world twenty 20
-
2018లో టి20 ప్రపంచకప్ కు సన్నాహాలు!
దుబాయ్: రెండేళ్లకొకసారి జరిగే టి20 ప్రపంచకప్‌ను 2018లో నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్‌తో సీనియర్ అధికారులు చర్చలు జరుపుతున్నారు. స్టార్ స్పోర్ట్స్ తో ఒప్పందం ఖరారైతే ఈ టోర్నీకి వేదికగా దక్షిణాఫ్రికాకు మొదటి అవకాశం ఇవ్వనున్నారు. ఒకవేళ సఫారీలు దీనికి సిద్ధంగా లేకపోతే యూఏఈని వేదికగా ఖరారు చేయాలని భావిస్తున్నారు. 2009లో చాంపియన్స్ ట్రోఫీ జరిగిన తరువాత ఏ రకమైన ఐసీసీ ఈవెంట్ కూడా యూఏఈలో జరగలేదు. మరోవైపు దక్షిణాఫ్రికాలో క్రికెట్ తో పాటు, పలు క్రీడలపై ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో నిర్వహించే ఐసీసీ ఈవెంట్స్ పై సౌతాఫ్రికా క్రికెట్ అక్కడి ప్రభుత్వంతో పరిష్కరించుకునే పనిలో ఉంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా క్రికెట్ పెద్దలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం 2017లో చాంపియన్స్ ట్రోఫీ, 2018లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్, 2019లో వన్డే ప్రపంచకప్, 2020లో టి20 ప్రపంచకప్ ఉన్నాయి. వీటికి అదనంగా 2018, 2022లోనూ టి20 ప్రపంచకప్ నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. -
స్యామీకి వివ్ రిచర్డ్స్ మద్దతు
ఆంటిగ్వా: ఇటీవల జరిగిన వరల్డ్ ట్వంటీ 20లో విజేతగా నిలిచినా, తమ క్రికెట్ బోర్డు నుంచి సరైన సహకారం అందలేదన్న వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ స్యామీ వ్యాఖ్యలకు ఆ దేశ మాజీ దిగ్గజ ఆటగాడు వివ్ రిచర్డ్స్ మద్దతుగా నిలిచాడు. ' స్యామీ అబద్దాలకోరు అని నేను అనుకోవడం లేదు. స్యామీ నిజాయితీగానే మాట్లాడాడు. అతను చేసిన వ్యాఖ్యలు మనసు నుంచి ఎటువంటి కలష్మం లేకుండా వచ్చినవే. ఇక్కడ ఏమి జరిగిందో అందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో విండీస్ కప్ గెలవడం నిజంగా అభినందనీయం. ఇప్పుడు విండీస్ ఆటగాళ్లకు స్యామీ ఒక ప్రతినిధిగా ఉన్నాడు. రాబోవు రోజుల్లో బోర్డు నుంచి ఎటువంటి సంకేతాలొచ్చినా ఇలానే విజయాలతోనే ముందుకు సాగండి' అని రిచర్డ్స్ సూచించాడు. వరల్డ్ టీ 20కప్‌ను విండీస్ గెలిచిన అనంతరం పోస్ట్ మ్యాచ్ ఇంటర్యూలో ఆ దేశ క్రికెట్ బోర్డు తీరును స్యామీ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు ఇండియాలో అడుగుపెట్టేనాటికి జట్టుకు యూనిఫామ్ కూడా లేదని, అయినాసరే పోరాడామని, చివరికి ప్రపంచ విజేతగా నిలిచామని స్యామీ పేర్కొన్నాడు. తమ పట్ల విండీస్ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్యామీ ఆవేదన వ్యక్తం చేశాడు. -
'శామ్యూల్స్ ను ఒత్తిడిలోకి నెట్టాలనుకోలేదు'
కోల్‌కతా: వెస్టిండీస్ క్రికెట్ జట్టు వరల్డ్ టీ 20 ట్రోఫీని సాధించడంలో కార్లోస్ బ్రాత్ వైట్ పాత్ర మరువలేనిది. చివరి ఓవర్లో విజయానికి 19 పరుగులు చేయాల్సిన తరుణంలో 4 వరుస సిక్సర్లు బాది ఇంకా రెండు బంతులుండగానే జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అయితే తాను హార్డ్ హిట్టింగ్ చేయడానికి ముందుగానే సిద్దమైనట్లు బ్రాత్ వైట్ తాజాగా వెల్లడించాడు. అది ఆఖరి ఓవర్ కావడంతో ఆ సమయంలో మార్లోన్ శామ్యూల్స్ ఒత్తిడిలోకి నెట్టకుండా తానే రిస్క్ తీసుకుని హిట్టింగ్ చేసినట్లు తెలిపాడు. '20 ఓవర్‌కు ముందు నేను-శామ్యూల్స్ మాట్లాడుకున్నాం. ఏది ఏమైనా బంతుల్ని వృథా చేయకూడదని నిర్ణయించుకున్నాం. తొలి బంతిని కనీసం హిట్ చేస్తే పరుగు తీస్తానని శామ్యూల్స్ చెప్పాడు. అయితే ఆ క్లిష్ట సమయంలో సింగిల్స్ తీసి మార్లోన్కు స్ట్రైకింగ్ ఇవ్వదలుచుకోలేదు. శామ్యూల్స్ కు స్ట్రైకింగ్ ఇచ్చి అతన్ని ఒత్తిడిలోకి నెట్టాలనుకోలేదు. నేనే క్రీజ్‌లో ఉండి చావో రేవో తేల్చుకోవాలనుకున్నా. బంతిని క్షణ్ణంగా పరిశీలించి బలంగా బాదాలనుకున్నా. మొదటి మూడు సిక్సర్లు కొట్టిన సమయంలో మా విజయానికి ఒక పరుగు మాత్రమే అవసరమనే విషయం నాకు తెలుసు. అయినప్పటికీ ఆ మరుసటి బంతిని బౌండరీ దాటిస్తేనే మేలనుకున్నా. ఆ సమయంలో ఎవరైనా రనౌట్ అయితే మ్యాచ్ చేజారిపోయి ప్రమాదం ఉందనే అలా చేశా. అదృష్టం కొద్దీ నా వ్యూహం ఫలించింది' అని బ్రాత్ వైట్ స్పష్టం చేశాడు. -
వరల్డ్ టీ 20 కెప్టెన్‌గా కోహ్లి
కోల్‌కతా: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వరల్డ్ టీ 20 కెప్టెన్ గా భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఎంపికయ్యాడు. వరల్డ్ టీ 20లో ప్రతిభ ఆధారంగా మాజీ క్రికెటర్లు, వ్యాఖ్యాతలతో కూడిన సెలెక్షన్ కమిటీ విరాట్ కోహ్లిని సారథిగా ఎంపిక చేసింది. ఈ మేరకు 12 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఐసీసీ సోమవారం వెల్లడించింది. భారత జట్టు నుంచి విరాట్ తో పాటు, వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రాకు కూడా చోటు దక్కింది. ఈ టోర్నీలో విరాట్ కోహ్లి మూడు హాఫ్ సెంచరీల సాయంతో 273 పరుగులు నమోదు చేశాడు. వరల్డ్ ట్వంటీ 20లో విరాట్ యావరేజ్ 136.50 ఉండగా, స్ట్రైక్ రేట్ 146. 77 గా ఉంది. విరాట్ సాధించిన పరుగుల్లో 29 బౌండరీలు, 5 సిక్సర్లు ఉండటం విశేషం. అయితే ఈ టోర్నీలో విరాట్ రెండో అత్యుత్తమ ఆటగాడిగా నిలవగా, బంగ్లాదేశ్‌కు చెందిన తమీమ్ ఇక్బాల్(295) తొలిస్థానాన్ని సాధించాడు. వరల్డ్ టీ 20 పురుషుల జట్టు ఇదే.. విరాట్ కోహ్లి(భారత్, కెప్టెన్), జాసన్ రాయ్(ఇంగ్లండ్), డీకాక్(దక్షిణాఫ్రికా), జో రూట్(ఇంగ్లండ్), బట్లర్(ఇంగ్లండ్), షేన్ వాట్సన్(ఆస్ట్రేలియా), ఆండ్రీ రస్సెల్(వెస్టిండీస్), మిచెల్ సాంట్నార్(న్యూజిలాండ్), డేవిడ్ విల్లే(ఇంగ్లండ్), శామ్యూల్ బద్రి(వెస్టిండీస్), ఆశిష్ నెహ్రా(భారత్), ముస్తాఫిజుర్ రెహ్మాన్(బంగ్లాదేశ్) -
'స్యామీ.. నీకిది తగదు'
అంటిగ్వా: వెస్టిండీస్ క్రికెట్ పెద్దలపై విమర్శనాస్త్రాలు సంధించిన ఆ దేశ టీ 20 కెప్టెన్ డారెన్ స్యామీపై విండీస్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటగాళ్లు అనవసర, అసందర్భ వ్యాఖ్యలు చేయడం తగదని బోర్డు అధ్యక్షుడు డేవ్ కామోరూన్ మండిపడ్డారు. 'స్యామీ నీకిది తగదు. బోర్డుకు విరుద్ధంగా మాట్లాడటం ఎంతమాత్రం సరికాదు. అసందర్భంగా వ్యాఖ్యలు చేసి బోర్డును రచ్చకీడ్చకండి. బోర్డుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం క్షమార్హం కాదు' అని ట్విట్టర్లో మందలించారు. వరల్డ్ టీ 20కప్‌ను విండీస్ గెలిచిన అనంతరం పోస్ట్ మ్యాచ్ ఇంటర్యూలో స్యామీ మాట్లాడుతూ వారి క్రికెట్ బోర్డు తీరును తప్పుబట్టిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు ఇండియాలో అడుగుపెట్టేనాటికి జట్టుకు యూనిఫామ్ కూడా లేదని, అయినాసరే పోరాడామని, చివరికి ప్రపంచ విజేతగా నిలిచామని స్యామీ పేర్కొన్నాడు. తమ పట్ల విండీస్ బోర్డు చులకన భావంతో వ్యవహరిస్తోందనడానికి ఇదే ఉదాహరణని స్యామీ ఆవేదన వ్యక్తం చేశాడు. -
విశ్వవిజేత విండీస్
కోల్‌కతా: విధ్వంసకర ఆటతీరే మా సొంతం, మా జట్టులో అందరూ మ్యాచ్ విన్నర్లే.. వరల్డ్ టీ 20 టోర్నీలో విండీస్ కెప్టెన్ డారెన్ స్యామీ పదేపదే చెప్పిన మాటలు. ఈ వ్యాఖ్యలను విండీస్ అక్షరాల నిజం చేసింది. ఆఖరి ఓవర్ లో 19 పరుగులు చేయాల్సిన తరుణంలో విండీస్ ఆటగాడు బ్రాత్ వైట్ నాలుగు సిక్సర్లు కొట్టి జట్టుకు అపూర్వమైన విజయాన్ని సాధించి పెట్టడమే ఇందుకు నిదర్శనం. ఆదిలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి తడబడిన కరీబియన్లు....చివరి వరకూ పోరాడి ట్రోఫీని సొంతం చేసుకున్నారు. ఆదివారం ఈడెన్ గార్డెన్ మైదానంలో ఇంగ్లండ్ తో జరిగిన ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో వెస్టిండీస్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోర్నీ లీగ్ దశలో ఇంగ్లండ్ ను మట్టికరిపించిన వెస్టిండీస్ మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. తద్వారా వరల్డ్ టీ 20లో విండీస్ రెండోసారి ట్రోఫీని సొంతం చేసుకోగా, మరోసారి టైటిల్ సాధించాలనుకున్నఇంగ్లండ్ ఆశలు తీరలేదు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు నమోదు చేసింది. జేసన్ రాయ్(0), అలెక్స్ హేల్స్(1), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(5)లు నిరాశపరిచినా, జో రూట్(54;36 బంతుల్లో 7 ఫోర్లు), బట్లర్(36;22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) జోడీ నిలకడగా ఆడారు. ఈ జోడి నాల్గో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ తేరుకుంది. ఇక చివర్లో విల్లే(21;14 బంతుల్లో 1 ఫోర్,2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో పాటు, జోర్డాన్(12నాటౌట్) సమయోచితంగా ఆడటంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. చార్లెస్(1), క్రిస్ గేల్(4), సిమ్మన్స్(0)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో విండీస్ 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత మార్లోన్ శామ్యూల్స్(85 నాటౌట్;9 ఫోర్లు, 2 సిక్సర్లు), డ్వేన్ బ్రేవో(25)లు జట్టు ఇన్నింగ్స్‌కు మరమ్మత్తులు చేపట్టారు. ఈ జోడీ నాల్గో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామన్ని నెలకొల్పింది. అయితే ఆ తరువాత రస్సెల్(1), స్యామీ(2)లు ఘోరంగా విఫలం కావడంతో మ్యాచ్ ఇంగ్లండ్ విజయం దిశగా సాగింది. కాగా, ఆ తరుణంలో సిమ్మన్స్‌కు జతకలిసిన బ్రాత్ వైట్(34 నాటౌట్;10 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగి పోయాడు. ప్రత్యేకంగా బెన్ స్టోక్స్ వేసిన చివరి ఓవర్ లో ఆకాశమే హద్దుగా విధ్వంసర ఇన్నింగ్స్ ఆడిన బ్రాత్ వైట్ విండీస్ కు అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టాడు. -
విండీస్ విజయలక్ష్యం 156
కోల్‌కతా:వరల్డ్ టీ 20 భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టైటిల్ పోరులో ఇంగ్లండ్ 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన విండీస్ తొలుత ఇంగ్లండ్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే జేసన్ రాయ్(0) వికెట్ ను కోల్పోయింది. అనంతరం అలెక్స్ హేల్స్(1), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(5) లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరడంతో ఇంగ్లండ్ 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో జో రూట్(54;36 బంతుల్లో 7 ఫోర్లు), బట్లర్(36;22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) జోడీ నిలకడగా ఆడి ఇంగ్లండ్ పరిస్థితిని చక్కదిద్దింది. ఈ జోడి నాల్గో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ తేరుకుంది. కాగా, బెన్ స్టోక్స్(13), మొయిన్ అలీ(0)లు తీవ్రంగా నిరాశపరచడంతో ఇంగ్లండ్ మరోసారి తడబడింది. ఇక చివర్లో విల్లే(21;14 బంతుల్లో 1 ఫోర్,2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో పాటు, జోర్డాన్(12నాటౌట్) సమయోచితంగా ఆడటంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు నమోదు చేసింది. విండీస్ బౌలర్లలో డ్వేన్ బ్రేవో,బ్రాత్ వైట్లు తలో మూడు వికెట్లు సాధించగా, బద్రికి రెండు, రస్సెల్‌కు ఒక వికెట్ దక్కింది. -
ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
కోల్‌కతా: వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా ఇక్కడ ఆదివారం ఈడెన్ గార్డెన్లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టైటిల్ పోరులో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 2010లో ఇంగ్లండ్, 2012లో వెస్టిండీస్ ఒక్కోసారి వరల్డ్ టీ 20 టైటిల్ గెలిచాయి. ఇక్కడ విజయం సాధించే జట్టు రెండోసారి టైటిల్ గెలిచిన మొదటి జట్టుగా ఘనత సాధిస్తుంది. ఇరు జట్ల మధ్య 13 టి20 మ్యాచ్‌లు జరిగితే వెస్టిండీస్ 9 గెలిచి 4 ఓడింది. వరల్డ్ కప్‌లోనైతే 4 సార్లూ విండీస్‌దే విజయం. అయితే రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. మరోవైపు ఈ ప్రపంచకప్‌లో విండీస్ ఆరుసార్లూ టాస్ గెలవడం విశేషం. ఇంగ్లండ్ జట్టులో ప్రధానంగా జేసన్ రాయ్, బట్లర్, హేల్స్ ధాటిగా ఆడుతుండగా, జో రూట్ అద్భుతమైన ఫామ్‌తో నిలకడ చూపిస్తున్నాడు. వెస్టిండీస్ తరఫున క్రిస్ గేల్, సిమన్స్, రసెల్, చార్లెస్ లు కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో అంతిమ సమరం రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. -
'అండర్ డాగ్స్గానే వరల్డ్ కప్ గెలుస్తాం'
కోల్‌కతా:వరల్డ్ టీ 20లో అండర్ డాగ్స్గానే ఇంగ్లండ్‌తో తుదిపోరుకు సిద్ధమవుతున్నట్లు వెస్టిండీస్ జట్టు కెప్టెన్ డారెన్ స్యామీ స్పష్టం చేశాడు. ఈ టోర్నీకు ముందు తమపై ఎటువంటి అంచనాలు లేవని, దాన్నే అంతిమ సమరంలో కూడా కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అయితే అండర్ డాగ్స్గానే వరల్డ్ కప్‌ను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. 'బ్యాటింగ్‌లో విధ్వంసర ఆటగాళ్లు మా సొంతం. డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న మా ఆటగాళ్లు బలం మాకు తెలుసు. లెండిల్ సిమ్మన్, ఛార్లెస్లతో కూడిన బౌండరీ హిట్టర్స్ విండీస్ జట్టులో ఉన్నారు. టైటిల్ గెలవడానికి ఇంకా ఒక అడుగు దూరంలోనే ఉన్నాం. విండీస్ జట్టు ఏం చేయాలనుకుంటుందో దాన్ని కచ్చితంగా అమలు చేయగలదు. పిచ్ ఎలా ఉన్నా పోరాడటమే మా నైజం. ప్రస్తుతం మేము ఇంగ్లండ్ జట్టుపై దృష్టి సారించాం. టోర్నీ ఆరంభానికి ముందు వెస్టిండీస్ జట్టులో చోటు చేసుకున్న వివాదాలతో మా జర్నీ కఠినంగానే సాగింది. వరల్డ్ కప్ ను గెలవాలనే ఇక్కడికి వచ్చాం. దాన్ని సాధించి తీరడమే మా లక్ష్యం' అని స్యామీ పేర్కొన్నాడు. నగరంలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఆదివారం వెస్టిండీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరుగనుంది. -
షాహిద్ ఆఫ్రిదినే టార్గెట్!
