టీమిండియా అదరహో..
కోల్ కతా: ప్రపంచకప్ల చరిత్రలో పాకిస్తాన్ చేతిలో ఎప్పుడూ ఓడిపోని టీమిండియా మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఇదే సమయంలో ఈడెన్ గార్డెన్లో పాకిస్తాన్ జట్టుకున్న ఘనమైన విజయాల రికార్డును సైతం భారత్ చెక్ పెట్టింది. తద్వారా వరల్డ్ టీ 20లోశనివారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీలో బోణి కొట్టింది. ఈ మ్యాచ్ లో ఆదిలో కీలక వికెట్లను చేజార్చుకుని ధోని సేన తడబడినా, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్ల జోడి బాధ్యాతాయుత ఇన్నింగ్స్ తో విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య ఓటమి అనంతరం ఢీలా పడిన భారత్.. ఆ ఛాయలను పాకిస్తాన్లో మ్యాచ్లో కనిపించకుండా జాగ్రత్తగా ఆడి తొలి గెలుపు రుచిని ఆస్వాదించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.0 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్లు షార్జిల్ ఖాన్(17), అహ్మద్ షెహజాద్(25) మోస్తరుగా రాణించినా, కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది (8) నిరాశపరిచాడు. ఒకానొక దశలో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్.. షోయబ్ మాలిక్(26), ఉమర్ అక్మల్(22)ల చలవతో తేరుకుంది.
ఈ జోడి 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం ఉమర్ అక్మల్ నాల్గో వికెట్ గా అవుట్ కాగా, ఆపై కాసేపటికే మాలిక్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో పాకిస్తాన్ పరుగుల వేగం మందగించింది. ఇక చివర్లో సర్ఫరాజ్ అహ్మద్(8 నాటౌట్), మొహ్మద్ హఫీజ్ (5 నాటౌట్) లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో పాకిస్తాన్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో నెహ్రా, బూమ్రా, పాండ్యా, రైనా, జడేజాలకు తలో వికెట్ దక్కింది.
అనంతరం 119 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన భారత్ 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.భారత జట్టులో రోహిత్ శర్మ(10) తొలి వికెట్ గా పెవిలియన్కు చేరగా, శిఖర్ ధావన్(6), సురేష్ రైనా(0)లు వెనువెంటనే అవుటయ్యారు. దీంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. అయితే ఆ తరుణంలో విరాట్ కోహ్లి(55 నాటౌట్), యువరాజ్ సింగ్(24)ల జోడి దాటిగా ఎదుర్కొంటూ భారత జట్టును విజయంవైపు నడిపించారు. ఈ జోడి 61 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ విజయానికి చక్కటి బాటలు వేశారు. కాగా, జట్టు స్కోరు 84 పరుగుల వద్ద ఉండగా యువీ నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. అయినప్పటికీ విరాట్ వేగం మాత్రం తగ్గలేదు. అదే దూకుడును కొనసాగిస్తూ హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. మరోవైపు క్రీజ్లో ఉన్న ఎంఎస్ ధోని (13 నాటౌట్; 9 బంతుల్లో 1 సిక్స్) తనదైన మార్కును చూపెట్టడంతో టీమిండియా ఇంకా 13 బంతులుండగానే విజయం సాధించింది.
శిఖర్, రైనాలు ఒక తరహాలో..
సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ రోహిత్ శర్మ(10) వికెట్ ను మూడో ఓవర్ మొదటి బంతికే కోల్పోయింది. మరోవైపు శిఖర్ ధావన్ మాత్రం జాగ్రత్తగా ఆడుతూ కోహ్లికి చక్కటి సహకారం అందించాడు. కాగా, టీమిండియా స్కోరు 23 పరుగుల వద్ద ఉండగా పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ సమీ వేసిన బంతిని లోనికి ఆడబోయిన ధావన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ మరసటి బంతికి అప్పుడే క్రీజ్లోకి వచ్చిన రైనా అదే తరహాలో బౌల్డ్ గా పెవిలియన్ చేరాడు. ఈ ఇద్దరూ ఒకే తరహాలో అవుట్ కావడంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు చెందారు. ఒక కీలక మ్యాచ్లో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు నిర్లక్ష్యంగా ఆడి పెవిలియన్కు చేరడం విమర్శలకు సైతం తావిచ్చింది.