పరిస్థితులకు తగినట్లుగానే: యువరాజ్
న్యూఢిల్లీ: మైదానంలోకి అడుగుపెట్టాక పరిస్థితులకు తగ్గట్లు ఆడటమే తన కర్తవ్యమని భారత స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ స్పష్టం చేశాడు. భారత జట్టులో పునరాగమనం చేసిన తరువాత యువరాజ్ సింగ్ బ్యాటింగ్ ఆర్డర్లో పదే పదే మార్పులు చోటు చేసుకోవడంపై మీడియా అడిగిన ప్రశ్నకు యువీ స్పందించాడు.
'బ్యాటింగ్ ఆర్డర్ అనేది సమస్యే కాదు. పరిస్థితులకు తగ్గట్లు ఆడితేనే జట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. పరిస్థితుల ప్రకారం బ్యాటింగ్ చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా. ప్రస్తుతం దానిపైనే దృష్టి పెట్టా. న్యూజిలాండ్ తో ఓటమి అనంతరం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాం. ఆ ఒత్తిడితోనే పాకిస్తాన్ పోరుకు సన్నద్ధమయ్యాం. ఆ మ్యాచ్ లో ఆదిలోనే మూడు ప్రధాన వికెట్లను నష్టపోవడంతో మరింత ఆందోళన గురయ్యాం. ఆ తరుణంలో సాధ్యమైనంతవరకూ స్ట్రైక్ రొటేట్ చేయాలని భావించా. బంతిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ పరుగులు రాబట్టాలని ప్రయత్నం చేశా. అయితే దురదృష్టవశాత్తూ చివరి వరకూ క్రీజ్ లో నిలబడలేకపోయా. విరాట్ కోహ్లి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టును నిలబెడితే, కెప్టెన్ ధోని చక్కటి ఫినిషింగ్ ఇచ్చాడు' అని యువరాజ్ పేర్కొన్నాడు.
మనం ఒక జట్టుగా ఆడుతున్నప్పుడు పరిస్థితుల ప్రకారం ఆడటమే సరైన విధానమన్నాడు. పాకిస్తాన్ తో విజయం అనంతరం తమ జట్టు ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ప్రోది చేసుకుందన్నాడు. తమ తదుపరి మ్యాచ్లకు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగడానికి పాకిస్తాన్ పై విజయం దోహదం చేస్తుందన్నాడు. శనివారం పాకిస్తాన్ తో ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్లో యువరాజ్ 24 విలువైన పరుగులు సాధించి భారత విజయానికి సహకరించిన సంగతి తెలిసిందే.