కరాచీ:వరల్డ్ టీ 20లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శనకు కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిని బాధ్యుణ్ని చేస్తూ ఆ జట్టు మేనేజర్ ఇంతికాబ్ అలమ్ రూపొందించిన నివేదిక మీడియాకు లీక్ కావడం దుమారం రేపుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ కోచ్ వకార్ యూనస్ అందించిన నివేదిక లీక్ కావడం, అందులో ఆఫ్రిది వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిని సంగతి తెలిసిందే. అయితే వారం వ్యవధిలో ఇంతికాబ్ పీసీబీకి అందజేసిన నివేదికలో కూడా ఆఫ్రిదినే ప్రధానంగా టార్గెట్ చేశారు. ఈ టోర్నీలో ఆఫ్రిది ఎటువంటి ప్రణాళికలు లేకుండా ముందుకు సాగాడని అందులో విమర్శించారు. వరల్డ్ టీ 20లో ఆఫ్రిది 'క్లూలెస్ కెప్టెన్' గా వ్యవహరించడం వల్లే పాక్ జట్టు లీగ్ దశలోనే నిష్ర్కమించినట్లు ఇంతికాబ్ మండిపడ్డారు. వరల్డ్ టీ 20లో జట్టు చెత్త ప్రదర్శన అనంతరం క్రికెట్ బోర్డు పెద్దలపై విమర్శలు రావడంతో పాటు మీడియాకు లీక్ అవుతున్న నివేదికలతో కలత చెందిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పదవికి షహర్యార్ ఖాన్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే షహర్యార్ కు అత్యంత సన్నిహితుడు, పాకిస్తాన్ క్రికెట్ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ నజామ్ సేథీతో పాటు కొంతమంది సీనియర్ అధికారులు నచ్చచెప్పడంతో ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గారు. -
'టీమిండియా కొన్ని తప్పులు చేయడం వల్లే'
ముంబై:వరల్డ్ టీ 20 టోర్నీకి ముందు టీమిండియాను టైటిల్ ఫేవరెట్‌గా భావించినా ఆ జట్టు సెమీ ఫైనల్లో కొన్ని తప్పులు చేసి భారీ మూల్యం చెల్లించుకుందని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. ఆ జట్టు కొన్ని మౌలిక విషయాలను అమలు చేయడంలో విఫలమై ఓటమి పాలైందన్నాడు. ' టోర్నమెంట్‌కు ముందు టీమిండియా కచ్చితంగా టైటిల్ గెలుస్తుందని అనుకున్నా. కాకపోతే నాకౌట్ స్టేజ్‌లో ఆ జట్టు కొన్ని తప్పులు చేసింది. ప్రత్యేకంగా నోబాల్స్ వేసి దానికి తగిన మూల్యం చెల్లించుకుంది. ఆ మ్యాచ్‌లో ధోని సేన నమోదు చేసిన 193 పరుగులు మంచి స్కోరే. దాంతో పాటు వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్‌ను తొందరగా పెవిలియన్ కు పంపడంతో ఆ మ్యాచ్ లో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని భావించా. కానీ టీ 20ల్లో ఏదైనా జరగొచ్చు. విండీస్ అద్భుతమైన విజయంతో క్రెడిట్ ను సొంతం చేసుకుంది' అని వార్న్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిపై వార్న్ ప్రశంసల వర్షం కురిపించాడు. మూడో స్థానంలో విరాటే అత్యుత్తమ ఆటగాడని వార్న్ కొనియాడాడు. -
ఫైనల్‌కు విండీస్
-
టీ20ల్లో టార్గెట్ ఎంత ఇచ్చినా తక్కువే: ధోనీ
ముంబై: వరల్డ్ టీ 20 ప్రపంచకప్ లో గురువారం జరిగిన సెమీస్ లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓటమి చవిచూసినా భారత్ గుడ్ క్రికెట్ ఆడిందని కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ ఫార్మాట్లో ఎన్ని పరుగుల టార్గెట్ ఉన్నా సేఫ్ స్కోరు కాదని చెప్పాడు. ఒకవేళ భారత్ 220, 230 స్కోర్ చేసినా ప్రత్యర్థి జట్టు ఛేజ్ చేసే అవకాశం ఉందని, విండీస్ అదేపని చేసిందన్నాడు. ఛేజింగ్ చేసేటప్పుడు వికెట్ సహకరిస్తుందా లేదా అనేది చాలా కీలకమని, రహానే తన బాధ్యత నిర్వర్తించాడని ధోనీ పేర్కొన్నాడు. బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా పూర్తిగా విఫలమయ్యారని వారు కాస్త రాణించినట్లయితే భారత్ కచ్చితంగా మ్యాచ్ గెలిచి ఫైనల్ చేరేదని ధోనీ ధీమా వ్యక్తంచేశాడు. అయితే రోహిత్, కోహ్లీ మాదిరిగా రహానే బ్యాటింగ్ చేయలేడన్నాడు. చివరి ఓవర్లలో జట్టు మరో 10-15 పరుగులు చేసి ఉండాల్సిందని, గెలిచే అవకాశాలు మెరగయ్యేవని చెప్పుకొచ్చాడు. అదృష్టాన్ని నమ్మకం కంటే కూడా గేమ్ ప్లానింగ్ జట్టుని గెలిపిస్తుందన్నాడు. అయితే ఫస్ట్ బ్యాటింగ్ లో 193 స్కోర్ అనేది చాలా గొప్పవిషయమని, టాస్ గెలిచి ఉంటే పరిస్థితులు తమకు అనుకూలించేవని కెప్టెన్ ధోనీ మనసులో మాట బయటపెట్టాడు. -
ధోని సేన ఇంటికి.. ఫైనల్‌కు విండీస్
ముంబై: వరల్డ్ టీ 20లో మరో ఉత్కంఠ పోరుకు తెరలేచింది. గురువారం వాంఖేడే స్టేడియంలో భారత్ తో చివరి వరకూ తీవ్ర ఆసక్తిని రేపిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో వెస్టిండీస్ అద్భుత విజయాన్ని సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఊహించిన మలుపుల మధ్య ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ధోని సేన ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. భారత్ విసిరిన 194 పరుగుల లక్ష్యాన్ని కరీబియన్లు ఇంకా రెండు బంతులు ఉండగానే ఛేదించి తుదిపోరుకు అర్హత సాధించారు. ఏప్రిల్ 3 వ తేదీన విండీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరుగనుంది. విండీస్ ఆటగాళ్లలో క్రిస్ గేల్ (5), మార్లోన్ శామ్యూల్స్(8) ఆదిలోనే పెవిలియన్ కు చేరి నిరాశపరిచినా.. ఆ తరువాత చార్లెస్ (52; 36 బంతుల్లో 7 ఫోర్లు,2 సిక్సర్లు), సిమ్మన్స్(83నాటౌట్; 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) లు విండీస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ జోడీ మూడో వికెట్ కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో విండీస్ విజయం దిశగా పయనించింది. ఆ తరువాత రస్సెల్(43 నాటౌట్;20 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దాటిగా ఆడి విండీస్ ఫైనల్ కు చేరడంలో సహకరించాడు. అంతకుముందు టాస్ ఓడి టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లి మరోసారి మెరుపులు మెరిపించాడు. విరాట్ (89 నాటౌట్; 47 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్) చెలరేగి ఆడటంతో టీమిండియా 193 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(43;31 బంతుల్లో 3 ఫోర్లు, 3సిక్సర్లు) దాటిగా ఆడగా, అజింక్యా రహానే(40;35 బంతుల్లో 2 ఫోర్లు) సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. అయితే జట్టు స్కోరు 62 పరుగుల వద్ద రోహిత్ శర్మ.. బద్రీ బౌలింగ్ లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో రహానేకు జతకలిసిన కోహ్లి ఆదిలో ఆచితూచి బ్యాటింగ్ చేసినా తరువాత తనదైన మార్కుతో ఆటతో రెచ్చిపోయాడు. అతనికి జతగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(15 నాటౌట్; 9 బంతుల్లో 1 ఫోర్) అండగా నిలవడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 192 పరుగులు నమోదు చేసింది. విండీస్ బౌలర్లలో రస్సెల్, బద్రిలకు తలో వికెట్ దక్కింది. -
విరాట్ కోహ్లి సరికొత్త రికార్డు
ముంబై: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి సరికొత్త రికార్డు నమోదు చేశాడు. వరల్డ్ టీ 20లో భాగంగా గురువారం ఇక్కడ విండీస్ తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ (89 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించి.. ట్వంటీ 20ల్లో పదహారవ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ 20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకూ ఇన్ని అర్థశతకాలు ఏ బ్యాట్‌మెన్ చేయలేదు. అంతకుముందు ఈ రికార్డు క్రిస్ గేల్, బ్రెండన్ మెక కల్లమ్ పేరిట ఉండేది. వీరిద్దరూ టీ 20ల్లో 15 హాఫ్ సెంచరీలు సాధించారు. -
కోహ్లిని రనౌట్ చేసే ఛాన్స్ వచ్చినా..
ముంబై: వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ వెస్టిండీస్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లికి అదృష్టం కలిసొచ్చింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా స్కోరు వికెట్ నష్టానికి 68 పరుగుల వద్ద ఉండగా కోహ్లి రెండు సార్లు రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అది కూడా ఒకే బంతికి కావడం ఇక్కడ గమనార్హం. ఇన్నింగ్స్ తొమ్మిది ఓవర్ లో భాగంగా బ్రేవో వేసిన మూడో బంతి నోబాల్ అయ్యింది. దీంతో ఫ్రీ హిట్ అయిన ఆ బంతిని బ్రేవో ఆఫ్ స్టంట్ కొద్దిగా దూరంగా వేయడంతో కీపర్ రామ్ దిన్ చేతుల్లోకి వెళ్లింది. అయితే అప్పటికే క్రీజ్ వదిలి బయట ఉన్న విరాట్ ను రనౌట్ చేద్దామని రామ్ దిన్ ప్రయత్నించినా సఫలం కాలేదు. అదే బంతికి బౌలర్ ఎండ్ లో ఉన్న బ్రేవ్ పరుగొత్తుకొచ్చి మరోసారి రనౌట్ చేయడానికి యత్నించినా అది కూడా వికెట్లకు దూరంగా వెళ్లింది. దీంతో విరాట్ కు వరుసగా రెండు లైఫ్‌లు లభించాయి. అప్పటికి విరాట్ వ్యక్తిగత స్కోరు ఒక పరుగు మాత్రమే. ఆ తరువాత విరాట్ (89 నాటౌట్; 47 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్) దాటిగా బ్యాటింగ్ చేశాడు. దీంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 192 భారీ పరుగులు నమోదు చేసింది -
కోహ్లి మెరుపులు
ముంబై: వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లి మరోసారి మెరుపులు మెరిపించాడు. విరాట్ (89 నాటౌట్; 47 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్) చెలరేగి ఆడటంతో టీమిండియా 193 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(43;31 బంతుల్లో 3 ఫోర్లు, 3సిక్సర్లు) దాటిగా ఆడగా, అజింక్యా రహానే(40;35 బంతుల్లో 2 ఫోర్లు) సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. అయితే జట్టు స్కోరు 62 పరుగుల వద్ద రోహిత్ శర్మ.. బద్రీ బౌలింగ్ లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో రహానేకు జతకలిసిన కోహ్లి ఆదిలో ఆచితూచి బ్యాటింగ్ చేసినా తరువాత తనదైన మార్కుతో ఆటతో రెచ్చిపోయాడు. అతనికి జతగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(15 నాటౌట్; 9 బంతుల్లో 1 ఫోర్) అండగా నిలవడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 192 పరుగులు నమోదు చేసింది. విండీస్ బౌలర్లలో రస్సెల్, బద్రిలకు తలో వికెట్ దక్కింది. -
విండీస్ ఫీల్డింగ్: భారత్ బ్యాటింగ్
ముంబై:వరల్డ్ టీ 20లో భాగంగా గురువారం వాంఖేడే స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ డారెన్ స్యామీ తొలుత ధోని సేనను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించాడు. తొలి మ్యాచ్‌లో అనూహ్య పరాజయం తర్వాత కోలుకొని భారత్ సెమీస్‌కు చేరగా...మూడు విజయాలతో సెమీస్ స్థానం సంపాదించాక అఫ్ఘానిస్తాన్ చేతిలో అనూహ్య ఓటమితో వెస్టిండీస్ ఈ మ్యాచ్‌కు వచ్చింది. భారత జట్టులో కాలి మడమ గాయంతో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో మనీష్ పాండే తుది జట్టులోకి వచ్చాడు. అయితే పేలవమైన ఫామ్‌తో నిరాశపరుస్తున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో అజింక్యా రహానేకు స్థానం కల్పించారు. భారత్, వెస్టిండీస్‌ల మధ్య ఇప్పటివరకూ జరిగిన 4 టి20 మ్యాచ్‌ల్లో చెరో రెండు గెలిచాయి. ప్రపంచకప్‌లలో మూడు ఆడగా... భారత్ ఒకటి గెలిచి, రెండు ఓడింది. -
జాసన్ రాయ్ వీరవిహారం: ఫైనల్లో ఇంగ్లండ్
ఢిల్లీ: టి20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ జట్టు చాంపియన్ తరహా ఆటతీరును ప్రదర్శించింది. అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ అద్భుతమైన ఆట తీరు కనబరిచిన ఇంగ్లండ్.. న్యూజిలాండ్ ను మట్టికరిపించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి సెమీ ఫైనల్లో భాగంగా బుధవారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన పోరులో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. ఓపెనర్ జాసన్ రాయ్(78;44 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో ఇంగ్లండ్ చిరస్మరణీయమైన విజయాన్నిఅందుకుంది. కివీస్ విసిరిన 154 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ చెలరేగిపోయింది. ఓ వైపు జాసన్ రాయ్ తనదైన దూకుడును ప్రదర్శించగా, అతనికి అలెక్స్ హేల్స్(20) సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. ఈ జోడి 8.2 ఓవర్లలో తొలి వికెట్ కు 82 పరుగుల భాగస్యామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ పటిష్ట స్థితికి చేరింది. ఇదే క్రమంలో జాసన్ రాయ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కాగా, జట్టు స్కోరు 110 పరుగుల వద్ద ఉండగా రాయ్, కెప్టెన్ మోర్గాన్ లు వరుస బంతుల్లో అవుట్ కావడంతో ఇంగ్లండ్ కాస్త తడబడినట్లు కనిపించింది. ఆ తరువాత జో రూట్(27నాటౌట్; 22 బంతుల్లో 3 ఫోర్లు), బట్లర్ (32 నాటౌట్; 17బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు)లు దాటిగా ఆడటంతో ఇంగ్లండ్ ఇంకా 17 బంతులుండగా విజయాన్ని సాధించింది. తద్వారా పొట్టి ఫార్మాట్ వరల్డ్ కప్‌లో తొలిసారి ఫైనల్ కు చేరాలనుకున్న కివీస్ ఆశలు తీరలేదు. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ తీసుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఆదిలోనే విధ్వంసకర ఆటగాడు గప్టిల్(15) వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలో కెప్టెన్ విలియమ్సన్ (32;28 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) , మున్రో(46;32 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్) లు రాణించి జట్టు స్కోరును ముందుకు తీసుకువెళ్లారు. ఈ జోడీ రెండో వికెట్ కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో న్యూజిలాండ్ 10.0 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 89 పరుగులు నమోదు చేసింది. అయితే ఆపై కోరీ అండర్సన్(28) మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోవడంతో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ మూడు వికెట్లు సాధించగా, విల్లే, జోర్డాన్, ప్లంకెట్, మొయిన్ అలీలకు తలో వికెట్ లభించింది. -
