ఢిల్లీ: వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ బుధవారం ఇంగ్లండ్ జరుగుతున్నతొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ తీసుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ ఆదిలో గప్టిల్(15) వికెట్ ను నష్టపోయింది.అనంతరం కెప్టెన్ విలియమ్సన్ (32;28 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) , మున్రో(46;32 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్) లు రాణించారు. ఈ జోడీ రెండో వికెట్ కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో న్యూజిలాండ్ 10.0 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 89 పరుగులు చేసి పటిష్టంగా కనిపించింది.
అయితే ఆపై కోరీ అండర్సన్(28) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. న్యూజిలాండ్ మిగతా ఆటగాళ్లలో రాస్ టేలర్(6), ల్యూక్ రోంచీ(3), సాంట్నార్(7)లు తీవ్రంగా నిరాశపరచడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ మూడు వికెట్లు సాధించగా, విల్లే, జోర్డాన్, ప్లంకెట్, మొయిన్ అలీలకు తలో వికెట్ లభించింది.