్‌రౌండర్ సామ్ కరన్ రెండు స్థానాలు ఎగబాకి టాప్-5కి చేరుకున్నాడు. ఇక లంక స్పిన్నర్ వనిందు హసరంగా 704 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆఫ్గన్ బౌలర్ రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. Top #T20WorldCup performers biggest gainers in the latest @MRFWorldwide ICC Men’s T20I Player Rankings. Details 👇https://t.co/MKEWVUpZCs — ICC (@ICC) November 16, 2022 చదవండి: అశ్విన్ విషయంలో రాజస్తాన్ రాయల్స్ దిమ్మతిరిగే కౌంటర్ -
WC 2022 Final Pak Vs Eng: పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ గెలిచిన ఇంగ్లండ్
ICC Mens T20 World Cup 2022- Final Pakistan vs England Updates In Telugu: ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. ఐదో వికెట్ డౌన్ 18.2: మొయిన్ అలీ బౌల్డ్ విజయానికి చేరువలో ఇంగ్లండ్ 16 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 110/4 ►విజయానికి 24 బంతుల్లో 28 పరుగులు కావాలి. కట్టడి చేస్తున్న పాక్ బౌలర్లు ►11వ ఓవర్లో 2, 12వ ఓవర్లో 3, 13వ ఓవర్లో 5, 14వ ఓవర్లో 2 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్ నాలుగో వికెట్ డౌన్ 12.3: షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో ఆఫ్రిదికి క్యాచ్ ఇచ్చి హ్యారీ బ్రూక్ (20) అవుట్ 12 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు- 82/3 10 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 77/3 ►విజయం కోసం 60 బంతుల్లో 61 పరుగులు కావాలి. ఆచితూచి ఆడుతున్న స్టోక్స్, బ్రూక్ ►స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగి పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో.. ఇంగ్లండ్ బ్యాటర్లు స్టోక్స్(11), బ్రూక్(12) ఆచితూచి ఆడుతున్నారు. 9 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 69-3 పవర్ ప్లేలో ఇంగ్లండ్ స్కోరు: 49-3 హ్యారీ బ్రూక్ 4, బెన్ స్టోక్స్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఇప్పటి వరకు షాహీన్ ఆఫ్రిదికి ఒక వికెట్, హ్యారీస్ రవూఫ్‌నకు రెండు వికెట్లు దక్కాయి. ఇంగ్లండ్‌కు భారీ షాక్ 5.3: హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో బట్లర్ అవుట్. 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మూడో వికెట్‌గా నిష్క్రమించిన ఇంగ్లండ్ కెప్టెన్. క్రీజులో హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ 5 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 43/2 జోస్ బట్లర్ 26, స్టోక్స్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 3.3: రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ ఫిలిప్ సాల్ట్ అవుట్ ఆదిలోనే ఇంగ్లండ్‌కు షాక్ అలెక్స్ హేల్స్‌ను అవుట్ చేసిన షాహీన్ ఆఫ్రిది ఇంగ్లండ్ బౌలర్ల దాటికి పాకిస్తాన్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఏడో వికెట్ డౌన్ 18.3: సామ్ కర్రన్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన నవాజ్(5). షాహీన్ ఆఫ్రిది, వసీం జూనియర్ క్రీజులో ఉన్నారు. షాదాబ్ అవుట్ 17.2: జోర్డాన్ బౌలింగ్‌లో షాదాబ్ ఖాన్ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. నవాజ్, మహ్మద్ వసీం జూనియర్ క్రీజులో ఉన్నారు. ఐదో వికెట్ డౌన్ ►16.3: సామ్ కర్రన్ బౌలింగ్‌లో అవుటైన షాన్ మసూద్. ►క్రీజులో మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ 15 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు:106/4 షాదాబ్ ఖాన్ 10, షాన్ మసూద్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్‌కు దెబ్బ మీద దెబ్బ ►12.2: స్టోక్స్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగిన ఇఫ్తీకర్ అహ్మద్. ►క్రీజులో షాదాబ్ ఖాన్, షాన్ మసూద్ ►12 ఓవర్లలో పాక్ స్కోరు: 84-3 బాబర్ ఆజం అవుట్ ►11.1: ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం(32). దీంతో మూడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్. ►క్రీజులో షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్ 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి పాకిస్తాన్ స్కోరు: 68 9 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు: 59-2 ►బాబర్ ఆజం 27, షాన్ మసూద్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన పాక్ ►7.1: ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి మహ్మద్ హారీస్(8) అవుట్. పాక్ స్కోరు. 45/2 పవర్ ప్లేలో పాక్ స్కోరు ►6 ఓవర్లలో వికెట్ నష్టానికి 39 పరుగులు చేసిన పాక్. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రన్‌కు ఒక వికెట్. తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ ►4.2: సామ్ కర్రన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(14 బంతుల్లో 15 పరుగులు). బాబర్ ఆజం, మహ్మద్ హారీస్ క్రీజులో ఉన్నారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న ఇంగ్లండ్ ►4 ఓవర్లలో పాక్ స్కోరు: 28-0 ►బాబర్, రిజ్వాన్ క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్లో పాక్ స్కోరు: 8-0 ►0.4- రనౌట్ నుంచి తప్పించుకున్న మహ్మద్ రిజ్వాన్ ►పాక్ ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ క్రీజులో ఉన్నారు. ► ఇంగ్లండ్ బౌలింగ్ అటాక్ ఆరంభించిన బెన్ స్టోక్స్ ►టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్లు ►ఇంగ్లండ్ జోస్ బట్లర్(వికెట్ కీపర్/ కెప్టెన్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్ ►పాకిస్తాన్ బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది నువ్వా- నేనా టీ20 ప్రపంచకప్-2022 తుది పోరుకు ఇంగ్లండ్- పాకిస్తాన్ సన్నద్ధమయ్యాయి. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆదివారం ఫైనల్లో ఇరు జట్లు తలపడనున్నాయి. గ్రూప్-1 నుంచి ఫైనల్‌కు చేరిన బట్లర్ బృందం.. గ్రూప్- 2 నుంచి తమతో పోటీకి వచ్చిన బాబర్ టీమ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
T20 WC 2022 Final: హేల్స్ రెచ్చిపోతే.. పాక్ వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు..!
ఇంగ్లండ్-పాకిస్తాన్ జట్ల మధ్య రేపు (నవంబర్ 13) జరిగే టీ20 వరల్డ్‌కప్-2022 అంతిమ సమరంలో గెలుపు కోసం ఇరు జట్లు సర్వ శక్తులు ఓడ్డనున్నాయి. హోరాహోరీగా సాగుతుందని భావిస్తున్న ఫైనల్లో దాయాది పాక్ సెంటిమెంట్లను నమ్ముకుంటే.. ఇంగ్లండ్ మాత్రం ప్రతిభపైనే ఆధాపడింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో అదృష్టం కొద్దీ ఫైనల్ దాకా వచ్చిన పాక్.. 1992 వన్డే వరల్డ్‌కప్ సీన్ రిపీట్ అవుతుందని ధీమా ఉంటే, ఇంగ్లండ్.. పాక్ అంచనాలను తల్లకిందులు చేసేందుకు సమాయత్తమవుతుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లో నాసిరకమైన ప్రదర్శనతో నెట్టుకొచ్చిన పాక్.. ఫైనల్లోనూ అదే ప్రదర్శన కొనసాగిస్తే ఒట్టి చేతులు ఊపుకుంటూ ఇంటి దారి పట్టాల్సింది వస్తుందని విశ్లేకులు అంచనా వేస్తున్నారు. మరోపక్క, ఇంగ్లండ్.. ప్రస్తుత టోర్నీలో సూపర్ ఫామ్‌లో ఉంది. ఒక్క ఐర్లాండ్ చేతిలో పరాభవం తప్పించి, దాదాపు అన్ని మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ఆట ఆడింది. అన్ని విభాగాల్లో ప్రపంచ స్థాయి జట్టుకు ఏమాత్రం తీసిపోకుండా రాణించింది. ఇదే ఫామ్‌ను బట్లర్ సేన టైటిల్ పోరులోనూ కొనసాగిస్తే.. పాక్ పరాజయాన్ని అడ్డుకోవడం దాదాపుగా ఆసాధ్యమేనని చెప్పాలి. ముఖ్యంగా భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అలెక్స్ హేల్స్ మరోసారి చెలరేగితే పాక్ వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ టోర్నీలో నాలుగు ప్రధాన జట్లైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, భారత్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో హేల్స్.. 84, 52, 47, 86 నాటౌట్ పరుగులు సాధించి భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు భారత్‌తో జరిగిన సెమీస్‌లో గాయం కారణంగా జట్టుకు దూరమైన మార్క్ వుడ్ ఫైనల్ మ్యాచ్‌లో తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఇంగ్లండ్ బౌలింగ్‌లో మరింత పటిష్టంగా మారుతుంది. మొత్తంగా ఇరు జట్ల బలాబలాలను పోలిస్తే.. పాక్‌పై ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని చెప్పాలి. చదవండి: ఫైనల్లో ఇంగ్లండ్‌పై పాక్ గెలిస్తే, బాబర్ ఆజమ్ ప్రధాని అవుతాడు..! -
కాలం ఒకేలా ఉండదు.. తిట్టినోడే చప్పట్లతో మెచ్చుకున్నాడు
''ఎక్కడ పారేసుకున్నావో.. అక్కడే వెతుకు కచ్చితంగా దొరుకుతుంది'' అని మన పెద్దలు అనడం వింటూనే ఉంటాం. ఈ సారాంశం ఇంగ్లండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్‌కు సరిగ్గా సరిపోతుంది. టి20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం టీమిండియాతో జరిగిన కీలక సెమీఫైనల్లో కెప్టెన్ బట్లర్‌తో కలిసి విధ్వంసం సృష్టించాడు. 