ఇంగ్లండ్ విజయలక్ష్యం 154
ఢిల్లీ: వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ బుధవారం ఇంగ్లండ్ జరుగుతున్నతొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ తీసుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ ఆదిలో గప్టిల్(15) వికెట్ ను నష్టపోయింది.అనంతరం కెప్టెన్ విలియమ్సన్ (32;28 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) , మున్రో(46;32 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్) లు రాణించారు. ఈ జోడీ రెండో వికెట్ కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో న్యూజిలాండ్ 10.0 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 89 పరుగులు చేసి పటిష్టంగా కనిపించింది. అయితే ఆపై కోరీ అండర్సన్(28) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. న్యూజిలాండ్ మిగతా ఆటగాళ్లలో రాస్ టేలర్(6), ల్యూక్ రోంచీ(3), సాంట్నార్(7)లు తీవ్రంగా నిరాశపరచడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ మూడు వికెట్లు సాధించగా, విల్లే, జోర్డాన్, ప్లంకెట్, మొయిన్ అలీలకు తలో వికెట్ లభించింది. -
ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
ఢిల్లీ:వరల్డ్ టీ 20లో భాగంగా బుధవారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో వరుస విజయాలు సాధించి న్యూజిలాండ్ మంచి ఊపు మీద ఉండగా, మరోవైపు తడబడుతూ ఇంగ్లండ్ సెమీస్ కు చేరింది.పొట్టి ఫార్మాట్ లో ఒకసారి వరల్డ్ కప్ ను గెలిచిన ఇంగ్లండ్ మరొకసారి తుదిపోరుకు అర్హత సాధించాలని భావిస్తుండగా, న్యూజిలాండ్ మాత్రం తొలిసారి ఫైనల్ కు చేరాలని పట్టుదలగా ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య 13 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఇంగ్లండ్ 8 గెలిచి, నాలుగు ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ప్రపంచకప్‌లలో మాత్రం నాలుగు మ్యాచ్‌లు జరిగితే చెరో రెండు గెలిచాయి. -
'విండీస్‌ను తక్కువ అంచనా వేయొద్దు'
కోల్‌కతా: వరల్డ్ టీ 20లో భాగంగా గురువారం భారత్‌తో తలపడే వెస్టిండీస్‌ను తక్కువ అంచనా వేయొద్దని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సూచించాడు. ఆ పోరును ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోవద్దని ధోని అండ్ గ్యాంగ్ ను గంగూలీ హెచ్చరించాడు. 'విండీస్‌తో జరజాగ్రత్త. వారి బౌలింగ్ శైలి భారత్ లోని పిచ్‌లకు సరిగ్గా సరిపోతుంది. దాంతో పాటు క్రిస్ గేల్, సిమ్మన్స్లతో కూడిన వారి బ్యాటింగ్ చాలా ప్రమాదకరం. ఆ జట్టుతో పోరుకు అన్నిరకాలకు సిద్ధంకండి'అని టీమిండియాకు విజ్ఞప్తి చేశాడు. లక్ష్య ఛేదనలో సచిన్ కంటే విరాట్ కోహ్లినే అత్యుత్తమ ఆటగాడు. గ్రేట్ మ్యాన్ సచిన్ కు ఎప్పుడూ ఓ ప్రత్యేకత ఉంది. ఛేజింగ్ లో మాత్రం సచిన్ కంటే విరాట్ బెస్ట్ అనేది నా అభిప్రాయం'అని గంగూలీ పేర్కొన్నాడు. విధ్వంసకర ఆటగాళ్లు మా సొంతం: స్యామీ వెస్టిండీస్ జట్టులో విధ్వంసకర ఆటగాళ్లకు కొదవలేదని ఆ జట్టు కెప్టెన్ డారెన్ స్యామీ స్పష్టం చేశాడు. టీమిండియా జట్టులో విరాట్ కోహ్లి కీలక ఆటగాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అయితే అవతలి జట్టు బలాబలాలపై కంటే తమ జట్టు ఆటతీరుపైనే ప్రధానం దృష్టి సారించామన్నాడు.' మా డ్రెస్సింగ్ రూమ్ చాలా మంది విధ్వంసకర ఆటగాళ్లతో నిండి వుంది. టీమిండియాతో పోరుకు సిద్ధంగా ఉన్నాం. ధోని సేన ఎదుర్కొనే సత్తా మాలో వుంది'అని స్యామీ హెచ్చరించాడు. -
నేను ఇంటికి వెళ్లడానికి సిద్ధం: వకార్
లాహోర్:వరల్డ్ టీ 20లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శనపై ఆ జట్టు కోచ్ వకార్ యూనస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మేరకు మంగళవారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి నివేదిక సమర్పించిన వకార్.. జట్టు ప్రదర్శనపై క్షమాపణలు తెలియజేశారు. అనంతరం పాకిస్తాన్ మీడియాతో మాట్లాడిన వకార్.. అసలు తమ జట్టులో లోపాలు ఎక్కడున్నాయన్న దానిపై చర్చించి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నాడు. దీనికి ఏ ఒక్కర్నో నిందించడం సరికాదని స్పష్టం చేశాడు. పాకిస్తాన్ జట్టులోని అంతర్గత లోపాలపై క్షణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని వకార్ అన్నాడు. 'వరల్డ్ టీ 20లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన చాలా బాధించింది. జట్టు ప్రదర్శనపై సుదీర్ఘంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో నేను పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాల్సి వస్తే తప్పకుండా వెళతా. పాకిస్తాన్ జట్టులో ఎటువంటి రాజకీయాలు, గ్రూప్ లు లేవు. కేవలం మాది పేలవ ప్రదర్శన మాత్రమే. ఆ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. మా దేశవాళీ క్రికెట్ కూడా చాలా బలహీనంగా ఉంది. మా దేశంలో ఎక్కువ క్రికెట్ ఆడకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. నా భవిష్యత్తును క్రికెట్ తో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. క్రికెట్ అనేది స్టార్స్ గేమ్ అయితే కాదు' అని వకార్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. -
డు ప్లెసిస్‌కు జరిమానా
న్యూఢిల్లీ:వరల్డ్ టీ 20లో శ్రీలంకతో సోమవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్‌కు మ్యాచ్ ఫీజులు యాభై శాతం జరిమానా పడింది. శ్రీలంక విసిరిన 121 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 13.0 ఓవర్ లో డు ప్లెసిస్ ఎల్బీగా అవుటయ్యాడు. అయితే డు ప్లెసిస్ క్రీజ్ ను వదిలి వెళుతున్న సమయంలో తలను అడ్డంగా ఊపుతూ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనల్లో ఆర్టికల్ 2.1.5 కిందకు రావడంతో డు ప్లెసిస్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా పడింది. ఇటీవల భారత్ తో చెన్నైలో జరిగిన నాల్గో వన్డే సందర్భంలో కూడా డు ప్లెసిస్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఏడాది కాలంలో ఒకే తరహా తప్పును చేయడం లెవెల్-1 నిబంధనను ఉల్లంఘించడం కావడంతో డు ప్లెసిస్ కు భారీ జరిమానా పడింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. -
'వారి ఫేవరెట్ ట్యాగ్‌ను పట్టించుకోం'
ఢిల్లీ: వరల్డ్ ట్వంటీ20లో ఇంగ్లండ్ జట్టు ప్రదర్శన సంతృప్తికరంగానే సాగుతుందని ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పష్టం చేశాడు. తమ జట్టు నాకౌట్ కు చేరే క్రమంలో అనేక గుణపాఠాలు నేర్చుకుని పటిష్టంగా తయారైందన్నాడు. తాము వెస్టిండీస్, దక్షిణాఫ్రికా వంటి జట్లపై భారీ స్కోర్లు నమోదు చేస్తే, అప్ఘానిస్తాన్ పై నమోదు చేసిన స్వల్ప స్కోరును తమ స్పిన్నర్లు కాపాడిన తీరు నిజంగా అభినందనీయమన్నాడు. శ్రీలంకతో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో పేసర్లు విశేషంగా రాణించారన్నాడు. ప్రత్యేకంగా చివరి ఓవర్లలో శ్రీలంకను కట్టడి చేసి విజయం సాధించిన తీరును మోర్గాన్ గుర్తు చేశాడు. ' న్యూజిలాండ్ తో జరిగే సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకునే సమయం ఆసన్నమైంది. ఈ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్నకివీస్ తో రేపు రసవత్తరపోరు తప్పదు. ఆ పోరులో విజయం సాధించి ఫైనల్ కు చేరాలని ఆతృతగా ఉన్నాం. మాపై న్యూజిలాండ్ ను ఫేవరెట్ గా పరిగణిస్తున్నా, ఆ ట్యాగ్ ను పట్టించుకోం. 2010 లో వరల్డ్ కప్ గెలిచిన మా జట్టు అదే పునరావృతం చేయాలని భావిస్తోంది' అని మోర్గాన్ పేర్కొన్నాడు. -
ఆశలు వదులుకున్నాం:విరాట్
మొహాలి:వరల్డ్ టీ 20లో ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో గెలుస్తామని అసలు అనుకోలేదని టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తాజాగా స్పష్టం చేశాడు. ఆదిలో ముఖ్యమైన వికెట్లను చేజార్చుకున్న తాము.. ఆసీస్ విధించిన లక్ష్యాన్ని ఛేదిస్తామని భావించ లేదన్నాడు. ఒకానొక దశలో టోర్నీ నుంచి నిష్క్రమించామనే అనుకున్నట్లు విరాట్ పేర్కొన్నాడు. 'ముఖ్యంగా 10.0 ఓవర్లు ముగిసిన తరువాత పరిస్థితి మా చేతుల్లో లేనట్లే ఉంది. దాదాపు ఆశలు వదులు కున్నాం. అయితే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వచ్చిన తరువాత మ్యాచ్ మా అధీనంలోకి వచ్చింది. మేము ఏం చేశామన్నది ఆ సమయంలో తెలియదు. బాధ్యతాయుతంగా ఆడాలని మాత్రమే నిర్ణయించుకున్నా. భారత జట్టు కోసం గొప్ప ఇన్నింగ్స్ ఆడటం నిజంగా ఆనందాన్నిచ్చింది. ధోని ఫోర్ తో ఇన్నింగ్స్ ను ముగించిన విధానం చాలా బాగుంది. దానిపై ఏమి మాట్లాడాలో నిజంగా తెలియడం లేదు. మరోసారి ధోని ఫోర్ తో జట్టుకు విజయాన్ని అందించాడు. అదొక అద్భుతమైన క్షణం'అని కోహ్లి తెలిపాడు. విజయానికి చివరి మూడు ఓవర్లలో 39 పరుగులు కావాల్సిన సమయంలో తాను ఆడిన ఇన్నింగ్స్ ఇంతకు ముందెప్పుడూ ఆడలేదన్నాడు. ఆ సమయంలో కనీసం ఓవర్ కు 15 పరుగులు రాబట్టాలనే కృతనిశ్చయంతో మాత్రమే బ్యాటింగ్ చేసినట్టు పేర్కొన్నాడు. -
శ్రీలంకపై దక్షిణాఫ్రికా ఘన విజయం
ఢిల్లీ: వరల్డ్ ట్వంటీ 20 టోర్నీలో శ్రీలంకతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక విసిరిన 121 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆదిలోనే డీ కాక్ (9) వికెట్ ను కోల్పోయింది. అనంతరం హషీమ్ ఆమ్లా(56 నాటౌట్), డుప్లెసిస్(31) ఏబీ డివిలియర్స్(20 నాటౌట్)లు రాణించడంతో దక్షిణాఫ్రికా 17.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి నెగ్గింది. దీంతో ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా రెండో విజయం సాధించగా, డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన లంకేయులు ఒక గెలుపుతో సరిపెట్టుకున్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 120 పరుగులు నమోదు చేసింది. లంక జట్టులో చండీమల్(21), తిలకరత్నే దిల్షాన్(36) లు మోస్తరుగా రాణించారు. అనంతరం సిరివర్ధనే(15), షనాకా(20నాటౌట్)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటడంతో దీంతో శ్రీలంక స్వల్ప స్కోరుకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫంగిసో, బెహర్దియన్, అబాట్‌లు తలో రెండు వికెట్లు సాధించగా స్టెయిన్,ఇమ్రాన్ తాహీర్‌లకు ఒక్కో వికెట్ చొప్పున దక్కింది. ఇప్పటికే ఇరు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్ కు ఎటువంటి ప్రాధాన్యత లేదు. గ్రూప్-1లో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా-శ్రీలంకలు చెరో మాత్రమే గెలిచి లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టాయి. ఈ గ్రూప్ నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే. -
'మేము వరల్డ్ కప్ ను గెలుస్తాం'
న్యూఢిల్లీ: తమ క్రికెట్ జట్టుకు రెండోసారి వరల్డ్ ట్వంటీ 20 కప్ ను గెలుస్తుందని ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈసారి పొట్టి ఫార్మాట్ లో వరల్డ్ కప్ ను అందుకునే అన్ని అర్హతలు తమకున్నాయన్నాడు. ' ఈసారి ఇంగ్లండ్ వరల్డ్ కప్ ను గెలిస్తే మాపై ఉన్న అన్ని అపోహలు తొలగిపోతాయి. మేము వరల్డ్ కప్ ను గెలిచి మాపై ఉన్న ముద్రను తప్పని నిరూపిస్తాం' అని బెన్ స్టోక్స్ తెలిపాడు. తాము ఇప్పటివరకూ ఒకసారి మాత్రమే ఐసీసీ ట్రోఫీని అందుకున్నామని, మరోసారి అదే ప్రయత్నంలో ఉన్నట్లు పేర్కొన్నాడు. శ్రీలంకతో జరిగిన గత మ్యాచ్ లో చివరి ఓవర్ వేసిన స్టోక్స్ నాలుగు డాట్ బాల్స్ వేసి ఇంగ్లండ్ సెమీస్ చేరడానికి సహకరించాడు. దీన్ని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్న ఈ స్టార్ ఆల్ రౌండర్.. ఎంజెలో మాథ్యూస్ చెలరేగి పోతున్న తరుణంలో వేసిన ఆ ఓవర్ లో తాను కొద్దిగా ఒత్తిడికి లోనైనట్లు స్టోక్స్ తెలిపాడు. -
యువరాజ్ స్థానంలో మనీష్?
