
సెమీ ఫైనల్లో ఇంగ్లండ్
ఢిల్లీ: వరల్డ్ ట్వంటీ 20 ఇంగ్లండ్ జట్టు సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్-1లో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో చివరి వరకూ పోరాడిన ఇంగ్లండ్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా టోర్నీలో మూడో గెలుపును అందుకున్నఇంగ్లండ్ సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయంతో దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంటిదారి పట్టాయి. ఇప్పటికే గ్రూప్-1 నుంచి వెస్టిండీస్ సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగులు నమోదు చేసింది. జాసన్ రాయ్(42; 39 బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్సర్లు), బట్లర్(66 నాటౌట్;37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో పాటు, జో రూట్(25), కెప్టెన్ మోర్గాన్(22) లు ఫర్వాలేదనిపించడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరును శ్రీలంక ముందు ఉంచకల్గింది.
అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన లంకేయులు 15 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. చండీమల్(1), దిల్షాన్(2),సిరివర్ధనే(7), తిరుమన్నే(3)లు తీవ్రంగా నిరాశపరిచారు. అయితే ఆ తరువాత కెప్టెన్ మాథ్యూస్(73; 54 బంతుల్లో 3 ఫోర్లు, 5సిక్సర్లు), కపుగదెరా(30; 27 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్)లు రాణించినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. శ్రీలంక 20.0 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 161 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్ నాలుగు వికెట్లు సాధించగా, విల్లే రెండు వికెట్లు దక్కాయి.