86 పరుగులు నాటౌట్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన అలెక్స్ హేల్స్‌ను టీమిండియా అభిమానులు అంత తొందరగా మరిచిపోలేరు. అసలు విషయమేంటంటే ముందు అలెక్స్ హేల్స్ అసలు ఇంగ్లండ్ వరల్డ్‌కప్ జట్టులోనే లేడు. స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో గాయపడడంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు అలెక్స్ హేల్స్. అయితే హేల్స్ జట్టులోకి రావడం వెనుక ఉన్నది మాత్రం ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్. బట్లర్ తనపై పెట్టుకున్న నమ్మకానికి అలెక్స్ హేల్స్ పూర్తిశాతం న్యాయం చేశాడు. ఈ టోర్నీలో నాలుగు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, భారత్‌లతో జరిగిన మ్యాచ్‌లలో అతను 84, 52, 47, 86 నాటౌట్ పరుగులు సాధించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఇక అలెక్స్ హేల్స్ 2019 వన్డే వరల్డ్ కప్‌కు ముందు సరదాగా ప్రమాదకరం కాని ‘రిక్రియేషనల్ డ్రగ్స్’ తీసుకున్నాడు. దాంతో అతనిపై 3 వారాల నిషేధం విధించారు. అలా మూడు వారాలు కాస్త మూడు సంవత్సరాలైపోయాయి. హేల్స్ మూడేళ్ల పాటు క్రికెట్‌కు దూరమవ్వడానికి కారణం మరో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. మోర్గాన్ దృష్టిలో మాత్రం డ్రగ్స్ వ్యవహారం చిన్న తప్పుగా అనిపించలేదు. దీనిని ‘నైతికత’కు సంబంధించిన అంశంగా వాదించిన మోర్గాన్ వరల్డ్ కప్ జట్టులోంచి హేల్స్‌ను తీసేయించాడు. నిజానికి 2015 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ ఘోర వైఫల్యం తర్వాత జట్టు పునరుజ్జీవంలో హేల్స్ కూడా కీలకపాత్ర పోషించాడు. వన్డేల్లో ఇంగ్లండ్ రికార్డు స్కోర్లలో అతనిదే ప్రధాన పాత్ర. అయినా సరే మోర్గాన్ మాత్రం తగ్గలేదు. హేల్స్‌ను జట్టుకు దూరంగా ఉంచి తన మాట నెగ్గించుకున్నాడు. సరిగ్గా చెప్పాలంటే ‘నేను కెప్టెన్‌గా ఉన్నంత వరకు నువ్వు మళ్లీ ఇంగ్లండ్ జట్టులోకి రాలేవు’ అని సందేశం ఇచ్చాడు. చివరకు అదే జరిగింది. అలా మూడేళ్ల పాటు ఇంగ్లండ్ జట్టుకు దూరమైన హేల్స్ మోర్గాన్ రిటైర్మెంట్ కాగానే మళ్లీ జట్టులోకి వచ్చాడు. బట్లర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాకా తన మార్క్‌ను చూపెట్టాలని అలెక్స్ హేల్స్‌ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చాడు. ఈ సెప్టెంబర్‌లో పాకిస్తాన్ టూర్లో హేల్స్ మంచి ప్రదర్శన కనబరిచాడు. కానీ అప్పటికే టి20 ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేయగా అందులో హేల్స్ లేడు. కానీ బెయిర్ స్టో గాయపడడం హేల్స్‌కు కలిసి వచ్చింది. అలా ఒక వరల్డ్‌కప్ ఆడే చాన్స్ మిస్ అయింది. కానీ మరో వరల్డ్‌కప్ ఆడే అవకాశం వచ్చింది. వచ్చిన రెండో అవకాశాన్ని హేల్స్ వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఇంకేముంది వెనక్కి తిరిగి చూస్తే హేల్స్ ప్రస్తుతం ఇంగ్లండ్ నుంచి టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఇక టీమిండియాతో జరిగిన సెమీస్‌లో హేల్స్ ఇన్నింగ్స్‌ను మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా చూశాడు. వరల్డ్‌కప్‌లో స్కై స్పోర్ట్స్ కామెంటరీ టీమ్‌లో భాగంగా ఉన్న ఇయాన్ మోర్గాన్ హేల్స్ బ్యాటింగ్‌కు చప్పట్లు కొడుతూ అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అందుకే అంటారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. మొన్న తిట్టినోడే ఇవాళ మెచ్చుకున్నాడు. అంటూ అభిమానులు కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: ఆటలో లోపం లేదు.. టాలెంట్‌కు కొదువ లేదు.. ఎప్పుడు గుర్తిస్తారో! WC 2022: ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’.. రేసులో 9 మంది! కోహ్లితో పాటు -
WC 2022: రూ. 500కే ఫైనల్ టిక్కెట్ల అమ్మకం!? ఇది వాళ్ల పనేనంటూ..
T20 World Cup Final: టీ20 ప్రపంచకప్-2022 మొదటి సెమీ ఫైనల్లో పాకిస్తాన్ న్యూజిలాండ్‌ను ఓడించగానే.. క్రికెట్ ప్రేమికుల్లో ఎక్కడా లేని ఉత్సాహం.. రెండో సెమీస్ మ్యాచ్‌లో గ్రూప్-2 టాపర్ టీమిండియా.. ఇంగ్లండ్‌ను చిత్తు చేయడం ఖాయమని.. తద్వారా ఫైనల్లో దాయాదుల హై వోల్టేజ్ మ్యాచ్ చూసే అవకాశం వస్తుందని ఆశగా ఎదురుచూశారు. కానీ అడిలైడ్ వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో భారత జట్టు పరాజయం పాలు కావడంతో అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. ముఖ్యంగా భారత బౌలర్లు ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయకపోవడం.. టీమిండియా ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓటమి చెందడం తట్టుకోలేకపోయారు. కనీస పోరాటం లేకుండానే ప్రత్యర్థి జట్టు ముందు తలొగ్గారంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. టీమిండియా- పాకిస్తాన్ ఫైనల్ ఆడితే చూడాలని.. 2007 నాటి సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ భారత్ గెలవాలంటూ ఆకాంక్షిస్తే సెమీస్‌లోనే ఇంటికి బాట పట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు. కాగా భారత్- పాక్ అంటేనే అంచనాలు ఎక్కువ. అది కూడా ఫైనల్లో తలపడితే ఆ మజానే వేరు. పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్ ఎనిమిదో ఎడిషన్‌లో ఇందుకు ఆస్కారం ఉన్న నేపథ్యంలో అప్పటికే ఫైనల్ మ్యాచ్‌కు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు చాలా మంది! కానీ ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ వారి ఆశలపై నీళ్లు చల్లడంతో ఉసూరుమన్నారు. దీంతో కొంతమంది ఫ్యాన్స్ ఇండియా- ఇంగ్లండ్ మ్యాచ్ ముగిసిన తర్వాత.. ఫైనల్ వీక్షించేందుకు కొనుక్కున్న టిక్కెట్లు అమ్మేందుకు ప్రయత్నించినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. 10 ఆస్ట్రేలియన్ డాలర్ల(మన కరెన్సీలో సుమారు 536 రూపాయలు)కే టిక్కెట్లు ఇచ్చేస్తామంటూ ఆవేదన, ఆగ్రహంతో కూడిన స్వరంతో వాళ్లు మాట్లాడటం అందులో వినిపించింది. అయితే, ఇది పాక్ నెటిజన్ల పనేనని, కావాలనే ఇలాంటి వీడియోలు షేర్ చేస్తున్నారంటూ.. ఇంతకీ ఇది నిజమైందో కాదో అంటూ ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా సోషల్ మీడియాలో భారత జట్టు ఓటమిపై మీమ్స్ ఆగటం లేదు. అన్ని రకాలుగా దెబ్బే ఆస్ట్రేలియాలో ఈ ఐసీసీ ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో న్యూజిలాండ్ సహా సమీప దేశాల్లో ఉన్న చాలా మంది భారతీయులు మెల్బోర్న్లో నవంబరు 13న ఫైనల్ చూసేందుకు విమాన టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇండియా- పాక్ మ్యాచ్ అంటే వ్యూయర్షిప్ రికార్డులు, రేటింగ్ ఓ రేంజ్లో ఉంటుంది. కానీ ఈ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు తలపడబోవడం లేదు కాబట్టి ఈ విధంగా కూడా బిజినెస్ దెబ్బ తినే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా రోహిత్ సేన ఫ్యాన్స్‌తో పాటు సగటు క్రికెట్ అభిమాని ఆశలన్నీ కల్లలు చేసింది. అయినా, ఆటలో గెలుపోటములు సహజమే! క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగటమే ముఖ్యం! చదవండి: T20 WC 2022: ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు రేసులో 9 మంది! కోహ్లితో పాటు: ఐసీసీ ప్రకటన SuryaKumar Yadav: ఓటమి బాగా హర్ట్ చేసింది.. ఒక్కడివి ఏం చేయగలవు! Fans who have already bought IND vs Pak final match tickets : pic.twitter.com/gqb0lElvLm — Raghav Masoom (@comedibanda) November 11, 2022 -
T20 World Cup 2022: అహో హేల్స్...
‘నేను మళ్లీ ప్రపంచకప్ ఆడతానని అనుకోలేదు’... సెమీస్ ముగిసిన తర్వాత అలెక్స్ హేల్స్ వ్యాఖ్య ఇది. బహుశా భారత అభిమానులు కూడా అదే జరిగి ఉంటే బాగుండేదని అనుకొని ఉంటారు! మూడేళ్ల పాటు ఆటకు దూరమై పునరాగమనంలో మళ్లీ చెలరేగుతున్న హేల్స్ కథ కూడా ఎంతో ఆసక్తికరం. ► ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీలలో ఎంత గొప్ప ప్రదర్శన ఇచ్చినా మూడేళ్ల పాటు అతనికి టీమ్‌లో చోటు దక్కలేదు. ఆ బాధను అధిగమించి అతను ప్రపంచవ్యాప్తంగా టి20 లీగ్‌లలో ఆడుతూ వచ్చాడు. చివరకు ఈ ఏడాది జూన్‌లో మోర్గాన్ రిటైర్ అయ్యాడు... సెప్టెంబర్‌లో హేల్స్‌కు టీమ్‌లో స్థానం లభించింది. పాకిస్తాన్ పర్యటనలో ఆకట్టుకున్న అతను వరల్డ్ కప్‌లో కీలక ఇన్నింగ్స్‌లతో తానేంటో నిరూపించాడు. ► పాక్ టూర్ తర్వాత కూడా ఇంగ్లండ్ వరల్డ్ కప్ జట్టులో హేల్స్‌కు స్థానం దక్కలేదు. అయితే బెయిర్‌స్టో అనూహ్యంగా గాయపడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో హేల్స్‌ను టీమ్‌లోకి తీసుకోవాల్సి వచ్చింది. అది ఎంత సరైన నిర్ణయమో ఇంగ్లండ్‌కు ఇప్పుడు తెలిసింది. ఈ టోర్నీలో నాలుగు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, భారత్‌లతో జరిగిన మ్యాచ్‌లలో అతను 84, 52, 47, 86 నాటౌట్ పరుగులు సాధించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. –సాక్షి క్రీడావిభాగం -
IND Vs ENG: పాక్ ఓపెనర్లను మించిపోయిన బట్లర్, హేల్స్
అంతా ఊహించినట్లే జరిగింది. ఆరంభం నుంచి టీమిండియాకు మైనస్‌గా కనిపిస్తూ వచ్చిన బౌలింగ్ విభాగం కీలకమైన సెమీస్ పోరులో పూర్తిగా చేతులెత్తేసింది. పైనల్ చేరతారనుకున్న టీమిండియా సెమీఫైనల్లో ఘోర పరాజయం చవిచూసి అవమానకర రీతిలో నిష్క్రమించింది. టీమిండియా బౌలర్లలో ఒక్క బౌలర్ నుంచి యార్కర్ బాల్ పడలేదంటే ఎంత పేలవమైన ఆటతీరు కనబరిచిందనేది అర్థం చేసుకోవచ్చు. ఇక కళ్ల ముందు 169 పరుగుల లక్ష్యం కనిపిస్తున్నా టీమిండియా బౌలింగ్‌ను చూసి ఇంగ్లండ్ ఓపెనర్లు ఇంచు కూడా బెదరలేదు. బట్లర్, అలెక్స్ హేల్స్ ఒకరితో ఒకరు పోటీ పడుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఈ ఇద్దరే కరిగించారంటే వారి బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగిందనేది అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరి దాటికి ఇంగ్లండ్ 16 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా చేధించింది. జాస్ బట్లర్ 80 నాటౌట్, అలెక్స్ హేల్స్ 86 నాటౌట్‌గా నిలిచి టీమిండియా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ చూస్తుంటే గతేడాది టి20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్ గుర్తుకుతెచ్చింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా విధించిన 152 పరుగుల లక్ష్యాన్ని పాక్ఘ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేధించింది. మహ్మద్ రిజ్వాన్ 79 నాటౌట్, బాబర్ ఆజం 68 నాటౌట్ అప్పటి టీమిండియా బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ పాక్‌కు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తాజాగా ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఈ రెండింటిలో కామన్‌గా ఉన్నది టీమిండియా అయితే.. జట్టు, స్కోర్లు మాత్రమే వేరు. మిగతాదంతా దాదాపు సేమ్ రిపీట్ అయింది. మరో విషయమేంటంటే బట్లర్, హేల్స్‌లు పాక్ ఓపెనర్లను మించిపోయారు. అప్పుడు పాక్ 17.1 ఓవర్లలో 152 పరుగుల లక్ష్యాన్ని అందుకుంటే.. తామేం తక్కువ తిన్నామా అన్నట్లుగా ఇంగ్లండ్ 16 ఓవర్లలోనే ఒక్క వికెట్ కోల్పోకుండా 169 పరుగుల టార్గెట్‌ను అందుకుంది. చదవండి: పాండ్యా కోసం పంత్ త్యాగం.. -
బట్లర్, హేల్స్ మెరుపు అర్ధశతకాలు.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?
టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-1లో భాగంగా ఇవాళ (నవంబర్ 1) జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఓపెనర్లు జోస్ బట్లర్ (47 బంతుల్లో 73; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), అలెక్స్ హేల్స్ (40 బంతుల్లో 52; 7 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ధశతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని (తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం) సద్వినియోగం చేసుకోలేకపోయిన ఇంగ్లండ్.. భారీ స్కోర్ సాధించడంలో విఫలమైంది. బట్లర్, హేల్స్, లివింగ్‌స్టోన్ (20) మినహా మిగతావారెవ్వరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. మొయిన్ అలీ (5), హ్యారీ బ్రూక్ (7), బెన్ స్టోక్స్ (8).. అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గూసన్ 2 వికెట్లు పడగొట్టగా.. సౌథీ, సాంట్నర్, సోధి తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఉతికి ఆరేసిన బట్లర్, హేల్స్.. వణికించి ఓడిన ఆస్ట్రేలియా
టీ20 వరల్డ్‌కప్‌కు ముందు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ఇంగ్లండ్ జట్టుకు మాంచి బూస్ట్ అప్ విజయం దక్కింది. సిరీస్‌లో భాగంగా ఆతిధ్య జట్టుతో ఇవాళ (అక్టోబర్ 9) జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసిన ఇంగ్లండ్ ఎట్టకేలకు గెలుపొందింది. బట్లర్, హేల్స్ విధ్వంసం.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఓపెనర్లు జోస్ బట్లర్ (32 బంతుల్లో 68; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), అలెక్స్ హేల్స్ (51 బంతుల్లో 84; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరలెవెల్లో రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. వీరిద్దరు తొలి వికెట్‌కు 11.2 ఓవర్లలో 132 పరుగులు జోడించగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వరుసగా విఫలమయ్యారు. ఆఖర్లో క్రిస్ వోక్స్ (5 బంతుల్లో 13 నాటౌట్) బౌండరీ, సిక్సర్ బాదడంతో ఇంగ్లండ్ 200 స్కోర్‌ను క్రాస్ చేసింది. ఆసీస్ బౌలర్లలో స్వెప్సన్ 3, కేన్ రిచర్డ్సన్, డేనియల్ సామ్స్, స్టోయినిస్ తలో వికెట్ పడగొట్టారు. చెలరేగిన వార్నర్, స్టోయినిస్.. వణికించి ఓడిన ఆస్ట్రేలియా 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభం నుంచే ప్రత్యర్ధిపై ఎదురుదాడికి దిగింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (44 బంతుల్లో 73; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆతర్వాత మిచెల్ మార్ష్ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టోయినిస్ (15 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఓ దశలో ఆసీస్ సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే ఆఖర్లో మార్క్ వుడ్ (3/34) వరుస క్రమంలో వికెట్లు తీయడంతో ఆసీస్ లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ ఆసీస్ పతనాన్ని శాశించగా.. రీస్ టాప్లే, సామ్ కర్రన్ తలో 2 వికెట్లు, ఆదిల్ రషీద్ ఓ వికెట్ పడగొట్టారు. భారీ అర్ధశతకం సాధించి ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించడానికి పునాది వేసిన హేల్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్‌లో తదుపరి మ్యాచ్ బుధవారం (అక్టోబర్ 12) జరుగనుంది. -
'పాకిస్తాన్ కూడా ఓడిపోయింది'.. ఇంగ్లండ్ ఘన విజయం
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను పాకిస్తాన్ ఓటమితో ప్రారంభించింది. కరాచీ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు) ఆసియా కప్ ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. కెప్టెన్ బాబర్ ఆజం 31 పరుగులు చేసి ఔటవ్వగా.. ఇఫ్తికర్ అహ్మద్ 28 పరుగులు చేశాడు. మిగతావారెవరు పెద్దగా రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో లూక్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ 2, సామ్ కరన్, మొయిన్ అలీ ఒక వికెట్ తీశాడు. కాగా ఇంగ్లండ్ రెగ్యులర్ కెప్టెన్ జాస్ బట్లర్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండడంతో మొయిన్ అలీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఇంగ్లండ్ బ్యాటర్స్‌లో అలెక్స్ హేల్స్ 53 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. చివర్లో 25 బంతుల్లో 42 పరుగులు చేసిన హారీ బ్రూక్ జట్టును గెలిపించాడు. పాకిస్తాన్ బౌలర్లలలో ఉస్మాన్ ఖాదీర్ 2, షాహనవాజ్ దహనీ, హారిస్ రౌఫ్ చెరొక వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ సెప్టెంబర్ 22న(గురువారం) జరగనుంది. ఇక పాకిస్తాన్ ఓడిపోవడంపై క్రికెట్ ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేశారు. ''ఒకేరోజు రెండు ఉపఖండపు జట్లు పరాజయం చవిచూశాయి. ఒకటి టీమిండియా అయితే.. రెండో జట్టు పాకిస్తాన్''..'' ఈ రెండు జట్లు తాము ఆడుతున్న సిరీస్‌లో కొత్త జెర్సీలతో బరిలోకి దిగాయి. కొత్త జెర్సీ రెండు జట్లకు కలిసి రాలేదు''... ''ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోతే.. పాకిస్తాన్ కూడా ఓడిపోయింది ఇంగ్లండ్ చేతిలో'' అంటూ పేర్కొన్నారు. చదవండి: దినేశ్ కార్తిక్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్ -
చాప్టర్ క్లోజ్ అనుకున్న తరుణంలో హార్డ్ హిట్టర్‌కు జాక్‌పాట్..
ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్‌కు జాక్‌పాట్ తగిలింది. జట్టుకు దూరమై మూడేళ్లు కావొస్తుండడంతో ఇక చోటు కష్టమే అనుకుంటున్న తరుణంలో అలెక్స్ హేల్స్‌కు ఈసీబీ నుంచి పిలుపొచ్చింది. అక్టోబర్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక టి20 ప్రపంచకప్‌కు ఈసీబీ.. గాయంతో దూరమైన జానీ బెయిర్ స్టో స్థానంలో అలెక్స్ హేల్స్‌ను ఎంపిక చేసింది. టి20 ప్రపంచకప్‌తో పాటు మెగాటోర్నీకి ముందు పాకిస్తాన్‌తో ఆడనున్న ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు కూడా హేల్స్‌కు చోటు దక్కింది. కాగా పాకిస్తాన్‌తో సెప్టెంబర్ 20, 22, 23, 25, 28, 30, అక్టోబర్ 2వ తేదీన ఇంగ్లండ్ ఏడు టి20లు ఆడనుంది. ఇక ప్రతిష్టాత్మక టి20 ప్రపంచకప్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. ఇక అలెక్స్ హేల్స్ 2019లో ఇంగ్లండ్ తరపున చివరి మ్యాచ్ ఆడాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌కు ముందు డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్స్ రావడంతో జట్టుకు దూరమయ్యాడు. తాజాగా హార్డ్ హిట్టర్ జానీ బెయిర్ స్టో అనూహ్యంగా గాయంతో వైదొలగడంతో అలెక్స్ హేల్స్ మూడేళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు తలుపులు తెరుచుకున్నాయి. ఇక బెయిర్ స్టో ఇటీవలే గోల్ఫ్ ఆడుతూ గాయపడ్డాడు. గోల్ఫ్ ఆడుతున్న తరుణంలో మోకాలు కింది భాగంలో తీవ్ర గాయం కావడంతో పాకిస్తాన్ సిరీస్‌తో పాటు టి20 ప్రపంచకప్‌కు చివరి నిమిషంలో దూరమయ్యాడు. ఈ మధ్య కాలంలో అలెక్స్ హేల్స్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 33 ఏళ్ల హేల్స్ ఇటీవలే జరిగిన హండ్రెడ్ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్స్‌లో ఒకడిగా ఉన్నాడు. 2020 నుంచి చూసుకుంటే అలెక్స్ హేల్స్ టి20ల్లో 111 ఇన్నింగ్స్‌లో 3376 పరుగులు సాధించాడు. అతని కంటే ముందు పాకిస్తాన్ స్టార్ మహ్మద్ రిజ్వాన్ 3435 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక టి20 క్రికెట్లో 10వేల పరుగుల మార్క్‌ను అందుకున్న క్రికెటర్ల జాబితాలో అలెక్స్ హేల్స్ చోటు దక్కించుకోవడం విశేషం. ఇక హేల్స్ ఇంగ్లండ్ తరపున 60 టి20ల్లో 1644 పరుగులు, 70 వన్డేల్లో 2419 పరుగులు, 11 టెస్టుల్లో 573 పరుగులు సాధించాడు. Alex Hales has also been added to our squads for the #T20WorldCup and IT20 tour of Pakistan 🏏 — England Cricket (@englandcricket) September 7, 2022 చదవండి: పాక్ కెప్టెన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లిన స్టార్ ఓపెనర్ Nick Kyrgios: వివాదం లేకుంటే మనసుకు పట్టదనుకుంటా.. నువ్వు మారవు! -
దంచికొట్టిన డేవిడ్ మలాన్.. దూసుకుపోతున్న ట్రెంట్ రాకెట్స్
హండ్రెడ్ లీగ్ 2022లో ట్రెంట్ రాకెట్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. తొలి మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించిన ఆ జట్టు.. నిన్న (ఆగస్ట్ 9) నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే తరహాలో రెచ్చిపోయి మరో ఘన విజయం నమోదు చేసింది. ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ మలాన్ (49 బంతుల్లో 88 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి రాకెట్స్ ప్రత్యర్ధిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. డేనియల్ సామ్స్ (3/31), ఫ్లెచర్ (2/22), లూక్ వుడ్ (2/30) విజృంభించడంతో సూపర్ ఛార్జర్స్ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్ వీస్ 27 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఛేదనలో ట్రెంట్ రాకెట్స్ మలాన్ సహా అలెక్స్ హేల్స్ (27 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో మరో 6 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంతో ట్రెంట్ రాకెట్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. చదవండి: న్యూజిలాండ్ క్రికెట్‌కు భారీ షాక్.. వైదొలిగిన స్టార్ బౌలర్ -
జాసన్ రాయ్, అలెక్స్ హేల్స్‌కు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ!?
