జాసన్ రాయ్ వీరవిహారం: ఫైనల్లో ఇంగ్లండ్
ఢిల్లీ: టి20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ జట్టు చాంపియన్ తరహా ఆటతీరును ప్రదర్శించింది. అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్లోనూ అద్భుతమైన ఆట తీరు కనబరిచిన ఇంగ్లండ్.. న్యూజిలాండ్ ను మట్టికరిపించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి సెమీ ఫైనల్లో భాగంగా బుధవారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన పోరులో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. ఓపెనర్ జాసన్ రాయ్(78;44 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో ఇంగ్లండ్ చిరస్మరణీయమైన విజయాన్నిఅందుకుంది.
కివీస్ విసిరిన 154 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ చెలరేగిపోయింది. ఓ వైపు జాసన్ రాయ్ తనదైన దూకుడును ప్రదర్శించగా, అతనికి అలెక్స్ హేల్స్(20) సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. ఈ జోడి 8.2 ఓవర్లలో తొలి వికెట్ కు 82 పరుగుల భాగస్యామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ పటిష్ట స్థితికి చేరింది. ఇదే క్రమంలో జాసన్ రాయ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కాగా, జట్టు స్కోరు 110 పరుగుల వద్ద ఉండగా రాయ్, కెప్టెన్ మోర్గాన్ లు వరుస బంతుల్లో అవుట్ కావడంతో ఇంగ్లండ్ కాస్త తడబడినట్లు కనిపించింది. ఆ తరువాత జో రూట్(27నాటౌట్; 22 బంతుల్లో 3 ఫోర్లు), బట్లర్ (32 నాటౌట్; 17బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు)లు దాటిగా ఆడటంతో ఇంగ్లండ్ ఇంకా 17 బంతులుండగా విజయాన్ని సాధించింది. తద్వారా పొట్టి ఫార్మాట్ వరల్డ్ కప్లో తొలిసారి ఫైనల్ కు చేరాలనుకున్న కివీస్ ఆశలు తీరలేదు.
అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ తీసుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఆదిలోనే విధ్వంసకర ఆటగాడు గప్టిల్(15) వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలో కెప్టెన్ విలియమ్సన్ (32;28 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) , మున్రో(46;32 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్) లు రాణించి జట్టు స్కోరును ముందుకు తీసుకువెళ్లారు. ఈ జోడీ రెండో వికెట్ కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో న్యూజిలాండ్ 10.0 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 89 పరుగులు నమోదు చేసింది. అయితే ఆపై కోరీ అండర్సన్(28) మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోవడంతో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ మూడు వికెట్లు సాధించగా, విల్లే, జోర్డాన్, ప్లంకెట్, మొయిన్ అలీలకు తలో వికెట్ లభించింది.