కట్టుదిట్టంగా భారత్ బౌలింగ్
కోల్కతా:వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. టాస్ గెలిచిన భారత్ తొలుత పాకిస్తాన్ ను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ ఆది నుంచి పరుగులు సాధించడానికి అష్టకష్టాలు పడుతోంది. అటు పేస్ బౌలింగ్ ను, స్పిన్ ను సమానంగా ప్రయోగిస్తున్న ధోని పాక్ జట్టుపై ఒత్తిడి తెచ్చేయత్నం చేస్తున్నాడు.
పాకిస్తాన్ ఆటగాళ్లలో షార్జిల్ ఖాన్(17) తొలి వికెట్ గా పెవిలియన్ కు చేరగా, అనంతరం స్వల్ప వ్యవధిలో అహ్మద్ షెహజాద్(25) రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఆపై షాహిద్ ఆఫ్రిది(8)ని పాండ్యా బోల్తా కొట్టించాడు. దీంతో పాకిస్తాన్ 60 పరుగులకు మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లలో రైనా, బూమ్రా, పాండ్యాలకు తలో వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్కు తొలుత వరుణుడు ఆటంకం కల్గించడంతో 18.0 ఓవర్లకు కుదించారు. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒక మ్యాచ్లో గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, టీమిండియా తీవ్రమైన ఒత్తిడిలో పోరుకు సన్నద్ధమైంది.