స్యామీకి వివ్ రిచర్డ్స్ మద్దతు
ఆంటిగ్వా: ఇటీవల జరిగిన వరల్డ్ ట్వంటీ 20లో విజేతగా నిలిచినా, తమ క్రికెట్ బోర్డు నుంచి సరైన సహకారం అందలేదన్న వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ స్యామీ వ్యాఖ్యలకు ఆ దేశ మాజీ దిగ్గజ ఆటగాడు వివ్ రిచర్డ్స్ మద్దతుగా నిలిచాడు. ' స్యామీ అబద్దాలకోరు అని నేను అనుకోవడం లేదు. స్యామీ నిజాయితీగానే మాట్లాడాడు. అతను చేసిన వ్యాఖ్యలు మనసు నుంచి ఎటువంటి కలష్మం లేకుండా వచ్చినవే. ఇక్కడ ఏమి జరిగిందో అందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో విండీస్ కప్ గెలవడం నిజంగా అభినందనీయం. ఇప్పుడు విండీస్ ఆటగాళ్లకు స్యామీ ఒక ప్రతినిధిగా ఉన్నాడు. రాబోవు రోజుల్లో బోర్డు నుంచి ఎటువంటి సంకేతాలొచ్చినా ఇలానే విజయాలతోనే ముందుకు సాగండి' అని రిచర్డ్స్ సూచించాడు.
వరల్డ్ టీ 20కప్ను విండీస్ గెలిచిన అనంతరం పోస్ట్ మ్యాచ్ ఇంటర్యూలో ఆ దేశ క్రికెట్ బోర్డు తీరును స్యామీ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు ఇండియాలో అడుగుపెట్టేనాటికి జట్టుకు యూనిఫామ్ కూడా లేదని, అయినాసరే పోరాడామని, చివరికి ప్రపంచ విజేతగా నిలిచామని స్యామీ పేర్కొన్నాడు. తమ పట్ల విండీస్ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్యామీ ఆవేదన వ్యక్తం చేశాడు.