ముంబై:వరల్డ్ టీ 20లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాల గాయంతో సతమతమైన టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సెమీ ఫైనల్‌కు దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆసీస్ మ్యాచ్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు ఛేజింగ్ దిగిన అనంతరం ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన యువరాజ్ తొడకండరాలు పట్టేశాయి. దీంతో యువీ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలో గురువారం వెస్టిండీస్ తో జరిగే సెమీ ఫైనల్లో మ్యాచ్ లో యువీ పాల్గొనడం అనుమానంగా మారింది. ఒకవేళ ఆ మ్యాచ్ సమయానికి యువరాజ్ ఫిట్ కాని పక్షంలో మనీష్ పాండేను తుది జట్టులో తీసుకునే అవకాశం ఉంది. విండీస్ తో మ్యాచ్ కు యువీ దూరమైతే మనీష్ ను తీసుకోవాలని టీమిండియా సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ లో చివరి మ్యాచ్ ఆడిన మనీష్ సెంచరీతో ఆకట్టుకుని భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. -
సఫారీల విజయలక్ష్యం 121
ఢిల్లీ: వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 121 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత శ్రీలంకను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన లంక జట్టులో చండీమల్(21), తిలకరత్నే దిల్షాన్(36) లు మోస్తరుగా రాణించారు. అనంతరం సిరివర్ధనే(15), షనాకా(20నాటౌట్)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటారు. దీంతో శ్రీలంక 19. 3 ఓవర్లలో 120 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫంగిసో, బెహర్దియన్, అబాట్‌లు తలో రెండు వికెట్లు సాధించగా స్టెయిన్,ఇమ్రాన్ తాహీర్‌లకు ఒక్కో వికెట్ చొప్పున దక్కింది. ఇప్పటికే ఇరు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్ కు ఎటువంటి ప్రాధాన్యత లేదు. గ్రూప్-1లో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా-శ్రీలంకలు చెరో మాత్రమే గెలిచి లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టాయి. ఈ గ్రూప్ నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే. -
ఫీల్డింగ్ ఎంచుకున్నదక్షిణాఫ్రికా
ఢిల్లీ: వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా సోమవారం శ్రీలంకతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఇరు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్ కు ఎటువంటి ప్రాధాన్యత లేదు. గ్రూప్-1లో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా-శ్రీలంకలు చెరో మాత్రమే గెలిచి లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టాయి. ఈ గ్రూప్ నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే. -
సెమీ ఫైనల్లో ధోని సేన
మొహాలి: పొట్టి ఫార్మాట్ లో ఆస్ట్రేలియాపై మరోసారి టీమిండియాదే పైచేయి అయ్యింది. తమ బౌలింగ్, బ్యాటింగ్ లో బలం చూపించిన ధోని సేన ఆసీస్ ను మట్టికరిపించింది. వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా గ్రూప్-2లో ఆదివారం ఆసీస్ తో జరిగిన కీలక మ్యాచ్ లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచి సెమీ ఫైనల్ కు చేరింది. కీలక వికెట్లను ఆదిలోనే చేజార్చుకున్న ధోని సేన కడవరకూ పోరాడి విజయ ఢంకాను మోగించింది. తద్వారా ఆసీస్ లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్ర్కమించింది. భారత విజయంలో విరాట్ కోహ్లి(82 నాటౌట్; 51 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ముఖ్య భూమిక పోషించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్లు అరోన్ ఫించ్(43; 34 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు), ఉస్మాన్ ఖవాజా(26; 16 బంతుల్లో 6 ఫోర్లు) చెలరేగి ఆడటంతో ఆసీస్ నాల్గో ఓవర్ ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. అయితే ఆసీస్ స్కోరు 54 పరుగుల వద్ద ఖవాజా తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆపై డేవిడ్ వార్నర్ (6) రెండో వికెట్ గా, కెప్టెన్ స్టీవ్ స్మిత్(2) మూడో వికెట్ గా స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు పంపడంతో ధోని సేన శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. ఆ తరుణంలో ఫించ్ కు మ్యాక్స్ వెల్ జతకలిశాడు. ఈ జోడి ఆసీస్ ఇన్నింగ్స్ కు మరమ్మత్తులు చేపట్టి స్కోరు బోర్డును ముందుకు నడిపించే యత్నం చేసింది. అయితే జట్టు స్కోరు 100 పరుగుల వద్ద ఫించ్ అవుట్ కావడంతో ఇన్నింగ్స్ ను చక్కబెట్టే బాధ్యతను షేన్ వాట్సన్ -మ్యాక్స్ వెల్ జోడి తీసుకుంది. ఈ క్రమంలోనే మాక్స్ వెల్ (31;28 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్) , షేన్ వాట్సన్(18 నాటౌట్) మోస్తరుగా రాణించారు. ఇక చివర్లో నేవిల్(10 నాటౌట్; 2 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో ఆసీస్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా, బూమ్రా, నెహ్రా, అశ్విన్, యువరాజ్ సింగ్ లకు తలో వికెట్ దక్కింది. అనంతరం ఆసీస్ విసిరిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఆదిలోనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్(13), రోహిత్ శర్మ(12), సురేష్ రైనా(10)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తరుణంలో విరాట్ కోహ్లి-యువరాజ్ సింగ్ ల జోడి ఇన్నింగ్స్ కు మరమ్మత్తులు చేపట్టింది. అయితే జట్టు స్కోరు 94 పరుగుల వద్ద యువరాజ్ సింగ్(21)నాల్గో వికెట్ గా పెవిలియన్ చేరాడు. కాగా, విరాట్ మాత్ర్రం దూకుడును కొనసాగిస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. ఇదే క్రమంలో విరాట్ హాఫ్ సెంచరీ మార్కును చేరగా, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(18 నాటౌట్; 10 బంతుల్లో 3 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడాడు. దీంతో టీమిండియా ఇంకా ఐదు బంతులు మిగిలి వుండగానే విజయం సాధించింది. భారత బౌలర్లు భళా.. ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ దిగడమే తరువాయి భారత బౌలర్లపై విరుచుకుపడింది. ఆశిష్ నెహ్రా వేసిన తొలి బంతికి బౌండరీ సాధించిన ఉస్మాన్ ఖావాజా.. ఆ తరువాత బూమ్రా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ లో మరింత రెచ్చిపోయాడు. ఆ ఓవర్ నాలుగు ఫోర్లు కొట్టి ఆసీస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో రెండో ఓవర్ ముగిసే సరికి ఆసీస్ ఖాతాలో 21 పరుగులు చేరాయి. ఆపై నెహ్రా వేసిన మూడో ఓవర్ లో అరోన్ ఫించ్, ఖవాజాలు కలిసి 10 పరుగులు సాధించి తమ జోరును యథావిధిగా కొనసాగించారు. ఆ సమయంలో అశ్విన్ ను రంగంలోకి దింపినా ఫలితం లేకుండా పోయింది. అశ్విన్ వేసిన నాల్గో ఓవర్ లో మరింత వేగం పెంచిన ఆసీస్ 22 పరుగులను పిండుకుంది. దీంతో నాల్గో ఓవర్ ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు నమోదు చేసింది. ఇక ఐదో ఓవర్ ను అందుకున్న నెహ్రా రెండో బంతికే ఖవాజాను పెవిలియన్ కు పంపి భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఖవాజా ఆఫ్ స్టంప్ కు బయటకు వెళుతున్న బంతిని కట్ చేయబోయి ధోనికి చిక్కాడు. దాంతో ఆసీస్ స్కోరు బోర్డులో వేగం క్రమేపి తగ్గుతూ వచ్చింది. ఆ సమయంలో ఫించ్ తో కలిసిన డేవిడ్ వార్నర్ పరుగులు సాధించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ లో ముందుకొచ్చి ఆడబోయిన వార్నర్ ను ధోని స్టంపింగ్ చేయడంతో ఆసీస్ 72 పరుగుల వద్ద రెండో వికెట్ ను నష్టపోయింది. ఆ తరువాత రెండు పరుగుల వ్యవధిలో స్టీవ్ స్మిత్ పెవిలియన్ కు చేరాడు. యువరాజ్ సింగ్ బౌలింగ్ లో ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు స్మిత్. అయితే ఆసీస్ కీలక వికెట్లను చేజార్చుకోవడంతో ఓపెనర్ గా వచ్చిన అరోన్ ఫించ్ తన దూకుడును కొద్దిగా తగ్గించాడు. దీంతో 13 ఓవర్ లో కానీ ఆసీస్ 100 పరుగుల మార్కును చేరలేకపోయింది. అదే సమయంలో పాండ్యా బౌలింగ్ లో భారీ షాట్ కు పోయి ధావన్ చేతికి చిక్కాడు ఫించ్. ఆపై మ్యాక్స్ వెల్, షేన్ వాట్సన్ లు స్కోరును పెంచుదామని చేసిన ప్రయత్నాన్ని భారత బౌలర్లు సమర్దవంతంగా తిప్పికొట్టారు. ఆసీస్ రెండొందలకు పైగా స్కోరు నమోదు చేస్తుందని భావించిన తరుణంలో భారత బౌలర్లు విశేషంగా రాణించడం నిజంగా అభినందనీయమే. -
ధోని సేన విజయలక్ష్యం 161
మొహాలి:వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా భారత్ తో జరుగుతున్న పోరులో ఆస్ట్రేలియా 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. అరోన్ ఫించ్(43; 34 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు), ఉస్మాన్ ఖవాజా(26; 16 బంతుల్లో 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు. ఈ క్రమంలోనే నాల్గో ఓవర్ ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ 200 పైగా స్కోరును నమోదు చేయడం ఖాయంగా కనిపించింది. అయితే ఆ తరువాత భారత బౌలర్లు రాణించడంతో ఆసీస్ వేగం తగ్గింది. డేవిడ్ వార్నర్(6), కెప్టెన్ స్టీవ్ స్మిత్(2) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు పంపడంతో ధోని సేన శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. ఇక ఆపై మ్యాక్స్ వెల్ (31;28 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్) , షేన్ వాట్సన్(18 నాటౌట్) మోస్తరుగా రాణించడంతో ఆసీస్ కాస్త ఫర్వాలేదనిపించింది. చివర్లో నేవిల్(10 నాటౌట్; 2 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు నమోదు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా, బూమ్రా, నెహ్రా, అశ్విన్, యువరాజ్ సింగ్ లకు తలో వికెట్ దక్కింది. -
భారత్‌తో వరల్డ్ టీ 20:ఆసీస్ బ్యాటింగ్
మొహాలి: వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా ఆదివారం ఇక్కడ భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొహాలి పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపింది. ఇప్పటివరకూ జరిగిన లీగ్ మ్యాచ్ లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్ లు గెలవడంతో ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఎలాంటి గణాంకాలు, రన్రేట్లతో పని లేకుండా సెమీ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. దీంతో భారత్-ఆసీస్ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఉత్కంఠభరితంగా సాగిన గత మ్యాచ్‌లో భారత్ ఒక పరుగుతో గట్టెక్కగా, ఇదే మైదానంలో శుక్రవారం పాక్‌ను చిత్తు చేసి ఆసీస్ ఆత్మవిశ్వాసంతో ఉంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు 12 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 8 గెలిచి 4 ఓడింది. వరల్డ్‌కప్‌లలో 4 మ్యాచ్‌లలో చెరో 2 గెలిచారు. -
విండీస్‌కు అఫ్ఘాన్ షాక్
నాగ్‌పూర్:వరల్డ్ టీ 20లో అఫ్ఘానిస్తాన్ సంచలన విజయం సాధించింది. గ్రూప్-1లో భాగంగా ఆదివారం విండీస్ తో జరిగిన మ్యాచ్‌లో అఫ్ఘాన్లు అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు. ఈ టోర్నీలో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న పసికూనలు.. కరీబియన్లకు షాకిచ్చారు. తొలుత అఫ్ఘాన్‌ను 123 పరుగులకే కట్టడి చేసిన వెస్టిండీస్.. ఆ తరువాత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడి ఆరు పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. తద్వారా లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడిన విండీస్ తొలిసారి పరాజయం ఎదుర్కొంది. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ తీసుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన అఫ్ఘాన్ ఆదిలోనే ఉస్మాన్ ఘని(4) వికెట్ ను నష్టపోయింది. అనంతరం మరో ఓపెనర్ మొహ్మద్ షెహజాద్(24) ఫర్వాలేదనిపించాడు. ఆపై అస్గర్ స్టానిక్ జాయ్(16), గుల్దాబిన్ నైబ్(8), షెన్వారీ(1)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరడంతో అఫ్ఘాన్ 56 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో నజిబుల్లా జద్రాన్(48 నాటౌట్. 40 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో అఫ్ఘానిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. అనంతరం 124 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్ 20.0 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టానికి 117 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. చార్లెస్(22), డ్వేన్ బ్రేవో(28), ఫ్లెచర్(11), రామ్ దిన్(18), బ్రాత్ వైట్(13)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటడంతో విండీస్ కు ఓటమి తప్పలేదు. అఫ్ఘాన్ బౌలర్లలో మొహ్మద్ నబీ, రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు సాధించగా,అమిర్ హమ్జా, హమిద్ హసన్,గుల్దాబిన్ నైబ్ లకు ఒక్కో వికెట్ చొప్పున దక్కింది. -
రాణించిన కరీబియన్ బౌలర్లు
నాగ్‌పూర్:వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా గ్రూప్-1లో అఫ్ఘానిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్ బౌలర్లు రాణించారు. అఫ్ఘాన్ ను సాధారణ స్కోరుకే కట్టడి చేసిన కరీబియన్లు మరోసారి తమ జోరును ప్రదర్శించారు. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ తీసుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన అఫ్ఘాన్ ఆదిలోనే ఉస్మాన్ ఘని(4) వికెట్ ను నష్టపోయింది. అనంతరం మరో ఓపెనర్ మొహ్మద్ షెహజాద్(24) ఫర్వాలేదనిపించాడు. ఆపై అస్గర్ స్టానిక్ జాయ్(16), గుల్దాబిన్ నైబ్(8), షెన్వారీ(1)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరడంతో అఫ్ఘాన్ 56 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో నజిబుల్లా జద్రాన్(48 నాటౌట్. 40 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో అఫ్ఘానిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో శామ్యూల్ బద్రి మూడు వికెట్లు సాధించగా, రస్సెల్ రెండు, బెన్, స్యామీలకు తలో వికెట్ లభించింది. -
సెమీ ఫైనల్లో ఇంగ్లండ్
ఢిల్లీ: వరల్డ్ ట్వంటీ 20 ఇంగ్లండ్ జట్టు సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్-1లో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడిన ఇంగ్లండ్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా టోర్నీలో మూడో గెలుపును అందుకున్నఇంగ్లండ్ సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయంతో దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంటిదారి పట్టాయి. ఇప్పటికే గ్రూప్-1 నుంచి వెస్టిండీస్ సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగులు నమోదు చేసింది. జాసన్ రాయ్(42; 39 బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్సర్లు), బట్లర్(66 నాటౌట్;37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో పాటు, జో రూట్(25), కెప్టెన్ మోర్గాన్(22) లు ఫర్వాలేదనిపించడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరును శ్రీలంక ముందు ఉంచకల్గింది. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన లంకేయులు 15 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. చండీమల్(1), దిల్షాన్(2),సిరివర్ధనే(7), తిరుమన్నే(3)లు తీవ్రంగా నిరాశపరిచారు. అయితే ఆ తరువాత కెప్టెన్ మాథ్యూస్(73; 54 బంతుల్లో 3 ఫోర్లు, 5సిక్సర్లు), కపుగదెరా(30; 27 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్)లు రాణించినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. శ్రీలంక 20.0 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 161 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్ నాలుగు వికెట్లు సాధించగా, విల్లే రెండు వికెట్లు దక్కాయి. -
ఎదురీదుతున్నశ్రీలంక
ఢిల్లీ:వరల్డ్ టీ 20లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక ఎదురీదుతోంది. ఇంగ్లండ్ విసిరిన 172 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక 15 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శ్రీలంక ఆటగాళ్లలో చండీమల్(1), దిల్షాన్(2),సిరివర్ధనే(7), తిరుమన్నే(3)లు తీవ్రంగా నిరాశపరిచి పెవిలియన్ కు చేరారు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లే రెండు వికెట్లు తీయగా, జోర్డాన్ కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలిస్తే నేరుగా సెమీస్ లోకి ప్రవేశిస్తుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జాసన్ రాయ్(42; 39 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బట్లర్(66 నాటౌట్;37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో పాటు, జో రూట్(25), కెప్టెన్ మోర్గాన్(22) లు ఫర్వాలేదనిపించడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. -
శ్రీలంక విజయలక్ష్యం 172
ఢిల్లీ: వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో జరుగుతన్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆదిలో హేల్స్(0) వికెట్ ను నష్టపోయింది. అయితే మరో ఓపెనర్ జాసన్ రాయ్(42; 39 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జో రూట్(25) ఫర్వాలేదనిపించడంతో ఇంగ్లండ్ పరిస్థితి కుదుటపడింది. ఆ తరువాత బట్లర్(66 నాటౌట్;37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. అతనికి కెప్టెన్ మోర్గాన్(22) సహకారం అందించడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో వాండర్ సేకు రెండు వికెట్లు లభించాయి. -
ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక
