
శ్రీలంక టీ 20 కెప్టెన్సీకి మలింగా దూరం!
ఇటీవల జరిగిన ఆసియాకప్ టోర్నీలో ఘోరంగా విఫలమైన శ్రీలంక క్రికెట్ జట్టు దిద్దుబాటు చర్యలకు దిగింది. గ
కొలంబో:ఇటీవల జరిగిన ఆసియాకప్ టోర్నీలో ఘోరంగా విఫలమైన శ్రీలంక క్రికెట్ జట్టు దిద్దుబాటు చర్యలకు దిగింది. గత కొంతకాలంగా గాయాలతో సతమవుతున్న లషిత్ మలింగాను వరల్డ్ టీ 20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించే ప్రయత్నంలో ఉంది. ఆ స్థానంలో ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ను కెప్టెన్గా నియమించే ఆలోచనలో ఉన్నట్లు తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే వన్డే, టెస్టు ఫార్మాట్లలో కెప్టెన్గా ఉన్న మాథ్యూస్ను టీ 20ల్లో కూడా సారథిగా కొనసాగించేందుకు శ్రీలంక క్రికెట్ యాజమాన్యం మొగ్గుచూపుతోంది.
గత రాత్రి తనను కెప్టెన్సీ బాధ్యతలను నుంచి తప్పించాలని కోరుతూ మలింగా లేఖ రాసిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఎస్ఎస్సీ వైస్ ప్రెసిడెంట్ మోహన్ డిసిల్వా పేర్కొన్నారు. ఒకవేళ మలింగాను కేవలం కెప్టెన్సీ నుంచి తొలగించినా, జట్టు స్క్వాడ్లో అతను యథావిధిగా కొనసాగుతాడని డిసిల్వా స్పష్టం చేశారు. ఈ వరల్డ్ కప్ లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న శ్రీలంక జట్టును మలింగా గాయం తీవ్రంగా బాధిస్తోంది. 2014లో బంగ్లాదేశ్లో జరిగిన వరల్డ్ టీ 20లో మలింగా నేతృత్వంలోని శ్రీలంక చాంపియన్గా అవతరించిన సంగతి తెలిసిందే.