IPL 2022: ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు ఇంగ్లండ్ క్రికెటర్లు జాసన్ రాయ్, ఆలెక్స్ హేల్స్ ఆనూహ్యంగా తప్పుకుని ఆయా ఫ్రాంచైజీలను షాక్‌కు గురిచేసిన సంగతి తెలిసిందే. బయోబబుల్ నిబంధనల కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరంగా ఉంటున్నట్లు వారిద్దరూ వెల్లడించారు. ఐపీఎల్-2022 మెగా వేలంలో భాగంగా జాసన్ రాయ్‌ను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేయగా, ఆలెక్స్ హెల్స్‌ను కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. కాగా సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఈ ఇద్దరి క్రికెటర్లపై బీసీసీఐ చర్యలు తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపై సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుంచి వైదొలగకుండా ఆటగాళ్లు ఉండేలా సరికొత్త విధానాన్ని తీసుకురావాలని బీసీసీఐ యోచిస్తోన్నట్లు సమాచారం. తాజాగా జరిగిన ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. "లీగ్‌లో వాటాదారులైన ఫ్రాంఛైజీల పట్ల గవర్నింగ్ కౌన్సిల్ నిబద్ధతను కలిగి ఉంది. ఫ్రాంఛైజీలు చాలా ప్రణాళికలతో ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేస్తారు. వారు సరైన కారణం లేకుండా వైదొలిగితే వారి లెక్కలు తారుమారు అవుతాయి. కొత్త పాలసీ విధానాన్ని తీసుకురావాలి అని భావిస్తున్నాము. సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాము. అలా అని ఐపీఎల్ నుంచి వైదొలిగిన ప్రతి ఒక్కరినీ కొన్ని సంవత్సరాల పాటు నిషేధించే స్వీపింగ్ విధానం తీసుకురాము. వారు తప్పుకున్న కారణం నిజమైతే ఎటువంటి చర్యలు ఉండవు" అని గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఒకరు పేర్కొన్నారు. చదవండి: IPL 2022 GT Vs LSG: అతడు మంచి వన్డే ప్లేయర్ మాత్రమే.. టీ20 క్రికెట్లో అలా కుదరదు: సెహ్వాగ్ విసుర్లు -
IPL 2022: కేఎల్ రాహుల్ జట్టుకు భారీ షాక్.. మరో ప్లేయర్ దూరం!
ఐపీఎల్-2022 సీజన్ ఆరంభానికి ముందే కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే జేసన్ రాయ్, అలెక్స్ హేల్స్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఆటగాడు సైతం ఈ సీజన్ నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. గాయం కారణంగా ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ ఐపీఎల్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి టెస్టు సందర్భంగా మార్క్ వుడ్ కుడి మోచేతికి గాయమైంది. ఈ క్రమంలో అతడు ఇంకా కోలుకోనందున ఐపీఎల్‌కి అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని, ఇంగ్లండ్ బోర్డు లక్నో ఫ్రాంఛేజీకి సమాచారం ఇచ్చినట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో పేర్కొంది. ఇక ఐపీఎల్-2022 సీజన్‌తో లక్నో జట్టు క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో మెగా వేలంలో భాగంగా మార్క్ వుడ్‌ను 7.50 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక బయో బబుల్ నిబంధనల కారణంగా జేసన్ రాయ్, అలెక్స్ హేల్స్ దూరం కాగా.. గాయం బారిన పడ్డ మార్క్ వుడ్ కూడా సీజన్ నుంచి తప్పుకోవడంతో లక్నోకు భారీ షాక్ తగిలినట్లయింది. ఇదిలా ఉండగా.. ఈ సీజన్లో ఘనంగా ఎంట్రీ ఇచ్చే క్రమంలో లక్నో.. ప్రమోషన్లతో బిజీగా ఉంది. మార్చి 28న మరో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌తో టోర్నీ ప్రయాణాన్ని ఆరంభించనుంది. చదవండి: IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్.. విలియమ్సన్ ఇక..! #BubbleKiBaatein: Aa gaye hai humare Captain on board, taiyaar hai banane naye record 🏏🙌 Welcome aboard, Captain💪👑@klrahul11 #LucknowSuperGiants #KLRahul #TataIPL #Mindset pic.twitter.com/zpLzHTGEo4 — Lucknow Super Giants (@LucknowIPL) March 16, 2022 .@LucknowIPL are ready to make their debut, are you ready to welcome them? Kyunki #TATAIPL mein UP ke naam ka danka bajna... #YehAbNormalHai!#IPL2022 | Mar 26 onwards | Star Sports Network & Disney+Hotstar pic.twitter.com/GQhHOmROzD — Star Sports (@StarSportsIndia) March 18, 2022 Making his 'Mark' already, eh? 😅 Loving @MAWood33's excitement on joining the Super Giants. We can't wait to have him with us. 🤩🙌#TATAIPLAuction #IPLAuction #LucknowSuperGiants pic.twitter.com/OPG7vQUzTa — Lucknow Super Giants (@LucknowIPL) February 13, 2022 -
IPL 2022: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆసీస్ కెప్టెన్.. ఐపీఎల్‌లోకి రీఎంట్రీ
KKR Rope In Aaron Finch As Replacement For Alex Hales: ఐపీఎల్ 2022 మెగా వేలంలో అమ్ముడుపోని సరుకుగా మిగిలిపోయిన ఆటగాళ్లలో ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఒకరు. ఫామ్ లేమి, వయసు పైపడిన దృష్ట్యా ఏ ఫ్రాంచైజీ అతన్ని తీసుకునేందుకు ముందుకు రాలేదు. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు, ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ జట్టు నుంచి అనూహ్యంగా (బయోబబుల్ వాతావరణంలో ఇమడలేక) తప్పుకోవడంతో ఫించ్‌కు ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చే లక్కీ ఛాన్స్ దక్కింది. 🚨 Aaron Finch joins KKR as a replacement for Alex Hales. Welcome to the #GalaxyOfKnights, @AaronFinch5! 💜#KKR #KKRHaiTaiyaar #IPL2022 pic.twitter.com/3HnSyKogV2 — KolkataKnightRiders (@KKRiders) March 11, 2022 ఫించ్‌ను కేకేఆర్ రూ. 1.5 కోట్ల బేస్‌ప్రైజ్‌కు సొంతం చేసుకుంది. గతంలో ఏకంగా 8 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆడిన రికార్డు ఉన్న 35 ఏళ్ల ఫించ్..గత సీజన్లో కోహ్లి నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఫించ్ ఐపీఎల్ కెరీర్లో మొత్తం 87 మ్యాచ్‌లు ఆడి 25.7 సగటున, 127.7 స్ట్రైయిక్రేట్తో 2005 పరుగులు చేశాడు. ఇందులో 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆసీస్ వన్డే, టీ20 జట్లకు నాయకత్వం వహిస్తున్న ఫించ్.. ఐపీఎల్ ప్రారంభ సమయానికి పాకిస్థాన్ పర్యటనలో ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ 6 వరకు ఆసీస్.. పాక్‌తో 3 వన్డేలు, ఏకైక టీ20 ఆడాల్సి ఉంది. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న ఆస్ట్రేలియా స్టార్ బౌలర్! -
ఎవరు కొనరేమో అనుకున్నాం.. చివర్లో అదృష్టం
ఐపీఎల్ మెగావేలం విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పాటు సాగిన లీగ్ వేలంలో క్రికెటర్లను సొంతం చేసుకునేందుకు 10 ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీ పడ్డాయి. గరిష్టంగా 217 స్థానాలకు ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉండగా అన్ని జట్లు కలిపి 204 మందితో సరిపెట్టాయి. ఇందులో భారత్ నుంచి 137 మంది ఉండగా... విదేశీ క్రికెటర్లు 67 మంది ఉన్నారు. ఎప్పటిలాగే కొందరు ఆటగాళ్లకు అంచనాలకు మించిన అనూహ్య ధర పలకగా... మరికొందరు స్టార్లు ఆశ్చర్యకరంగా తక్కువ విలువతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా ఆశ్చర్యంగా అసలు వేలంలో అమ్ముడుపోతారో లేదో అని అనుకున్న కొందరి ఆటగాళ్లను చివర్లో అదృష్టం వరించింది. వీళ్లది లక్ అనే చెప్పొచ్చు. చదవండి: IPL 2022 Auction: అన్క్యాప్డ్ ప్లేయర్‌కు అంత ధర.. ఎవరీ యష్ దయాల్ తొలి రోజు అమ్ముడుపోక రెండో రోజు చివర్లో మళ్లీ వేలానికి వచ్చిన వారిలో డేవిడ్ మిల్లర్‌కు రూ. 3 కోట్ల విలువ పలికింది. అప్పటి వరకు ఒక్క వికెట్ కీపర్‌ను కూడా తీసుకోని గుజరాత్ టైటాన్స్ వరుసగా వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్లను తీసుకుంది. భారత పేసర్ ఉమేశ్ యాదవ్‌ను కూడా చివర్లో కోల్‌కతా బేస్‌ప్రైస్‌కే తీసుకోవడం ఊరట కలిగించింది. 333 టి20ల్లో ఏకంగా 146.35 స్ట్రయిక్‌రేట్‌తో 9,346 పరుగులు సాధించిన ఘనమైన రికార్డు ఉన్న అలెక్స్ హేల్స్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్‌లోకి అడుగు పెట్టాడు. కోల్‌కతా తక్కువ మొత్తానికే (రూ.కోటీ 50 లక్షలు) అతడిని దక్కించుకోగలిగింది. ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ విల్లీ (బెంగళూరు; రూ. 2 కోట్లు) ఈ సీజన్ వేలంలో అమ్ముడైన చివరి ఆటగాడిగా నిలిచాడు. చదవండి: IPL 2022 Mega Auction: ఎవరీ షెపర్డ్.. 7.75 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం! -
రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన; సూపర్ విక్టరీ
