ఇండో-పాక్ మ్యాచ్ ఎఫెక్ట్: టీవీల బంద్!
కరాచీ: దాయాది దేశాలైన భారత్-పాకిస్తాన్ల క్రికెట్ సమరం అంటేనే ఆయాదేశాల్లో విపరీతమైన ఆసక్తి. సాధారణ మ్యాచ్ల కంటే ఇరు జట్లు ఎక్కడ తలపడుతున్నా జనాల హార్ట్ బీట్ పెరిగిపోవడం ఖాయం. అయితే ఇరు దేశాల మధ్య పోరు జరుగుతున్న సమయంలో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని మ్యాచ్లను వీక్షించడం మనకు తెలిసిందే. మరి పాకిస్తాన్ ఓటమి చెందుతుందని ముందే భావించారో ఏమో కానీ గుజ్రాన్వాలా నగరంలో ఆస్పత్రులలోని కార్డియో వార్డుల్లో టీవీలను బంద్ చేసి ముందస్తు జాగ్రత్త పాటించారు అక్కడ ఉన్న డాక్డర్లు. ఒక ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు.. ప్రైవేట్ ఆస్పత్రులలో ఉన్న అన్ని కార్డియో వార్డుల్లో టీవీ సెట్లను సైతం తొలగించారు. రోగులు ఎటువంటి టెన్షన్ బారిన పడకుండా ఉంచాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారట.
'శనివారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్లోని గుజ్రాన్ వాలాలో ఉన్న అన్ని ఆస్పత్రులలో టీవీలను బంద్ చేశాం. దీనిలో భాగంగా టీవీ సెట్లను ఆయా ఆస్పత్రి వార్డుల నుంచి పాక్షికంగా తొలగించాం. ఇరు దేశాలు క్రికెట్ ఆడుతున్నాయంటే అది ఒక గేమ్ గా మాత్రమే ఉండదు. ఒక ఉద్వేగ భరితమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. దీనివల్ల రోగుల గుండె సంబంధిత వ్యాధులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అందుచేత నగరంలోని ఆస్పత్రుల్లో ఉన్న కార్డియో వార్డులలో టీవీ సెట్లను తొలగించాల్సి వచ్చింది. మ్యాచ్ ముగిసిన తరువాత అంటే ఆదివారం వాటిని తిరిగి పునరుద్ధరించాం' అని హార్ట్ సర్జన్ మాటీన్ స్పష్టం చేశారు. రోగులు టెన్షన్ బారిన పడటం వల్ల అది వారి ప్రాణానికి మరింత హాని చేకూర్చే అవకాశం ఉందని, వారిని సాధ్యమైనంతవరకూ ఒత్తిడికి దూరంగా ఉంచాలనుకునే ఇలా చేసినట్లు మాటీన్ స్పష్టం చేశారు. ఇందుకోసం స్థానిక పౌరపరిపాలన అధికారుల సాయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.