టీమిండియా టార్గెట్ 119
కోల్కతా: వరల్డ్ టీ20లో భాగంగా ఇక్కడ భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ 119 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ తీసుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ ఆది నుంచి ఆచితూచి బ్యాటింగ్ చేసింది. పాక్ ఓపెనర్లు షార్జిల్ ఖాన్(17), అహ్మద్ షెహజాద్(25) మోస్తరుగా రాణించినా, కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది (8) నిరాశపరిచాడు. ఒకానొక దశలో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్.. షోయబ్ మాలిక్(26), ఉమర్ అక్మల్(22)ల చలవతో తేరుకుంది.
ఈ జోడి 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం ఉమర్ అక్మల్ నాల్గో వికెట్ గా అవుట్ కాగా, ఆపై కాసేపటికే మాలిక్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో పాకిస్తాన్ పరుగుల వేగం మందగించింది. ఇక చివర్లో సర్ఫరాజ్ అహ్మద్(8 నాటౌట్), మొహ్మద్ హఫీజ్ (5 నాటౌట్) లు పరుగులు చేయకుండా నియంత్రించడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. దీంతో పాకిస్తాన్ 18.0 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. భారత బౌలర్లలో నెహ్రా, బూమ్రా, రైనా, జడేజా, పాండ్యాలకు తలో వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్కు తొలుత వరుణుడు ఆటంకం కల్గించడంతో 18.0 ఓవర్లకు కుదించారు. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒక మ్యాచ్లో గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, టీమిండియా ఒక మ్యాచ్ లో ఓటమి పాలై తీవ్రమైన ఒత్తిడిలో పోరుకు సన్నద్ధమైంది.