'స్యామీ.. నీకిది తగదు'
అంటిగ్వా: వెస్టిండీస్ క్రికెట్ పెద్దలపై విమర్శనాస్త్రాలు సంధించిన ఆ దేశ టీ 20 కెప్టెన్ డారెన్ స్యామీపై విండీస్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటగాళ్లు అనవసర, అసందర్భ వ్యాఖ్యలు చేయడం తగదని బోర్డు అధ్యక్షుడు డేవ్ కామోరూన్ మండిపడ్డారు. 'స్యామీ నీకిది తగదు. బోర్డుకు విరుద్ధంగా మాట్లాడటం ఎంతమాత్రం సరికాదు. అసందర్భంగా వ్యాఖ్యలు చేసి బోర్డును రచ్చకీడ్చకండి. బోర్డుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం క్షమార్హం కాదు' అని ట్విట్టర్లో మందలించారు.
వరల్డ్ టీ 20కప్ను విండీస్ గెలిచిన అనంతరం పోస్ట్ మ్యాచ్ ఇంటర్యూలో స్యామీ మాట్లాడుతూ వారి క్రికెట్ బోర్డు తీరును తప్పుబట్టిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు ఇండియాలో అడుగుపెట్టేనాటికి జట్టుకు యూనిఫామ్ కూడా లేదని, అయినాసరే పోరాడామని, చివరికి ప్రపంచ విజేతగా నిలిచామని స్యామీ పేర్కొన్నాడు. తమ పట్ల విండీస్ బోర్డు చులకన భావంతో వ్యవహరిస్తోందనడానికి ఇదే ఉదాహరణని స్యామీ ఆవేదన వ్యక్తం చేశాడు.