న్యూజిలాండ్ జైత్రయాత్ర
మొహాలి: వరల్డ్ ట్వంటీ 20లో న్యూజిలాండ్ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. మంగళవారం గ్రూప్-2 లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది కివీస్ కు హ్యాట్రిక్ విజయం కావడంతో సెమీస్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న కివీస్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. గప్టిల్(80;48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) కళాత్మక ఇన్నింగ్స్ ఆడి న్యూజిలాండ్ కు మంచి ఆరంభాన్ని అందించాడు. అతనికి కెప్టెన్ విలియమ్సన్(17) అండగా నిలవడంతో న్యూజిలాండ్ తొలి వికెట్ కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. అనంతరం కోరీ అండర్సన్(21;14 బంతుల్లో 3 ఫోర్లు), రాస్ టేలర్(36 నాటౌట్; 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యాతయుతంగా ఆడటంతో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరు చేసింది.
అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 158 పరుగులకే పరిమితమై ఓటమి చెందింది. పాకిస్తాన్ ఓపెనర్లు షార్జిల్ ఖాన్(47;25 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), అహ్మద్ షెహజాద్(30;32 బంతుల్లో 3 ఫోర్లు) మంచి ఆరంభాన్నివ్వడంతో ఆ జట్టు గెలుపుదిశగా పయనించినట్లు కనబడింది. ఈ జోడి 5.3 ఓవర్లలో 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పాకిస్తాన్ శిబిరంలో ఆనందం నింపారు. అయితే ఆ తరువాత వరుస విరామాల్లో కీలక వికెట్లను కోల్పోయిన పాకిస్తాన్ కష్టాల్లో పడింది. పాకిస్తాన్ టాపార్డర్ ఆటగాళ్లలో ఖలిద్ లతిఫ్(3), షాహిద్ ఆఫ్రిది(19),ఉమర్ అక్మల్ (24)లు నిరాశపరిచారు. ఇక చివర్లో షోయబ్ మాలిక్(15 నాటౌట్), సర్ఫారాజ్ అహ్మద్(11 నాటౌట్) లు గెలుపుకోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నార్, మిల్నేలు తలో రెండు వికెట్లు సాధించారు.