భారత ప్రభుత్వం నుంచి హామీ రాలేదు: పీసీబీ
కరాచీ: ఈనెలలో ఆరంభం కానున్న వరల్డ్ టీ 20లో భారత-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్పై నెలకొన్న అనిశ్చిత ఇంకా వీడలేదు. అటు మ్యాచ్ వేదిక మొదలుకొని, ఇటు పాకిస్తాన్ జట్టు భారత్లో పర్యటించే విషయంపై గత కొన్నిరోజుల క్రితం ఏర్పడిన సందిగ్ధత అలానే కొనసాగుతోంది. తమ క్రికెట్ జట్టుకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తూ భారత ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇస్తేనే పాకిస్తాన్ జట్టు వరల్డ్ టీ 20లో పాల్గొంటుందని ఆ దేశ క్రికెట్ చైర్మన్ షహర్యార్ ఖాన్ మరోసారి స్పష్టం చేశారు. 'మా జట్టు భారత్ లో పర్యటనకు పాక్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాలేదు. భారత్ లో జరిగే వరల్డ్ టీ 20లో మిగతా ఏ జట్టును టార్గెట్ చేయడం లేదు. మా పాకిస్తాన్ జట్టునే అంతా లక్ష్యంగా చేసుకుంటున్నారు. దాంతో మాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది. వారి హామీ కోసం ఎదురుచూస్తున్నాం' అని షహర్యార్ ఖాన్ పేర్కొన్నారు.
మరోవైపు భారత్తో పాకిస్తాన్ మ్యాచ్ ను కోల్ కతాలో జరిగితే పిచ్ ను తవ్వేస్తామంటూ యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(ఏటీఎఫ్ఐ)హెచ్చరించింది. భారత్ పై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ జట్టు వరల్డ్ టీ 20లో పాల్గొనడం ఎంతవరకూ సబబని ఏటీఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు విరేష్ షాండిల్యా ప్రశ్నించారు. 'పాకిస్తాన్ జట్టు భారత్ కు వస్తే ఇక్కడి సాహస సైనికులను అవమానపరిచనట్లే. ఈడెన్లో మ్యాచ్ను వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ మ్యాచ్ను జరపాలని తలిస్తే పిచ్ను తవ్వేస్తాం' అని విరేష్ షాండియ్యా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.