
'మేము వరల్డ్ కప్ ను గెలుస్తాం'
న్యూఢిల్లీ: తమ క్రికెట్ జట్టుకు రెండోసారి వరల్డ్ ట్వంటీ 20 కప్ ను గెలుస్తుందని ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈసారి పొట్టి ఫార్మాట్ లో వరల్డ్ కప్ ను అందుకునే అన్ని అర్హతలు తమకున్నాయన్నాడు. ' ఈసారి ఇంగ్లండ్ వరల్డ్ కప్ ను గెలిస్తే మాపై ఉన్న అన్ని అపోహలు తొలగిపోతాయి. మేము వరల్డ్ కప్ ను గెలిచి మాపై ఉన్న ముద్రను తప్పని నిరూపిస్తాం' అని బెన్ స్టోక్స్ తెలిపాడు.
తాము ఇప్పటివరకూ ఒకసారి మాత్రమే ఐసీసీ ట్రోఫీని అందుకున్నామని, మరోసారి అదే ప్రయత్నంలో ఉన్నట్లు పేర్కొన్నాడు. శ్రీలంకతో జరిగిన గత మ్యాచ్ లో చివరి ఓవర్ వేసిన స్టోక్స్ నాలుగు డాట్ బాల్స్ వేసి ఇంగ్లండ్ సెమీస్ చేరడానికి సహకరించాడు. దీన్ని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్న ఈ స్టార్ ఆల్ రౌండర్.. ఎంజెలో మాథ్యూస్ చెలరేగి పోతున్న తరుణంలో వేసిన ఆ ఓవర్ లో తాను కొద్దిగా ఒత్తిడికి లోనైనట్లు స్టోక్స్ తెలిపాడు.