ఢిల్లీ: వరల్డ్ టీ 20లో భాగంగా గ్రూప్-1లో శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధిస్తే నేరుగా సెమీస్‌కు చేరుతుంది. ఇప్పటికే ఇంగ్లండ్ రెండు విజయాలు సాధించడంతో మూడో విజయం కోసం ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు పెద్దగా ఫామ్ లో శ్రీలంక టోర్నీలో ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచి సెమీస్ ఆశలను దాదాపు క్లిష్టం చేసుకుంది. ఈ గ్రూప్‌లో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే... దక్షిణాఫ్రికా జట్టు ఇంటికి వెళుతుంది. -
బంగ్లాను కుప్పకూల్చిన కివీస్
కోల్‌కతా: వరల్డ్ టీ 20లో పెద్ద పెద్ద జట్లను సైతం వణికించిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు.. తన చివరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం ఘోరంగా చతికిలబడింది. గ్రూప్-2లో భాగంగా శనివారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విలవిల్లాడింది.ఇప్పటికే సెమీస్ కు చేరుకుని మంచి ఊపు మీద ఉన్న కివీలు బంగ్లాను కుప్పకూల్చి 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. తద్వారా టోర్నీలో కివీలు వరుసగా నాల్గో విజయాన్ని దక్కించుకుని లీగ్ దశను ఘనంగా ముగించారు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 145 పరుగులు నమోదు చేసింది. న్యూజిలాండ్ నికోలస్(7) వికెట్ ను ఆదిలోనే కోల్పోయినా, కెప్టెన్ విలియమ్సన్(42; 32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుతంగా ఆడి జట్టు ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఆ తరువాత మున్రో(35), రాస్ టేలర్(28) లు మాత్రమే మోస్తరుగా రాణించడంతో న్యూజిలాండ్ సముచిత స్కోరు సాధించింది. అనంతరం 146 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లా పులులు ఏమాత్రం పోరాడకుండానే చేతులెత్తేశారు.బంగ్లా ఆటగాళ్లలో తమీమ్ ఇక్బాల్(3), మొహ్మద్ మిథున్(11), షబ్బిర్ రెహ్మాన్(12), షకిబుల్ హసన్(2), సౌమ్య సర్కార్(6),మహ్మదుల్లా(5), ముష్ఫికర్ రహీమ్(0)లు తీవ్రంగా నిరాశపరచడంతో ఆ జట్టు 15.4 ఓవర్లలో 70 పరుగులకే చాపచుట్టేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఎలియట్, సోథీలు చెరో మూడు వికెట్లు సాధించి బంగ్లా పతనాన్ని శాసించగా,సాంట్నార్, మెక్లాన్ గన్, నాథన్ మెకల్లమ్ లు తలో వికెట్ తీశారు. -
బంగ్లాదేశ్ లక్ష్యం 146
కోల్‌కతా: వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ 146 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నికోలస్(7) వికెట్ ను ఆదిలోనే కోల్పోయింది. అయితే కెప్టెన్ విలియమ్సన్(42; 32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) తనదైన దూకుడును కొనసాగించి స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. ఆ తరువాత మున్రో(35), రాస్ టేలర్(28) లు మాత్రమే మోస్తరుగా రాణించారు. ఆపై బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ వరుస వికెట్లను కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఐదు వికెట్లు సాధించగా, అల్ అమిన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇప్పటికే గ్రూప్-2 నుంచి న్యూజిలాండ్ సెమీస్ కు చేరగా, బంగ్లాదేశ్ నిష్క్రమించింది. దీంతో ఈ మ్యాచ్‌కు ఎటువంటి ప్రాధాన్యత లేదు. -
పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా
-
సెమీస్‌కు చేరిన వెస్టిండీస్
నాగ్‌పూర్:వరల్డ్ టీ20లో మరో ఉత్కంఠ పోరుకు తెరలేచింది. గ్రూప్-లో భాగంగా దక్షిణాఫ్రికాతో చివరి ఓవర్ వరకూ ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ మూడు వికెట్ల తేడాతో గెలిచి సెమీస్ కు చేరింది. దక్షిణాఫ్రికా విసిరిన 123 పరుగుల లక్ష్యాన్ని విండీస్ ఇంకా రెండు బంతులుండగానే ఛేదించి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. తద్వారా ఈ గ్రూప్ నుంచి సెమీస్ లోకి ప్రవేశించిన తొలి జట్టుగా విండీస్ నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20.0 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డీ కాక్(47; 46 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ రాణించక పోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో హషీమ్ ఆమ్లా(1), డు ప్లెసిస్ (9), కోల్పోరోసో(0), ఏబీ డివిలియర్స్(10), డేవిడ్ మిల్లర్(1) లు వరుసగా క్యూకట్టారు. దీంతో సఫారీలు 47 పరుగులకే ఐదు వికెట్లను చేజార్చుకున్నారు. ఆ తరుణంలో డీ కాక్కు జతకలిసిన వైజ్(28) మోస్తరుగా ఫర్వాలేదనిపించడంతో దక్షిణాఫ్రికా కొద్దిగా తేరుకుంది. ఇక చివర్లో క్రిస్ మోరిస్(16 నాటౌట్) తనవంతు ప్రయత్నం చేయడంతో దక్షిణాఫ్రికా సాధారణ స్కోరును మాత్రమే నమోదు చేయగల్గింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన విండీస్ ఆదిలో క్రిస్ గేల్(4) వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత చార్లస్(32) , మార్లోన్ శామ్యూల్స్(44) రాణించడంతో విండీస్ విజయం దిశగా దూసుకెళ్లింది. అయితే 100 పరుగుల వద్ద రస్సెల్(4), స్వామీ(0)లు ఇమ్రాన్ తాహీర్ బౌలింగ్ లో అవుట్ కావడంతో విండీస్ తడబడినట్లు కనిపించింది. ఇక చివర్లో బ్రాత్ వైట్(10 నాటౌట్;1 సిక్స్)తో రాణించడంతో విండీస్ ఏడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. -
వెస్టిండీస్ విజయలక్ష్యం 123
నాగ్‌పూర్:వరల్డ్ టీ 20లో భాగంగా గ్రూప్-1లో వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 123 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డీ కాక్(47; 46 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ రాణించక పోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత దక్షిణాఫ్రికాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆదిలోనే హషీమ్ ఆమ్లా(1) వికెట్ ను రనౌట్ రూపంలో కోల్పోయింది. ఇక ఆ తరువాత తేరుకోని దక్షిణాఫ్రికా వరుస విరామాల్లో కీలక వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డు ప్లెసిస్ (9), కోల్పోరోసో(0), ఏబీ డివిలియర్స్(10), డేవిడ్ మిల్లర్(1) లు వరుసగా క్యూకట్టారు. దీంతో సఫారీలు 47 పరుగులకే ఐదు వికెట్లను చేజార్చుకున్నారు. ఆ తరుణంలో డీ కాక్కు జతకలిసిన వైజ్(28) మోస్తరుగా ఫర్వాలేదనిపించడంతో దక్షిణాఫ్రికా కొద్దిగా తేరుకుంది. ఇక చివర్లో క్రిస్ మోరిస్(16 నాటౌట్) తనవంతు ప్రయత్నం చేయడంతో దక్షిణాఫ్రికా 20.0 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రస్సెల్, డ్వేన్ బ్రేవో, క్రిస్ గేల్లు తలో రెండు వికెట్లు సాధించారు. -
ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
నాగ్‌పూర్: వరల్డ్ టీ 20లో భాగంగా గ్రూప్-1లో శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ రెండు మ్యాచ్ లు ఆడిన వెస్టిండీస్ ఆ రెండింటిలో గెలిచి మంచి ఊపు మీద ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచి వెనుకబడింది. అయితే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలని దక్షిణాఫ్రికా భావిస్తుండగా, వెస్టిండీస్ మాత్రం తమ జైత్రయాత్రను కొనసాగించి నేరుగా సెమీస్‌లోకి చేరాలని యోచిస్తోంది. -
ప్రపంచకప్ నుంచి పాక్ అవుట్
మొహాలి: వరల్డ్ ట్వంటీ 20 నుంచి పాకిస్తాన్ నిష్క్రమించింది. గ్రూప్-2లో భాగంగా శుక్రవారం ఆసీస్‌తో జరిగిన కీలక పోరులో పాకిస్తాన్ 21 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి వైదొలిగింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు పోరాడినా ఫలితం దక్కలేదు. అటు బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ రాణించి ఘన విజయం సాధించిన ఆసీస్ సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు నమోదు చేసింది.ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్( 61 నాటౌట్; 43 బంతుల్లో 7 ఫోర్లు), మ్యాక్స్ వెల్(30; 18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), షేన్ వాట్సన్(44 నాటౌట్;21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించి ఆసీస్ భారీ స్కోరు చేయడంలో సహకరించారు. అంతకుముందు ఉస్మాన్ ఖవాజా(21), డేవిడ్ వార్నర్(9), అరోన్ ఫించ్(15)లునిరాశపరచడంతో ఆసీస్ 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో స్మిత్, మ్యాక్స్ వెల్ జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. ఈ జోడీ నాల్గో వికెట్ కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అనంతరం స్మిత్ -వాట్సన్ ల జోడి ఆసీస్ ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించింది. ఇదే క్రమంలో స్మిత్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేయగా, వాట్సన్ తనదైన శైలిలో ఆడాడు. ఈ జంట 74 పరుగుల అజేయ భాగస్వామ్యాన్నిసాధించడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. అనంతరం 194 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్ 20.0 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. పాక్ ఆటగాళ్లలో షార్జిల్ ఖాన్(30;19 బంతుల్లో 6 ఫోర్లు),ఖలిద్ లతిఫ్(46;41 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), ఉమర్ అక్మల్(32;20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్ప్), షోయబ్ మాలిక్(40 నాటౌట్; 20 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్సర్లు) రాణించినా జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో ఫాల్కనర్ ఐదు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించగా, ఆడమ్ జంపాకు రెండు, హాజల్ వుడ్‌కు ఒక వికెట్ దక్కింది. -
పాకిస్తాన్ కు భారీ లక్ష్యం
మొహాలి:వరల్డ్ టీ 20లో భాగంగా గ్రూప్-2లో పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా 194 గుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్( 61 నాటౌట్; 43 బంతుల్లో 7 ఫోర్లు), మ్యాక్స్ వెల్(30; 18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), షేన్ వాట్సన్(44 నాటౌట్;21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించి ఆసీస్ భారీ స్కోరు చేయడంలో సహకరించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఆదిలో తడబడింది. ఉస్మాన్ ఖవాజా(21), డేవిడ్ వార్నర్(9), అరోన్ ఫించ్(15)లునిరాశపరిచడంతో ఆసీస్ 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో స్మిత్, మ్యాక్స్ వెల్ జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. ఈ జోడీ నాల్గో వికెట్ కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అనంతరం స్మిత్ -వాట్సన్ ల జోడి ఆసీస్ ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించింది. ఇదే క్రమంలో స్మిత్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేయగా, వాట్సన్ తనదైన శైలిలో ఆడాడు. ఈ జంట 74 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు నమోదు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో వాహబ్ రియాజ్, ఇమాద్ వసీంలకు తలో రెండు వికెట్లు లభించాయి. -
ఆ తప్పు నుంచి గుణపాఠం నేర్చుకో: ధోని
బెంగళూరు:వరల్డ్ టీ 20లో భాగంగా తమతో బుధవారం జరిగిన మ్యాచ్ లో అనవసరపు షాట్‌కు పోయి బంగ్లాదేశ్ ఓటమికి పరోక్షంగా కారణమైన మహ్మదుల్లా రియాద్ చేసిన తప్పు నుంచి గుణపాఠం నేర్చుకోవాలని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హితబోధ చేశాడు. బంగ్లాదేశ్ గెలుపుకు రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో మొహ్మదుల్లా చేసిన తప్పిదం కారణంగా ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకుందన్నాడు. ' మహ్మదుల్లా కొట్టిన ఆ షాట్ బౌండరీ దాటితే అతను నిజంగా హీరో అయ్యేవాడు. ఇప్పుడు అదే షాట్ అతన్ని కచ్చితంగా విమర్శలకు గురి చేస్తుంది. ఇది క్రికెట్. ఆ తప్పు నుంచి మొహ్మదుల్లా పాఠం నేర్చుకుంటాడని ఆశిస్తున్నా'అని ధోని తెలిపాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత్ ఒక పరుగు తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. భారత్ బౌలర్ హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్ నాల్గో బంతికి బంగ్లా సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ భారీ షాట్ ఆడబోయి శిఖర్ ధావన్ క్యాచ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటికి బంగ్లాదేశ్ విజయానికి రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాలి. కాగా, ఆ తదుపరి బంతికి అదే తరహా షాట్ ఆడిన మహ్మదుల్లా జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక చివరి బంతికి ముస్తాఫిజుర్ రెహ్మాన్ రనౌట్ కావడంతో బంగ్లాదేశ్ గెలవాల్సిన మ్యాచ్ ను భారత్ కైవసం చేసుకుంది. -
'ఇకనైనా పూర్తిస్థాయి క్రికెట్ ఆడాలి'
మొహాలి:వరల్డ్ టీ 20లో తమ జట్టు ఇంకా పూర్తిస్థాయిలో గాడిలో పడలేదని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. ఇప్పటివరకూ ఆసీస్ రెండు మ్యాచ్‌లు ఆడినా వంద శాతం ప్రదర్శన మాత్రం ఇవ్వలేకపోయాన్నాడు. ప్రస్తుతం తమ దృష్టంతా తదుపరి మ్యాచ్ ల్లో విజయం సాధించడంపైనే ఉందని స్మిత్ తెలిపాడు. 'మేము పాకిస్తాన్‌తో పాటు భారత్‌తో లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ రెండూ నాణ్యమైన జట్లే. ఆ జట్లపై విజయం సాధిస్తే నేరుగా సెమీస్‌కు చేరతాం. ముందుగా శుక్రవారం పాకిస్తాన్‌తో ఆడాల్సిన మ్యాచ్‌పైనే దృష్టి పెట్టాం. మా జట్టు ఒత్తిడిలో ఉన్న మాట వాస్తవమే. దాన్ని అధిగమించి ముందుకు వెళ్లడమే మా కర్తవ్యం. ఇంకా పూర్తిస్థాయి ఆట ఆసీస్ జట్టు నుంచి రాలేదు. రాబోయే మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తాం' అని స్మిత్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాపై స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతను బ్యాట్స్‌మెన్ కదలికల్ని అర్ధం చేసుకుని బంతిని సంధించే తీరు నిజంగా అద్భుతమని కొనియాడాడు. రేపటి మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌కు జంపా నుంచి ముప్పు పొంచి వుందని ఈ సందర్భంగా స్మిత్ హెచ్చరించాడు. -
'మా క్రికెట్ జట్టులో ఎటువంటి గ్రూపులు లేవు'
మొహాలి:పాకిస్తాన్ క్రికెట్ లో చోటు చేసుకున్న గ్రూపు తగాదాల వల్లే ఆ జట్టు వరుస వైఫల్యాలను చవిచూస్తుందన్న వార్తలను ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ ఖండించాడు. తమ క్రికెట్ జట్టుపై వస్తున్న ఈ తరహా ఊహజనితమైన వార్తలో ఎటువంటి వాస్తవం లేదన్నాడు. పాక్ క్రికెట్ జట్టు ఓడి పోవడం వల్లే గ్రూపులు ఏర్పాడ్డాయంటూ తమకు వ్యతిరేకంగా కథనాలు రావడం నిజంగా బాధాకరమన్నాడు. పాక్ క్రికెట్ జట్టులో నైపుణ్యానికి కొదవలేకపోయినా, నిలకడలేమి వల్లే పరాజయం చెందుతున్నట్లు అభిప్రాయపడ్డాడు. 2009 లో వరల్డ్ టీ 20 ట్రోఫీ గెలిచిన పాక్ జట్టులో సగానికి పైగా ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో లేకపోవడం కూడా వరుస వైఫల్యాలకు ఒక కారణమన్నాడు. ఆ విషయాన్ని పక్కకు పెట్టి, తమ జట్టు గ్రూపులుగా విడిపోయిందని అనవసరపు రాద్దాంతం చేయడం తగదన్నాడు. తమ సెమీస్ అవకాశాలు పూర్తిగా సమసి పోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఆస్టేలియాతో జరిగే తమ తదుపరి పోరులో గెలవడంపైనే దృష్టి పెట్టినట్లు మాలిక్ తెలిపాడు.పాకిస్తాన్ లో ఇప్పుడు పీఎస్ఎల్(పాకిస్తాన్ సూపర్ లీగ్) ఆరంభమయ్యిందని, మరో రెండు, మూడు సంవత్సరాల్లో ఆ లీగ్ నుంచి నాణ్యమైన క్రికెటర్లు జాతీయ జట్టులోకి వస్తారని మాలిక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. -
క్రికెట్ కు షేన్ వాట్సన్ వీడ్కోలు!
మొహాలి: వరల్డ్ ట్వంటీ 20 అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోబోతున్నట్లు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ స్పష్టం చేశాడు. ఈ మేరకు తన రిటైర్మెంట్పై నిర్ణయాన్ని వాట్సన్ తాజాగా ప్రకటించాడు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ తరువాత తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలిపాడు. గతేడాది యాషెస్ సిరీస్ తరువాత టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు చెప్పిన వాట్సన్.. గత సెప్టెంబర్ నుంచి వన్డేలకు కూడా దూరంగా ఉన్నాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోవడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు వాట్సన్ పేర్కొన్నాడు. తాను ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించడం ఒకింత గర్వంగా ఉందన్నాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడానికి తరచు గాయాల బారిన పడటం కూడా ఒక కారణమని వాట్సన్ పేర్కొన్నాడు. ఇటు వన్డేల్లో, టెస్టుల్లో, ట్వంటీ 20 ల్లో ఆస్ట్రేలియాకు అద్భుత విజయాలందించిన వాట్సన్.. 59 టెస్టు మ్యాచ్ లు, 190 వన్డేలు ఆడగా, 56 ట్వంటీ 20లకు ప్రాతినిథ్యం వహించాడు. 2002లో సెంచూరియన్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో ఆరంగేట్రం చేసిన వాట్సన్.. 2005లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో పాకిస్థాన్ తో జరిగిన టెస్టులో స్థానం దక్కించుకున్నాడు. అతని టెస్టు కెరీయర్ లో 35 .0 పైగా సగటుతో నాలుగు సెంచరీలు చేశాడు. టెస్టుల్లో షేన్ వాట్సన్ అత్యధిక స్కోరు 176. కాగా, 75 వికెట్లు తీశాడు. ఇక వన్డేల విషయానికొస్తే 9 సెంచరీలు ,33 హాఫ్ సెంచరీల సాయంతో 5,757 పరుగులు చేయగా, 168 వికెట్లు తీశాడు. వన్డేల్లో వాట్సన్ అత్యధిక స్కోరు 185 నాటౌట్. ఇక ట్వంటీ 20 ల్లో ఒక సెంచరీతో పాటు, 10 హాఫ్ సెంచరీలు సాధించగా, 46 వికెట్లు తీశాడు. ట్వంటీ 20ల్లో వాట్సన్ అత్యధిక స్కోరు 124 నాటౌట్. -
ధోని సేన సెమీస్‌కు చేరాలంటే..
