
'వరల్డ్ కప్ గెలిచే సత్తా మాలో ఉంది'
కేప్టౌన్:వచ్చే నెలలో భారతలో ఆరంభం కానున్న వరల్డ్ టీ 20లో తమ సత్తాను నిరూపించుకుంటామని ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు అలెక్స్ హేల్స్ పేర్కొన్నాడు. వరల్డ్ కప్ను గెలవడానికి కావాల్సిన అన్ని వనరులు తమ జట్టులో ఉన్నాయన్నాడు. అటు ప్రతిభతో పాటు బ్యాట్తో విధ్వంసం సృష్టించే ఆటగాళ్లు తమ సొంతమని హేల్స్ తెలిపాడు. వరల్డ్ కప్ ఫేవరెట్లలో ఇంగ్లండ్ కూడా ఒకటి అనుకుంటున్నారా?అని అడిగిన ప్రశ్నకు హేల్స్ స్పందించాడు.
' మాది అత్యుత్తమ జట్టు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుత జట్టులో నేనొక సభ్యుణ్ని. అటు బ్యాటింగ్ తో పాటు, బౌలింగ్లో కూడా మా జట్టు పటిష్టంగా ఉంది. తొలి ఆటగాడు దగ్గర్నుంచి పదకొండో ఆటగాడు వరకూ అంతా హిట్ చేసేవారే. తద్వారా ఇది మాకు ఒక సువర్ణావకాశం' అని హేల్స్ తెలిపాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ను కోల్పోయినందుకు చాలా నిరూత్సాహం చెందామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో హేల్స్ అద్వితీయంగా రాణించిన సంగతి తెలిసిందే. ఐదు వన్డేల సిరీస్లో తొలి నాలుగు మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలు చేసిన హేల్స్.. చివరి వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్ ను ఇంగ్లండ్ 2-3 తేడాతో కోల్పోయినా హేల్స్ కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు.