దుమ్మురేపిన గప్టిల్
మొహాలి:వరల్డ్ టీ 20లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో మార్టిన్ గప్టిల్ దుమ్మురేపాడు. గప్టిల్(80;48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు)తో కళాత్మక ఇన్నింగ్స్ ఆడటంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్కు శుభారంభం లభించింది. గప్టిల్ కు కెప్టెన్ విలియమ్సన్ చక్కటి సహకారం అందించాడు.
అయితే జట్టు స్కోరు 62 పరుగుల వద్ద విలియమ్సన్(17) తొలి వికెట్ గా అవుటయ్యాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో మున్రో(7) కూడా పెవిలియన్ చేరడంతో న్యూజిలాండ్ తడబడినట్లు కనిపించింది. కాగా, కోరీ అండర్సన్(21;14 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించడంతో న్యూజిలాండ్ మళ్లీ గాడిలో పడింది. ఆపై రాస్ టేలర్(36 నాటౌట్; 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యాతయుతంగా ఆడటంతో న్యూజిలాండ్ 181 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచకల్గింది.
ఇప్పటికే న్యూజిలాండ్ రెండు వరుస మ్యాచ్లు గెలిచి మంచి ఊపు మీద ఉండగా, పాకిస్తాన్ రెండు మ్యాచ్లకు గాను ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పాకిస్తాన్ భావిస్తుండగా, న్యూజిలాండ్ మరో విజయం సాధించి నేరుగా సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలని యోచిస్తోంది.