వరల్డ్ టీ 20లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఒక పరుగు తేడాతో గెలిచి నాకౌట్ ఆశలను సజీవంగా నిలుపుకుంది టీమిండియా. అయితే ధోని సేన సెమీస్‌కు చేరాలంటే ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు టీమిండియా నెట్ రన్‌రేటే ప్రధాన కారణం. భారత్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించినా రన్ రేట్లో మాత్రం పాకిస్తాన్, ఆసీస్ జట్ల కంటే వెనకబడింది. ఇదే సమయంలో శుక్రవారం ఆసీస్-పాకిస్తాన్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోతే అక్కడితో ఆ జట్టు కథ ముగుస్తుంది. అదే సమయంలో గ్రూప్-2 నుంచి సెమీస్ లోకి ప్రవేశించే రెండో జట్టు కోసం ఆసీస్-భారత జట్ల మధ్య పోటీ నెలకొని ఉంటుంది. ఇక్కడ భారత్ గెలిస్తే నేరుగా సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ ఆసీస్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచి, భారత్‌పై ఆసీస్ గెలిస్తే మాత్రం ఈ మూడు జట్లు తలో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించినట్లువుతుంది. అప్పుడు నాకౌట్ సమీకరణాలకు నెట్ రన్ రేట్ పైనే ఆధారపడాలి. అయితే ప్రస్తుత భారత్ నెట్ రన్‌రేట్ (-0.546) ఆందోళనకరంగా ఉండగా, పాకిస్తాన్ రన్ రేట్ (+0.254), ఆస్ట్రేలియా రన్ రేట్(+0.108)లు ముందంజలో ఉన్నాయి. భారత్ గెలిచిన రెండు మ్యాచ్‌లతో పాటు, నెట్ రన్ రేట్‌ను చూస్తే మన జట్టు సెమీస్ కు చేరడం కష్టమే. వీటితో సంబంధం లేకుండా ధోని సేన సెమీ ఫైనల్ కు చేరాలంటే కచ్చితంగా ఆసీస్‌పై మ్యాచ్‌ను గెలవడం ఒక్కటే మార్గం. ఇదిలా ఉండగా వరల్డ్ టీ 20లో టీమిండియా ఇంకా పూర్తిగా గాడిలో పడలేదనే చెప్పాలి. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో జరిగిన ట్వంటీ 20 సిరీస్‌ను, ఆ తరువాత స్వదేశంలో శ్రీలంకతో సిరీస్‌ను, బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియాకప్‌ను గెలిచి మంచి ఊపు మీద కనిపించిన భారత్.. వరల్డ్ టీ 20 వచ్చేసరికి మాత్రం జట్టు పూర్తిస్థాయిలో ఆడటం లేదు. ఈ టోర్నీలో న్యూజిలాండ్‌తో ఓటమి అనంతరం భారత్ సాధించిన రెండు విజయాలు స్థాయికి తగినవి ఎంతమాత్రం కావు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత జట్టు భారీ స్కోర్లు సాధించడానికి నానా తంటాలు పడుతుంది. చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా ఉంది భారత జట్టు పరిస్థితి. వరల్డ్ కప్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ధోని సేన యావత్తు భారత అభిమానుల ఆశలను నిజం చేయాలంటే ఇకనైన బ్యాట్ ఝుళిపించక తప్పదు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఆసీస్‌ను నిలువరించాలంటే భారత జట్టు అంచనాలను అందుకోవాలి. సమష్టిగా రాణిస్తేనే ఆసీస్‌పై విజయం సాధ్యమవుతుందని ధోని అండ్ గ్యాంగ్ గ్రహించాలి. -
న్యూజిలాండ్ జైత్రయాత్ర
మొహాలి: వరల్డ్ ట్వంటీ 20లో న్యూజిలాండ్ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. మంగళవారం గ్రూప్-2 లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది కివీస్ కు హ్యాట్రిక్ విజయం కావడంతో సెమీస్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న కివీస్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. గప్టిల్(80;48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) కళాత్మక ఇన్నింగ్స్ ఆడి న్యూజిలాండ్ కు మంచి ఆరంభాన్ని అందించాడు. అతనికి కెప్టెన్ విలియమ్సన్(17) అండగా నిలవడంతో న్యూజిలాండ్ తొలి వికెట్ కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. అనంతరం కోరీ అండర్సన్(21;14 బంతుల్లో 3 ఫోర్లు), రాస్ టేలర్(36 నాటౌట్; 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యాతయుతంగా ఆడటంతో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 158 పరుగులకే పరిమితమై ఓటమి చెందింది. పాకిస్తాన్ ఓపెనర్లు షార్జిల్ ఖాన్(47;25 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), అహ్మద్ షెహజాద్(30;32 బంతుల్లో 3 ఫోర్లు) మంచి ఆరంభాన్నివ్వడంతో ఆ జట్టు గెలుపుదిశగా పయనించినట్లు కనబడింది. ఈ జోడి 5.3 ఓవర్లలో 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పాకిస్తాన్ శిబిరంలో ఆనందం నింపారు. అయితే ఆ తరువాత వరుస విరామాల్లో కీలక వికెట్లను కోల్పోయిన పాకిస్తాన్ కష్టాల్లో పడింది. పాకిస్తాన్ టాపార్డర్ ఆటగాళ్లలో ఖలిద్ లతిఫ్(3), షాహిద్ ఆఫ్రిది(19),ఉమర్ అక్మల్ (24)లు నిరాశపరిచారు. ఇక చివర్లో షోయబ్ మాలిక్(15 నాటౌట్), సర్ఫారాజ్ అహ్మద్(11 నాటౌట్) లు గెలుపుకోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నార్, మిల్నేలు తలో రెండు వికెట్లు సాధించారు. -
దుమ్మురేపిన గప్టిల్
మొహాలి:వరల్డ్ టీ 20లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మార్టిన్ గప్టిల్ దుమ్మురేపాడు. గప్టిల్(80;48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు)తో కళాత్మక ఇన్నింగ్స్ ఆడటంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు శుభారంభం లభించింది. గప్టిల్ కు కెప్టెన్ విలియమ్సన్ చక్కటి సహకారం అందించాడు. అయితే జట్టు స్కోరు 62 పరుగుల వద్ద విలియమ్సన్(17) తొలి వికెట్ గా అవుటయ్యాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో మున్రో(7) కూడా పెవిలియన్ చేరడంతో న్యూజిలాండ్ తడబడినట్లు కనిపించింది. కాగా, కోరీ అండర్సన్(21;14 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించడంతో న్యూజిలాండ్ మళ్లీ గాడిలో పడింది. ఆపై రాస్ టేలర్(36 నాటౌట్; 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యాతయుతంగా ఆడటంతో న్యూజిలాండ్ 181 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచకల్గింది. ఇప్పటికే న్యూజిలాండ్ రెండు వరుస మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపు మీద ఉండగా, పాకిస్తాన్ రెండు మ్యాచ్‌లకు గాను ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పాకిస్తాన్ భావిస్తుండగా, న్యూజిలాండ్ మరో విజయం సాధించి నేరుగా సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలని యోచిస్తోంది. -
భారీ స్కోరు దిశగా కివీస్
మొహాలి:వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా గ్రూప్-2లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. న్యూజిలాండ్ 11.0 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. గప్టిల్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో న్యూజిలాండ్ స్కోరు బోర్డు వేగంగా ముందుకు కదులుతోంది. అతనికి జతగా కోరీ అండర్సన్(2) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు కెప్టెన్ విలియమ్సన్(17) తొలి వికెట్ గా అవుట్ కాగా, మున్రో(7) రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఇప్పటికే న్యూజిలాండ్ రెండు వరుస మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపు మీద ఉండగా, పాకిస్తాన్ రెండు మ్యాచ్‌లకు గాను ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పాకిస్తాన్ భావిస్తుండగా, న్యూజిలాండ్ మరో విజయం సాధించి నేరుగా సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలని యోచిస్తోంది. -
బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
మొహాలి: వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా మంగళవారం ఇక్కడ పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే న్యూజిలాండ్ రెండు వరుస మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపు మీద ఉండగా, పాకిస్తాన్ రెండు మ్యాచ్‌లకు గాను ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పాకిస్తాన్ భావిస్తుండగా, న్యూజిలాండ్ మరో విజయం సాధించి నేరుగా సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలని యోచిస్తోంది. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. -
కీలక పోరుకు ధోని సేన సిద్ధం!
బెంగళూరు:వరల్డ్ టీ 20లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా మరో కీలక పోరుకు సన్నద్ధమైంది. గ్రూప్-2లో భాగంగా బంగ్లాదేశ్‌తో బుధవారం జరుగనున్న లీగ్ మ్యాచ్‌లో ధోని సేన తలపడనుంది. రేపు రాత్రి గం.7.30 ని.లకు చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఒక గెలుపు మాత్రమే సాధించి కాస్త వెనుకబడింది. సెమీ ఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే బంగ్లాదేశ్‌పై భారత్‌కు భారీ విజయం అవసరం. గ్రూప్-2లో న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకుపోతూ నెట్ రన్ రేట్ పరంగా అగ్రస్థానంలో ఉండగా, ఇదే గ్రూప్‌లో ఉన్న పాకిస్తాన్ రెండో స్థానంలో, ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉన్నాయి. ఇక భారత్ నాల్గో స్థానంలో ఉంది. మ్యాచ్‌కు మ్యాచ్‌కు నెట్ రన్ రేట్ లో మార్పులు చోటు చేసుకోవడం అనివార్యమే అయినా భారత్ పరిస్థితి మాత్రం కాస్త ఆందోళన కరంగానే ఉందనే చెప్పాలి. దీంతో రేపటి మ్యాచ్‌లో భారత్ మెరుగైన రన్ రేట్‌తో బంగ్లాదేశ్ తో గెలవాలి. కాగా, సంచనాలకు మారు పేరైన బంగ్లాదేశ్‌తో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు బంగ్లా గట్టిపోటీనిచ్చిన సంగతిని ధోని సేన గ్రహించి అందుకు తగిన వ్యూహ రచనతో సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. మరోవైపు రెండు వరుస ఓటములతో బంగ్లాదేశ్ దాదాపు సెమీస్ అవకాశాలను కోల్పోయింది. ఈ తరుణంలో బంగ్లాదేశ్ మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో బంగ్లాతో మ్యాచ్ ను టీమిండియా తేలిగ్గా తీసుకోకుండా పూర్తి స్థాయిలో విజృంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధావన్, రైనాల ఫామ్‌పై ఆందోళన.. ఈ టోర్నీలో ఓపెనర్ శిఖర్ ధావన్, సురేష్ రైనాలు పూర్తి స్థాయిలో ఆడలేదు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఈ ఇద్దరూ అనవసరపు షాట్లకు పోయి వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో వీరి ఫామ్ పై భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. ఈ ఇద్దరి ఆటగాళ్ల వైఫల్యం వల్ల మిడిలార్డర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. పేస్ బౌలింగ్ ను ఎదుర్కోవడం తమ వల్ల కాదు అన్న చందంగా తయారైంది ఈ ఆటగాళ్ల పరిస్థితి. పేరుకు స్టార్ క్రికెటర్లే అయినా వారు ఆశించిన స్థాయిలో ఆడకపోవటం అభిమానుల్ని సైతం నిరాశకు గురి చేస్తుంది. ఇకనైన వీరు తేరుకుని భారత్ కు చక్కటి పునాది వేస్తేనే మిడిల్ ఆర్డర్ పై భారం తగ్గుతుంది. వాతావరణం,పిచ్ ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. దీంతో ఏదొక దశలో వర్షం పడే అవకాశం ఉన్నా మ్యాచ్ కు పూర్తి స్థాయిలో అంతరాయం కలగకపోవచ్చు. ఇక పిచ్ విషయానికొస్తే బ్యాటింగ్‌కు అనుకూలించడం ఖాయంగా కనబడుతోంది. అయితే మొదట్లో పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉంది. భారత జట్టు(అంచనా): మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేష్ రైనా, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అశ్విన్, ఆశిష్ నెహ్రా, బూమ్రా బంగ్లాదేశ్ జట్టు(అంచనా):మష్రాఫ్ మొర్తజా(కెప్టెన్), మొహ్మద్ మిథున్, సౌమ్య సర్కార్, షబ్బీర్ రెహ్మాన్, షకిబుల్ హసన్, సువగటా హామ్,మొహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్, సక్లయిన్ సాజిబ్, అల్-అమిన్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ -
ఆసీస్‌పై న్యూజిలాండ్ గెలుపు
నాగ్‌పూర్: టి20 మహిళల ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ ‘ఎ’లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ విసిరిన 104 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 16.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు సుజీ బేట్స్(23), ప్రీస్ట్(34) జట్టుకు శుభారంభాన్ని అందించడంతో న్యూజిలాండ్ విజయం లాంఛనమైంది. ఆ తరువాత డివైన్(17), మెగ్లాషన్(11)లు మోస్తరుగా రాణించి జట్టు స్కోరును ముందుకు తీసుకువెళ్లారు. ఇక చివర్లో అమీ సాటర్ వైట్(16 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడటంతో న్యూజిలాండ్ ఇంకా 22 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళలు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 103 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ జట్టులో ఎల్లీసీ పెర్రీ(42), జోనాసేన్(23), మూనీ(15 నాటౌట్),బ్లాక్ వెల్(10)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటిన వారిలో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో కాస్పెరక్ మూడు వికెట్లు సాధించగా,బెర్మింగ్హమ్కు రెండు, డివైన్, సాటర్ వైట్లకు తలో వికెట్ లభించింది. -
పరిస్థితులకు తగినట్లుగానే: యువరాజ్
న్యూఢిల్లీ: మైదానంలోకి అడుగుపెట్టాక పరిస్థితులకు తగ్గట్లు ఆడటమే తన కర్తవ్యమని భారత స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ స్పష్టం చేశాడు. భారత జట్టులో పునరాగమనం చేసిన తరువాత యువరాజ్ సింగ్ బ్యాటింగ్ ఆర్డర్లో పదే పదే మార్పులు చోటు చేసుకోవడంపై మీడియా అడిగిన ప్రశ్నకు యువీ స్పందించాడు. 'బ్యాటింగ్ ఆర్డర్ అనేది సమస్యే కాదు. పరిస్థితులకు తగ్గట్లు ఆడితేనే జట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. పరిస్థితుల ప్రకారం బ్యాటింగ్ చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా. ప్రస్తుతం దానిపైనే దృష్టి పెట్టా. న్యూజిలాండ్ తో ఓటమి అనంతరం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాం. ఆ ఒత్తిడితోనే పాకిస్తాన్ పోరుకు సన్నద్ధమయ్యాం. ఆ మ్యాచ్ లో ఆదిలోనే మూడు ప్రధాన వికెట్లను నష్టపోవడంతో మరింత ఆందోళన గురయ్యాం. ఆ తరుణంలో సాధ్యమైనంతవరకూ స్ట్రైక్ రొటేట్ చేయాలని భావించా. బంతిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ పరుగులు రాబట్టాలని ప్రయత్నం చేశా. అయితే దురదృష్టవశాత్తూ చివరి వరకూ క్రీజ్ లో నిలబడలేకపోయా. విరాట్ కోహ్లి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టును నిలబెడితే, కెప్టెన్ ధోని చక్కటి ఫినిషింగ్ ఇచ్చాడు' అని యువరాజ్ పేర్కొన్నాడు. మనం ఒక జట్టుగా ఆడుతున్నప్పుడు పరిస్థితుల ప్రకారం ఆడటమే సరైన విధానమన్నాడు. పాకిస్తాన్ తో విజయం అనంతరం తమ జట్టు ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ప్రోది చేసుకుందన్నాడు. తమ తదుపరి మ్యాచ్‌లకు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగడానికి పాకిస్తాన్ పై విజయం దోహదం చేస్తుందన్నాడు. శనివారం పాకిస్తాన్ తో ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ 24 విలువైన పరుగులు సాధించి భారత విజయానికి సహకరించిన సంగతి తెలిసిందే. -
శ్రీలంకకు విండీస్ షాక్
బెంగళూరు: వరల్డ్ ట్వంటీ 20లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకకు వెస్టిండీస్ షాకిచ్చింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ పేలవ ప్రదర్శన కొనసాగించిన లంకేయులు.. విండీస్‌కు ఏ దశలోనూ పోటీనివ్వకుండానే చేతులెత్తేశారు. దీంతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీలో వరుసగా రెండో గెలుపును సొంతం చేసుకుంది. శ్రీలంక విసిరిన 123 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ నిలకడగా బ్యాటింగ్ కొనసాగించి గెలుపును సొంతం చేసుకుంది. ఓపెనర్ ఆండ్రీ ఫ్లెచర్(84 నాటౌట్;64 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) దాటిగా బ్యాటింగ్ చేసి విండీస్ విజయంలో సహకరించాడు. అతనికి రస్సెల్(20 నాటౌట్) అండగా నిలవడంతో విండీస్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ బ్యాటింగ్ దిగకుండానే విండీస్ విజయం సాధించడం విశేషం. శ్రీలంక బౌలర్లలో సిరివర్ధనేకు రెండు, వాండ్రాస్సేకు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 122 పరుగులు నమోదు చేసింది. శ్రీలంక ఆటగాళ్లలో తిషారా పెరీరా(40; 29 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్) , కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్(20) మినహా ఎవరూ ఆకట్టుకోలేక పోవడంతో జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. దిల్షాన్(12), చంఢీమాల్(16), తిరుమన్నే(5), కపుగదెరా(6)లు తీవ్రంగా నిరాశపరిచారు. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై విండీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
విండీస్ విజయలక్ష్యం 123
బెంగళూరు: వరల్డ్ టీ 20లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 123 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన విండీస్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక ఓపెనర్లు దిల్షాన్(12)తొలి వికెట్ గా అవుట్ కాగా, చంఢీమాల్(16) రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం తిరుమన్నే(5), కపుగదెరా(6) నిరాశపరచడంతో శ్రీలంక జట్టు 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఆపై కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్(20) మోస్తరుగా రాణించగా, సిరివర్ధనే(0) డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో లంకేయులు వంద పరుగుల మార్కును చేరడం కూడా అనుమానంగా మారింది. ఆ తరుణంలో తిషారా పెరీరా(40; 29 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్) ఇన్నింగ్స్ కు మరమ్మత్తులు చేపట్టడంతో లంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో శామ్యూల్ బద్రి మూడు వికెట్లు సాధించగా, డ్వేన్ బ్రేవో కు రెండు, రస్సెల్, బ్రాత్ వైట్ లకు తలో వికెట్ లభించింది. -
ఇండో-పాక్ మ్యాచ్ ఎఫెక్ట్: టీవీల బంద్!