నాటింగ్హమ్: హండ్రెడ్ బాల్ క్రికెట్ కాంపీటీషన్లో భాగంగా ట్రెంట్ రాకెట్స్‌కు ఆడుతున్న ఆఫ్ఘన్ స్టార్ రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్గాడు. ముందు బౌలింగ్‌లో మూడు వికెట్లతో దుమ్మురేపిన అతను ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ 25 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే రషీద్ ఔటయ్యే సమయానికి ట్రెంట్ ఇంకా 47 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఓపెనర్‌గా వచ్చిన అలెక్స్ హేల్స్ 40 పరుగులతో చివరివరకు నాటౌట్‌గా నిలిచి అద్భుత విజయాన్ని అందించాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నార్తన్ సూపర్‌చార్జర్స్ 99 బంతుల్లో 132 పరుగులకు ఆలౌట్ అయింది. నార్తన్ బ్యాటింగ్‌లో జె. సింప్సన్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హ్యారీ బ్రూక్ 38 పరుగులు చేశాడు. ట్రెంట్ రాకెట్స్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్ 3,డీ లాంజ్ 3, మాథ్యూ కార్టర్ 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆడిన ట్రెంట్ రాకెట్స్ 94 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. అలెక్స్ హేల్స్ 40, రషీద్ ఖాన్ 25 పరుగులు చేశారు. -
చెత్త ఫుడ్ అంటూ విమర్శలు.. క్లారిటీ ఇచ్చిన ఆటగాడు
కరాచీ: ఫిబ్రవరి 20న అట్టహాసంగా ప్రారంభమైన పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్ 2021) గురువారం అర్థంతరంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. లీగ్‌లో భాగంగా ఏడుగురు ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో పీసీబీ లీగ్‌ను వాయదా వేయాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా పీఎస్ఎల్ లీగ్‌పై మరో విషయం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. లీగ్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లకు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని.. ఎక్కడ పరిశుభ్రత పాటించడం లేదని.. అందుకే కరోనా కేసులు వెలుగు చూశాయంటూ ట్రోల్స్ చేశారు. దీనికి తోడూ ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ తన ట్విటర్లో పెట్టిన ఫోటోను ఒక వ్యక్తి రీట్వీట్ చేశాడు. ఆ ఫోటోలో రెండు ఎగ్స్, టోస్ట్ బ్రెడ్.. కనిపించాయి. హేల్స్ కూడా పీసీబీని ట్రోల్ చేస్తూ ఆ ఫోటో పెట్టాడంటూ సదరు వ్యక్తి కామెంట్స్ చేశారు. అయితే ఇది చూసిన హేల్స్.. చెత్త ఫుడ్ అంటూ విమర్శలు చేసినవారికి క్లారిటీ ఇస్తున్నట్లుగా తన కామెంట్స్‌లో తెలిపాడు. '' మీరు ఫోటోలో చూస్తున్నది నిజానికి మంచి క్వాలిటీతో ఉన్న ఆహారం. కాకపోతే వారిచ్చిన ఫుడ్ ఆర్డర్ ప్రకారం ఇవ్వలేదు.. ఇది కొంచెం ఫన్నీగా అనిపించింది.. అందుకే ఫోటోను షేర్ చేశా.. అంతేగాని ఫుడ్ క్వాలిటీని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. పీఎస్ఎల్ నిర్వాహకులు మా అందరిని ఆహ్లదకర వాతావరణంలోనే ఉంచింది. అనవసరంగా ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు.''అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అలెక్స్ హేల్స్ పీఎస్ఎల్లో ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చదవండి: పీఎస్ఎల్ 2021 వాయిదా.. వికెట్ తీయగానే జెర్సీ విప్పేసిన తాహిర్ It was one meal where the order was incorrect.. I found it funny, nothing more. The food and hospitality here has been excellent, hope this clears it up 👍🏼 — Alex Hales (@AlexHales1) March 4, 2021 -
స్టన్నింగ్ క్యాచ్.. షాక్‌లో బౌలర్, బ్యాట్స్‌మన్
కాన్బెర్రా : బిగ్‌బాష్ లీగ్ 2020లో మెల్బోర్న్ రెనెగేడ్స్, సిడ్నీ థండర్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో మెకేంజీ హార్వే అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ హైలెట్‌గా నిలిచింది. హార్వే అందుకున్న క్యాచ్ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌నే కాదు బౌలర్‌ను కూడా షాక్‌కు గురిచేసింది. కష్టసాధ్యమైన క్యాచ్‌ను హార్వే సూపర్డైవ్ చేసి అందుకున్న తీరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. హార్వే సాధించిన ఈ ఫీట్ సిడ్నీ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో జరిగింది. (చదవండి : వైరల్ : క్రికెటర్ల బిల్లు చెల్లించిన అభిమాని) మెల్బోర్న్ రెనేగేడ్స్ బౌలర్ మిచెల్ పెర్రీ వేసిన ఫుల్‌టాస్ బంతిని అలెక్స్ హేల్స్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. ఆ షాట్ తీరు చూస్తే ఎవరైనా ఫోర్ అనుకుంటారు. కానీ బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న హార్వే ముందుకు డైవ్ చేసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. హార్వే క్యాచ్‌తో షాక్‌కు గురైన హేల్స్ నిరాశగా వెనుదిరగగా.. బౌలర్ పెర్రీ ఆశ్చర్యం వక్తం చేస్తూ కాసేపు అలాగే నిల్చుండిపోయాడు. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేసింది. అమేజింగ్ హార్వే.. ఇది క్యాచ్ ఆఫ్ ది టోర్న్‌మెంట్ అవుతుందా? హార్వేను బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది వరల్డ్ అనొచ్చా? దీనిపై మీ కామెంట్ ఏంటి అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా మ్యాచ్‌కు ముందు వర్షం అంతరాయం కలిగించడంతో 17 ఓవర్లకు ఆటను కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ రెనెగేడ్స్ నిర్ణీత 17 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. షాన్ మార్ష్ 87 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, నబీ 33 పరుగులతో రాణించాడు. (చదవండి: క్యారీ స్టన్నింగ్ క్యాచ్.. వహ్వా అనాల్సిందే) అనంతరం 20 ఓవర్లలో 173 పరుగుల సవరించిన లక్ష్యాన్ని సిడ్నీ థండర్స్ ముందు ఉంచారు. ఓపెనర్లు ఉస్మాన్ ఖాజా, అలెక్స్ హేల్స్ దాటిగా ఆడడంతో సిడ్నీ థండర్స్ వేగంగా పరుగులు సాధించింది. హేల్స్ వెనుదిరిగిన అనంతరం మ్యాచ్‌కు మరోసారి వర్షం అంతరాయం కలిగింది. అప్పటికి సిడ్నీ థండర్స్ 12 ఓవర్లలో 117 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో డక్‌వర్త్ లుయీస్ పద్దతిలో సిడ్నీ థండర్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు రిఫరీ ప్రకటించారు. The catch of the tournament!? The best fielder in the world!? What a grab...#BBL10 | @BKTtires pic.twitter.com/ByRq1ecBCL — cricket.com.au (@cricketcomau) January 1, 2021 -
స్టోక్స్ కోసం ఏమైనా రూల్స్ మార్చారా?
లండన్: అలెక్స్ హేల్స్.. గతంలో ఇంగ్లండ్ జట్టుకు వెన్నుముక. మరి ఇప్పుడు అతని పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం జట్టును ఎంపిక చేసే క్రమంలో హేల్స్‌ను పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు. ఓపెనర్‌గా పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన హేల్స్‌కు ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) శాశ్వతంగా చరమగీతం పాడాలని కంకణం కట్టుకున్నట్టే కనబడుతోంది. 2019 వన్డే వరల్డ్‌కప్‌కు కొద్ది రోజుల ముందు హేల్స్ నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు తేలడంతో అతనిపై వేటు పడింది. అప్పట్లో అది తాత్కాలిక వేటే అనుకున్నారంతా. ఆ క్రమంలోనే వన్డే వరల్డ్‌కప్‌ను ఆడే అవకాశాన్ని హేల్స్ కోల్పోయాడు. అయితే తాజాగా మళ్లీ హేల్స్‌కు చుక్కెదురైంది. కరోనా సంక్షోభం తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ పునరుద్ధరణలో భాగంగా 55 మందితో కూడిన జట్టును ట్రైనింగ్ కోసం ఈసీబీ ప్రకటించింది. ఇందులో హేల్స్‌కు అవకాశం దక్కలేదు. ఇదే ఇప్పుడు విమర్శలకు దారి తీస్తుంది. (‘అతనితో పోలిస్తే వార్నర్‌కే కష్టం’) హేల్స్‌పై అంత కాఠిన్యంగా ఎందుకు ఉన్నారంటూ ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్ నిక్ కాంప్టన్ ప్రశ్నించాడు. హేల్స్ తప్పు చేశాడు.. కానీ అది శాశ్వతంగా నిషేధం విధించే తప్పుకాదు కదా అని ఈసీబీపై ఫైర్ అయ్యాడు. ఒకవేళ మీ దృష్టిలో హేల్స్ పెద్ద నేరమే చేసుంటే, మరి స్టోక్స్ అంతకంటే పెద్ద వివాదాల్లో తలదూర్చలేదా అని నిలదీశాడు. స్టోక్స్‌కు వచ్చేసరికి రూల్స్ ఏమైనా మారిపోయాయా అంటూ మండిపడ్డాడు. మరొకవైపు హేల్స్‌కు మరో చాన్స్ ఇవ్వాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ సైతం మద్దతుగా నిలిచాడు. అతను తప్పు చేసి ఉండవచ్చు కానీ మళ్లీ జట్టులో వేసుకోలేనంత తప్పు కాదు కదా అని హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటివరకూ హేల్స్ అనుభవించిన శిక్ష సరిపోతుందన్నాడు. కాగా, గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో హేల్స్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. బీబీఎల్, పీఎస్ఎల్లో హేల్స్ ఆకర్షణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరి ప్రస్తుత ఇంగ్లండ్ పెద్దలు పట్టించుకోని హేల్స్ తిరిగి జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడా.. లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. (‘అతను మరో ధోని కావడం ఖాయం’) -
క్రికెటర్ హేల్స్‌కు కరోనా?
కరాచీ: కరోనా వైరస్‌తో ప్రపంచమే ఆగిపోయింది. ఆటలన్నీ వాయిదా పడినా... లీగ్ దశ దాకా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నిర్విరామంగా సాగింది. మంగళవారం రెండు సెమీస్ మ్యాచ్‌లు, బుధవారం ఫైనల్‌తో ఈ లీగ్‌కు శుభం కార్డు పడాల్సివుంది. అయితే ఈ ‘మహమ్మారి’ బారిన ఓ విదేశీ క్రికెటర్ పడటంతో లీగ్ అర్ధాంతరంగా వాయిదా పడింది. ఇంగ్లండ్ ప్లేయర్ అలెక్స్ హేల్స్‌కు కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలియడంతో సెమీస్, ఫైనల్స్ పోటీల్ని వాయిదా వేస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సీఈఓ వసీమ్ ఖాన్ తెలిపారు. ‘పాక్ నుంచి తిరుగుముఖం పట్టిన హేల్స్ తనకు కరోనా లక్షణాలున్నట్లు మాకు సమాచారమిచ్చాడు. దీంతో పలు వర్గాలతో సంప్రదింపులు జరిపాక లీగ్‌ను వాయిదా వేయాలని నిర్ణయించాం’ అని ఆయన చెప్పారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రజా మాట్లాడుతూ లీగ్ మొదలైనప్పటినుంచి ఎలాంటి అనుమానిత కేసులు లేకపోవడంతో సజావుగానే సాగిందని, కానీ 31 ఏళ్ల హేల్స్‌కు కరోనా లక్షణాలు బయటపడటంతో కలకలం రేగిందని... ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పుడు పీఎస్ఎల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేయనున్నామని ఆయన చెప్పారు. పీఎస్ఎల్లో మొత్తం 34 మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొన్నారు. వారంతా కరోనా భయాందోళనలతో ఇదివరకే స్వదేశాలకు చేరారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఒప్పందాలు, వ్యవహారాలను పక్కనబెట్టి వెళ్లాలనుకున్నవారిని పంపించామని రమీజ్ రజా తెలిపారు. పాకిస్తాన్‌లోనూ కరోనా కేసులు నమోదు కావడంతో బంగ్లాదేశ్‌తో వచ్చే నెలలో జరగాల్సిన వన్డే, టెస్టు సిరీస్‌లను పీసీబీ రద్దు చేసింది. అలాగే ఈ నెల 25 నుంచి జరగాల్సిన నేషనల్ వన్డే కప్‌ను కూడా సస్పెండ్ చేసింది. ఇంగ్లండ్ చేరుకున్న అనంతరం హేల్స్ తన స్పందన తెలియజేశాడు. తాను ఇంకా కరోనా పరీక్షలకు హాజరు కాలేదని, పాజిటివ్ అంటూ వచ్చిన వార్తల్లో కూడా నిజం లేదని స్పష్టం చేశాడు. అయితే జ్వరంతో పాటు సాధారణం కంటే భిన్నమైన లక్షణాలు తనలో కనిపించడంతో ముందు జాగ్రత్తగా అందరికీ దూరంగా ఉంటున్నట్లు అతను వెల్లడించాడు. -
అలెక్స్ హేల్స్‌కు కరోనా సోకిందా?
లాహోర్ : ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్‌పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ రమీజ్రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో ఆడేందుకు వచ్చిన హేల్స్ అతను వెళ్లే ముందు కరోనా లక్షణాలు ఉన్నట్లుగా అనుమానమొచ్చిందని పేర్కొన్నాడు. లాహోర్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్న రమీజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతకుముందు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా మంగళవారం జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్‌ను కూడా వాయిదా వేస్తున్నట్లు పీసీబీ తెలిపింది. 'అలెక్స్ హేల్స్ కు కరోనా లక్షణాలు ఉన్నాయో లేదో స్పష్టంగా తెలీదు.. కానీ అతను పరీక్షలు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం.మేము కూడా ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో పీఎస్ఎల్ను వాయిదా వేసి పీసీబీ మంచి పని చేసింది. ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించడం వ్యర్థమైన పని.. ఇలాగే సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించి ఉంటే లీగ్ అట్టర్ఫ్లాఫ్ అయ్యేది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. ఈ సమయంలో లీగ్‌ను వాయిదా వేయడం తప్ప ఇంకో అవకాశం తీసుకోదలచుకోలేదు ' అని రమీజ్ పేర్కొన్నాడు. (కరోనా సోకి యువ కోచ్ మృతి) కాగా పీఎస్ఎల్లో అలెక్స్ హేల్స్ కరాచీ కింగ్స్ తరపున ప్రాతినిథ్యం వహించాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు లీగ్ మధ్యలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. లీగ్ నిర్వాహకులు వారందరికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి వారి స్వదేశానికి పంపించింది. ఇదే విషయమై.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సీఈవో వసీమ్ ఖాన్ మాట్లాడుతూ.. ' లీగ్‌లో పాల్గొన్న విదేశీ ఆటగాళ్లలో కొందరు కరోనా బారీన పడ్డారేమోనని మాకు అనుమానంగా ఉంది. కానీ వారి పేర్లు వెల్లడించడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే లీగ్‌లో పాల్గొన్న ఆటగాళ్లతో పాటు నిర్వాహకులకు, బ్రాడ్కాస్టర్లకు కోవిడ్ టెస్టులు చేయించామని' తెలిపాడు. కాగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 బారీన పడి 7వేలకు పైగా మృతి చెందగా, ప్రపంచవ్యాప్తంగా 1, 82,611 కరోనా కేసులు నమోదయ్యాయి. క్వారంటైన్లో నువ్వు.. బయట నేను! -
హేల్స్... చేజేతులా
లండన్: ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ ముంగిట... ఆతిథ్య ఇంగ్లండ్‌కు కొంత ఇబ్బందికర పరిణామం. ఉత్తేజిత మాదక ద్రవ్యాలు (రిక్రియేషనల్ డ్రగ్స్) వినియోగించినట్లు తేలడంతో డాషింగ్ బ్యాట్స్‌మన్ అలెక్స్ హేల్స్ 15 మంది సభ్యుల ఇంగ్లండ్ ప్రపంచ కప్ బృందం నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. దీంతోపాటు మే 3న ఐర్లాండ్‌తో జరుగనున్న ఏకైక వన్డేతో పాటు, మే 5 నుంచి పాకిస్తాన్‌తో ప్రారంభం కానున్న ఒక టి20, ఐదు వన్డేల సిరీస్‌కూ అతడిని జట్టు నుంచి తప్పించారు. ఏటా సీజన్ ప్రారంభ, ముగింపునకు ముందు ఇంగ్లండ్ పురుషుల ప్రొఫెషనల్ క్రికెటర్లు, సెంట్రల్ కాంట్రా క్టు మహిళా క్రికెటర్లకు ‘వెంట్రుక కుదుళ్ల’ ఆధారంగా డోప్ పరీక్ష నిర్వహిస్తారు. దీంట్లో రెండోసారీ పాజిటివ్‌గా రావడంతో హేల్స్‌పై గత వారమే 21 రోజుల నిషేధం పడింది. అప్పుడే రాయల్ లండన్ కప్ నుంచి పక్కన పెట్టారు. ‘కీలక సమయంలో అనవసర విషయాలకు తావివ్వకుండా, జట్టులో సరైన వాతావరణం నెలకొల్పేందుకు ఈ చర్య తీసుకున్నాం. దీనిపై తీవ్రంగా, సుదీర్ఘంగా చర్చించాం. జట్టుకు ఏది మేలు చేస్తుందో అదే చేశాం. దీంతోనే హేల్స్ కెరీర్ ఏమీ ముగిసిపోదు. అతడికి కావాల్సిన సాయం అందిస్తాం’ అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎండీ, పురుషుల క్రికెట్ డైరెక్టర్ ఆష్లే గైల్స్, ఆ దేశ సెలెక్షన్ కమిటీ హెడ్ ఎడ్ స్మిత్ ప్రకటన జారీ చేశారు. ఇది రెండోసారి... ‘హార్డ్ హిట్టర్’ అయిన 30 ఏళ్ల హేల్స్ క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొనడం రెండేళ్లలో ఇది రెండోసారి. సహచర క్రికెటర్ బెన్ స్టోక్స్‌తో కలిసి 2017 సెప్టెంబరులో బ్రిస్టల్‌లో ఓ నైట్ క్లబ్ వద్ద వ్యక్తిపై తీవ్రంగా దాడి చేసిన ఘటనలో హేల్స్‌పై ఆరు మ్యాచ్‌ల నిషేధం, జరిమానా విధించారు. బ్రిస్టల్ ఉదంతంతో హేల్స్ కెరీర్ ఇబ్బందుల్లో పడగా, అతడి స్థానాన్ని బెయిర్‌స్టో, జాసన్ రాయ్ భర్తీ చేశారు. అయితే, గతేడాది జూన్‌లో ఆస్ట్రేలియాతో ట్రెంట్‌బ్రిడ్జ్ వన్డేలో హేల్స్ 92 బంతుల్లోనే 147 పరుగులు బాది ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు స్కోరు (481) చేయడంలో కీలకపాత్ర పోషించాడు. తద్వారా విస్మరించలేని ఆటగాడయ్యాడు. హేల్స్ ఇంగ్లండ్ తరఫున 11 టెస్టులు, 70 వన్డేలు, 60 టి20లు ఆడాడు. మరోవైపు భుజం గాయంతో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సామ్ బిల్లింగ్స్ ఇప్పటికే జట్టుకు దూరమయ్యాడు. హేల్స్‌ను తప్పించిన నేపథ్యంలో జేమ్స్ విన్స్‌కు చోటు దక్కే వీలుం ది. ప్రపంచ కప్‌నకు తుది 15 మందిని ప్రకటించేందుకు అన్ని దేశాల జట్లకు మే 23 వరకు గడువు ఉంది. -
ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ!
నాటింగ్‌హామ్ : మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్లుంది ఇంగ్లండ్ జట్టు పరిస్థితి. ఇప్పటికే సొంత గడ్డపై భారత్‌తో టీ20 సిరీస్ కోల్పోయి.. తొలి వన్డే ఓడి కష్టాల్లో ఉన్న ఆ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ అలెక్స్ హేల్స్ గాయంతో వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. పక్కటెముకల పట్టేయడంతో తొలి వన్డేకు దూరమైన హేల్స్.. నాలుగు వారాలు విశ్రాంతి కావాలని డాక్టర్లు సూచించడంతో ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఇక భారత్‌పై రెండో టీ20లో హాఫ్ సెంచరీ సాధించి హేల్స్ ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. భారత్‌పై మంచి ఫామ్ ఉన్న హేల్స్ దూరమవ్వడం ఆ జట్టును కలవరపాటు గురిచేస్తోంది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో సైతం హేల్స్(147) అద్బుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. హేల్స్ స్థానంలో డేవిడ్ మలాన్ తుది జట్టులోకి వచ్చాడు. గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత కుల్దీప్ 6 వికెట్లతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ పతనాన్ని శాసించగా.. రోహిత్ శర్మ సెంచరీతో బౌలర్లను ఆడుకున్నాడు. దీంతో భారత్ విజయం సులువైంది. -
ఇంగ్లండ్‌ను గెలిపించిన అలెక్స్ హేల్స్
-
హేల్స్ గెలిపించాడు..