కరాచీ: దాయాది దేశాలైన భారత్-పాకిస్తాన్ల క్రికెట్ సమరం అంటేనే ఆయాదేశాల్లో విపరీతమైన ఆసక్తి. సాధారణ మ్యాచ్‌ల కంటే ఇరు జట్లు ఎక్కడ తలపడుతున్నా జనాల హార్ట్ బీట్ పెరిగిపోవడం ఖాయం. అయితే ఇరు దేశాల మధ్య పోరు జరుగుతున్న సమయంలో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని మ్యాచ్‌లను వీక్షించడం మనకు తెలిసిందే. మరి పాకిస్తాన్ ఓటమి చెందుతుందని ముందే భావించారో ఏమో కానీ గుజ్రాన్వాలా నగరంలో ఆస్పత్రులలోని కార్డియో వార్డుల్లో టీవీలను బంద్ చేసి ముందస్తు జాగ్రత్త పాటించారు అక్కడ ఉన్న డాక్డర్లు. ఒక ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు.. ప్రైవేట్ ఆస్పత్రులలో ఉన్న అన్ని కార్డియో వార్డుల్లో టీవీ సెట్లను సైతం తొలగించారు. రోగులు ఎటువంటి టెన్షన్ బారిన పడకుండా ఉంచాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారట. 'శనివారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్‌లోని గుజ్రాన్ వాలాలో ఉన్న అన్ని ఆస్పత్రులలో టీవీలను బంద్ చేశాం. దీనిలో భాగంగా టీవీ సెట్లను ఆయా ఆస్పత్రి వార్డుల నుంచి పాక్షికంగా తొలగించాం. ఇరు దేశాలు క్రికెట్ ఆడుతున్నాయంటే అది ఒక గేమ్ గా మాత్రమే ఉండదు. ఒక ఉద్వేగ భరితమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. దీనివల్ల రోగుల గుండె సంబంధిత వ్యాధులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అందుచేత నగరంలోని ఆస్పత్రుల్లో ఉన్న కార్డియో వార్డులలో టీవీ సెట్లను తొలగించాల్సి వచ్చింది. మ్యాచ్ ముగిసిన తరువాత అంటే ఆదివారం వాటిని తిరిగి పునరుద్ధరించాం' అని హార్ట్ సర్జన్ మాటీన్ స్పష్టం చేశారు. రోగులు టెన్షన్ బారిన పడటం వల్ల అది వారి ప్రాణానికి మరింత హాని చేకూర్చే అవకాశం ఉందని, వారిని సాధ్యమైనంతవరకూ ఒత్తిడికి దూరంగా ఉంచాలనుకునే ఇలా చేసినట్లు మాటీన్ స్పష్టం చేశారు. ఇందుకోసం స్థానిక పౌరపరిపాలన అధికారుల సాయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. -
ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
బెంగళూరు:వరల్డ్ టీ 20లో భాగంగా ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గ్రూప్-1 లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి మంచి ఊపు మీద ఉన్నాయి. అఫ్ఘానిస్తాన్ పై శ్రీలంక గెలవగా, ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక కంటే విండీస్ కాస్త మెరుగ్గా కనబడుతోంది. మరోవైపు శ్రీలంక ప్రధాన బౌలర్ మలింగా ప్రపంచకప్‌కు దూరం కావడంతో ఆ జట్టు బౌలింగ్ బలహీనపడిందనే చెప్పాలి. అయితే ఇరు జట్లలో హిట్టర్లు ఉన్నందున పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. -
'అమితాబ్ పారితోషికం తీసుకోలేదు'
కోల్‌కతా:పాకిస్తాన్‌తో శనివారం ఈడెన్ గార్డెన్లో భారత్‌తో జరిగిన వరల్డ్ టీ 20 మ్యాచ్‌లో భాగంగా జాతీయ గీతాన్ని ఆలపించిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఎటువంటి పారితోషికం తీసుకోలేదని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) తాజాగా స్పష్టం చేసింది. తమ ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమానికి ఆయన స్వచ్ఛందంగానే హాజరైనట్లు పేర్కొంది. ఈడెన్ గార్డెన్ స్టేడియంలో మ్యాచ్ కు ముందు జరిగిన జాతీయ గీత ఆలాపన కార్యక్రమానికి హాజరైన బిగ్ బి రూ. 4 కోట్లు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కొంతమంది అభిమానులు అడిగిన ప్రశ్నలకు క్యాబ్ సీనియర్ అధికారి స్పందిస్తూ.. బిగ్ బి అమితాబ్ కు తాము ఎటువంటి పారితోషికం ఇవ్వలేదని, ఆ వార్తలో ఎటువంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. చివరకు అమితాబ్ విమాన టికెట్లతో పాటు, హోటళ్ల బిల్లుల విషయంలో కూడా ఆయన తన సొంత నగదునే ఖర్చు పెట్టినట్లు ఈ సందర్భంగా క్యాబ్ అధికారి పేర్కొన్నారు. -
టీమిండియా అదరహో..
కోల్ కతా: ప్రపంచకప్‌ల చరిత్రలో పాకిస్తాన్ చేతిలో ఎప్పుడూ ఓడిపోని టీమిండియా మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఇదే సమయంలో ఈడెన్ గార్డెన్లో పాకిస్తాన్ జట్టుకున్న ఘనమైన విజయాల రికార్డును సైతం భారత్ చెక్ పెట్టింది. తద్వారా వరల్డ్ టీ 20లోశనివారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీలో బోణి కొట్టింది. ఈ మ్యాచ్ లో ఆదిలో కీలక వికెట్లను చేజార్చుకుని ధోని సేన తడబడినా, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్‌ల జోడి బాధ్యాతాయుత ఇన్నింగ్స్ తో విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య ఓటమి అనంతరం ఢీలా పడిన భారత్.. ఆ ఛాయలను పాకిస్తాన్లో మ్యాచ్‌లో కనిపించకుండా జాగ్రత్తగా ఆడి తొలి గెలుపు రుచిని ఆస్వాదించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.0 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్లు షార్జిల్ ఖాన్(17), అహ్మద్ షెహజాద్(25) మోస్తరుగా రాణించినా, కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది (8) నిరాశపరిచాడు. ఒకానొక దశలో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్.. షోయబ్ మాలిక్(26), ఉమర్ అక్మల్(22)ల చలవతో తేరుకుంది. ఈ జోడి 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం ఉమర్ అక్మల్ నాల్గో వికెట్ గా అవుట్ కాగా, ఆపై కాసేపటికే మాలిక్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో పాకిస్తాన్ పరుగుల వేగం మందగించింది. ఇక చివర్లో సర్ఫరాజ్ అహ్మద్(8 నాటౌట్), మొహ్మద్ హఫీజ్ (5 నాటౌట్) లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో పాకిస్తాన్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో నెహ్రా, బూమ్రా, పాండ్యా, రైనా, జడేజాలకు తలో వికెట్ దక్కింది. అనంతరం 119 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన భారత్ 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.భారత జట్టులో రోహిత్ శర్మ(10) తొలి వికెట్ గా పెవిలియన్‌కు చేరగా, శిఖర్ ధావన్(6), సురేష్ రైనా(0)లు వెనువెంటనే అవుటయ్యారు. దీంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. అయితే ఆ తరుణంలో విరాట్ కోహ్లి(55 నాటౌట్), యువరాజ్ సింగ్(24)ల జోడి దాటిగా ఎదుర్కొంటూ భారత జట్టును విజయంవైపు నడిపించారు. ఈ జోడి 61 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ విజయానికి చక్కటి బాటలు వేశారు. కాగా, జట్టు స్కోరు 84 పరుగుల వద్ద ఉండగా యువీ నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. అయినప్పటికీ విరాట్ వేగం మాత్రం తగ్గలేదు. అదే దూకుడును కొనసాగిస్తూ హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. మరోవైపు క్రీజ్‌లో ఉన్న ఎంఎస్ ధోని (13 నాటౌట్; 9 బంతుల్లో 1 సిక్స్) తనదైన మార్కును చూపెట్టడంతో టీమిండియా ఇంకా 13 బంతులుండగానే విజయం సాధించింది. శిఖర్, రైనాలు ఒక తరహాలో.. సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ రోహిత్ శర్మ(10) వికెట్ ను మూడో ఓవర్ మొదటి బంతికే కోల్పోయింది. మరోవైపు శిఖర్ ధావన్ మాత్రం జాగ్రత్తగా ఆడుతూ కోహ్లికి చక్కటి సహకారం అందించాడు. కాగా, టీమిండియా స్కోరు 23 పరుగుల వద్ద ఉండగా పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ సమీ వేసిన బంతిని లోనికి ఆడబోయిన ధావన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ మరసటి బంతికి అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన రైనా అదే తరహాలో బౌల్డ్ గా పెవిలియన్ చేరాడు. ఈ ఇద్దరూ ఒకే తరహాలో అవుట్ కావడంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు చెందారు. ఒక కీలక మ్యాచ్‌లో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు నిర్లక్ష్యంగా ఆడి పెవిలియన్‌కు చేరడం విమర్శలకు సైతం తావిచ్చింది. -
కష్టాల్లో టీమిండియా
కోల్‌కతా: వరల్డ్ టీ 20 లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. పాక్ విసిరిన 119 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. భారత జట్టులో రోహిత్ శర్మ(10) తొలి వికెట్ గా పెవిలియన్‌కు చేరగా, శిఖర్ ధావన్(6), సురేష్ రైనా(0)లు వెనువెంటనే అవుటయ్యారు. పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ సమీ వేసిన బంతిని శిఖర్, రైనాలు ఒకే తరహాలో ఆడబోయి బౌల్డయ్యారు. అంతకుముందు పాకిస్తాన్ బ్యాటింగ్ చేసి 18.0 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. -
టీమిండియా టార్గెట్ 119
కోల్‌కతా: వరల్డ్ టీ20లో భాగంగా ఇక్కడ భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ 119 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ తీసుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ ఆది నుంచి ఆచితూచి బ్యాటింగ్ చేసింది. పాక్ ఓపెనర్లు షార్జిల్ ఖాన్(17), అహ్మద్ షెహజాద్(25) మోస్తరుగా రాణించినా, కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది (8) నిరాశపరిచాడు. ఒకానొక దశలో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్.. షోయబ్ మాలిక్(26), ఉమర్ అక్మల్(22)ల చలవతో తేరుకుంది. ఈ జోడి 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం ఉమర్ అక్మల్ నాల్గో వికెట్ గా అవుట్ కాగా, ఆపై కాసేపటికే మాలిక్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో పాకిస్తాన్ పరుగుల వేగం మందగించింది. ఇక చివర్లో సర్ఫరాజ్ అహ్మద్(8 నాటౌట్), మొహ్మద్ హఫీజ్ (5 నాటౌట్) లు పరుగులు చేయకుండా నియంత్రించడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. దీంతో పాకిస్తాన్ 18.0 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. భారత బౌలర్లలో నెహ్రా, బూమ్రా, రైనా, జడేజా, పాండ్యాలకు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌కు తొలుత వరుణుడు ఆటంకం కల్గించడంతో 18.0 ఓవర్లకు కుదించారు. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒక మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, టీమిండియా ఒక మ్యాచ్ లో ఓటమి పాలై తీవ్రమైన ఒత్తిడిలో పోరుకు సన్నద్ధమైంది. -
కట్టుదిట్టంగా భారత్ బౌలింగ్
కోల్‌కతా:వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. టాస్ గెలిచిన భారత్ తొలుత పాకిస్తాన్ ను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ ఆది నుంచి పరుగులు సాధించడానికి అష్టకష్టాలు పడుతోంది. అటు పేస్ బౌలింగ్ ను, స్పిన్ ను సమానంగా ప్రయోగిస్తున్న ధోని పాక్ జట్టుపై ఒత్తిడి తెచ్చేయత్నం చేస్తున్నాడు. పాకిస్తాన్ ఆటగాళ్లలో షార్జిల్ ఖాన్(17) తొలి వికెట్ గా పెవిలియన్ కు చేరగా, అనంతరం స్వల్ప వ్యవధిలో అహ్మద్ షెహజాద్(25) రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఆపై షాహిద్ ఆఫ్రిది(8)ని పాండ్యా బోల్తా కొట్టించాడు. దీంతో పాకిస్తాన్ 60 పరుగులకు మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లలో రైనా, బూమ్రా, పాండ్యాలకు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌కు తొలుత వరుణుడు ఆటంకం కల్గించడంతో 18.0 ఓవర్లకు కుదించారు. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒక మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, టీమిండియా తీవ్రమైన ఒత్తిడిలో పోరుకు సన్నద్ధమైంది. -
టాస్ గెలిచిన భారత్
కోల్‌కతా:వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత వరుణుడు ఆటంకం కల్గించడంతో ఈ మ్యాచ్ ను 18.0 ఓవర్లకు కుదించారు. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒక మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, టీమిండియా ఒక మ్యాచ్ లో ఓటమి పాలై తీవ్రమైన ఒత్తిడిలో పోరుకు సన్నద్ధమైంది. ఇప్పటివరకూ జరిగిన వరల్డ్ కప్‌లలో భారత్ దే పై చేయి అయినా, ఈడెన్ లో మాత్రం పాకిస్తాన్ రికార్డు మెరుగ్గా ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనబడుతోంది. -
అప్ఘానిస్తాన్ 'సూపర్' షో
నాగ్‌పూర్: వరల్డ్ టీ 20లో భాగంగా జింబాబ్వేతో జరిగిన కీలక క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో సూపర్ షోతో అదరగొట్టిన అఫ్ఘానిస్తాన్ ప్రధాన పోటీకి అర్హత సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో సైతం ఆకట్టుకున్న అప్ఘానిస్తాన్.. జింబాబ్వే పెట్టుకున్న ఆశలకు కళ్లెం వేసింది. అప్ఘాన్ 59 పరుగులతో తేడాతో గెలిచి సూపర్-10 కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇటీవల జింబాబ్వేపై రెండు సిరీస్‌లు నెగ్గిన అప్ఘానిస్తాన్ అదే ఊపును వరల్డ్ టీ20లో కొనసాగించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. గ్రూప్-బిలో భాగంగా టాస్ గెలిచిన అఫ్ఘానిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అప్ఘానిస్తాన్ ఓపెనర్ నూర్ అలీ జర్దాన్(10) తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరినా, మరో ఓపెనర్ మొహ్మద్ షెహజాద్(40;23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. అనంతరం అస్ఘర్ స్టానింక్జాయ్(0), గులాబ్దిన్ నాయిబ్(7)లు నిరాశపరచడంతో అప్ఘాన్ 63 పరుగులకే నాలుగు వికెట్లును కోల్పోయింది. ఆ తరుణంలో షెన్వారీ, మొహ్మద్ నబీల జోడీ అఫ్ఘాన్ స్కోరు బోర్డును ముందుకు కదిలించింది. అయితే ఈ జోడీ 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం షెన్వారీ(43) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. కాగా, మొహ్మద్ నబీ(52;32 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీ నమోదు చేసి అప్ఘాన్ భారీ స్కోరు చేయడంలో్ సహకరించాడు. ఆ తరువాత 187 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన జింబాబ్వే ఏ దశలోనూ ఆకట్టులేకపోవడంతో ఘోర ఓటమి పాలైంది. జింబాబ్వే ఆటగాళ్లలో సిబందా(13), కెప్టెన్ మసకద్జ(11), ముతాంబామి(10), విలియమ్స్(13), వాలర్(7) ఇలా టాపార్డ్ పూర్తిగా వైఫల్యం చెందడంతో ఆ జట్టు 19.4 ఓవర్లలో 127 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది. అప్ఘాన్ బౌలర్లలో రషిద్ ఖాన్ మూడు వికెట్లు సాధించగా, హాసన్ కు రెండు వికెట్లు, మొహ్మద్ నబీ, షెన్వారీలకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు స్కాట్లాండ్, హాంకాంగ్ జట్లపై అప్ఘాన్ గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో తాను ఆడిన మూడు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో అఫ్ఘాన్ గెలవడంతో సూపర్-10కు నేరుగా అర్హత సాధించింది. కాగా, క్వాలిఫయింగ్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన జింబాబ్వే ఇంటిదారి పట్టింది. -
జింబాబ్వేకు భారీ లక్ష్యం
నాగ్‌పూర్:వరల్డ్ టీ20లో భాగంగా శనివారం ఇక్కడ జింబాబ్వేతో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్ఘానిస్తాన్ ఆది నుంచి ఎదురుదాడికి దిగి జింబాబ్వేపై ఒత్తిడి పెంచింది. అప్ఘానిస్తాన్ ఓపెనర్ నూర్ అలీ జర్దాన్(10) తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరినా, మరో ఓపెనర్ మొహ్మద్ షెహజాద్(40;23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. అనంతరం అస్ఘర్ స్టానింక్జాయ్(0), గులాబ్దిన్ నాయిబ్(7)లు నిరాశపరచడంతో అప్ఘాన్ 63 పరుగులకే నాలుగు వికెట్లును కోల్పోయింది. ఆ తరుణంలో షెన్వారీ, మొహ్మద్ నబీల జోడీ అఫ్ఘాన్ స్కోరు బోర్డును ముందుకు కదిలించింది. అయితే షెన్వారీ(43) ఐదో వికెట్ గా పెవిలియన్ చేరడంతో వీరి 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాగా, చివరి ఓవర్లలో పెవిలియన్ కు చేరిన మొహ్మద్ నబీ(52;32 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించడంతో అఫ్ఘాన్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఇప్పటికే గ్రూప్- బిలో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్ లు గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా సూపర్-10 కు అర్హత సాధిస్తుంది. -
'మంచి-చెడుల కలయికే టీ 20 ఫార్మాట్'
ముంబై: జీవితమనేది మంచి చెడుల కలయిక. చీకటి వెలుతురుల సమ్మేళనం. మన జీవితం అంటే కేవలం మనమే కాదు.. మన చుట్టూ ఉన్న పరిస్థితులే. దాన్నే మనం మంచి చెడుల కలయిక అభివర్ణిస్తుంటాం. అయితే టీ 20 క్రికెట్ అనేది క్రికెటర్ల జీవితాల్లో ప్రధాన భాగమై పోయింది. ఒక క్రికెటర్ జీవితాన్ని తారాస్థాయికి చేర్చాలన్నా.. మరో క్రికెటర్ జీవితాన్ని పాతాళానికి తొక్కేయేలన్నా ఇప్పుడు టీ 20 క్రికెట్ పైనే ఆధారపడి వుంది. అటు కెరీర్ పరంగా, ఇటు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి క్రికెటర్లకు ఒక వరంలా దొరికింది టీ 20ఫార్మాట్. ఇదే మాటను ముంబై రంజీ జట్టు కెప్టెన్, ముంబై ఇండియన్స్ ఆటగాడు ఆదిత్యా తారే తాజాగా స్పష్టం చేశాడు.' భారీ స్థాయిలో నగదును పెట్టుబడిగా పెట్టే గేమ్‌లలో ట్వంటీ 20 క్రికెట్ కూడా ఒకటి. తద్వారా క్రికెటర్లు మంచి జీవితాన్ని ఆస్వాదించడానికి ఆస్కారం దొరికింది. అదే సమయంలో ఈ ఫార్మాట్ క్రికెట్ స్పిన్నర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ధనాధన్ క్రికెట్లో స్పిన్నర్లు రాణించడం కష్టంతో కూడుకున్న పని కాబట్టి వారి కెరీర్ అయోమయంలో పడే ప్రమాదం కూడా ఉంది. అయితే చెడు కంటే కూడా మంచే ఇక్కడ ఎక్కువగా ఉంది' అని ఆదిత్య తారే పేర్కొన్నాడు. టీ 20 జనరేషన్లో తాను క్రికెటర్‌గా ఉండటం నిజంగా అదృష్టమేనన్నాడు. తన పరంగా చూస్తే టీ 20 క్రికెట్లో చాలా సానుకూలాంశాలున్నాయన్నాడు. అటు ఆర్థికపరమైన వెసులుబాటుతో పాటు, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఈ గేమ్ ద్వారానే తనకు లభించదన్నాడు. ఒక సౌలభ్యమైన జీవితాన్ని అనుభవించడానికి టీ 20 క్రికెట్ కారణమన్నాడు. ఈ గేమ్ ద్వారా చాలా మంది స్పాన్సర్లు మనల్ని కలుస్తుంటారని, అదే మన మొత్తం మైండ్ సెట్ లో మార్పును తీసుకొస్తుందన్నాడు. ఇదే సమయంలో టీ 20 ఫార్మాట్లో కొన్ని ప్రతికూలాంశాలను కూడా తారే ఎత్తి చూపాడు. ఒక నాణ్యమైన స్పిన్ బౌలర్‌పై టీ 20 ఫార్మాట్ ప్రభావం చూపిన దాఖలాలు చాలానే ఉన్నాయన్నాడు. ఇది బ్యాట్స్ మెన్ గేమ్ అయినందున, బంతి పోరాటం చేయడం చాలా కష్టమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ప్రత్యేకంగా ఈ ఫార్మాట్లో స్పిన్నర్లు ప్రభావం చూపే అవకాశాలు తక్కువన్నాడు. టీ 20 ఫార్మాట్ ప్రవేశపెట్టిన కొత్తలో మన స్పిన్ బౌలర్లు బాగా ఇబ్బంది పడే సంగతిని తారే గుర్తు చేశాడు. కాగా, ఇప్పుడు టీ 20ల్లో భారత క్రికెట్ జట్టు ఇద్దరు నుంచి ముగ్గురు వరకూ మంచి స్పిన్నర్లను కల్గి ఉండటం నిజంగా అభినందనీయమన్నాడు. తాజా పరిస్థితుల్లో కనీసం ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగుతుందని, ఇది టీ 20 క్రికెట్ కు శుభపరిణామన్నాడు. -
'వరల్డ్ టీ 20 టైటిల్ గెలవడమే మా లక్ష్యం'
కోల్‌కతా:వన్డే ఫార్మాట్ లో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్టేలియాకు టీ 20 వరల్డ్ కప్ మాత్రం అందని ద్రాక్షగానే ఉంది. కాగా, ఈసారి టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతోనే భారత్‌లో అడుగుపెట్టామని అంటున్నాడు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్. ఇప్పటివరకూ పొట్టి ఫార్మాట్లో టైటిల్ గెలవకపోవడం కొరతగా మిగిలిపోయిందన్నాడు. ఈ ఫార్మాట్లో తమ జట్టు బాగానే ఉన్నా ట్రోఫీని మాత్రం చేజిక్కించుకోలేకపోవడం బాధాకరంగా ఉందన్నాడు. ప్రస్తుత వరల్డ్ కప్‌ను దక్కించుకోవడానికి తమ శాయశక్తుల కృషి చేస్తామని, అదే లక్ష్యంతో భారత్‌కు వచ్చినట్లు స్మిత్ స్పష్టం చేశాడు. తమ జట్టులో చాలా మంది క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడి ఉండటంతో ఇక్కడ పరిస్థితులు తమ కచ్చితంగా కలిసొస్తాయన్నాడు. ఆసీస్ టాపార్డర్ లో ప్రధాన ఆటగాళ్లైన అరోన్ ఫించ్, ఉస్మాన్ ఖాజా, డేవిడ్ వార్నర్‌ల బ్యాట్ నుంచి పరుగుల వరద పారడం ఖాయమని స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు. 2005 లో తొలిసారి అంతర్జాతీయంగా ప్రవేశపెట్టిన ట్వంటీ 20 మ్యాచ్ లు అనతికాలంలోనే అమోఘమైన ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీంతో ట్వంటీ 20 వరల్డ్ కప్ ను ప్రవేశపెట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. 2007 లో తొలిసారి ట్వంటీ 20 వరల్డ్ కప్ కు శ్రీకారం చుట్టారు. అయితే ఇప్పటివరకూ ఐదు ట్వంటీ 20 వరల్డ్ కప్ లు జరిగినా.. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. 2010లో ఫైనల్ రౌండ్ వరకూ చేరిన ఆస్ట్రేలియా టైటిల్ వేటలో మాత్రం చతికిలబడింది. -
టీమిండియానే ఫేవరెట్.. కానీ
ముంబై: వరల్డ్ టీ 20లో భారత క్రికెట్ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందని దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ స్సష్టం చేశాడు. ఇటీవల కాలంలో ఈ పొట్టి ఫార్మాట్ గేమ్‌లో టీమిండియా నిలకడగా రాణిస్తూ అనేక విజయాలను సొంతం చేసుకుందన్నాడు. అయితే ఇది ఓపెన్ టోర్నమెంట్ అయినందున మిగతా జట్ల అవకాశాలను కూడా తీసిపారేయలేమని పేర్కొన్నాడు. 'స్వదేశీ పరిస్థితుల నేపథ్యంలో ధోని అండ్ గ్యాంగే వరల్డ్ టీ 20లో ఫేవరెట్. కానీ ఓపెన్ టోర్నమెంట్లో ఎవర్నీ తక్కువ అంచనా వేయకూడదు. తనదైన రోజున ఏ జట్టైనా అద్భుతాలను సృష్టించవచ్చు. నా దృష్టిలో ఈ వరల్డ్ కప్‌లో అంచనాలు కూడా తారుమారు కావొచ్చు. మేము వరల్డ్ కప్ ను గెలిస్తే మా జట్టుపై ఉన్న విఫల ముద్ర తొలిగిపోతుంది. 'అని డుప్లెసిస్ పేర్కొన్నాడు. శనివారం ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరుగనున్ననేపథ్యంలో డు ప్లెసిస్ మీడియాతో ముచ్చటిస్తూ పై విధంగా స్పందించాడు. -
నెదర్లాండ్స్-ఒమన్ మ్యాచ్ రద్దు
ధర్మశాల:వరల్డ్ టీ 20లో నెదర్లాండ్స్-ఒమన్ జట్ల మధ్య శుక్రవారం ఇక్కడ జరగాల్సిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. గత రాత్రి భారీ వర్షం కురవడంతో అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. ఈ మ్యాచ్‌లో కేవలం టాస్ మాత్రమే సాధ్యమైంది. టాస్ గెలిచిన ఒమన్ తొలుత ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నా.. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయ్యింది. దీంతో ఇరు జట్లకు తలో పాయింట్ లభించింది. కాగా, నెదర్లాండ్స్ పెట్టుకున్న సూపర్-10 దశ ఆశలకు మాత్రం బ్రేక్ పడింది. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై నెదర్లాండ్స్ ఓటమి పాలైంది. -
ఆ జట్టు సెమీస్లోఎదురైతే..
ముంబై:వరల్డ్ టీ 20లో భాగంగా శ్రీలంక జట్టుతో సెమీ ఫైనల్లో తలపడాల్సి వస్తే వారిని కచ్చితంగా ఓడిస్తామని న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కోరీ అండర్సన్ స్పష్టం చేశాడు. ఇరు జట్ల మధ్య పూల్ విభాగంలో మ్యాచ్ జరిగే ఆస్కారం లేదని, ఒకవేళ శ్రీలంకతో సెమీస్ ఆడితే మాత్రం ఆ జట్టును ఎలా ఓడించాలో తమకు తెలుసని అండర్సన్ అన్నాడు. 'పూల్ విభాగంలో మా రెండు జట్లు వేర్వేరు గ్రూప్‌ల్లో ఉన్నాయి. శ్రీలంకతో సెమీస్‌లో మేము తలపడితే వారిని ఓడిస్తాం. శ్రీలంక జట్టులో కుమార సంగాక్కర, మహేలా జయవర్ధనేలు లేకపోవడం వల్ల మాపై ఎటువంటి ఒత్తిడి లేదు. ప్రస్తుతం ఉన్న లంక జట్టులో కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్దే బాగా తెలిసిన ముఖం. దాంతో పాటు యువకులతో కూడిన మా జట్టు ఉత్సాహంగా ఉంది.ఫెర్ఫార్మెన్స్ విషయంలో ఏ జట్టుతో తలపడినా ఎదురుదాడికి దిగడమే మా కర్తవ్యం 'అని అండర్సన్ పేర్కొన్నాడు. తమ తొలి మ్యాచ్ టీమిండియాతో కావడంతో దృష్టంతా ఆ గేమ్‌పైనే నిలిపినట్లు అండర్సన్ తెలిపాడు. ఇరు జట్ల మధ్య మార్చి 15 వ తేదీన నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగనున్న ఆమ్యాచ్ హోరాహోరీగా కొనసాగే అవకాశం ఉందన్నాడు. గురువారం జరిగిన వార్మప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ 74 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 226 పరుగులు చేసింది. మున్రో 67;అండర్సన్ ( 60 రిటైర్డ్‌హర్ట్), గప్తిల్ (41), ఇలియట్ (36 నాటౌట్) చెలరేగారు. అనంతరం లంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు మాత్రమే పరిమితమై ఓటమి పాలైంది. -
బ్యాటింగ్ ఎంచుకున్న హాంకాంగ్
నాగ్ పూర్: వరల్డ్ టీ20లో భాగంగా గ్రూప్-బిలో అఫ్ఘానిస్తాన్-హాంకాంగ్‌ల మధ్య క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హాంకాంగ్ బ్యాటింగ్ తీసుకుంది. ఇప్పటికే ఒక క్వాలిఫయింగ్ మ్యాచ్ లో విజయం సాధించిన అఫ్ఘానిస్తాన్ మరో గెలుపుపై దృష్టి సారించగా, ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి బోణీ చేయాలని హాంకాంగ్ భావిస్తోంది. ఇరు జట్ల బలబలాలను పరిశీలిస్తే అప్ఘానిస్తాన్ మెరుగ్గా కనబడుతోంది. -
భారత ప్రభుత్వం నుంచి హామీ రాలేదు: పీసీబీ
కరాచీ: ఈనెలలో ఆరంభం కానున్న వరల్డ్ టీ 20లో భారత-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌పై నెలకొన్న అనిశ్చిత ఇంకా వీడలేదు. అటు మ్యాచ్ వేదిక మొదలుకొని, ఇటు పాకిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించే విషయంపై గత కొన్నిరోజుల క్రితం ఏర్పడిన సందిగ్ధత అలానే కొనసాగుతోంది. తమ క్రికెట్ జట్టుకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తూ భారత ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇస్తేనే పాకిస్తాన్ జట్టు వరల్డ్ టీ 20లో పాల్గొంటుందని ఆ దేశ క్రికెట్ చైర్మన్ షహర్యార్ ఖాన్ మరోసారి స్పష్టం చేశారు. 'మా జట్టు భారత్ లో పర్యటనకు పాక్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాలేదు. భారత్ లో జరిగే వరల్డ్ టీ 20లో మిగతా ఏ జట్టును టార్గెట్ చేయడం లేదు. మా పాకిస్తాన్ జట్టునే అంతా లక్ష్యంగా చేసుకుంటున్నారు. దాంతో మాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది. వారి హామీ కోసం ఎదురుచూస్తున్నాం' అని షహర్యార్ ఖాన్ పేర్కొన్నారు. మరోవైపు భారత్‌తో పాకిస్తాన్ మ్యాచ్ ను కోల్ కతాలో జరిగితే పిచ్ ను తవ్వేస్తామంటూ యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(ఏటీఎఫ్‌ఐ)హెచ్చరించింది. భారత్ పై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ జట్టు వరల్డ్ టీ 20లో పాల్గొనడం ఎంతవరకూ సబబని ఏటీఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు విరేష్ షాండిల్యా ప్రశ్నించారు. 'పాకిస్తాన్ జట్టు భారత్ కు వస్తే ఇక్కడి సాహస సైనికులను అవమానపరిచనట్లే. ఈడెన్‌లో మ్యాచ్‌ను వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ మ్యాచ్‌ను జరపాలని తలిస్తే పిచ్‌ను తవ్వేస్తాం' అని విరేష్ షాండియ్యా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
'ఈడెన్ గార్డెన్ పిచ్ ను తవ్వేస్తాం'
కోల్‌కతా: వరల్డ్ టీ 20లో భాగంగా ఈనెల 19వ తేదీన భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌పై ఇంకా నిరసనల పర్వం కొనసాగుతూనే ఉంది. మ్యాచ్ వేదిక ధర్మశాల నుంచి కోల్ కతాకు మారినా మరోసారి పాత కథే పునరావృతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత్‌తో పాకిస్తాన్ మ్యాచ్ ను కోల్ కతాలో జరిగితే పిచ్ ను తవ్వేస్తామంటూ యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(ఏటీఎఫ్‌ఐ)హెచ్చరించింది. భారత్ పై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ జట్టు వరల్డ్ టీ 20లో పాల్గొనడం ఎంతవరకూ సబబని ఏటీఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు విరేష్ షాండిల్యా ప్రశ్నించారు. 'పాకిస్తాన్ జట్టు భారత్ కు వస్తే ఇక్కడి సాహస సైనికులను అవమానపరిచనట్లే. ఈడెన్‌లో మ్యాచ్‌ను వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ మ్యాచ్‌ను జరపాలని తలిస్తే పిచ్‌ను తవ్వేస్తాం'అని విరేష్ షాండియ్యా హెచ్చరించారు. దాదాపు పది రోజుల పాటు అనేక మలుపులు తిరిగిన అనంతరం వేదిక మార్పు అంశం బుధవారం ఓ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. ధర్మశాలలో అయితే తాము ఆడటానికి సిద్ధంగా లేమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆ వేదికను ధర్మశాల నుంచి కోల్ కతా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. మరి ప్రస్తుతం ఏటీఎఫ్‌ఐ నుంచి తీవ్ర నిరసన గళం వినిపిస్తుండటంతో పాకిస్తాన్ జట్టు వరల్డ్ టీ 20లో పాల్గొనడంపై మరోసారి చర్చనీయాంశంగా మారింది.