కార్డిఫ్: టీమిండియా విజయాన్ని ఒకే ఒక్కడు అడ్డుకున్నాడు. తక్కువ స్కోరైనా కాపాడుకుంటుందనుకున్న తరుణంలో.. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ అలెక్స్ హేల్స్(58; 41 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించాడు. టీమిండియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్‌ను ఆతిథ్య జట్టు 1-1తో సమం చేసింది. తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. తడబడిన ఇంగ్లండ్..149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను ఉమేశ్ విడదీశాడు. ఉమేశ్ వరుస ఓవర్లలో రాయ్(15), బట్లర్(14)లను ఔట్ చేయగా, రూట్(9)ను చహల్ పెవిలియన్‌కు పంపిచాడు. ఆతిథ్య జట్టు 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా శిబిరంలో ఆశలు చిగురించాయి. కానీ, హేల్స్ పట్టుదలతో బ్యాటింగ్ చేయడం.. అతడికి మోర్గాన్(17), బెయిర్ స్టో(28)ల నుంచి సహకారం అందడంతో మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని పూర్తి చేశాడు. టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా, భవనేశ్వర్, హార్దిక్ పాండ్యా, చహల్ తలో వికెట్ సాధించారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోహ్లి సేన నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కార్డిఫ్ పిచ్ నెమ్మదైనది కావడంతో పరుగులు చేయడానికి టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆపసోపాలు పడ్డారు. ఇంగ్లండ్ కట్టుదిట్టమైన పేస్ బౌలింగ్‌తో భారత ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని అందించలేకపోయారు. జాక్ బాల్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి రోహిత్ శర్మ(5) క్యాచ్ ఔట్ కాగా, నిర్లక్ష్యంతో మరో ఓపెనర్ శిఖర్ ధావన్(10) రనౌట్‌గా వెనుదిరిగారు. ఫస్‌డౌన్‌లో వచ్చిన తొలి మ్యాచ్ సెంచరీ హీరో కేఎల్ రాహుల్(6) విఫలమవ్వటంతో భారత్ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లి(47; 38 బంతుల్లో 1ఫోర్, 2 సిక్సర్లు), సురేశ్ రైనా(27; 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆదుకునే ప్రయత్నం చేశారు. చివర్లో ఎంఎస్ ధోని (32; 24 బంతుల్లో 5 ఫోర్లు), పాండ్యా(12) బ్యాట్ ఝళిపించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ నమోదు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లే, బాల్, ప్లంకెట్, రషీద్ తలో వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఆదివారం జరగనుంది. -
వన్డే క్రికెట్లో పెను సంచలనం.!
నాటింగ్‌హామ్: 50 ఓవర్లలో 41 ఫోర్లు, 21 సిక్సర్లతో ఏకంగా 481 పరుగులు... ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సొంతగడ్డపై సృష్టించిన వీర విధ్వంసం ఇది. ఆస్ట్రేలియాపై సునామీలా విరుచుకుపడిన మోర్గాన్ సేన వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మంగళవారం జరిగిన డే–నైట్ మూడో వన్డేలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 481 పరుగులు చేసింది. ఫలితంగా ఇప్పటి వరకు తమ పేరిటే ఉన్న 444 పరుగుల (2016లో పాకిస్తాన్‌పై) రికార్డును తుడిచి పెట్టింది. అలెక్స్ హేల్స్ (92 బంతుల్లో 147; 16 ఫోర్లు, 5 సిక్సర్లు), జాన్ బెయిర్‌స్టో (92 బంతుల్లో 139; 15 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకాలతో విరుచుకు పడగా... జేసన్ రాయ్ (61 బంతుల్లో 82; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇయాన్ మోర్గాన్ (30 బంతుల్లో 67; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో తమ వంతు పాత్ర పోషించారు. మ్యాచ్‌లో మూడు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు కావడం విశేషం. ఇంగ్లండ్ ధాటికి ఆసీస్ బౌలర్లలో టై అత్యధికంగా 100 పరుగులు సమర్పించుకోగా, రిచర్డ్సన్ 92, స్టొయినిస్ 85 పరుగులు ఇచ్చారు. 46 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 450 వద్ద నిలిచింది. బ్యాటింగ్ జోరు చూస్తే స్కోరు 500 పరుగులు దాటుతుందని అనిపించింది. అయితే చివరి నాలుగు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా లేకుండా 31 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆసీస్... వరుస బంతుల్లో హేల్స్, మోర్గాన్ వికెట్లు కూడా తీయడంతో స్కోరు 481కే పరిమితమైంది. 482 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రషిద్ (4/47) దెబ్బకు 239 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటింగ్‌లో ట్రావిస్ హెడ్ (51), స్టోయినీస్ (44)లు టాప్ స్కోరర్లుగా నిలిచారు. 5 వన్డేల సిరీస్‌లో 3-0తో ఇంగ్లండ్ సిరీస్ కైవసం చేసుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఐపీఎల్: అలెక్స్ హేల్స్ అరంగేట్రం
జైపూర్ : ఐపీఎల్-11 సీజన్లో భాగంగా సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ వైపు మొగ్గు చూపాడు. ఇక సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్థానంలో వచ్చిన ఇంగ్లండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్లో అరంగేట్రం చేస్తున్నాడు. మహ్మద్ నబీ స్థానంలో ఈ ఇంగ్లండ్ క్రికెటర్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక రాజస్తాన్ జట్టులో ఇద్దరు యువఆటగాళ్లు ఇష్ సోది, మహీపాల్ లోమ్మెర్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నారు. వరుసగా గత రెండు మ్యాచ్‌లను గెలిచిన సన్‌రైజర్స్ రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. తమ బలమైన బౌలింగ్‌తో ఎంతటి తక్కవ స్కోర్‌నైనా కాపాడుకుంటోంది. ఇక రాజస్తాన్ ముంబైపై స్టన్నింగ్ విజయాన్నందుకుంది. ఈ విజయాన్నే పునరావృత్తం చేయాలని భావిస్తోంది. తుదిజట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ : శిఖర్ ధావన్, అలెక్స్ హేల్స్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), మనీశ్ పాండే, షకీబ్ అల్ హసన్, యుసఫ్ పఠాన్, వృద్దిమాన్ సాహా, రషీద్‌ఖాన్, బసిల్ థంపి, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ రాజస్తాన్ రాయల్స్: అజింక్యా రహానే(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్, బెన్ స్టోక్స్, బట్లర్, కృష్ణప్ప గౌతమ్, జోఫ్రా ఆర్చర్, మహీపాల్ లోమ్మెర్, ధావల్ కులకర్ణి, జయదేవ్ ఉనాద్కట్, ఇష్ సోది -
‘సన్‌రైజర్స్’ దబిడిదిబిడి; వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: జనరంజకంగా సాగుతోన్న ఐపీఎల్ 2018 మధ్యలో ‘బాలయ్య డైలాగ్’ వైరల్ అయింది. తనకు మాత్రమే సాధ్యమనే రీతిలో అద్భుతమైన డైలాగులు చెబుతూ ప్రేక్షకులను రంజింపజేస్తారు హీరో నందమూరి బాలకృష్ణ. కొత్త సినిమా వచ్చిన ప్రతిసారి అభిమానులు ఆయన డైలాగ్స్‌ను ఇమిటేట్చేస్తూ సోషల్‌మీడియాలో వీడియోలు పెడుతుండటం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మన్ అలెక్స్ హేల్స్ సైతం బాలయ్య డైలాగ్‌తో దబిడిదిబిడిలాడించాడు. వివరాల్లోకి వెళితే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు భువనేశ్వర్, మనీశ్ పాండే, అలెక్స్ హేల్స్‌లు శనివారం బంజారాహిల్స్‌లోని సెంట్రో షోరూమ్‌లో సందడి చేశారు. ‘జస్ట్ ఛేంజ్’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పలువురు వర్ధమాన క్రీడాకారులతో ముచ్చటించారు. చాలా మంది చిన్నారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆద్యాంతం సరదాగా సాగిన వేడుకలో చిన్నారులు కొందరు సన్‌రైజర్స్ ఆటగాళ్లను వినూత్నమైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. పిల్లల కోరిక మేరకు ‘శ్రీమన్నారాయణ’ సినిమాలో బాలకృష్ణ చెప్పిన ‘డోన్ట ట్రబుల్ ది ట్రబుల్..’ డైలాగ్‌ను అలెక్స్ హేల్స్ ఇమిటేట్ చేశారు. మొదటి ప్రయత్నంలోనే.. అచ్చం బాలయ్య మాదిరే హేల్స్ డైలాగ్ చెప్పేయడంతో కోలాహలం ఒక్కసారే మిన్నంటింది. చిన్నారులు అడిగిన మరికొన్ని ప్రశ్నలు.. క్రికెట్ ఆడకపోయి ఉంటే ఏం చేసేవారని ఓ చిన్నారి భువనేశ్వర్ కుమార్‌ను ప్రశ్నించగా... తాను ఆర్మీలో చేరేవాడినని అతను తెలిపాడు. మిగతా ప్రశ్నలకు సమాధానమిస్తూ భువీ ‘క్రీడాకారులుగానే కాకుండా జీవితంలో ఎదగాలంటే కష్టపడేతత్వం ఉండాలి. శ్రమిస్తేనే ఏదైనా సాధించగలం. నాకే కాదు ప్రతీ క్రికెటర్‌కు సచిన్ టెండూల్కరే మార్గదర్శి’ అని చెప్పాడు. సన్‌రైజర్స్ జట్టులో చిలిపి చేష్టలు ఎవరు చేస్తారని మరో చిన్నారి ప్రశ్నించగా, బిపుల్ శర్మ కామెడీ బాగా చేస్తాడని, అందరినీ ఆటపట్టిస్తుంటాడని మనీశ్ పాండే సమాధానమిచ్చాడు. -
వార్నర్ స్థానంలో హేల్స్
న్యూఢిల్లీ: నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు... ఇంగ్లండ్ డాషింగ్ బ్యాట్స్‌మన్ అలెక్స్ హేల్స్‌ను ఎంపిక చేసుకుంది. ఇంగ్లండ్ తరఫున టి20ల్లో ఏకైక సెంచరీ చేసిన ఈ ఓపెనర్‌ను కనీస ధర కోటి రూపాయలకు తీసుకుంది. 29 ఏళ్ల హేల్స్ 2015 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. దాంతోపాటు బిగ్‌బాష్ లీగ్ (ఆస్ట్రేలియా), పాకిస్తాన్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లలో కూడా బరిలోకి దిగాడు. కెరీర్లో 52 టి20 మ్యాచ్‌లు ఆడిన హేల్స్ 136.32 స్ట్రయిక్ రేట్‌తో 1,456 పరుగులు సాధించాడు. ‘సన్‌రైజర్స్ హైదరాబాద్ వార్నర్ స్థానంలో అలెక్స్ హేల్స్‌ను ఎంచుకుంది’ అని ఐపీఎల్ పాలక మండలి ఓ ప్రకటనలో తెలిపింది. -
ఐపీఎల్: వార్నర్ స్థానంలో హేల్స్!
హైదరాబాద్ : ట్యాంపరింగ్ వివాదంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌కు ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ దూరమైన విషయం తెలిసిందే. దీంతో వార్నర్ స్థానంలో ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంపిక చేసుకుంది. అతని కనీస ధర కోటి రూపాయలకే సొంతం చేసుకుంది. అందుబాటులో ఉన్న ఆటగాళ్ల జాబితా నుంచి సన్‌రైజర్స్ హేల్స్‌ను ఎంపిక చేసుకున్నట్లు బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ ఇంగ్లండ్ ఓపెనర్‌పై ఈసారి జరిగిన వేలంలో ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. దీంతో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. అయితే హేల్స్ టీ20 కెరీర్ ఫర్వాలేదు. 52 అంతర్జాతీయ టీ20ల్లో 31.65 సగటుతో 1456 పరుగులు చేశాడు. 2015 ఐపీఎల్లో కోరె అండర్స్‌న్ గాయంతో దూరం అవ్వడంతో అతని స్థానంలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించిన ఆసీస్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లపై ఏడాది పాటు నిషేదం విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐ కూడా స్మిత్, వార్నర్‌లను ఈ ఏడాది ఐపీఎల్‌కు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వీరి స్థానాల్లో వేరే ఆటగాళ్లను తీసుకోవాలని ఫ్రాంచైజీలకు సూచించింది. వార్నర్‌ను భర్తీ చేయడం కష్టమే.! వార్నర్ లేని సన్‌రైజర్స్‌ను ఊహించుకోవడం హైదరాబాద్ అభిమానులకు కష్టంగా ఉంది. వార్నర్ ఆట ఒక ఎత్తు అయితే మిగతా జట్టంతా ఒకవైపు. 2014లో 528 పరుగులు ...2015లో 562...2016లో 848...2017లో 641...సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున గత నాలుగు సీజన్లో డేవిడ్ వార్నర్ ప్రదర్శన ఇది. ఒంటి చేత్తో అతను మ్యాచ్‌లు గెలిపించాడు. 2014 నుంచి 59 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 52.63 సగటు, 147.71 స్ట్రైక్ రేట్‌తో 2,579 పరుగులు చేశాడు. ఇందులో 26 అర్ధ శతకాలు, ఒక శతకం ఉన్నాయి. -
స్టార్ క్రికెటర్లకు నిరాశ
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల)-11 సీజన్లో భాగంగా రెండో రోజు వేలంలో కూడా పలువురు స్టార్ క్రికెటర్లకు నిరాశే ఎదురైంది. ట్వంటీ 20 స్పెషలిస్టులైన ఇంగ్లండ్ క్రికెటర్లు ఇయాన్ మోర్గాన్, అలెక్స్ హేల్స్‌ను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తిచూపలేదు. మరొకవైపు ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్ వైపు సైతం ఏ ఫ్రాంచైజీ కన్నెత్తి చూడలేదు. ఈ వేలంలో మోర్గాన్ కనీస ధర రూ. 2 కోట్లు ఉండగా, హేల్స్ కు నిర్ణయించిన ధర రూ. 1 కోటిగా ఉంది. కాగా, ఈ ధరకు కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ముందుకు రాకపోవడం ఆసక్తికరంగా మారింది. మార్ష్ కనీస ధర రూ. 1.5 కోట్లు ఉన్నప్పటికీ ఈ స్టార్‌ను కూడా ఎవరూ తీసుకోలేదు. దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్‌ను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ముందుకు రాకపోగా, వెస్టిండీస్ క్రికెటర్ సిమ్మన్స్‌ను కూడా వేలంలో అమ్ముడుపోలేదు. స్టెయిన్ కనీస ధర రూ. 1 కోటి ఉండగా, సిమ్మన్స్ కనీస ధర రూ. 1.5 కోట్లగా ఉంది. -
అలెక్స్ హేల్స్ 'లార్డ్స్' రికార్డులు
లార్డ్స్:ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు అలెక్స్ హేల్స్ పలు రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రాయల్ లండన్ వన్డే కప్ లో భాగంగా నాటింగ్షైర్ తరపున బరిలోకి దిగిన హేల్స్ శనివారం జరిగిన ఫైనల్లో అజేయంగా 187 పరుగులు చేశాడు. తద్వారా కొన్ని రికార్డుల్ని సాధించాడు. కౌంటీ మ్యాచ్ ఫైనల్లో లార్డ్స్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన రికార్డును నమోదు చేశాడు. దాంతో పాటు ఈ స్టేడియంలో లిస్ట్-ఎ మ్యాచ్ ల్లో అత్యధిక స్కోరును సాధించిన ఆటగాడిగా కూడా హేల్స్ నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ బూన్(166) రికార్డును హేల్స్ సవరించాడు. 1989 లో లార్డ్స్ లో ఎంసీసీతో జరిగిన లిస్ట్-ఎ మ్యాచ్ లో బూన్ అత్యధిక వ్యక్తిగత పరుగుల్ని సాధించాడు. ఆపై ఇంతకాలానికి హేల్స్ దాన్ని బద్ధలు కొట్టాడు. మరొకవైపు ఇంగ్లండ్ తరపున అత్యధిక వన్డే పరుగుల్ని నమోదు చేసిన తన పాత రికార్డును సవరించుకున్నాడు. గత సీజన్లో నాటింగ్‌హామ్‌లో పాకిస్తాన్ తో జరిగిన వన్డేలో హేల్స్ 171 పరుగులు చేశాడు. అదే ఇంగ్లండ్ నుంచి ఇప్పటివరకూ అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోరు. ఆ తర్వాత ఏడాది కాలంలో ఆ రికార్డును హేల్సే సవరించడం ఇక్కడ విశేషం. రాయల్ లండన్ వన్డే కప్‌లో నాటింగ్షైర్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి కప్ ను కైవసం చేసుకుంది. సర్రేతో జరిగిన మ్యాచ్ లో నాటింగ్షైర్ ఇంకా రెండు ఓవర్లకు పైగా ఉండగానే గెలుపొందింది. -
ఇంగ్లండ్ కు మరో ఎదురుదెబ్బ
కోల్‌కతా: భారత్‌తో మూడో వన్డేకు ముందు ఇంగ్లండ్ కు ఎదురు దెబ్బ తగిలింది. చేతి గాయం కారణంగా ఓపెనర్ అలెక్స్ హేల్స్ మిగతా సిరీస్‌కు దూరమయ్యాడు. కటక్‌లో జరిగిన రెండో వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ హేల్స్ గాయపడ్డాడు. ఆదివారం ఇక్కడ జరగనున్న మూడో వన్డేకు హేల్స్ అందుబాటులో ఉండడని టీం మేనేజ్మెంట్ తెలిపింది. రెండో వన్డేలో భారత మాజీ కెప్టెన్ మహేందర్‌సింగ్ ధోని క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అతని చేతికి గాయమైంది. గాయం తీవ్రత దృష్ట్యా హేల్స్ శనివారం ఉదయం ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లాడు. ఆదివారం జరగనున్న మూడో వన్డేలో హేల్స్ స్థానంలో జాసన్ రాయ్‌తో కలిసి సామ్ బిల్లింగ్స్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు టెస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన వికెట్ కీపర్ జాని బెయిర్‌స్టో కూడా అందుబాటులో ఉన్నాడు. వీరిద్దరిలో ఎవరికి అవకాశం కల్పిస్తారో వేచి చూడాల్సిందే. -
వరుసగా ఐదుసార్లు అర్ధసెంచరీలు
ట్రెంట్‌బ్రిడ్జ్: సంచలనాలకు నెలవుగా మారిన ఇంగ్లీషు క్రికెట్ జట్టు మరో రికార్డు సృష్టించింది. వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు(444) చేసిన జట్టుగా వరల్డ్ రికార్డు నెలకొల్పింది. పాకిస్థాన్ తో మంగళవారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ ఈ ఘనత సాధించింది. అలెక్స్ హేల్స్ సంచలన ఇన్నింగ్స్ కు బట్లర్, జో రూట్, మోర్గాన్ మెరుపులు తోడవడంతో ఇంగ్లండ్ భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో హేల్స్ శతకం బాదగా, బట్లర్, జో రూట్, మోర్గాన్ అర్ధ సెంచరీలు నమోదు చేశారు. హేల్స్ కు ‘మ్యాన్ ది మ్యాచ్’ దక్కింది. మ్యాచ్ విశేషాలు * ఇంగ్లండ్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా హేల్స్(171) నిలిచాడు. రాబిన్ స్మిత్(167) పేరున ఉన్న రికార్డును హేల్స్ తన పేరిట లిఖించుకున్నాడు. * ఏడు ఇన్నింగ్స్ లో హేల్స్ సెంచరీ చేయడం ఇది మూడోసారి. తర్వాత అతడు మొదటి సెంచరీ సాధించడానికి 27 ఇన్నింగ్స్ వరకు ఆగాల్సి వచ్చింది. * రెండు వికెట్ కు ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు జోడించిన చేసిన(750) చేసిన ఘనత హేల్స్, రూట్ కు దక్కింది. అంతకుముందు ఈ రికార్డు బెల్, ట్రాట్(740) పేరిట ఉంది. * ఆరుగురు బ్యాట్స్మన్లు (రూట్, బాయ్‌కాట్, గోచ్, స్టివార్ట్, ట్రాట్, హేల్స్ వరుసగా ఐదుసార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు సాధించారు. * రెండు టెస్టు దేశాల మధ్య జరిగిన వన్డేల్లో ఇంగ్లండ్ సాధించిన స్కోరే(444) అత్యుత్తమం. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా(439) పేరిట ఉండేది. గతేడాది జోహెన్నెస్‌బర్గ్ లో వెస్టిండీస్ తో జరిగిన వన్డేలో సౌతాఫ్రికా ఈ స్కోరు చేసింది. -
'వరల్డ్ కప్ గెలిచే సత్తా మాలో ఉంది'
కేప్‌టౌన్:వచ్చే నెలలో భారతలో ఆరంభం కానున్న వరల్డ్ టీ 20లో తమ సత్తాను నిరూపించుకుంటామని ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు అలెక్స్ హేల్స్ పేర్కొన్నాడు. వరల్డ్ కప్‌ను గెలవడానికి కావాల్సిన అన్ని వనరులు తమ జట్టులో ఉన్నాయన్నాడు. అటు ప్రతిభతో పాటు బ్యాట్‌తో విధ్వంసం సృష్టించే ఆటగాళ్లు తమ సొంతమని హేల్స్ తెలిపాడు. వరల్డ్ కప్ ఫేవరెట్లలో ఇంగ్లండ్ కూడా ఒకటి అనుకుంటున్నారా?అని అడిగిన ప్రశ్నకు హేల్స్ స్పందించాడు. ' మాది అత్యుత్తమ జట్టు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుత జట్టులో నేనొక సభ్యుణ్ని. అటు బ్యాటింగ్ తో పాటు, బౌలింగ్‌లో కూడా మా జట్టు పటిష్టంగా ఉంది. తొలి ఆటగాడు దగ్గర్నుంచి పదకొండో ఆటగాడు వరకూ అంతా హిట్ చేసేవారే. తద్వారా ఇది మాకు ఒక సువర్ణావకాశం' అని హేల్స్ తెలిపాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను కోల్పోయినందుకు చాలా నిరూత్సాహం చెందామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో హేల్స్ అద్వితీయంగా రాణించిన సంగతి తెలిసిందే. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసిన హేల్స్.. చివరి వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్ ను ఇంగ్లండ్ 2-3 తేడాతో కోల్పోయినా హేల్స్ కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు.